
శుభఘడియ
(నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-పద్మావతి నీలంరాజు
సముద్రం ఒడ్డున నిల్చుని తదేకంగా చూస్తున్నది సరయు. ఆమె మనసు ఆ సాగర గర్భంలాగే హృదయాంతరంలో ఉన్నబాధని దాచలేక అల్లకల్లోలమవుతున్నది. అతను వెళుతూ బాధతో ఆమెను చూసిన చూపులు సూటిగా ఆమె హృదయంలో దిగిపోయాయి. అతనితో మనస్పూర్తిగా మాట్లాడాలని ఉంది. కానీ ఇప్పుడు మాట్లాడగలదా? తనెంత తొందరపాటుగా మాట్లాడింది. అతని మనసుకు బాగా గాయం అయిందని అర్ధమవుతున్నది. అతను చేసింది పెద్ద తప్పేం కాదు. కానీ నేనే ఎందుకు ఆవేశంగా ప్రతిస్పందిచాను. ఎంత ఆవేశంగా పరుషంగా మాట్లాడాను.
“అయ్యో! ప్లీజ్! సంపత్ వెళ్ళకు, ప్లీజ్! నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు ప్లీజ్! ప్లీజ్ వెళ్ళకు,” అంటూ హాస్పిటల్ బెడ్ మీద అసహనంగా కదులుతున్నది సరయు. ఇచ్చిన మత్తు ఇంజక్షన్ వలన ఆమె కళ్ళు తెరవలేకపోతున్నది. లేవలేకపోతున్నది. మనసు తీవ్రంగా పనిచేస్తున్నా శరీరం సహకరించడం లేదు. ఎక్కడ లేని శక్తి పుంజుకొని, “ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు! వెళ్ళకు! అలా వెళ్ళిపోకు,” అంటూ పెద్దగా అరిచింది.
నైట్ డ్యూటీ చేస్తున్న నర్స్ మేరీ పరుగు పరుగున సరయు బెడ్ దగ్గరికి వచ్చింది. సరయుని కుదుపుతూ లేపటానికి ప్రయత్నిస్తున్నది. ఇంజక్షన్ ప్రభావం వలన ఆమె కళ్ళు తెరచి తెరవలేనట్టుగా చూసింది. పల్చటి లైట్ రూము నిండా పరచుకొని ఉంది. సిస్టర్ మొహం తనకు చాలా దగ్గరగా కనిపిస్తున్నది. “తను ఏం చేసింది. తనకు ఏమయింది?” అనుకుంటూ ‘మంచినీళ్లు’ అని చిన్నగా సైగ చేసింది. సిస్టర్ ఒక్క గ్లాస్ నీళ్లుతెచ్చి తాగించింది. మనస్థిమిత పడి, మత్తుగా నిద్రలోకి జారిపోయింది. సిస్టర్ మేరీ ఆమెకు తలకింద దిండు సరిచేసి, బెడ్డు పక్కనే ఆమెను చూస్తూ కూర్చుంది. సిస్టర్ మేరీ ఆమెకు తలకింద దిండు సరిచేసి, దుప్పటి మెడ వరకు కప్పి, ఫ్యాన్ పెంచి బెడ్డు పక్కనే ఆమెను చూస్తూ కూర్చుంది. ఎంతో అందంగా కనిపించే ఆమె కనుముక్కు తీరు చూసి నిట్టూర్చింది. వెంటనే ఆపరేటర్స్ తెచ్చి పల్సు, హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసింది. అన్ని చాల ఎక్కువగా ఉన్నాయి. మూసుకున్న కనురెప్పల వెనక కంటిపాప వేగంగా కదులుతున్నది. ‘ఎంతో ఆందోళన ఉంటే తప్ప ఇంత చిన్న వయసులో ఇలాంటి హెల్త్ ప్రాబ్లం రాదు.’ అనుకుంటూ ఆమె నుదురుమీద చేయి వేసి నిమురుతూ బెడ్ కి తల ఆనించి పడుకుండిపోయింది సిస్టర్ మేరీ.
“గుడ్ మార్నింగ్ సిస్టర్! రాత్రంతా ఈ పేషెంట్ దగ్గరే కూర్చుని ఉన్నట్లున్నారే! వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వండి. నేను చూసుకుంటాను,” అన్నది ఉదయాన్నే వచ్చిన సిస్టర్ అరుణ. సిస్టర్ మేరీ అరుణతో అంది, “డాక్టర్ బలరామ్ వస్తే రాత్రి అంతా సరయు చాలా హిస్టరికల్ గా ప్రవర్తించిందనిచెప్పు.” కొద్దిసేపటికి సిస్టర్ మేరీ డ్యూటీ ముగించి ఇంటికెళ్ళిపోయింది.
