అమ్మ నిర్ణయం

(నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-దేవులపల్లి విజయలక్ష్మి

గోడ ఆసరా చేసుకుని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళి గ్రీన్ టీ పెట్టుకుని ట్రాలీలో టీ కప్పు స్నాక్స్ పెట్టుకొని ట్రాలి తోసుకుంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని టీ సిప్ చేస్తూ స్నాక్స్ తింటూ టీవీలో తనకి ఇష్టమైన పాత సినిమా పాటల క్లిప్పింగ్లు చూస్తోంది కస్తూరి.

ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.

“రా! భవాని తలుపు తెరిచే ఉంది.” అంది.

“రాత్రికి ఏం చేయమంటారు నిన్న రోటి కూర అరగలేదన్నారు. ఇవాళ సాబుదాన్ కిచిడీ చేయనా.కొంచెం లైట్ గా ఉంటుంది.” అంది భవాని.

“ఆ అలాగే!” అని కళ్ళు మూసుకుని చిట్టిబాబు ‘కొమ్మలో కోయిల’ వింటూ కళ్ళు మూసుకుంది.” కస్తూరి.

“అమ్మా!” అంటూ కొంచెం గట్టిగా కోపంగా వినపడ్డ భవాని గొంతుకకి కస్తూరి కళ్ళు తెరిచింది. ఏమిటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరేసింది.

“అమ్మా! ఏమిటమ్మా! పొద్దున వంట అంతా అలానే ఉంది ఏమీ తినలేదు. నేను వండింది మీకు నచ్చకపోతే నేను మానేస్తాను.ఇంకెవరినైనా పెట్టుకోండి.” అంది కళ్ళనీళ్ళతో భవాని.

“ఎందుకో భవాని మనసు బాలేక తినలేదు. అంతే కానీ నీ వంట బాగోలేక కాదురా. ఫ్రిజ్లో పెట్టు.” అంది కస్తూరి.

“80 ఏళ్ల వయసులో ఫ్రిజ్లో పెట్టుకొని తింటారా? అందులోనూ హై బి.పి హై డయాబెటిక్. డాక్టరు హార్ట్ కూడా చాలా వీక్ గా ఉందన్నారు.” అంటూ ఆప్యాయంగా మందలించింది భవాని.
గతం నీలి నీడలు కస్తూరిని వెంటాడాయి.

***

ఆ రోజు కస్తూరి కౌంటర్ దగ్గరకి ఐ.సి.యు కి చకచకా తిరుగుతోంది. తన వయసు అరవై ఐదని మరచిపోయింది. మోకాళ్ళ నొప్పులు గుర్తులేదు. ఐ.సి.యు లోకి వెళ్లిన కస్తూరిని “వచ్చాడా?” అని సౌజ్ఞ చేసాడు రవీంద్ర. అప్పుడే వచ్చిన సిస్టర్ మాట్లాడుతారా సార్ మాస్క్ తీస్తా. టూ మినిట్స్ పరవాలేదు. అంటూ మాస్క్ తీసింది.

“వంశీ వస్తున్నాడా? కోడలు పిల్లలు వస్తున్నారా?” అంటూనే ఆయాస పడసాగాడు రవీంద్ర. వెంటనే నర్స్ ఆక్సిజన్ మాస్క్ పెట్టింది.

కళ్ళు గట్టిగా మూసుకున్నాడు రవీంద్ర. కంటికి కొసలు నుంచి ధారగా కన్నీళ్లు.

రవీంద్ర చేతిని తన చేతిలోకి తీసుకుంది కస్తూరి. “నేనున్నాను కదా రవి. బాధపడవద్దు తగ్గిపోతుంది.విదేశాల నుంచి హఠాత్తుగా రావాలంటే ఎంత కష్టమో చదువుకున్న మీకు తెలియనిది కాదు కదా!” అంటూ ఊరడించింది.

ఇంజెక్షన్ కి మగతలోకి జారాడు రవీంద్ర.

లాంజ్ లో కూర్చుంది కస్తూరి. తనకి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు. రవీంద్రకి ముగ్గురు తమ్ముళ్లు ఒక చెల్లెలు అందరూ దూరంగా ఉన్నారు. కొంతమంది భౌతికంగాను మరి కొంతమంది మానసికంగానూ.

***

కస్తూరి గతంలోకి జారుకుంది.

‘రవీంద్ర తల్లిని తండ్రిని తన దగ్గరే ఉంచుకున్నాడు. తనకు ముందు నుంచి పెద్ద వాళ్ళు అంటే గౌరవం. అంతకంటే ప్రేమ ఎక్కువ. వారు అత్త మామ అనిపించేది కాదు. మామగారికి అత్తగారికి ఆఖరి నిమిషం వరకు సేవ చేసింది కస్తూరి.

