
నీహార పథం – భాగం-3
-డాక్టర్ కొండపల్లి నీహారిణి
నీహార పథంలో ఇప్పటిదాకా….
అమెరికాలో మనుమరాలు తన కథ చెప్పమని అడగగా, తాను ఎందుకు జీవిత గాథ చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే ఉపోద్ఘాతంతో ప్రారంభమైన “నీహార పథం” లో డాక్టర్ కొండపల్లి నీహారిణి తన ‘తొలి తొలి అడుగుల చిన్నారి లోకం …’ అంటూ బాల్య విశేషాలలో వాళ్ళ అమ్మ తనను “దేవుడూ …” అని ఎందుకు పిలిచేవారో చెప్పారు. ఆ రోజుల్లోనే వాళ్ళ అమ్మ గారు పెండ్యాల కౌసల్యాదేవి మహిళా మండలిని స్థాపించి స్త్రీల సాధికారత కోసం కృషి చేసిన విషయాన్ని, వరంగల్ జిల్లా మొట్టమొదటి ఎం.పీ.గా సేవలు అందించిన నాన్నగారు పెండ్యాల రాఘవరావు ఆనాటి పోరాట సమయంలో వారి స్పీచ్ కాగానే కాళోజీ నారాయణరావు ఏమన్నారో చెప్పిన విషయం అంతా రాశారు. ఆకాశవాణి ప్రభావం, పెద్ద కుటుంబ ఆహ్లాదం, యశోదమ్మకు కృష్ణుడు నోరు చూపించినట్టు వాళ్ళ అమ్మ గారికి ఎందుకు నోరు తెరిచి చూపించారో చెప్పిన కథనం తర్వాత….
***
మేము చదువుకున్న రోజులలో బడి ముందు ఆ పెద్ద విశాలమైన ఆట స్థలంలో పచ్చని చెట్లు ఉండేవి. ఆ చెట్ల క్రింద కూర్చుని కొన్ని పాఠాలు విన్నాం. బడి ముందే రోడ్డు. మా ఊర్లో నుండి “చిలుపూరు బుగులు వేంకటేశ్వర స్వామి” ఆలయం ఉన్న చిలుపూర్ వెళ్లడానికి మట్టి రోడ్డు ఉండేది. ‘గుబులు‘ నే ‘బుగులు‘ అంటారని ఈ మధ్య తెలంగాణ మాండలికం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తెలిసింది!! బస్టాండ్ దగ్గర పెద్ద పెద్ద మర్రి చెట్లు, రావి చెట్లు ఉండేవి. వాటి వ్రేళ్ళు నేలమీద తేలి ఉండేవి. పెద్ద పెద్ద ఊడలు ఉండేవి. అవి ఆ రోజుల్లో ఏ జీవిత సత్యాలనూ బోధించలేదు . కానీ, “అర్ర తలుపులు” కవితా సంపుటిలో “పల్లె మరిచింది” (2004)కవితలో
“బస్సు దిగగానే నవ్వుతూ పలకరించే పెద్ద మఱ్ఱి చెట్టు జాడలేదు/ దాని మొదట్లో వెలిసిన పాన్ షాప్ తోరణాలైన పాన్ మసాలా పాకెట్లు పళ్లికిలించి పలకరించాయి గానీ / తమ యజమాని పలకరించలేదని చిన్నబోయాయి/ మారని మట్టిరోడ్డు వెంట ఊళ్ళోకి వెళ్ళబోతుంటే / ఆటో తమ్ముళ్ళ అమాయక ప్రశ్న లు/ నర్సయ్య గుడిసె మాత్రం ఇల్లైంది/ మందుల షాపు ,”మందు” షాపు” లను చూసి ఒళ్ళు ఝల్లని జలధరించింది…..” అని రాసాను, మళ్లీ ఇప్పుడు గుర్తుకొస్తున్నది.