***
మేరీ మళ్లీ సాయంత్రం 8 గంటలకల్లా డ్యూటీ కి వచ్చింది. ఆమెకి ఎందుకో సరియుని చూస్తే, నాలుగేళ్ల క్రితం ఇలాగే ఆందోళన పడి ఎవరికి చెప్పుకోలేక, ఏమీ చెప్పలేక, అఘాయిత్యం చేసుకుని చనిపోయిన తన చెల్లెలు గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి అలా అవకూడదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటూ మిగిలిన పేషెంట్స్ అందరిని అటెండ్ అయి సరయు దగ్గరికి వచ్చింది. “ఎలా ఉన్నావ్ సరయు? మీల్స్ చేసావా? ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో” అంటూ అందించింది. అన్నిటికి మౌనంగా తలాడించింది సరయు.
అటెండర్ వీరయ్య వచ్చి “అక్క నిన్నెవరో కలవడానికి వచ్చారు. డ్యూటీ చేంజ్ రూమ్ లో కూర్చోబెట్టొచ్చాను,” అన్నాడు.
“ఎవరు? వస్తున్నా పద,” అంటు, సరయు రెస్ట్ తీసుకో, మళ్ళీ వస్తాను,” అంటు వీరయ్య వెనకాతలే వెళ్ళింది.
సంపత్ సిస్టర్ మేరీ ని చూస్తూ, “నమస్తే సిస్టర్! సరయు ఎలా ఉంది?” అడిగాడు. “బాగానే ఉంది. నువ్వే కదా ఆ అమ్మాయిని హాస్పిటల్ లో చేర్పించింది. ఆ అమ్మాయికి అసలు ఏమైంది? చాలా ఆందోళనలో ఉంది. నీకు ఏమైనా తెలిస్తే చెప్పు వింటాను. అప్పుడే ఆ అమ్మాయికి నేనేమైనా సాయం చేయగలను,” అంది.
సంపత్ చెప్పడం మొదలుపెట్టాడు. ‘సరయు చాలా మంచి భావుకత ఉన్న అమ్మాయి. ఆమె అందమైన కళ్ళు పలికే భావం, ఆమె మనసులో నుండి పుట్టే అందమైన కవితలు నాకెంతో ఇష్టం. ఆ ఇష్టం ఒక మంచి స్నేహంగా మారింది. కానీ తను రాసుకొనే కవితలను నాకు మాత్రమే వినిపించేది. అలా చాలా సన్ని హితమైన స్నేహం మాది. మాకు ఒకరి పట్ల ఒకరికి అభిమానం, ప్రేమ కూడా పెరిగాయి. ఆమెని ఒక మంచి కవయిత్రిగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉబలాటం నాలో పెరిగిపోయింది. అందుకే తనకు తెలియకుండా రెండు కవితలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. దానికి చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. నాతో ముభావంగా ఉంటు మాట్లాడటం తగ్గించింది. అంతలా బాధపడేంత నేనేం చేసానో నాకు అర్ధం కాలేదు. తనని అడగాలనుకుంటూనే ఉన్నాను.
“అంతేనా! ఇంకేమయిన జరిగిందా? ఇంకొంచెం వివరంగా చెప్పు,” అడిగింది సిస్టర్ మేరీ కొంచం అనుమానంగా.
సంపత్ చెప్పడం కొనసాగించాడు; “మా ఫ్రెండ్స్ అందరం సెమిస్టర్ పూర్తి అవడంతో సరదాగా మాట్లాడుతూ యూనివర్సిటీ కాంటీన్ లో చేరాము.“మనం ఏం చేయాలో? ఎక్కడ ఉంటామో? అంతా కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికి సరదాగా ఈ క్షణాలను గడిపేద్దాం,” అన్నాడు సంపత్. అందరూ అలాగే అంటూ కోరస్ గా పలికారు. సమోసాలు,టీలు ఆర్డర్ ఇచ్చారు. రమ,సరియు,సంపత్ అందరితో కులాసాగా కబుర్లు చెప్తున్నారు. ఆ రోజు నేను తన డైరీ తీసి “డియర్ ఫ్రెండ్స్ ఇది కూడా వినండి,” అన్నాను. అందరు కుతూహలంగా సంపత్ వంక చూశారు “ఏం చెప్పబోతున్నాడా?” అని. రమ,కాశీ మాత్రం “సంపత్ సరయూకి ప్రపోజ్ చేస్తున్నాడా? ఏంటి?” అన్న అనుమానం రాగా మరింత శ్రద్ధగా వాళ్ళ వైపు చూశారు. పెద్దగా చదవటం మొదలుపెట్టాడు సంపత్ .
శీర్షిక: ఎదురుచూపు రచన: ప్రేయసి
వచ్చింది పువ్వంటి నవ్వు
రాలేదు నాదరికి నువ్వు.
పూసింది ఎల మావి గుబురు
రాలేదు నీ నుంచి కబురు.