ఆరోజు బాగా గుర్తు తనకు. మామగారిది ఆఖరి శ్వాస అని తెలియదు తనకు. ‘అమ్మా కస్తూరి!’ అనంగానే హాజరైంది. రెండు చేతులు చాచి తన చేతుల్ని అడిగితే అర్థం కాలేదు. అప్రయత్నంగా ఆయన చేతుల్లో చేతులు పెట్టింది. ఆయన తన చేతులని నుదుటికి ఆనించుకొని ముద్దు పెట్టుకుని రెండు చేతులు జోడించి, ‘నీలాంటి కోడలు దొరకటం నా అదృష్టం. థాంక్యూ ఫర్ యువర్ గ్రేట్ సర్వీసెస్.’ అంటూనే తల పక్కకి వాల్చారు.

‘తండ్రి పోయినప్పుడు కంటే ఎక్కువ ఏడ్చింది తను బహుశా తండ్రి మరణం విన్నది గాని దగ్గరగా చూడకపోవటంతోనో ఏమో! కళ్ళకి కట్టినట్లు ఆ సంఘటన ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ ఆలోచించకూడదు,’ అనుకుంటూ తలవిదిల్చింది కస్తూరి.

“డాక్టర్ గారు పిలుస్తున్నారు.” అంటూ నర్సుచెప్పింది.

‘ఏమి చెబుతారో! అని ఆదుర్దాతో గుండె కొట్టుకుంటుంటే,’ డాక్టర్ క్యాబిన్లోకి అడుగు పెట్టింది కస్తూరి..
.
“పేషెంట్ పరిస్థితి కొంతవరకు స్టేబుల్ అయింది. ఇప్పటికే ట్వంటీ వన్ డేస్ ఆయ్యింది. ఇంకా ఉంచితే ఈ హాస్పిటల్ వాతావరణానికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. రేపు డిశ్చార్జ్ చేస్తాము. 88% లంగ్స్ డామేజ్ అయ్యాయి ట్వంటీ ఫొర్ అవర్స్ ఆక్సిజన్ సపోర్ట్ తో ఇంకొక పదిహేను రోజులు చూద్దాం. తర్వాత నెమ్మదిగా ఆక్సిజన్ సపోర్ట్ విత్ డ్రా చేద్దాము. అస్సలు నడవకూడదు. వీల్ చైర్ లోనే మూమెంట్ అంతా. హార్ట్ వాల్వ్ కూడా దెబ్బతింది. మానవ ప్రయత్నంగా మనం అందించాల్సిన ది బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నాము.” అని ప్రిస్క్రిప్షన్, తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు డాక్టరు.

***

డిశ్చార్జ్ అయి రవీంద్ర ఇంటికి రావడం, వంశీ అమెరికా నించి రావడం ఒకేసారి అయింది.ఉన్నన్ని రోజులు తండ్రిని అంటిపెట్టుకొని ఉన్నాడు వంశీ. వంశీ వచ్చాక గుండెల మీద నుండిపెద్ద బరువు దించినట్లయింది కస్తూరికి. చూస్తుండగానే నెల రోజులు అయ్యాయి వంశీ వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది.

“అమ్మా! నాన్న, నువ్వు జాగ్రత్త. నేను మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత వస్తాను.”అంటూ వీడ్కోలు పలికాడు వంశీ.

“వంశీ వెళ్ళిపోయాడా!” అన్నాడు రవీంద్ర.

“అవును. వెళ్ళిపోయాడు.” అంది కస్తూరి.

“కస్తూరి! నువ్వు అమ్మా,నాన్నలని ఎంతో ప్రేమగా చూసుకున్నావు. కానీ నిన్ను నీ కోడలు చూసుకోదు. ఆ అమ్మాయి మనస్తత్వం వేరు. నేను పోయిన తర్వాత నువ్వు వంశీ దగ్గరకు వెళ్లొద్దు. బాధపడతావు. ఒంటరిగానైనా ఇక్కడే ఉండు. బ్యాంక్ బ్యాలెన్స్ సరిపడా ఉంది. లంకంత ఇల్లు ఉంది. ఆత్మగౌరవం దెబ్బతినే చోట ఉండటం కంటే మరణం మేలు.” అన్నాడు రవీంద్ర రొప్పుతూ.

“హుష్! మాట్లాడకండి ఇప్పుడీ మాటలన్నీ ఎందుకు? ‘నేను కోలుకుంటాను.’ అని విల్ పవర్ పెంచుకోండి.” అంటూ కోప్పడింది కస్తూరి.

