దేవి చౌధురాణి

(రెండవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

దేవి తన మావగారిని రక్షించిన తరువాతే తన ప్రాణ రక్షణ అని నిశ్చయించుకుంది. ఆయనను ఎలాగైనా తన నావ పైకి రప్పించాలి.

హరివల్లభ రాయ్ ఇంతకు క్రితం ఇంగ్లీషువాడి నాగతరికి భవాని ఠాకూర్ బరకందాజ్‌కు జరిగిన పోరటం వద్ద వున్నవాడే. అయితే, అతను ఇంగ్లీషువాడి నాగతరిలో లేడు. చాణక్య నీతి ఉపయోగించి తనకు మాత్రం ఏమీ ప్రమాదం జరగకుండా ఒక తెప్పవాడికి డబ్బు ఇచ్చి కొంచెం దూరంగా వుండి చూస్తున్నాడు. ఇంతలో దట్టమైన మబ్బులు ముసురుతుండటం చూసి గాలివాన మొదలయితే తెప్ప మునిగి తన ప్రాణం పోతుందని తీరానికి చేరాడు. చీకటి ఛాయలు మొదలవ్వటంతో మళ్లీ భయం పట్టుకుంది. అడవిలో నుండి క్రూర మృగాలు వస్తాయి, పాములు కరవవచ్చు, లేకపోతే దోపిడి దొంగలు ఎత్తుకుపోవచ్చు అనే ఆలోచనలతో ఉన్నాడు. ‘తప్పు చేసాను లెఫ్టినెంట్ దగ్గరకే వెళ్లవలసింది’ అని గొణుక్కోవటం మొదలుపెట్టాడు. పోరు ఆగిపోవటం చూసి ఆ దొంగముండను పట్టుకునే వుంటారు, హమ్మయ్య తన పన్నాగం పండింది, ఇప్పుడు లెఫ్టినెంట్ దగ్గరకు వెళ్లి తన ప్రాణం కాపాడుకోవటమే కాదు, బహుమతి కూడా అందుకోవచ్చు అనుకున్నాడు. ఇంతలో తనను అక్కడకు చేర్చిన తెప్పవాడు దగ్గరగానే కనపడటం చూసి, పిలిచి “గాలి వాన వస్తోంది, తెప్ప తట్టుకుంటుందా” అని అడిగాడు.

తెప్పవాడు, “అదేంటండి అట్లా అడుగుతారు, తెప్పలు ఎప్పుడూ మునగవు” అన్నాడు. తెప్పవాడు చెప్పింది హరివల్లభ రాయ్ నమ్మలేదు. కానీ ఈ అడవిలో వుంటే పులులు తింటయి, పాములు కరుస్తాయి. లెఫ్టినెంట్ దగ్గరకు వెళ్లటమే మంచిదనుకుని, మళ్లీ తెప్పవాడితో బేరం కుదుర్చుకుని లెఫ్టినెంటు వుండవలసిన నాగతరికి చేరాడు. అప్పుడే నావ పైనుండి చాడీలవాడిని రప్పించమని సిపాయి కేక వేసాడు.

హరివల్లభ రాయ్ తన గొప్పతనానికి సత్కరిస్తున్నారున్నారు అని అనుకుంటూ గర్వంగా లేచి నిలబడి, “ఇక్కడే ఉన్నాను, ఎవరు నన్ను పిలిచేది?” అన్నాడు.

“లెఫ్టినెంట్ సాబ్.”

“ఎక్కడున్నాడు?”

“ఆ పెద్ద నావ మీద. ఎక్కి వెళ్లు” అని అరిచాడు ఇంకో సిపాయి.

హరివల్లభ రాయ్ తాళ్ల నిచ్చెన ఎక్కి నావ పైకి వెళ్లాడు. అక్కడ వున్న వైభోగం చూసి ఇది రాజమహలా అని ఆశ్చర్యపోయాడు. ఎదురుగా ఇద్దరు ఆడవాళ్లు బంగారం, వెండిజరీలతో కూడిన వస్త్రధారణతో మహారాణుల రాజసం వుట్టిపడుతూ వున్నారు. ఇద్దరు రాణులను నోరు తెరిచి చూస్తూ వుండిపోయాడు. ఇంతలో ఎదురుగా కూర్చున్న లెఫ్టినెంటును గమనించి వంగి దండాలు పెట్టాడు. ఆ కంగారులోనే నిశికి కూడా వంగి దండాలు పెట్టాడు.

