అమ్మ చెట్టు!

– శాంతిశ్రీ బెనర్జీ

ఇంటి ముంగిట నిల్చున్న
పున్నాగ చెట్టు నీడన
వాలు కుర్చీలో వాలి
ఊహలలో తేలిపోతుంటే —

ఉషోదయాన సంధ్యాసమయాన
విశ్రాంతిగా కాఫీ సేవిస్తూ
పూల పరిమళాలు ఆఘ్రాణిస్తూ
పక్షుల కువకువలు
అలవోకగా వినిపించే
కోయిల రాగాలు వింటుంటే —

మధ్యాహ్నపుటెండలో
మంచంలో కునుకు తీస్తుంటే
కలిగే అనుభూతి అనిర్వచనీయం!

ఊగే కొమ్మల గాలి
శరీరాన్ని స్పర్సిస్తుంటే
తన్మయత్వంతో తనువు పులకరించేను!

బాధ్యతలు తీరిన రిటైర్మెంట్ లో
రెక్కలొచ్చిన పిల్లలు
విదేశాలకెగిరిపోతే
వంటరితనాన్ని మరిపిస్తాయి
నీడనిచ్చే తల్లిలాంటి తరువు!
గూళ్ళలో గుసగుసలాడే గువ్వలు!

అందుకే అంటాను
ప్రతి ఇంటి ముంగిట
అమ్మ చెట్టు నాటాలని !
దాని ఛాయలో సేదతీరే
సిరిని స్వంతం చేసుకోవాలని!

*****

Leave a Reply

Your email address will not be published.