జనన మరణాలు మానవుని చేతిలో ఉంటే భగవంతుడిని ఎవరు తలుచుకోరేమో? ఇల్లంతా వీల్ చైర్ లో తిరిగిన రవీంద్ర వీల్ చైర్ కి విశ్రాంతి ఇచ్చాడు.

***

కర్మకాండలకి వచ్చిన అందరూ వెళ్లపోయారు.కస్తూరి వళ్లో తలపెట్టుకుని పడుకున్నాడు వంశీ. “అమ్మా నాతో వచ్చేయమ్మా!” అన్నాడు ఏడుస్తూ.

“సంవత్సరం వరకు ఎక్కడికి రాను నాన్నా.” తర్వాత ఆలోచిద్దాం అంది కస్తూరి.

“నేనక్కడ స్థిమితంగా ఉండలేను అమ్మా.” అన్నాడు వంశీ.

“తప్పదు కన్నా! ఇది జీవితం. నీ పిల్లలని వృద్ధిలోకి తేవటమే నీ భవిష్యత్తు. కాలం ఎంతటి గాయాన్నైనా మాపుతుంది. నా సంగతి అంటావా పెళ్లయ్యాక బాధ్యతలతో నా ఆశలని ఆశయాలని మూటగట్టి మూల పడేసా. శేష జీవితం నా ఆశలకి, ఆశయాలకి మళ్లీ ప్రాణం పోయాలనుకుంటున్నాను.” అంది అరవైఐదేళ్ళ కస్తూరి.

***

ఏడాది అయ్యింది సంవత్సరీకాలు పెట్టి అర్జెంటుగా వెళ్లాలంటూ వెళ్లిపోయాడు వంశీ తల్లికి అమెరికాకి టికెట్టు బుక్ చేసి. వెళ్లేటప్పుడు కోడలు మాట మాత్రంగానైనా, ‘అత్తయ్యా మీకు మాత్రం ఎవరున్నారు వంశీ ఒక్కడే కదా వచ్చి మాతోనే ఉండండి.’ అంటుందేమోనని ఆశగా చూసింది కస్తూరి.

“సీయు అత్తా. టేక్ కేర్.” అంటూ క్యాబ్ ఎక్కిన కోడల్ని చూసిన కస్తూరి మొట్టమొదటిసారిగా తన హృదయంలోని ముక్కని దొంగలించిన దొంగలా కనబడింది కోడలు. మళ్ళీ ‘చిన్నపిల్ల ఏమీ తెలియదు.’ అని సమాధాన పరుచుకుంది కస్తూరి.

కస్తూరి అమెరికా వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. వంశీ ఎక్కడికక్కడ వీల్ చైర్స్ అసిస్టెంట్స్ కి బుక్ చేశాడు. బిజినెస్ క్లాసులో తల్లి కంఫర్ట్ గా రావాలని అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు. కొంత కష్టపడ్డా క్షేమంగా అమెరికా చేరింది కస్తూరి.

***

ఇంట్లోకి అడుగు పెట్టిన కస్తూరి మనుమలు వచ్చి వాటేసుకుంటారనకుంది.

“హాయ్ నానమ్మ! హౌ ఆర్ యు? హౌ ఈస్ యువర్ జర్నీ? “అంటూ స్కూల్ బ్యాగ్లు వేసుకొని తుర్రుమన్నారు పిల్లలు.

సోఫాలో కూర్చున్న కస్తూరికి కాఫీ కప్పు అందిస్తూ, “ఎలా ఉన్నారు? సారీ అత్తయ్య నేను ఆఫీస్ కి లాగిన్ అవ్వాలి. టేబుల్ మీద బ్రేక్ ఫాస్ట్ ఉంది. డార్లింగ్ మీ అమ్మకి సర్వ్ చేసి నువ్వు తిను.” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మృదుల.

కనురెప్పలు వాటి అంతట అవే మూసుకుపోతుంటే, ” బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసి పడుకో.” అంటూ ఆప్యాయంగా టిఫిన్ పెట్టాడు వంశీ. తిని తినంగానే స్నానంచేసి నిద్రలోకి జారుకుంది కస్తూరి.
“అమ్మాలంచ్ చేద్దుగాని రా!” అంటున్న పిలుపు ఎక్కడో బావిలో నుంచి వినపడ్డట్టు వినపడింది కస్తూరికి.

కళ్ళు తెరిచిన కస్తూరిని లేపి కూర్చుండబెట్టి సూప్ ఇచ్చాడు వంశీ. లంచ్ కి టేబుల్ రెడీ చేస్తానని వెళ్ళాడు. ముగ్గురు లంచ్ కూర్చున్నారు.మామిడికాయ పప్పు వంకాయ కారం పెట్టిన కూర, సాంబారు, టమాటా చట్నీ వడ్డించింది కోడలు మృదుల.