కురులార పోసుకొని నిలుచుంటే
పిల్ల తెమ్మరెలా కురులు సవరిస్తావు,
కురులలో మల్లె మాలవై పోలేవా?
నా సిగలో అందమైన మందారం కాలేవా?
ఎంతో ఆర్తితో చదివాడు. కాశి సంపత్ భుజాలు చుట్టూ చేయి వేసి, “ఇది నీ కోసమే రాసింది కదూ?” అన్నాడు గుసగుసగా. “ఏంటి విశేషం,” అని చూసింది రమ సరయు వంక. అప్పటికే మారిన సరయు ముఖకవళికలు చూసి ఎదో ప్రమాదం ముంచుకొస్తున్నదని ఊహించింది రమ. సరయు ముఖకవళికలు కొత్త గా కనిపిస్తున్నాయి రమకి. ‘అసలేమయి ఉంటుంది,’ రమ ఆలోచనలో పడింది. సంపత్ తనవంక చూసుంటే సరయుని చూడు అని చెప్పేది.
కానీ సంపత్ ఉత్సాహంగా “మనందరం గర్వపడాల్సిన విషయం ఏమిటంటే మన సరయు పెన్ నేమ్ ‘ప్రేయసి’,ఆ పేరుతో అద్భుతంగా కవితలు రాస్తుంది. ఈ డైరీ నిండా ఆమె రాసిన కవితలే. ఎప్పటికైనా మన సరయు ఒక మంచి కవయిత్రిగా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను,” అంటూ ఉపన్యాస ధోరణిలో చెప్పుకుంటూ పోతున్నాడు.
సరయు అసహనంగా చూసింది. అతని ధోరణికి ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకున్నట్టయింది. పరిసరాలను మరిచిపోయింది,విసురుగా చేతిలో డైరీ లాక్కుని, అతని చెంప చెళ్లుమనిపించింది, “ఈ కవితలు నా మనసులోని భావాలకు ఒక తీయటి రూపకల్పన. భద్రంగా మధుర స్మృతులుగా మనసులో దాచుకోవాలని అనుకున్నాను. పదిమందికి తెలియడంకోసం కాదు. అంతా పాడు చేసావ్. ఇలా చేయడానికి నీకేం హక్కు ఉందని, నా డైరీ దొంగలించావు, నేను అస్సలు ఊహించలేదు నువ్విలా నా భావాలను అందరి ముందు బయటపెడతావని,” వేలు చూపిస్తూ ఇంకా ఆవేశంగా “మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి. మీరు నాకేమీ మేలు చేయనక్కర్లేదు. మీరు మీ హద్దుల్లో ఉంటే అంతే చాలు. అదే నాకు పదివేలు,” అంటూ ఊపిరి బలంగా తీసుకుంటూ విసవిసా క్యాంటీన్ బయటకు పోయింది. కాంటీన్లో టేబుల్ ముందు కూర్చుని ఉన్న అనేకమంది విద్యార్థులు ఎం జరుగుతున్నదా అని వీళ్లవైపే చూడసాగారు. రమ “నేను కూడా వస్తాను ఆగవే,” అంటూ సరయు వెనకాతలే పరిగెత్తింది.
సరయు, సంపత్ మధ్య ఇంత విభేదం ఉంటుందని, వస్తుందని వాళ్ళు ఊహించలేదు. ఇది ఊహించని పరిణామం. సంపత్ భుజం తట్టి ఒక్కొక్కరు నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. అనుకోకుండా జరిగిన అవమానానికి సంపత్ షాక్ లో అలాగే ఉండిపోయాడు. సరయు విసురుగా వెనక్కి వచ్చింది. ఇంకేదో మాట్లాడబోయింది. రమ సరయుని ఆపటానికి ప్రయత్నం చేస్తున్నది. హఠాతుగా కలిగిన షాక్, స్నేహితులందరి ముందు చెంపదెబ్బతో జరిగిన అవమానం నుండి తేరుకున్న సంపత్ సరయుని చూస్తూ, “ఏంటి నేను నాకు సంబంధంలేని మీ విషయాల్లో తలదూరుస్తున్నానా? నేను నా హద్దుల్లో ఉండాలా? నేనే హద్దులు దాటి మిమ్మల్ని బాధించాను సరయుగారు? మీరు నాకు వినిపించిన ఈ మీ కవితలు, నాకు మాత్రమే పరిమితం కాకూడదనుకున్నాను. మీ కవితలు మంచి రసజ్ఞులయిన పాఠకుల హృదయాలలో నిలిచిపోవాలనికున్నాను. మీలోని భయం పోగొట్టడానికి మీ డైరీలోని కవితను మన ఫ్రెండ్స్ ముందు చదివాను. మీకు ఒక మంచి కవయిత్రిగా సామాజిక గుర్తింపు కలిగితే నా కన్నా ఆనందపడే వాళ్ళు ఎవరూ ఉండరు. ఇప్పటివరకు మన మధ్య స్నేహం మాత్రమే కాదు, దానికి అతీతమైన ఏదో అనుబంధం ఉందన్న భ్రమలో ఉన్నాను. మిమ్మల్ని ఇంకెప్పుడు బాధపెట్టను. మీ అనుమతి లేకుండా మీ సొంత విషయాలలో ఎప్పటికి కల్పించుకొను. మిమల్ని ఇంకెప్పుడూ కలవను, నన్ను క్షమించండి సరయు గారు,” అంటూ సంపత్ విసవిసా వెళ్లిపోతున్నాడు సరయు వంక చూడకుండానే.
