ట్రావెల్ డైరీస్ -6

నక్షత్రాలు నేలదిగే నగరం

-నందకిషోర్

 
హిమాలయాల్లో ఏడు సరస్సులు (సాత్ తాల్) ఒకే చోట ఉండే ప్రాంతం ఒకటుంది. ఆ ప్రాంతానికంతా వన్నె తెచ్చిన్నగరం నైనితాల్. ఇది ఉత్తరాఖండ్ రాజధాని. మనదేశంలోని అందమైన నగరాల్లో ఒకటి. నయనాదేవి మందిరం ఉన్నందుకు నైనితాల్ అనేపేరు. ఆ మందిరం పక్కనే సరస్సు. ఆ సరస్సు నీళ్ళన్నీ నయనాదేవి కన్నీళ్ళంత తేటగా ఉంటాయ్.
 
నైనితాల్‌కి నేను చాలాసార్లే వెళ్ళాను. మనసు కుదురులేదంటే చాలు, హర్దోయి నుండి శుక్రవారం అర్ధరాత్రి భాగ్ ఎక్స్ప్రెస్ ఎక్కి పారిపోయి వొచ్చేవాన్ని. రుద్రపూర్ దాటగానే ప్రకృతి సౌందర్యం గాలినిండా ఆవహించినట్టయేది. హల్ద్వాని రాగానే హిమపర్వత దర్శనం మొదలయ్యేది. కాత్ గోడం( Kathgodam) రైలు గమ్యస్థానం. plains ఇక్కడికే ఆఖరు. ఆపైన ఉన్నదంతా ఘాటీ. పక్షుల కన్నా ప్రేమపక్షులు ఎక్కువ కనపడే ఊరిది. నా ఒంటరి రోజుల్లో ఈ నగరం నాకో సాంత్వన.
 
*
 
ఎప్పుడూ బయటే ఏం తిరుగుతాం? మనలోపలికి కూడా ఒక్కోసారి ప్రయాణం చేస్తాం కదా? మన లోపలికి మనతో పాటు ఎవరన్నా వొస్తేనో! ఈ పోస్ట్ నైనితాల్ గురించే కాదు; మా సుప్పమ్మ గురించి కూడా.
 
సుప్పమ్మ నాకు స్నేహం బాగా కుదిరిందని చెప్పా కదా! బస్సులో తన పక్క సీటు నాకోసమే రిజర్వ్ అయి ఉండేది. రోజూ ఆఫీసునుండి ఇంటిదాకా దారి పొడవునా మేం కబుర్లు చెప్పుకునేవాళ్లం. చెట్లనీ, నీళ్లనీ, గడ్డినీ, మంచునీ, తామరల్నీ, సాయీ నదినీ తన్మయంగా చూసేవాళ్ళం .
 
సుప్పమ్మకి చాలా విషయాలు తెల్సని చెప్పా కదా! ఏయే పంట ఏ కాలంలో ఎందుకు వేసేది తను చెప్పేది. ఏ చెట్టు ఎలాంటి భూమిలో ఎంత తేమ ఉంటే పెరుగుద్దో చెప్పగలిగేది. తను మా ఆఫీసులో solid waste management expert. అవసరమైనప్పుడు ఏ చెత్తతో ఏం చేయొచ్చో కూడా చెప్పేది.
 
సుప్పమ్మకి గీతలూ తెల్సు. నన్నెక్కడ ఉంచాలో ఆ హద్దు గురించి కాదు. తను వేసే బొమ్మల గురించి ఈ మాట. మాకు స్నేహం కుదిరాక నేను poetry రాసేవాణ్ణనీ ఇప్పుడు రాయట్లేదనీ చెప్పాను. తను బొమ్మలు వేసేదాన్ననీ, ఇంట్లోవాళ్ళకి ఇష్టం లేక స్కూల్ తర్వాత మానేసానని చెప్పింది. ఆమె స్కూల్లో ఉన్నప్పుడు గీసిన బొమ్మ ఒకటి చూపించింది. అది ఎవరికోసమో ఎదురుచూసే ఓ అమ్మాయి బొమ్మ. ఆ కళ్ళలో నాకేదో మెరుపు తోచింది,
 