“ఎందుకమ్మా ఇన్ని చేశావు? ఏదో రెండు ఐటమ్స్ చేస్తే పోయేది ఆఫీస్ పనితో.” అంది సానుభూతి చూపిస్తూ కస్తూరి.

“అయ్యో! లేదు అత్తయ్య ఇవాళ లంచ్ మీ అబ్బాయి ప్రిపేర్ చేశాడు. నేను ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉన్నాను. అయినా మీరు మీ అబ్బాయిని చాలా బాగా ట్రైన్ చేశారు. తను వంట చాలా బాగా చేస్తాడు. వారంలో మూడు నాలుగు రోజులు వంట తనే చేస్తాడు. పిల్లలకి డాడ్ వంట అంటే చాలా ఇష్టం.” అంటూ గడగడా చెప్పింది మృదుల.

ఏడవలో నవ్వాలో తెలియలేదు కస్తూరికి.

“అమ్మా అలా కూర్చొని హైదరాబాద్ కబుర్లు చెప్పు.” అన్నాడు వంశీ.

“ఏముంటాయిరా! పెదనాన్న పోయాక పెద్దమ్మ కూతురు దగ్గరికి వచ్చింది. అదే అపార్ట్మెంట్లో ఇంకో ఫ్లాట్ తీసుకుని ఉంటుంది. ఎనభైఏడు ఏళ్లు వచ్చాయి. కాకినాడలో కొబ్బరితోటలు యాభై ఎకరాల పొలం, వెయ్యి గజాల ఇల్లు వదిలి వచ్చానని దిగులు పడుతోంది. రేపోమాపో ఈ భూ గ్రహాన్ని వదిలి వెళ్లాలని తెలియని పిచ్చిమాలోకం. కొడుకు లండనులో పెదనాన్న పోయినప్పుడు వచ్చి కార్యక్రమం చేయలేదు. ఏదో గెట్ టుగెదర్ అంటూ అందరికీ లంచ్ ఇచ్చి మమ్మల్ని అందరినీ వాళ్ళ నాన్న గురించి మాట్లాడమన్నాడు. పెద్దమ్మకి పార్కిన్సన్ ఎటాక్ అయింది. నేను అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉంటాను.పిల్లల గురించి రెక్కలు ముక్కలు చేసుకుని ఆస్తులు కూడబెడితే మాకు అక్కర్లేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు విజయ్.రెండో పెద్దమని ఇంట్లోంచి తరిమేసారు. ఊరి చివర ఓల్డ్ ఏజ్ హోం లో ఉంటుంది. దాని కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు కదా!” అంది.

ఇంతలో ఆరతి,ఆరుష్ లు స్కూల్ నుంచి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఓవెన్ లో వేడిచేసుకుని తిని “హాయ్ నానమ్మా” అని వాళ్ళు రూములోకి వెళ్ళారు.

కస్తూరి వచ్చి నెల రోజులు అవుతుంది. ఇంట్లో రొటీన్ మారలేదు. ధైర్యం చేసి వంట గదిలో అడుగు పెట్టలేదు కస్తూరి. “అమ్మా హ్యాపీగా రెస్ట్ తీసుకో” అని వారించేవాడు వంశి.

కానీ కస్తూరికి తెలుసు ఏదైనా తేడా వస్తే మృదుల ఏమైనా అంటుందేమోనని.

***

“అమ్మా! ఈ వీకెండ్ ఔటింగ్ కి వెళ్దాం’ అంటూ ప్లాన్ చేశాడు వంశీ.

కస్తూరికి ఔటింగ్ అనంగానే రవీంద్ర గుర్తుకు వచ్చాడు. “యూనివర్సిటీ పనులతో తీరటం లేదు’ ఈ సా రి లాంగ్ వకాషన్ లో వెస్ట్రన్ యూరోప్ కి వెళ్ళాలి వంశీ గ్రాడ్యుయేషన్ లోగా కస్తూరి.” అనేవాడు. కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. అని చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకుంది.

ఏ మూల నుంచి కనిపెట్టాడో వంశీ తల్లి గుండెలకి అదుముకొని, “అమ్మా నీ ఫీలింగ్స్ నాకు అర్థం అవుతున్నాయి.” అంటూ భుజాలు నొక్కాడు.

తిరగడానికి వెళ్ళినప్పుడు “అమ్మ ఏమైనా గిఫ్ట్స్ తీసుకుంటావా!” అని అడిగాడు వంశీ.