ఒకసారి నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు కావచ్చు, మల్లయ్య సార్ అని ఒకసారి ఉండేవారు . ఆయన అందరినీ కొడుతూ కొడుతూ నన్ను కూడా కొట్టారు . నేనేమి అల్లరి చేయలేదు. ఎందుకు కొట్టాడంటే మా క్లాస్మేట్ ఒక అబ్బాయి చాలా పొడుగ్గా ఉండేవాడు. ఒక్కొక్కళ్ళతో సార్ ఎక్కాలు చదివించేప్పుడు, అతను “బద్దెందొకాట్ల బద్దెంది…. బద్దెంది రొండ్ల యిర్వైయ్యారు ” అంటూ 18 వ ఎక్కం చదువు తున్నాడు. అతనలా చదువుతుంటే క్లాసంతా నవ్వేసరికి సార్ కు కోపం వచ్చి, అందరినీ కొట్టారు. అయితే నేను నవ్వలేదు. ఎందుకంటే , నాకు ఆ అబ్బాయితో మంచి స్నేహమే ఉండేది. నన్ను చిన్నక్క … చిన్నక్క… అనేవాడు. దీనికీ ఓ కథ ఉంది. మమ్మల్ని ఊళ్లో అందరూ “దొరసాని” అనే అనేవాళ్లు. నన్ను ” చిన్న దొర్సాని ” అనేవాళ్ళు. అలా ఎవరైనా అనగానే సర్రున ఇంతెత్తు లేచే దాన్ని! “చిన్న దొరసాని … ఏంది? చిన్న దొరసాని?”, “చిన్నక్క” అను “నీహక్క” అను “అక్క” అను అనేదాన్ని. అలా మాకు ఊరంతా అన్నలు, మామలు అంతే! మా అమ్మ చాలా మంది ని అన్నా అని పిలిచేది. అయినా ప్రజలు కదా వాళ్ళు వాళ్ళ అలవాట్లనేలా మానుకుంటారు? ఇక్కడ ఈ అబ్బాయి నా క్లాస్మేట్ కాబట్టి నన్ను చిన్నక్క అనే అనేవాడు. ఎవరైనా మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం చాలా అరుదు. అంతకు ముందు కూడా క్లాసులో ఆ అబ్బాయి అలా చదివితే మా అసలు లెక్కల సార్ కొట్టాడు. అయినా అతను మానుకోలేకపోయాడు. ఈ సార్ సబ్ట్యూషన్ క్లాస్ కి వచ్చారు. అదన్నమాట! నాకు ఆ అబ్బాయి మీద జాలి. నేను నవ్వలేదు. అయినా దెబ్బ పడింది. ఆ సార్ కి తెలియలేదు. గుంపులో గోవిందా అన్నట్టుగా! ఎంత అన్యాయం! చేయని తప్పుకు శిక్షనా? ఇక చూసుకోండి నా ప్రతాపం! ఇంటికి వెళ్లి అమ్మకు బాపుకు చెప్పి, ఏడ్చి, నేను అల్లరి చేయకున్నా నన్ను కొట్టాడు అని.. కంప్లైంట్ ఇచ్చా. మామూలుగా అయితే వాళ్లూ నమ్మకపోదురేమో కానీ, వాళ్ళకు ఈ విషయం తెలుసు. ఇంక తప్పనిసరై పెద్ద సార్ కు కంప్లైంట్ వెళ్ళింది . పెద్ద సార్ అంటే ఎవరు? దామోదర్ రావు చిన్నబాపు. ఆయిన స్కూల్ కి హెడ్మాస్టర్ కాదు. టీచర్. ప్రతి రోజూ ప్రొద్దున్నే సైకిల్ మీద ఓ రౌండ్ ఊరంతా తిరిగేవారు . ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్!! స్కూల్ పెట్టినప్పటి నుంచి అందర్నీ భయభక్తుల్లో ఉంచిన సార్ కాబట్టి ఆ చినబాపును ఊరు ఊరంతా “పెద్దసారు” అనేవాళ్ళు. వీరు ప్రముఖ కవి వరవర్ రావు గారి అన్నయ్య.
‘జెండా వందనం’ వచ్చిందంటే మా హడావిడి ఇంత అంతా కాదు . పెద్ద సార్ ఆఫీస్ ముందు అంటే హెడ్మాస్టర్ సార్ ఆఫీస్ ముందు గద్దెపై పొడవాటి స్తంభం అంటే పోల్ ఉండేది, దానికి జెండా కట్టి 15 వ ఆగస్ట్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని, జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేవాళ్లు. కానీ , దాన్ని మేము హెడ్మాస్టర్ ఆఫీస్ అని అనే వాళ్లం కాదు. పెద్ద సార్ రూమ్ అనేవాళ్ళు. అనరాకనో… అలవాటు ప్రకారమో కానీ, అలాగే పిలిచేవాళ్ళు. ఆ ప్రాంగణమంతా రంగురంగుల కాగితాల తోరణాలను అతికించే వాళ్ళం, మువ్వన్నెల జెండా సిద్ధం చేసేవాళ్ళం . చాలా కాలం వరకు మా బాపు బడి లో జెండా ఎగరేసేవారు. తెల్లవారుజామున్నే లేచి స్నానం చేసి తెల్లని శుభ్రమైన బట్టలను వేసుకొని తొందరగా వెళ్లేవాళ్ళం. అందరి కన్నా ముందు ఉండాలి. అందరికన్నా బాగా పాడాలి , బాగా