సుప్పమ్మ పుట్టినరోజుకి నేను acrylic colors, హాండ్ మేడ్ పేపర్ కొని తెచ్చాను. తనకి పట్టరాని సంతోషం. “ఇంటికి చాలా దూరం ఉన్నావ్ కద, ఇప్పుడెవరూ చూడరు నిన్ను”.. నువ్ మళ్ళీ గీస్తే చూడాలని ఉందని చెప్పాను. సరేనంది. ఎన్ని వర్ణాలు తన కుంచె ఒలకబోతుందో అప్పటికి ఊహకైన తెలీదు.
 
*
 
బొమ్మలు గీయమంటే మొదట మేం చూసే పక్షులు, సీతాకోకలు, తూనీగలూ గీసింది. రకరకాల మొక్కలూ, ఆకులూ గీసింది. (అప్పుడే సీతాకోకల్ని రాత్రికూడా ఎలా ఎగిరించవొచ్చో మేం కనిపెట్టాం). ఒకసారి తన ఇంట్లో బుద్దుడి బొమ్మ, దాన్ని తను అలంకరించిన తీరూ గీసింది. అది నిజం బుద్దుడి బొమ్మ కన్నా బాగుండింది. ఊరికే ఒక theme చెప్తే దానికి తగ్గట్టుగా గీయగలవా అని అడిగాను. ప్రయత్నిస్తా అంది. నాకిష్టమైన టాగోర్ పద్యాలు కొన్ని ఇస్తే, ఆ అక్షరాలకి తను అద్భుతంగా రంగులద్దింది. హృదయంతో పద్యం అనుభవించితే తప్ప ఆ వర్ణం కాగితంమీదికి రాదు. టాగోర్ గనక అవి చూసి ఉంటే ఆమెని తప్పక ముద్దాడేవాడు.
 
*
 
landscapes గీయటం తనకిష్టం. abstract పెద్దగా ఒప్పేది కాదు. చూసింది చూసినట్టు నువ్ రాస్తావ చెప్పు, నే పక్కనుండి బొమ్మ గీస్తాననేది సుప్పమ్మ. మేం చాలా ప్రయాణాలు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. హిమాలయాలు, ఎడారులూ, నదులూ మేం తిరగాలనుకున్నాం. కొండలమీదా, నదీ తీరాల్లో ఉండాలనుకున్నాం. ఏమీ తోచనివ్వని ఈ పిచ్చి ఊరిని వొదిలి ఎటన్నా పారిపోవాలని ప్రతీరోజూ అనుకున్నాం.
 
ప్రయాణం గురించిన ఊహలతోనే, మాటలతోనే కాలం గడిచిపోతున్న రోజులవి. చాచా దగ్గర చాయ్ కోసం ఇద్దరం కలిసివొచ్చినప్పుడూ, బస్సు దిగి కూరగాయలు కొనేందుకు వెళ్ళినప్పుడూ అవే కబుర్లు. రివ్యూ మీటింగ్ బోర్ కొట్టినప్పుడూ, వీకెండ్ విసుగ్గా గడిచిపోయినప్పుడూ అవే కబుర్లు. 
 
పక్కన ఊర్లల్లో ఎక్కడన్నా సారస్ కనపడితే, తామరలు చెరువంతా పూస్తే తను నన్ను హడావిడిగా తీసుకునిపోయేది. నేనూ ఒక్కోసారీ సాయీ నదిమీద సూర్యాస్తమయం చూద్దామనీ, పక్షులు చూద్దామనీ తనని పిలుచుకుపోయేది. మా ఆఫీస్ చుట్టు పక్కల తిరుగాడే గుర్రప్పిల్లలంటే ఇద్దరికీ ఇష్టం. వాటన్నిటికీ మేం పేర్లు పెట్టాం.
 