నిశి చిరునవ్వుతో ఫార్శీలో రాజసం ఉట్టిపడుతూ, “బోందేగి ఖాన్ సాబ్, మెజార్ షరీఫ్?” అని పలకరించింది.

వెంటనే దివ “బోందేగి ఖాన్ సాబ్, మెజార్ షరీఫ్. అసలు రాణిని నేను, నాకు నమస్కరించవా?” అని అడిగింది.

ఇదేమీ అర్థం కాని లెఫ్టినెంట్ అసలు రాణి ఎవరో హరివల్లభ రాయ్‌ని చెప్పమన్నాడు. హరివల్లభ రాయ్‌కి అసలు ఏం జరుగుతున్నదో, ఏం చెయ్యాలో తోచలేదు. ఏదో ఒకటిలే అని అనుకుని నిశిని చూపించాడు.

నిశి నవ్వటం మొదలుపెట్టింది. ఇంతలోనె పొరపాటు చేసానేమో అని సణుక్కుని, కాదు కాదు ఈవిడ అని దివను చూపించాడు.

ఇప్పుడు దివ నవ్వసాగింది. హరివల్లభ రాయ్ మళ్లీ సణుక్కుని కాదు ఈవిడే రాణి అని నిశిని చూపించాడు.

లెఫ్టినెంటుకి తిక్క రేగింది. “ఉరేయ్ అబద్దపు పందికొడకా, నీకు అసలు దేవి ఎవరో అసలు తెలుసా” అని అడిగాడు.

దివ వెంటనే “సాహబ్ కోపం తెచ్చుకోవద్దు. ఇతనికి తెలీదు. ఇతని కొడుకు పైన దాక్కుని వున్నాడు. అతనికి తెలుసు, పిలిపించండి” అన్నది.

హరివల్లభ రాయ్ విస్మయంగా “నా కొడుకా?”

“అదేగా నేను అన్నది.”

“నా కొడుకు వ్రజేశ్వర్?”

“చెప్పిందదే.”

“ఎక్కడ?”

“నావ పైన.”

“ఇక్కడెందుకు వున్నాడు?”

“అతనే చెపుతాడు.”

“వెంటనే ఇక్కడికి తీసుకు రండి” అని అరిచాడు లెఫ్టినెంట్.

దివ తల ఊపగానే రంగరాజు వ్రజేశ్వర్‌ని తీసుకు రావటానికి పైకి వెళ్లాడు. అప్పటిదాకా దాసి వస్త్రధారణలో ఒక మూలన నిలబడిన నిజమైన దేవి, హరివల్లభ రాయ్ ప్రవేసిస్తున్న సమయంలో ఫలహారాలు తీసుకు వస్తాననే మిషతో అక్కడి నుండి తప్పుకున్నది.

వ్రజేశ్వర్ వచ్చాడు. లెఫ్టినెంట్ మళ్లీ అదే ప్రశ్న వేసాడు “దేవి నీకు తెలుసా?”

“తెలుసు.”

“వీళ్లిద్దరిలో ఎవరు?”

“ఇద్దరూ కాదు.”

లెఫ్టినెంట్ కోపంతో పేట్రిగిపోతూ “ఏంటి, వీళ్లిద్దరిలో దేవి చౌధురాణి ఎవరూ కాదా?”

“వీళ్లిద్దరు దేవికి దాసీలు.”

“అసలు నీకు దేవి ఎవరో తెలుసా?”

“ఖచ్చితంగా తెలుసు.”

అంతకుముందు ఓ మూల దాసిలాగ నుంచున్న స్త్రీ లెఫ్టినెంట్‌కి గుర్తుకువచ్చింది. ఆవిడేనేమో! నావ అంతా వెతుకుతాను తనతో వచ్చి గుర్తు పట్టమని వ్రజేశ్వర్‌ని రమ్మన్నాడు.

