అనుసృజన

ఆ గది గుర్తుకొస్తుంది

హిందీ మూలం: జావేద్ అఖ్తర్

అనుసృజన: ఆర్ శాంతసుందరి

ఆ గది గుర్తుకొస్తుంది
ఈ జీవితంలో ఎండ భగభగల్లో మాడిపోయినప్పుడల్లా
అవతలివారు చెప్పే అసత్యాలని నేను చెప్పే అబద్ధాలని విని విని అలసిపోయినప్పుడల్లా
అందరితో పోరాడి ఓటమి చవిచూసినప్పుడల్లా
ఆ ఒక్క గదిలోకి వెళ్ళినప్పుడల్లా
ఆ లేత , ముదురు కావి రంగు గది ఎంతో దయగల గది
తన మెత్తని గుప్పిట్లో దాచేసేది నన్ను తల్లి పిల్లవాణ్ణి తన చీర కొంగు కప్పి దాచినట్టు
“మండే ఎండలో వీధులవెంట తిరగడం ఇదేం అలవాటు నీకు?’ అంటూ ప్రేమగా మందలించి నట్టు
ఆ గది గుర్తొస్తుంది
నాకు బలమైన, భారీగా ఉన్న కష్టపడితే గాని తెరుచుకోని
ఆ నల్ల చందనపు తలుపు
ఒక కోపిష్ఠి తండ్రి
గరుకు తేలిన తన ఛాతీలో
మమకారమనే సముద్రాన్ని దాచుకున్నట్టు
ఆ కుర్చీ దాని పక్కనే దాని కవల ఒకటి
అవి రెండూ నా స్నేహితులు
ఆ అహంకారి, కఠినంగా మాట్లాడే అద్దం
దాని మనసు మంచిదే పాపం
ఆ పక్కకి ఒరిగిపోయిన అలమరా ఒక మూల ఒదిగిపోయి
ముసలి దాది లాగ అద్దాన్ని కసురుతూ ఉండేది
ఆ పూలకుండీ ఒకటి చిన్నదైనా గొప్ప అల్లరి చేసేది
ఆ ఇద్దరినీ చూసి నవ్వేది
అన్నీ తెలిసినట్టు ఒక వంకర నవ్వు
కిటికీ అంచు మీదికి వంగిన ఒక పూతీవ
ఏదో పచ్చటి రహస్యం చెపుతున్నట్టు
అటక మీదా అరల్లోనూ పుస్తకాలు
గురుపత్నుల్లా గంభీరంగా కూర్చుని ఉన్నా
నేను వాటిని ఏమైనా అడగాలని ఎదురుచూస్తూ
-తలవైపు నిద్రకి నా తోడులా
అలసటకి వైద్యుడిలా
ఆ మెత్తని మనసున్న తలగడ
దాని ఒడిలో తల పెట్టుకుని
పైకప్పుకేసి చూసేవాణ్ణి
ఆ దూలాల్లో ఎన్ని గొలుసు కథలో!
ఆ చిన్న బల్ల మీద ఎదురుగా
గోడ మీద వేలాడే చిత్రాలు
ఆప్యాయంగా , నమ్మకంగా చూసేవి నావైపు
చిరునవ్వులు రువ్వుతూ
అసలు అనుమానమే రాలేదు వాటికి
ఏదో ఒక రోజు అన్నిటినీ వదిలి వెళ్ళిపోతానని
అలా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రానే రానని
ఇప్పుడు నేనుంటున్న ఇల్లు
చాలా అందమైనది కానీ తరచు ఇక్కడ కూర్చుని
మౌనంగా గుర్తు చేసుకుంటూ ఉంటాను
ఆ గది నాతో మాట్లాడేది…

*****

Leave a Reply

Your email address will not be published.