*
 
సుప్పమ్మకి బండి (టూ వీలర్) నడపడం బాగా వొచ్చు, నాకు రాదు. తను ఫీల్డ్ స్టాఫ్‌లో ఎవరిదన్నా అడిగి తీసుకొస్తే నేను వెనకాల కూర్చుని సోది చెప్పేవాన్ని. ఒకసారి అట్లానే పొలాల్లో నెమళ్ళు చూసేందుకని బరేలీ దాక వెళ్ళాం. దాదాపు వంద కిలోమీటర్లు. పొద్దుపొద్దునే ఇంకా మసక ఉండగానే బండి శబ్ధానికి భయపడి నెమళ్ళు పొలాల్లోంచి ఎత్తైన చెట్ల మీదికి ఎగిరే దృశ్యం మాటలకందని అందం. ఎండిన చెట్ల కొమ్మల మీద నెమళ్ళు వాలి, అవి పూలని మించిన అందంతో ఊగేవి. సుప్పమ్మ రంగుల డబ్బా తెరిచి కూర్చునేది. ఆ దారిపైన వెళ్ళే మనుషులందరూ మమ్మల్ని విచిత్రంగా చూసేవాళ్ళు.
 
మే నెల గడిచింది. జూన్ లో వాన మొదలవగానే మేం నైనితాల్ పోదామనుకున్నాం. నైనితాల్ మూడు వందల కిలోమీటర్లు. బండి మీదా, అదీ స్కూటీ మీద ఘాటీ అనగానే మా భానుగాడు నో అనేసాడు. మా ఇద్దరు చెల్లెల్లకీ, రమేషన్నకీ బండి వొచ్చు. నాకొక్కనికే రాదు. అయినా సరే పోదామని నిర్ణయించుకున్నాం. మూడు బండ్లు ఫ్రెండ్స్‌వి తీసుకున్నాం. నా ఫ్రెండ్ బాలు డిల్లీలో ఉద్యోగం చేసేవాడు. నాకు తోడుగా ఉంటాడని వాన్ని రైల్లో Kathgodam వరకి రమ్మని ముందే చెప్పాను.
 
*
Day1
 
నైనిటాల్ ప్రయాణానికి సుప్పమ్మ బట్టలతోపాటే రంగులూ సర్దుకుంది. జూన్ రెండో వారాంతం, రెండు రోజులు మా ప్రయాణం. పొద్దున్నే బయల్దేరి బరేలిలో ఒక టీ కోసం ఆగామ్. ఆపై మళ్ళీ ఎక్కడో ఓ పెప్పర్మెంట్ చేనులో. దాని వాసన భలే గమ్మత్తు. అక్కడే మర్రిచెట్టు ఊడలు దిగిన బావి ఉంటే కాసేఫు సరదాగా ఆడాం.
 
ఎప్పట్లాగే నేను వెనకాల హాయిగా కూర్చున్నా. కన్నడ పాటలు పాడుతున్నా. కొంచెమైనా తనమీదికి ఒరిగేనా? “సరిగా కూర్చోరా” అని తిట్ల దండకం మొదలెట్టేది సుప్పమ్మ. social distance తనకి ముందునుండే అలవాటనుకుంటా. దాదాపు 250 కిలోమీటర్లు డ్రైవ్ చేసి తను అలసిపోయింది. నన్ను నడపమంటే ఎక్కడ పడేస్తానో అని భయపడి నడపలేనన్నాను. మళ్ళీ ఒకసారి “సిగ్గులేదురా నీకు” అని దండకం.
 
Kathgodam లో బాలూ అందివొచ్చాడు. చాలాసేపు వెయిట్ చేయించాం వాన్నప్పటికే.  సుప్పమ్మకి కొంచెం రెస్ట్ దొరికింది. ఘాటీ ఎక్కుతుంటేనే సాయంత్రమైపోయింది. అది హిమాలయాల ఘాటీ. Kathgodam దాటగానే కుడిపక్కన Gaula నది పాయ తగుల్తుంది. ఇంకా ముందుకుపోయేకొద్దీ చిత్రమైన మెలికలు. దారిలో బెర్రీ పండ్లు, చెర్రీ పండ్లు, ఆపిల్స్ ఎన్నో రకాలు దొరుకుతున్నాయ్. అలాంటివి ఉన్న చోట ఆపక తప్పుతుందా?
 