రమ గట్టిగా అరిచింది, “సంపత్!” “సరయు! సరయు!” అంటూ పడిపోతున్న సరయుని పట్టుకోలేక. సంపత్ వెనక్కి తిరిగి చూసాడు. సరయు హిస్టీరియా వచ్చినట్లు కాళ్ళుచేతులు కొట్టుకుంటూ కింద పడిపోయింది. కొద్ది క్షణాల్లోనే స్పృహ కోల్పోయింది.
“వెంటనే ఆమెని హాస్పిటల్ లో చేర్చాము. కానీ తనని కలుసుకునే ధైర్యం లేక ఆమె ఎలా ఉందో తెలుసుకోవాలని మీ దగ్గరికి వచ్చాను. రమ చెప్పింది ఆమెని ఉదయం నుండి సెడేషన్ లోనే ఉంచారని ” అన్నాడు సంపత్.
“ఇప్పుడు ఆమెకి ఏ మందులు లేవు. తను కోలుకుంది. ఇంకా బలహీనంగా ఉంది,. కానీ ఇంకా కొన్ని టెస్ట్ లు చేయాలి ఆమెకి,” అన్నది.
“అయితే మీరు ఈ డైరీ ఆమెకు అందజేయండి. ఎవరు ఇచ్చారు అని అడిగితే మీ శ్రేయోభిలాషి అని చెప్పండి,” అన్నాడు.
“ఆమె ఆవేశంలో అయితే మాట్లాడింది. కానీ నీతోటి అలా మాట్లాడటం తట్టుకోలేకపోయింది. ఆమె మనసు అల్లకల్లోలం అయింది. ఆ వత్తిడి తట్టుకోలేకపోవడంతో హిస్టీరియా వచ్చింది. ఆమె కోలుకోవడానికి సమయం పట్టచ్చు. మీ మధ్య వచ్చిన దూరం కాలమే పరిష్కరిస్తుంది. కొంతకాలం దూరంగా ఉండి ఆమెని కనిపెట్టుకొనివుండు,” అంది సిస్టర్ మేరీ అనునయంగా.
అప్పటికే వార్డ్ బాయ్ సాయంతో డ్యూటీ రూమ్ నుండి బయటికి వచ్చి, తలవంచుకొని వెళ్ళిపోతున్న సంపత్ ని దూరంగా వీల్ చైర్ లో కూర్చుని ఉన్న సరయు చూస్తుండి పోయింది బాధగా. తన జీవితం రమ, సంపత్ వాళ్ళలాగ వడ్డించిన ఇస్తారు కాదు. తన చిన్న వయసులోనే తండ్రిని పోగోట్టుకున్నది. తల్లికి చదువులేకపోవడం వంటలు చేస్తూ తనని పోషించుకుంటూ వచ్చింది. ఎప్పటికయినా తను ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడి ఈ ఆర్ధిక ఇబ్బందులు లేకుండా గౌరవ ప్రదంగా బతకాలని ఆమె ఆశించి, తనను ఇప్పటివరకు చదివించింది. కానీ ఆమె అనారోగ్యం ఇప్పుడు పని చేయనివ్వడం లేదు. డాక్టర్ దగ్గరికెళ్ళటానికి కూడా డబ్బులు లేవన్న భయంతో ఏవో కాయ కల్పం మందులు వేసుకుంటూ తన బండిని లాగిస్తున్నది. ఇలాటి స్థితిలో నేనాలాటి కవితలు రాసానంటే, అది నా గొప్పతనం కాదు. నాకనిపిస్తుంది కళ్లెం లేని గుర్రం లాగ నా మనసు పరిగెడుతుంటే, సంపత్ సహచర్యంతో ప్రేమావేశంలో అలా రాసానేమో అనిపిస్తున్నది . కానీ నా స్థితి లో సంపత్ లాంటి ,రమా లాంటి స్నేహితులు దొరకడం నేను ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యం. అలాటిది నేను సంపత్ ని కోరుకోవడం,” తల విదిలించింది నిరాశగా సరయు.