నాకేమీ అక్కర్లేదు’ కృష్ణ అన్న పిల్లలకి ఏమైనా టాయ్స్ తీసుకో. ప్రతివారం తప్పక వచ్చి ఎలా ఉన్నావు పెద్దమ్మ అని పలకరించిపోతాడు. మధ్యలో జ్వరం వస్తే దగ్గరుండి డాక్టరు దగ్గరకు కూడా తీసుకెళ్లాడు.” అంది కస్తూరి.

“ఓ దానిదేముంది తప్పకుండా అలాగే అమ్మ.” అంటున్న భర్తని కొరకొరా చూసింది మృదుల.

“ఇక్కడ డాలర్స్ లో ఖర్చు పెట్టాలి. రూపాయలు కాదు.” అంటు కస్తూరి వంక చూసింది మృదుల.

గడువు పూర్తి అయి అమెరికా వదిలి మాతృభూమికి వస్తుంటే కస్తూరికి ఒక రకమైన వైరాగ్యం ఆవహించింది. తనను కావాలనుకునే తన కొడుకు తప్ప ఆ దేశంలో సొంత కోడలు మనుమల అభిమానానికి నోచుకోలేదని.

అప్పుడప్పుడు వస్తూ ఉండు అమ్మాఅన్న వంశీతో గంభీరంగా, “వంశీ భర్త పోయిన మొదటి సారే ఇంత మర్యాద జరుగుతే మళ్లీ మళ్లీ ఎందుకు నాన్నా రమ్మనమంటావు?” నువ్వేరా. బహుశా ఇదే నా ఆఖరి ప్రయాణం అమెరికాకి అంటూ ఖచ్చితంగా చెప్పింది కస్తూరి .

***

అమెరికా నుంచి వచ్చిన కస్తూరి తన ప్రణాళికను ఆచరణలోకి వెనువెంటనే తేవాలనుకుంది. అందులో మొట్టమొదటిది ఆఖరిది కూడ ఛారిటీనే ప్రధానాంశంగా పెట్టుకుంది. డ్రెవర్ సహాయంతో హైదరాబాదు పరిసర ప్రాంతాల్లోని అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, అంగవైకల్యుల ఆశ్రమాలు అన్ని ఒక నెలలో చూసి అందులో ఆర్థిక సహాయం లేకుండా కొట్టుమిట్టాడుతున్న ఆశ్రమాలని కొన్ని ఎంపిక చేసుకుంది.

ఏ ఆశ్రమాలకి డొనేషన్స్ విరివిగా వస్తాయో వారు కస్తూరి వెంట పడ్డారు. మీ ఫోటో వేస్తాము. మీ గురించి రాస్తామంటూ. వారందరినీ వదిలి ఒక పది ఆశ్రమాలను దృష్టిలోకి తీసుకుని వారికి నెలనెల ఆహార దినుసులు ఇవ్వాలని నిర్ణయించుకుంది.

భర్త వీల్ చైర్ లో శేష జీవితం గడపడంతో ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రికి వీల్ చైర్స్, క్రచెస్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

అత్తమామలకు, తల్లిదండ్రులకు, భర్త చనిపోయి పితృ కర్మలు చేయలేకపోవడంతో ఆ చుట్టుపక్కల సాయిబాబా గుడిలో అన్న దానానికి కట్టాలని నిర్ణయం తీసుకుంది.

పుట్టినరోజులకి కస్తూరి అనాధాశ్రమంలో అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకుంది.

తన దగ్గరున్న పైకం భర్త ప్రొఫెసర్గా చనిపోవడంతో నెలకి దగ్గర దగ్గర ఒక తొంభై వేల వరకు పెన్షన్ వస్తుంది. దానిని మూడు భాగాలు చేసింది ఒక భాగం తన ఖర్చులు, రెండవ భాగం వైద్యానికి, మూడవ భాగం దానధర్మాలకి.

ఈ విధంగా కస్తూరి తనకి ఇష్టమైన కార్యక్రమాలతో ఆత్మ తృప్తిని పొందింది. తనకి పర్సనల్గా వస్తున్న కొద్దిపాటిపెన్షన్ పేద విద్యార్థులకు తన అందుబాటులో ఉన్న వాచ్మెన్, స్వీపర్సు పిల్లలకి ఒక పది మందికి స్కూలు రీఓపెన్ అయినప్పుడు పుస్తకాలకి సంవత్సరం ఫీజు కట్టేది కస్తూరి. తను చేస్తున్న పని ఏదీ వంశీ దగ్గర దాచేది కాదు.

“అమ్మ నీ మనసు ఎలా చెప్తే అలా నడుచుకో అమ్మ.” అనేవాడు.