*
 
నైనిటాల్ చేరేసరికి మసక సాయంత్రం. మబ్బు దట్టంగానే పట్టింది. ఆ రోజెందుకో టూరిస్టర్ రద్దీ చాలా ఎక్కువుండి మాకు హోటల్ కిందెక్కడా దొరకలేదు. కొండ కొసదాకా పోతే అక్కడన్నీ వందల యేళ్ళ వయసున్న దేవదారు వృక్షాలు. అవి గంధర్వలోకపు వృక్షాలు కదా? దేవదారు కొమ్మల మీద వెన్నెల మెరుస్తుందని నా అనుమానం. మబ్బుపట్టిన ఆకాశంలో వెన్నెలెక్కడిది? అది ఆకులపై చేరే పసుప్పచ్చని పొడి అని చెప్పింది సుప్పమ్మ పూధూళి తీసినట్టే దీన్ని సేకరించి కుంకుమలా భరిణలో దాచుకుంటారనీ చెప్పింది.
 
నైనిటాల్ నక్షత్రాలు నేలదిగే నగరం అనొచ్చు. రాత్రి ఆ కొండమీద ఉన్న దీపాలన్నీ సరస్సులో అదే వరసలో తేలుతూ ఉంటాయి. మేం రాత్రికి ఒక చిన్న హోటల్ లో  అడ్జస్ట్ అయ్యాం. చలేసి కాస్త వోడ్కా తాగాం. మా పిల్లలు అప్పటికే నిద్రపోయారు.
 
*
 
Day2
 
మరుసటి రోజు ఉదయం సైట్ సీయింగ్ కి దిక్కులేదు.
ప్రపంచాన్నంత ఒక మేఘంలో దాస్తే అది నైనితాల్ అని ఎప్పుడో చెప్పా గుర్తుందా? Kurptal view point దాకా దాకా ఘాటీలో వెళ్ళాం. అక్కణ్ణుంచి మామూలు రోజుల్లో అయితే సరస్సు కనపడాలి. ఆ రోజు ఏమీ కనపడలేదు.అంతటి చలిలోనూ ఎవరో టీ కాస్తుంటే వాళ్లకి దండం పెట్టి తేనీరు పుచ్చుకున్నాం.
 
చీకట్లో లైట్లు లేకుండా ప్రయాణం చేస్తే ఎలా ఉంటాదో అలాంటి దారి. బైక్ కి ఉన్న లైట్ వెల్తురు కూడా ఆ తుంపరవానలో తడిసిపోతోంది. అటు ఇటూ పచ్చదనంతో దారంతా తడుస్తున్న పసరికపాములా ఉంది.  ఒకరివెనక ఒకరం. అది మేం మేఘాల్లో  చేస్తున్న ప్రయాణం. ఆకాశం, కొండ రెండూ మబ్బుపట్టిన వానలోనే కొండదారులు తిరిగాం. లవర్స్ పాయింట్ దగ్గర కిందకి దిగి చూసాం. అక్కడా అంతే. ఏవి నీళ్ళో, ఏది మేఘమో, ఇది ఆకాశమో తెలీకుండా ఉంది.
 
కాస్త తెరిపి వొచ్చిన చోట ఎక్కడో కొండ మీద మేఘం ఆడుతుంటే మేం ఉన్నచోటల్లా ఆగిపోయి దాని వొయ్యారం చూసాం. కొండ మేఘాన్ని తుంపి దూదిపింజల్ని విసిరినట్టు కొద్దికొద్దిగా పైకి విసిరేస్తోంది. అక్కడే కొన్ని ఫోటోలు తీసుకున్నాం. అందరం ఒకర్నొకరం ఆటపట్టిస్తూ కావలించుకున్నాం. అక్కన్నుంచి హోటల్ కొచ్చి త్వరగానే భీంతాల్ కి వెళ్ళాం. అప్పటికే ఇంకొంత తెరిపి వొచ్చింది.
 