నిస్సహాయతలో సంపాత్ తోటి ఆలా మాట్లాడి అతన్ని బాగా గాయపరిచింది తను. సంపత్ తన నుండి చాలా దూరం వెళ్ళిపోయినట్లు అనిపించింది. తనెంత తొందరపడింది. అతన్ని శాశ్వతంగా కోల్పోయాన? భయంతో కూడిన అశాంతి ఆమెలో కలిగింది. మనసంతా ఆవేదన , నిరాశా, నిస్పృహ తో నిండిపోయాయి.
శిశిర మరుదెంచెనే సఖి
పండు తాకుల పట్టు పరదాలు ల దాల్చి,
పలుకునే వీడ్కోలు భగ్న మనస్క
రాదు పొ ఇక నీ వసంతం సాగిపోయె!
ఆమె దూరంగా వెళ్ళిపోతున్న సంపత్ ని చూస్తూ నిస్సహాయంగా అలాగే వీల్ చైర్ లో వొరిగి పోయింది. సిస్టర్ మేరీ ఒక్క అంగలో సరయుని చేరుకొని బెడ్ మీదకి చేర్చింది. నిస్సహాయంగా, స్పృహలోలేని సరయుని చూస్తుంటే మేరీకి జాలి వేసింది.
***
రూమ్ కి వెళ్ళగానే సంపత్ రమ కి ఫోన్ చేసి తాను సిస్టర్ మేరీతో మాట్లాడింది, తను దూరంగా ఉండి వీల్ చైర్లో ఉన్న సరయుని చూసినట్లు చెప్పాడు. “రమా ! ఇదంతా నా వల్లే జరిగింది. సరయుని ఈ స్థితికి తీసుకొచ్చింది నేనే. నా సరయుని కాపాడుకోవాలి. రేపు నువ్వు వస్తావా డా. బలరాంని కలుద్దాం,” అన్నాడు.
“తప్పకుండ వస్తాను సంపత్,నువ్వంతల బెంగపడద్దు. దానికి వేరే టెన్సన్స్ కూడా ఉన్నాయి. కొద్దీ రోజులుగా ఇలాగే బాధపడుతున్నది. మనం డాక్టర్ గారితో మాట్లాడదాము,” అంది భరోసాగా. అన్నట్లుగా రమ, సంపత్ ఇద్దరు హాస్పిటల్ దగ్గర కలుసుకున్నారు. రౌండ్స్ ముగించుకొని వచ్చిన బలరాం వాళ్ళని సాదరంగా తన రూమ్ లోకి పిలిచాడు.
“ చెప్పండి, సరయు మీకేమవుతుంది,” అడిగాడు.
“ మంచి స్నేహితురాలు సార్. చాలా మంచిది,” అన్నది రమ.
“ మరి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారా?”
“ ఇంకా లేదు సర్ ,”అన్నాడు సంపత్.
“సరయూకి అమ్మ ఒక్కతే సర్, వంటలు చేస్తూ సరయుని చదివించుకుంటున్నది. ఈ మధ్య ఆమెకి ఆస్తమా ఎక్కువయి పనులకి వేళ్ళ లేక పోతున్నది. అందుకే సరయూకి ఇంట్లో గడవడం కష్టమయి పోతున్నది. హాస్టల్లో మేమందరం తనని చూసుసుకునేవాళ్ళం . ఇప్పుడు మాకు హాస్టల్ కూడా లేదు, మా స్టడీస్ పూర్తయినాయి. ఒక టెన్ డేస్ లో హాస్టల్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. అందుకే కొద్ది రోజుల నుండి తాను మానసికంగా బాగా ఢీలా పడిపోయింది. మేమెంత చెప్పిన తట్టుకోలేక పోతున్నది ఆ స్థితిని,” వివరించింది రమ.
“ ఈ విషయం నాకెందుకు చెప్పలేదు రమ,” అడిగాడు సంపత్.
“ తన విషయాలు ఎవ్వరికి చెప్పోద్దంది. ముఖ్యంగా నీకు,” అంది రమ పేలవంగా నవ్వేస్తూ.
డా.బలరాం కల్పించుకొని, “ఆమెకేమయిన హెల్త్ సమస్యలు చిన్నప్పటినుంచి ఉన్నాయేమో తెలియాలి. అందుకు ఆమె మెడికల్ హిస్టరీ కావాలి. ఫిట్స్ తనకి చిన్ననాటి నుండే ఉన్నాయా?” అడిగాడు.
రమ చెప్పింది, “లేదు డాక్టర్ గారు, నాకు తెల్సినంత మటుకు ఇదే మొదటి సారి,” అన్నది.
“అలాగా! అయితే ఆమె అమ్మని పిలిపించండి, ట్రీట్మెంట్ మొదలుపెడదాము,” అన్నాడు.
“ ఎంత ఖర్చవుతుంది డాక్టర్ గారు,” అడిగాడు సంపత్.