అనుకోకుండా కరోనాతో తన సేవలకు అంతరాయం కలుగుతుందా అని భయపడింది కస్తూరి. స్థిరచిత్తంతో వంటవాడిని పెట్టి వారి చేత సాంబార్ అన్నం, పులిహార పెరుగన్నం, లాంటివి వారంలో ఒకరోజు చేయించి పొట్లాలు కట్టి నీటి పొట్లాలు కారు డిక్కీలో పెద్ద పెద్ద గంపల్లో పెట్టుకొని ఎస్.ఐ పర్మిషన్సూతో సూచించిన చోట్ల ఎక్కడ ఎక్కువమంది నిరాశ్రయులు ఉన్నారో అక్కడికి వెళ్లి తడవకి ఐదువందల పొట్లాలదాక పంచింది కస్తూరి.

ఈ సంగతి తెలిసిన వంశీ చాలా భయపడ్డాడు. “అమ్మా నువ్వు నాకు కావాలి. నీ వయసు ఇప్పుడు డెభైఐదేళ్లు ఈ వయసులో నీకు కరోనా వస్తే చాలా ప్రమాదం.” అంటూ మందలించాడు. కానీ కస్తూరి వీటన్నిటికీ భయపడే పరిస్థితులలో లేదు.

వంశీ భయపడ్డట్టే కస్తూరి కరోనా బారిన పడింది. ఆ స్థితిలోనూ ఆత్మస్థైర్యం కోల్పోలేదు “నేను మంచినే చేస్తున్నా మంచిని చేసే వాళ్ళని భగవంతుడే కాపాడుకోవాలి.” అది ఆయన బాధ్యత అనేది ఎవరైనా వద్దు అంటే. కరోనా తగ్గగానే వంశి వచ్చాడు. వస్తూనే తల్లి పాదాలకి పాదాభివందనం చేసి, “నేను ఎంత అదృష్టవంతుడిని అమ్మా. నీలాంటి తల్లికి తనయుడనయ్యాను.” అన్నాడు.

“ఏమిటిరా వంశీ కొత్త కొత్త డైలాగులు చెప్తున్నావు.” అంది చిరునవ్వుతో కస్తూరి.

చేతిలో పత్రిక చూపించాడు వంశీ.

“వయసుతో పనిలేదు. మనసుంటే మార్గం ఉంటుంది. ఒంటరినన్న భయం లేదు. వృద్ధురాలినన్న దిగులు లేదు. మరొక మదర్ థెరెసా ” అంటూ క్యాప్షన్ తో ఆ పత్రికలో హెడ్డింగ్ తో తన ఫోటో. తన కార్యక్రమాల గురించి విశ్లేషణ తన ఫోటో చెన్నై కర్ణాటక కేరళ పత్రికలలో తన గురించి వ్రాసినది.

అప్పుడు గుర్తుకు వచ్చింది కస్తూరికి. తన స్నేహితురాలి చెల్లెలు కూతురు ప్రగతి మూడు భాషలలో పత్రిక నడుపుతోందని కన్నడ, తమిళ, మలయాళాలలో. ప్రతినెలా ఒక విశిష్ఠ మహిళ గురించిన పరిచయం ఉంటుంది అని చెప్పింది.

మాటలలో ఆమె తన గురించి అడిగిన ప్రశ్న, “అసలు అన్నదానమే చేయాలని మీకెందుకు అనిపించింది?” అని అడిగిన దానికి సమాధానం తనకు గతం కళ్ళ ముందుకు రాగా తను చెప్పినది యథాతథంగా ఆ పత్రికలో పొందుపరచడం అయింది.

“మా అబ్బాయి వంశీ ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు మా ఇంట్లో మా మామగారు వారి తండ్రిగారిది ఆబ్దీకం పెడుతున్నారు. మిట్ట మధ్యాహ్నం రెండు గంటలు. వాకిట్లోకి వచ్చిన నేను ఒక యువతి చంటి బిడ్డని జోలెలో కట్టుకొని నెత్తిమీద చీపురు కట్టలు పెట్టుకుని ‘ఝాడు ఝాడు, చీపురు కట్టలు అమ్మా’ అంటూ అరుచుకుంటూ వెళ్తోంది.

నన్ను చూసి ఆగి “అమ్మా దాహం వేస్తోంది. జర నీళ్ళు ఇస్తారా!” అని అడిగింది. వెంటనే నేను గబగబా లోపలికి వెళ్లి ఒక ఆకులు అన్నం పప్పు కూర ఇంకొక చేత్తో వంశీ పాత సీసాలో పాలు ,మంచినీళ్ళ బాటిల్ తీసుకొని వచ్చి ఇచ్చాను.