మాట్లాడాలి.. దానికోసం ఇంట్లో ముందు వారం రోజులు ప్రిపేర్ అయ్యేవాళ్ళం. మా అమ్మ ‘జెండా వందనం’ రోజు కూడా ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసేది. ‘మన సాంస్కృతిక పండుగలకు’ చేసినట్టుగా… ‘ జాతీయ పండుగలకు‘! వాకిట్లో ముగ్గులు వేసి జెండా దించేవాళ్లం, జాతీయ దినోత్సవాలు అంటే అలా పులకించిపోయేవాళ్ళం! రేడియోలో వచ్చే లలిత సంగీత దేశభక్తి గీతాలు, సినీ గీతాలు ఊరంతా మారుమ్రోగేది. రోడ్డు వారగా, బాటలకు ప్రక్కనా తెల్లని పొడి వేసేవాళ్ళు. ఊరంతా శుభ్రం అయ్యేది. “ఎలోళ్లు” గ్రామపంచాయతీ ముఖ్యులకు చెప్పిరావాలి. ( ఎలోళ్లు అంటే ప్రభుత్వ సర్వీసులో ఉన్న గ్రామ సహకార ఉద్యోగులు village workers , గ్రామ సేవకులు) . ఊరి పెద్ద మాదిగ అధ్వర్యంలో డప్పు కొట్టి చాటింపు వేయించేది. ఊరి వాళ్ళందరూ శుభ్రంగా తయారై , సిద్ధమై వచ్చేవాళ్ళు. బడి తరపున చాక్లెట్లు పంచేవాళ్ళం. ఆ రోజు ను ఎంతో పవిత్రంగా భావించేవాళ్లందరూనూ! నేనైతే రన్నింగ్ రేస్ లోనో, స్కిప్పింగ్ లోనో, కోకో లోనో, ఉపన్యాసం లోనో ఏదో ఒక చిన్న ప్రైజ్ నైనా అందుకునేది. ప్రైజ్ రాని సంవత్సరం బాధనే! ఎందుకంటే మా నలుగురి మధ్య చర్చోపచర్చలు జరిగేవి కదా! అప్పటికే పెద్దన్నయ్య లు చాలా పెద్దవాళ్లు. సెలవుల్లో డాక్టర్ అన్నయ్య వచ్చేదాయె! ఇక రేడియో లో చక్కని కార్యక్రమాలు, పాటలు ఎన్నో .. మా చెవ్వులటే… మా నోట ఆ పాటలు!
” ఎత్తండి ఎత్తండి స్వాతంత్య్రపు జెండా.. ఎత్తవోయి ఎత్తు ఎత్తు ఆకాశం నిండా..” అనే పాట
“నదీ సుందరి.. సుధా చందన .. నగా ధీశ్వర నందినీ..” అనే పాట
” నారాయణ నారాయణ అల్లా అల్లా…” పాట
” ఓహో యాత్రికుడా .. ఓహో యాత్రికుడా.. ” అనే ఎన్నో పాటలు రేడియోలో వింటూ పాడుతూ ఆ రోజు మొత్తం దేశభక్తిను మా ఒంట్లో నింపుకునే వాళ్ళం మనసుల్లోకి ఒంపుకునే వాళ్ళం. టంగుటూరి సూర్యకుమారి గారి గళంలో ,
ఇక “టూం…. టురుటుం… టూం….టురుటుం…. టుక్కుం… టుక్కుం…” అనే ప్రారంభ మ్యూజిక్ తో మధ్యాహ్నం ప్రసారమయ్యే ” కార్మికుల కార్యక్రమం” వచ్చిందంటే చాలు .. మేం అందులో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. మొత్తం మాకైతే బట్టీకొట్టినట్టే… చిన్నక్క, ఏకాంబరం, బాలయ్య , రాంబాబు పాత్రలలో నేను , తమ్ముడు, అక్కయ్య, అన్నయ్య లీనమైపోయి నటించేసిన ఆ అందమైన రోజులు కన్నుల ముందర తచ్చాడుతున్నవి .. ఇప్పుడనిపిస్తున్నది అది ” ఆకాశవాణి యుగం” అని! నిజం గా అలా అనవచ్చేమో!!
స్కూల్ కి “నాదర్ సాబ్” వస్తున్నారంటే మాలాంటి విద్యార్థులు కావాలి కదా! నాదర్ సాబ్ అంటే ఎవరనుకున్నారేంటి? అంటే, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈరోజుల్లో చెప్పే MEO. అప్పుడు నాదర్ సాబ్ చెకింగ్ కు వస్తే పెద్ద హల్చల్ ఉండేది.
‘సూక్తులు‘ అమ్మని అడిగి పేపర్ మీద రాసుకుని వెళ్లి స్కూల్లో టీచర్ కి ఇస్తే గోడలకు అతికించేది. పుస్తకాలకు అట్టలు వేసి శుభ్రంగా పెట్టుకోవాలి. ” చూచిరాత” కాపీలలో అందంగా రాయాలి టీచర్స్” గుడ్” వేయాలి.. ఇది చక్కని ఛాలెంజ్!
*****
( ఇంకా వుంది )

ఎం .ఏ. తెలుగు , తెలుగు పండిత శిక్షణ (20 ఏళ్ళ బోధనానుభవం), ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ‘ ఒద్దిరాజు సోదరుల జీవితం-సాహిత్యం‘ పై పరిశోధన చేసి , డాక్టరేట్ పట్టా పొందాను . నిత్యవిద్యార్థిగా నిరంతర సాహిత్య పఠనం . పెద్దల మాటలను , కొత్తగొంతుకలను వినడం ఇష్టం .