“ఆమెకి ఫిట్స్ మళ్ళీరాకుండా ఉండడానికి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, దానికి న్యూరాలజిస్ట్ ని పిలవాలి. అప్పటివరకు ఆమెని హాస్పిటల్ లోనే ఉంచాలి. మొత్తం మీద లక్ష రూపాయలు కావచ్చు. ఆమె ఆర్థిక స్థాయిని బట్టి మేము హాస్పిటల్ తరఫున బెడ్- ఫుడ్ ఫ్రీగా ఇస్తాము. మిగిలిన ఖర్చులు పేషంట్ చూసుకోవాలి ,” అన్నాడు సాలోచనగా చూస్తూ.
“ అలాగే డాక్టర్ ,మీరు ట్రీట్మెంట్ మొదలుపెట్టండి,” అన్నాడు సంపత్.
“అంత డబ్బు నువ్వెక్కడనుంచి తెస్తావు సంపత్,” అడిగింది రమ అనుమానంగా.
“ ఆ విషయం నాకు వదిలేయి. నాకు ప్రతి ఏడాది స్టడిస్ కోసమని నాన్నగారు నా అకౌంట్లో డబ్బులు వేస్తారు. సరయు హాస్పిటల్ ఖర్చులన్నీ నేనే భరిస్తాను. నువ్వు నాకు సాయంగా ఉండాలి. ఈ పరిస్థితిలో నేను తనకి ఎదురుపడక పోవడమే మంచిది. నువ్వు వాళ్ళ అమ్మ గారికి తెలియచేయి,” అన్నాడు.
“అలాగే. దగ్గర్లోనే ఉన్న చిన్న పల్లెటూరు వెల్లలూరు,ఆమె తమ్ముడి ఇంట్లో ఉంటున్నది. నేనే వెళ్లి ఆమెకి ధైర్యం చెప్పి తీసుకొస్తాను,” అంది.
“అయితే ఇదిగో ఈ రెండు వేలుంచు, “ అంటూ ఇవ్వ బోయాడు.
“వద్దు సంపత్. ఈ మాత్రం నేను ఖర్చు పెట్టగలను సరయు కోసం. ఒక విషయం, ముందుగా మీ నాన్నగారికి చెప్పి డబ్బులు ఖర్చు పెట్టు,” అంది రమ.
***
“సరయు! ఎలా ఉన్నదే! టిఫిన్ చేశావా?” అడిగింది. తిన్నాను అన్నట్టు తలూ పింది బలహీనంగా.
“ నేను మీ అమ్మగారిని తీసుకొస్తాను. లేకపోతే ఆమె ఎదురు చూస్తుంటుంది నువ్వు ఇంటికి వస్తావని. సరేనా,” అంది సరయు చేతిమీద చేయి వేసి.
నిస్సహాయంగా చూస్తుండి పోయింది. “నువ్వేమి దిగులు పడకు. నీకు ఏమి కాదు, మీ అమ్మగారికి ఏమి కాదు. నేను చూసుకుంటాను. సాయంత్రానికల్లా మీ అమ్మగారు నీ దగ్గర ఉంటుంది,” అని చెప్పి వెళ్ళిపోయింది రమ.
అన్నట్టుగా వెల్లలూరు వెళ్లి విషయం చెప్పి, వాళ్ళ అమ్మ గారిని తీసుకొని గుంటూరు చేరుకుంది. నేరుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. సరయుని అలా చూస్తున్న ఆమె హృదయం ద్రవించి పోయింది. ముందుగానే ఆమెకు సరయు మానసిక స్థితి చెప్పడంతో ఆమె ఏడుపురాకుండా నిబ్బరంగా ఉండి, బయటికి రాగానే ఘొల్లుమంది. రమ ఆమెని సముదాయించి, హాస్పిటల్ కి దగ్గరగా ఉన్నధర్మశాలలో ఆమె బసకి ఏర్పాటు చేసి తాను వెళ్లి పోయింది.
మరునాడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి, మెడిసిన్స్ కి కావాల్సిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ముప్పై వేలు కట్టేసాడు. సిస్టర్ మేరీకి చెప్పాడు , “సిస్టర్ సరయుకి నేను డబ్బులు కడుతున్నానని మీరు చెప్పకండి,” అన్నాడు.
మూడోరోజు ఉదయాన్నే రమ వచ్చింది.“సరయు ఎలా ఉందే ?” అడిగింది రమ ఆప్యాయంగా.
“బాగాను ఉన్నాను. ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఒక్క సారి మొదలుపెట్టారు, డబ్బులు చాల అవుతాయి కదు? అమ్మ మామయ్యని అడిగేమన్న తెచ్చిందా?” అడిగింది సరయు.