“అమ్మా ఎండ ఎక్కువగా ఉంది. కాసేపు ఈ అరుగు మీద కూర్చుని వెళ్లిపోతానమ్మా.” అంటూ నా అనుమతికి ఆశగా చూసింది.

నాకు ఆమె మాటలు వినపడలేదు. జోలెలో సొమ్మసిల్లిపడిఉన్న ఆమె బిడ్డను చూసేసరికి హృదయం తరుక్కుపోయింది..ఆ పాలు బిడ్డకి పట్టగా ఆత్రంగా ఆ బిడ్డ పాలు తాగుతుంటే నాకళ్ళల్లో నీళ్లు జలజలా రాలేయి. అన్నం తిని ఆమె నా కాళ్లు పట్టుకొని కృతజ్ఞతతో చూసిన చూపు ఎప్పటికీ మరువలేనిది.

ఇంట్లోకి వెళ్లిన నన్ను చూసిన ఆడబిడ్డ “నీకు అంత దానధర్మాలు చేయాలని ఉంటే మీ పుట్టింటి సొమ్ముని దానం చేసుకో. మా అన్న సొమ్ముని కాదు.” అంది.

అంతే అభిమానంతో ఆ రోజు నుంచి ఒక్క పైసా ఎవరికీ దానం ఇవ్వలేదు. నేను ఉద్యోగం చేసినప్పుడు నా జీతంలో ఏదైనా దానం చేసేదాన్ని. నా ఏకైక ఆశయం అన్నార్తులకి అన్నం పెట్టటం.నా భర్త పోయాక ఆయన పెన్షన్ లో కొంతభాగం ఇటువంటి సేవలకి వినియోగిస్తున్నాను.”అని చెప్పింది. అదే విషయం ప్రగతి అడిగినప్పుడు తను చెప్పింది. ఆ విషయంతో సహా పత్రికలో ఫోటోతో సహా పబ్లిష్ అయి ఉంది.

“ఇది నీకు ఎక్కడిది వంశీ.” అని అడిగింది కస్తూరి.

“ఈ పత్రిక నా ఫ్రెండ్ రాజశేఖరన్ ఇంట్లో చూశాను. ఇది అమెరికాలో ఇంగ్లీషులో అనువదిస్తున్నారు. నా తల్లి ఇంత గొప్ప వ్యక్తిత్వం కలదని అందరూ పొగుడుతుంటే తెలుసుకున్న ఆఖరి వాడిని నేను అమ్మా!. అంటూ తల్లి ఒడిలో తల పెట్టుకుని అన్నిర్వచనీయమైన అనుభూతిని పొందాడు వంశీ.

ఒకటొకటిగా 1945లో తన పెళ్లి నగలన్నీ కోడలికి మనుమరాలికి పంపిస్తూఉండేది. పంపించిన ప్రతీసారి వంశీతో. “వంశీ కోడల్ని మనవరాలిని ఈ నగలు పెట్టుకుని వీడియోలో కనపడమనరా, పోనీ ఫోటో తీసి పంపరా.” అని బ్రతిమాలేది.

ఈరోజు వరకు ఆమె కోరిక నెరవేరలేదు. ఇంతలో యుద్ధంలో పోయిన వారి కుటుంబాలకి సహాయం అందజేయవలసినదిగా ప్రకటన చూసింది. వెంటనే మరిది కొడుకుని బెనారస్ కి ఫ్లైట్ కి బుక్ చేయమంది.

“పెద్దమ్మ ఒంటరిగా ఎలా వెళ్తావు? అన్నాడు.

“ఆ ప్రకటన ఇచ్చినది ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కపూర్. స్వయంగా రిసీవ్ చేసుకోవడానికి అరేంజ్మెంట్లు చేశాడు. అతను స్వచ్ఛందంగా ఈ సేవలు చేస్తున్నాడు.” అన్నది కస్తూరి .

భర్త లేకుండా పొలిమేరలు దాటని కస్తూరి డెభై ఎనిమిదేళ్ళ వయసులో బెనారస్ వెళ్లి చనిపోయిన, అంగవైకల్యం పొందిన సిపాయిల ఇంటికి వెళ్లి వారికి చెక్కు అందజేసి తాదాత్మ్యం చెందింది.

కస్తూరి మనస్సు ఎంతో తృప్తిగా ఉంది. ఇంటికి వచ్చినవారు ఒంటరిగా ఎందుకు ఉంటావు కొడుకు దగ్గరికి వెళ్లి ఉండవచ్చు కదా ఆఖరి రోజుల్లోనైనా అంటే, “మృత్యువు ఏ ఖండంలో ఉన్నా కబళించక మానదు. నా జన్మభూమి మీద నాకిష్టమైన పనులు చేసుకుంటూనే నా తుది శ్వాస విడవాలని ఉంది. అనేది చిరునవ్వుతో కస్తూరి.