భీం తాల్ కి వెళ్ళేదారిలో కొండమీద వానకి పుట్టిన సెలలు పారుతున్నాయ్. వాటి ధారలోనే మనసు కరుగుతోంది. పైన్ చెట్లు, ఓక్ చెట్లు, సిడార్ లు సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తులో పెరుగుతాయ్. ఎంత ఎత్తు వేటికి అనుకూలమో సుప్పమ్మ చెపుతోంది. దారిలో కొత్తగా కనిపించిన గడ్డిపూలూ, ఫెర్న్ ఆకులూ తెంపుతోంది. రాలి ఎండి వానకి తడిసిన చిత్తడి ఆకులేవో ఏరుతుంది. కోపం పోలేదు. నేను ఓ ధార కింద కూర్చుందామనుకున్నా, నన్నెవరూ పోనివ్వలేదు. దారిలో వ్యూ పాయింట్స్ దగ్గర దేవదారు అడవిలో చిన్న గూడెంలా కనిపిస్తోంది నైనితాల్.
 
*
 
భీం తాల్ చేరే సరికి తెల్లారింది. అది చాలా పెద్ద సరస్సు. ఆ చెరువునిండా హంసలు. అవి పిలిస్తే వొస్తున్నాయి. దాన్ని చూసి పసి పిల్లలు కేరింతలు కొడుతున్నారు (వాటికి పొద్దున్నే ఎవరన్నా ఆహారం వేస్తారు.అందుకని పిలిస్తే రావడం అలవాటు). నేనూ పిల్లాణ్ణి కదా?నాలోనూ కేరింత.
 
పసుపుపచ్చని బోట్లు చూడ ముచ్చటగా ఉన్నాయ్ సరస్సు మధ్యలో అక్వేరియం కూడా ఉంటుంది. మేం పోలేదు.  ఊరికే నుంచుని చూసాం. చెక్కతో చేసిన బొమ్మలు, పెన్ స్టాండ్స్ కొనుక్కున్నాం. మా సహజ కాసేపు యోగా చేసుకుంది. సాయంత్రంకల్లా ఇంటికి చేరాలని త్వరగానే అక్కన్నుంచి బయలుదేరి పోయాం
 
వొచ్చిన దారి తిరిగి వెళ్ళేదారి ఒకటి కాదు. తిరుగు దారి వొచ్చిన దారికంటే దూరం తక్కువగానీ, భయంగొల్పే లోయ. వందల అడుగుల ఎత్తున్న దారిలో Suicide spots రెండున్నాయి. వాటి దగ్గర నిల్చుని ఆ భయం కాస్తా అనుభవించాం. కాత్ గోడం దాటినాక వొచ్చిన గౌలా నది వంతెన దగ్గర నున్నటి రాళ్ళు ఏరుకున్నాం.
 
సుప్పమ్మ వొచ్చేప్పుడు బండి నడపడం కూడా రాదని తిట్టిందంటే నవ్వి బండి నా చేతికిచ్చాడు బాలు. వెనక కూర్చుని గైడ్ చేసాడు. ఆ రోజే మొదటి సారి నేను బండి నడపడం ఘాటీ దాటాక సగం దూరందాకా చలిలో బండినడిపితే చేతులు ఎర్రబడ్డాయ్. బాలూ హర్దోయి దాకా వొచ్చాడు. మేం చేరేసరికి రాత్రయింది. సుప్పమ్మ కోపం పోయింది. 
 
బండి నేర్చుకున్నందుకు, మేం ఏరిన ఫెర్ను ఆకులు, పక్షి ఈకలు, రంగురాళ్లు, గవ్వలూ అన్నీ కలిపి.. జ్ఞాపకంగా  ఓ బొమ్మ గీసిచ్చింది సుప్పమ్మ.
****

 

Please follow and like us:

One thought on “ట్రావెల్ డైరీస్ -6 (నక్షత్రాలు నేలదిగే నగరం)”

Leave a Reply

Your email address will not be published.