“అదేంలేదు, ఎకనామికల్లి పూర్ పేషంట్స్ కి ఇక్కడ ఉచిత వైద్యం దొరుకుతుంది. కొంచమయితే మనం కట్టాల్సి ఉంటుంది. అవన్నీ నేను చూసుకుంటాలే,” అంది.
“నీలాటి స్నేహితురాలు నాకుండడం నేను చేసుకున్న పుణ్యం, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను,” అంది కళ్ళు కృతజ్ఞత భావంతో నిండిపోగా.
“పిచ్చి దాన, నేను కేవలం మధ్యవర్తిని మాత్రమే, నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నీ ప్రాణ స్నేహితుడు ఇవన్నీ చేస్తున్నాడు అజ్ఞాతంగా,” అనుకోంది రమ మనసులో.
పదిహేను రోజులు సరయు ట్రీట్మెంట్ లో గడిచిపోయాయి. సరయు వాళ్ళమ్మని రమ కనిపెట్టుకొని చూసుకుంటూ ఆమెకి కూడా సీనియర్ సిటిజెన్ కింద ఒక స్వచ్ఛంధ సంస్థ ద్వారా వైద్య సదుపాయం ఏర్పాటు చేసింది.
డా.బలరాం అన్నాడు,” వెరీ గుడ్ మిస్.సరయు. మీరు నార్మల్ అయిపోయారు. మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు. మూడు నెలల కొక సారి మీ రొక ఇంజెక్షన్ ఒక ఏడాది పాటు తీసుకోవాలి.”
“ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు?” అడిగింది రమ.
“రేపు సాయంత్రం,” అన్నాడు, “ఓకే డాక్టర్,” అన్నారు సరయు, రమ ఒకే సారి. అలా అన్నందుకు ఇద్దరికీ నవ్వు కూడా వచ్చింది. అలా నవ్వు కుంటున్న సరయుని దూరంగా ఉండి గమనిస్తున్న సంపత్ నిశ్చింతగా అక్కడి నుండి వెళ్లి పోయాడు. ముందుగానే ప్రతి మూడు నెలలకివ్వాల్సిన ఇంజక్షన్ డబ్బులు కట్టేసి, డేట్స్ ఫిక్స్ చేయించి, అది హాస్పిటల్ వారి పాలసీ అని చెప్పించాడు సంపత్.
సరయు గుంటూరులోనే చిన్న రూమ్ తీసుకుంది. వాళ్ళమ్మగారికి ఒకరింట్లో వంట చేయటానికి కుదిరించింది రమ. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కొంతవరకు ఆర్థిక ఇబ్బదులనుండి బయటపడింది సరయు. రమతో కలిసి సివిల్స్ కి తయారీ మొదలుపెట్టింది సరయు ఆ ఏడాది. ప్రిలిమ్స్ పాసయినా మెయిన్స్ లో పోయింది రమకి. సరయు దీక్ష పట్టినట్లు చదవడంతో మెయిన్స్ క్లియర్ చేసి, ఇంటర్వ్యూకి చేరుకుంది. అన్ని కలసి రావడంతో విమెన్స్ కోటాలో ఐ ఆర్ ఎస్ లో సెలెక్ట్ అయింది.
“రమ! సంపత్ తనమాట నిలబెట్టుకొని మళ్ళి నన్ను కలవలేదు. అంతగా బాధ పెట్టాననిపిస్తున్నది. నేను మనఃస్ఫూర్తిగా సంపత్ కి క్షమాపణ చెప్పుకోవాలి. నేను మళ్ళి అతన్ని కలుస్తానా?” అంది దుఃఖంతో గొంతు పూడుకుపోగా.
“పిచ్చి సరయు! నీది సంపత్ ది అంత త్వరగా తెగి పోయే బంధం అనుకుంటున్నావా!”
‘లేదు’ అని తలఊపింది.
“నాకు నమ్మకముంది సంపత్ నిన్నెప్పటికీ మరిచిపోలేడు. నీలాగే తను కూడా నిన్ను కలవాలని ఎదురుచూస్తున్నాడేమో. ఆ శుభఘడియ త్వరలోనే వస్తుంది. నా మాటల మీద నమ్మకముంచు,” అంటూ స్వాంతన పలికింది రమ.
కానీ ఎప్పటి కప్పుడు సంపత్ కి సరయు ఆరోగ్య విషయం, సివిల్స్ తయారీ గురించి చెబుతూనే ఉన్నది. కానీ ఆ విషయం సంపత్ కోరిక మేరకు గోప్యంగానే ఉంచింది సరయుకి తెలియకుండా. ఢిల్లీ లోనే ఉంది సివిల్స్ కి తయారయ్యాడు సంపత్. అందుకే సంపత్ ఎక్కడ ఉన్నదన్న విషయం రమకి కూడా తెలియకుండా జాగర్త పడ్డాడు. సివిల్స్ సరయు క్లియర్ చేసిందని తెలుసుకున్నాకే తన సంగతి కూడా చెప్పి, సరయుని తను ఢిల్లీలో కలుసుకునేదాకా తన గురించి ఏమి తెలియచేయొద్దని రమ చేత ఒట్టేయించు కున్నాడు.