***

తల్లి నిర్ణయం తిరుగులేని నిర్ణయం అని తెలిసిన వంశీ ఆరు నెలలకు ఒకసారి వచ్చి తల్లిదగ్గర వీలైనన్ని రోజులు ఉంటూఉంటాడు.

తల్లి హై షుగర్ తో అర్ధరాత్రి స్పృహ కోల్పోయి ఎవరికీ తెలియలేదని తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డ వంశీ భవానిని తల్లికి తోడుగా కుదిర్చాడు. వంశీ వచ్చి వెళ్లిన మరుసటి రోజు నుంచి మళ్లీ వంశీ వచ్చే వరకు రోజు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూనే తన సేవా కార్యక్రమాలకి అంతరాయం కలిగించేది కాదు కస్తూరి.

“భవాని! నా కొడుకు వంశీ రావడానికి ఇంకా ఎన్నాళ్ల ఉంది?” అంది కస్తూరి.

“అదేమిటి అమ్మా! పోయిన నెలగా వెళ్ళింది. ఇంకా ఐదు నెలలు అవుతుంది.” అంది నవ్వుతూ భవాని.

“అయితే ఈ ఐదు నెలలు ఎలా గడపను?” అంటుండంగానే ఫోను మ్రోగింది.

“అమ్మ నేను వంశీని. ఈసారి నాకు ఢిల్లీలో పదిహేను రోజుల పని ఉంది. నేను హైదరాబాదు వచ్చి నిన్ను నాతో ఢిల్లీ తీసుకొని వెళ్తాను‌.

“అన్నట్టు కంపెనీ వాళ్లు స్టార్ హోటల్ బుక్ చేశారు. హాయిగా వంట హడావిడి లేకుండా పదిహేను రోజులు మనం ఇద్దరమే కలిసి ఉండవచ్చు.” అంటూ సంతోషంగా చిన్నపిల్లవాడిలా చెప్పాడు వంశీ.

“భవాని! అర్బన్ వాళ్ళని పిలు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి.అలాగే బెడ్ రూమ్ క్లీన్ చేయి.” అంటూ నడవలేని కస్తూరి చకచకా నడవటం చూసి విస్తుపోయింది భవాని. ఇలాంటి తల్లి ప్రేమకి తాను నోచుకోనందుకు.

***

“అమ్మా! పదిహేను రోజులు ఎలా గడిచాయో తెలియలేదు నీ సమక్షంలో.”అన్నాడు వంశి.

“వంశీ నా ఆరోగ్య పరిస్థితి ఏమి బాగాలేదు రా. రేపు నాకు ఏదైనా అయితే వెంటనే వస్తావా? వస్తావనుకో కానీ నిన్ను నేను ఆఖరి నిమిషంలో చూసుకోలేనేమో కదా! పెద్ద మావయ్య అలానే పోయారు పెద్దమ్మ అలానే పోయింది. పెద్దమ్మ పోతే ఆశ్రమం వారే దహనం చేశారు‌” అంది దిగులుగా కస్తూరి.

“అమ్మా నీకు ఎన్ని సార్లు చెప్పాను ఈ నెగిటివ్ ఆలోచనలు. అంటున్న వంశీ తల్లి మొహంలో మార్పులను గమనించి ఏమైంది అమ్మా! ఆర్ యు ఆల్ రైట్? అంటూ తన చైర్ లోంచి లేచి పడబోతున్న తల్లిని పట్టుకున్న వంశీ హతాసుడయ్యాడు నిమిషాల్లో చల్లబడుతున్న తల్లి శరీరాన్ని చూసాడు..

వెంటవెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాడు.

ఆమెని పరీక్షించిన డాక్టర్స్ ఆమె మరణించి నలభై ఐదు నిమిషాలు అయ్యిందని, మాసివ్ హార్ట్ ఎటాక్ అని కన్ఫామ్ చేశారు.

అమ్మ నీదే ఎప్పుడు పై చేయి అంటూ గుండెలో అగ్ని పర్వతం బద్దలయినట్లు రోదించాడు వంశీ ఏడవద్దు కన్నా అన్న తల్లి ఓదార్పు కోసం.

ఓం అసతోమా సద్గమయ |
తమసోమా జ్యోతిర్గమయ |
మృత్యోర్మా అమృతంగమయ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

*****

Leave a Reply

Your email address will not be published.