***
సరయు ఢిల్లీ చేరుకుంది ట్రైనింగ్ కోసం. సాయంత్రం లెక్చర్ సెషన్లో ట్రైనీస్ అందరు ఆఫీసర్స్ కాంటీన్ లో చేరారు. టీ బ్రేక్ లో వెనకాతలే వచ్చి ఎవరో నిలుచున్నట్లయింది సరయూకి. వెన్నక్కి తిరిగి చూసింది. “సంపత్!” ఆశర్యంగా చూస్తుండిపోయింది.
“హలో మేడం, నేను గుర్తున్నానా ?” నవ్వుతు అడుగుతున్నాడు సంపత్.
“సంపత్ నువ్వా?” తన కళ్ళని తానే నమ్మలేనట్లుచేసింది. ‘అవును’ అని తలూపాడు స్టైలిష్ గా.
ఆమె వంటనే పరిసరాలను మర్చిపోయింది, “సంపత్,” అంటూ భావోద్వేగంతో గట్టిగా అతని చేతులు పట్టుకొని ఊపేసింది పోయిన పెన్నిధి దొరికినట్లు. సంపత్ సంతోషంగా ఆమె తలా నిమురుతూ కొద్దీ సేపు అలా ఉండి పోయారిద్దరు.
ట్రైనింగ్ లాస్ట్ డే ట్రైనీసందరు పార్టీ అంటూ ఒకచోట చేరారు. అప్పుడు సరయు పెద్దగా అంది, “ఫ్రెండ్స్ నేను మీ అందరిముందు ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, మీరు సమ్మతిస్తే,” అంది నాటకీయంగా. “షూర్ అన్నారందరు చప్పట్లు కొడుతూ.
సరయు తన డైరీ తీసింది.
శీర్షిక : అభిసారిక
ఆశగా ఆకాశంలో తారలా
నా ఆశ మినుకు మిణుకుమంటున్నది
వెంటనంటే నీ తలపులా !
వలపు వెన్నెలలో కాంతి లా ,
అమవాస నిశి లో
నన్నంటి వచ్చే తార లా,
నువ్వు నా వెంటే ఉన్నావన్న భావనలో
నిన్ను తలవని క్షణం లేదు, నీకోసం వేచి చూడని ఘడియ లేదు
నీ అభిసారికల!!
అందరు కొద్దిసేపు విస్మయంలో ఉండిపోయారు. కొద్దిక్షణాల్లో క్లాప్స్ తో ఆమెని అభినందించారు. ముందుగా తేరుకుంది రఘురాం, తెలుగు లిటరేచర్ లో మెయిన్స్ క్లియర్ చేసాడు.
“గ్రేట్! ఎంత అందమయిన భావన. అమవాస నిశిలో సహితం తార నీ వెంటే ఉన్న ఒక మంచి స్నేహితుడి కొసం రాసినట్లుగా ఉంది. ఎంత చక్కటి భావన” అంటూ “ఎప్పటికయినా మీ కవిత సంకలనాలు పబ్లిష్ చేసే బాధ్యత నాకే ఇవ్వాలి సరయు,” అన్నాడు పెద్దగా క్లాప్ కొడుతూ. “ఇట్స్ మై ప్రామిస్,” అంది సరయు సంపత్ వంక చూస్తూ.
సంపత్ మనసంతా నిండిపోయిన సంతృప్తితో సరయుని చూస్తుండి పోయాడు. తిరుగు ప్రయాణం రోజు సంపత్, “సరయు! మనం కలిసి ప్రయాణించే ప్రయాణికులమా లేక , ఎప్పటికి కలవని రైలు పట్టాలమా? ఏదయినా నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, “ అన్నాడు. ఇద్దరికీ కలిపి చేయించిన ఫ్లయిట్ టికెట్స్ ని చూపిస్తూ,”సంపత్! స్వేచ్ఛగా మనః స్ఫూర్తిగా ఒకరి కోసం ఒకరి లాగ మన గమ్యంకోసం కలిసి పయనిద్దాం జంట పక్షుల్లాగా, “ అంది. ఇద్దరు కలిసి హైదరాబాద్ ఫ్లయిట్ ఎక్కారు.
*****

Padmavathi Neelamraju is a retired teacher with more than 35 years of experience in teaching English, based in Chandigarh. She completed her education at Nagarjuna University, AP and CIEFL, Hyderabad, and went on to receive an MPhil in Indian Writings in English with a focus on Feminist literature. With an interest in Telugu and English literature, she pens her experiences through blogs and newspapers. Her writings often reflect her enthusiastic and experiential outlook towards life and society. She actively volunteers for the cause of education.