“మీరే వెతుక్కోండి. నేనెందుకు?” అన్నాడు వ్రజేశ్వర్.

“ఏరా, నువ్వు చాడీలవాడి కొడుకువు, చాడీ చెప్పవా” అంటూ అరిచాడు లెఫ్టినెంట్.

“లేదు, నేను మీకు చాడీలు చెప్పను” అన్నాడు వ్రజేశ్వర్.

“సర్వనాశనం” అని వాపోయాడు హరివల్లభ రాయ్.

“నువ్వు చాడీలవాడి కొడుకివి, చాడీ చెప్పనంటావా? హరాంకోర్” అని అరిచాడు లెఫ్టినెంట్.

ఆ తిట్టు వింటూనే వ్రజేశ్వర్‌కి సహనం నశించింది. పిడికిలి బిగించి లాగి లెఫ్టినెంట్ ముక్క మీద కొట్టాడు. దెబ్బకు లెఫ్టినెంట్ అదుపు తప్పి క్రింద పడ్డాడు. “అయ్యో, లెఫ్టినెంట్ సాబ్‌ని ఏం చేసావు, ఏం చేసావు?” అంటు హరివల్లభ రాయ్ కంగారు పడ్డాడు.

వ్రజేశ్వర్ మళ్లీ పిడికిలి బిగించాడు. అయితే అదే సమయంలో బయటనుంచి జమేదార్ దూసుకువచ్చి “హుజూర్, తుఫాను వస్తున్నది” అంటూ కేకలు పెట్టటం మొదలుపెట్టాడు.

అప్పుడే లోపలి గదిలో నుండి శంఖానాదం వినబడింది. రెండు సార్లు శంఖం లయగా పూరించబడింది.

బయట నుండి తెరలు తెరలుగా గాలి ఊళలు వినబడుతున్నాయి. నావ మొత్తం ఊగసాగింది. ఇంగ్లీషు వాడి నాగతరులు ఒకదానికొకటి కొట్టుకుంటూ మోత చేస్తున్నాయి.

నావకి లంగరు వెయ్యకుండా వదులుగా ఒడ్డుకు వున్న గూటానికి కట్టి వున్నదనే విషయం ఇదివరకే చెప్పుకున్నాం. శంఖానాదం వినబడగానే ఇద్దరు నావికులు ఒడ్డున గూటానికి కట్టిన తాడును విప్పదీసి ఒక్క ఉదుటున నావలోకి దూకారు. కర్ణధారులు తెరచాపలు దించారు. తుఫాను గాలితో నిండిన తెరచాపలు  నావను ఒక ప్రక్కకు మునిగిపోతుందేమో అన్నంతగా వంపివేసాయి. చుక్కాణివాడు, తెరచాపల వాళ్లు నేర్పుగా నావ వంగిన వైపునుండి నావను నది దిగువ వైపుకి తిప్పి, నిలబెట్టి, తెరచాపను నేర్పుగా తుఫాను గాలితో నింపేటేటట్టు నిలపగా, నావ మెరుపు వేగంతో దూసుకుపోయింది. ఇంగ్లీషువాడి నాగతరులలో వున్న సిపాయిలు తేరుకుని తమ తుపాకులను గురిపెట్టేలోగా, తుపాకి గుళ్లకి అందనంత దూరానికి వెళ్లిపోయింది. సిపాయిలందరూ నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయారు.

వ్రజేశ్వర్ దెబ్బకు క్రింద పడిన లెఫ్టినెంట్ తేరుకుని, లేచి, ఉగ్రంగా వ్రజేశ్వర్‌ని దెబ్బ కొట్టటానికి పిడికిలి బిగించి ముందుకు దూకబోతుంటే రంగరాజు వెనక నుండి పట్టుకున్నాడు. లెఫ్టినెంట్ పడటం గమనించిన జమేదారు తన తుపాకితో దాడి చేయబోతే వ్రజేశ్వర్ వాడిని ఒడుపుగా పట్టుకుని తుపాకి లాక్కుని నదిలోకి విసిరేసాడు. రంగరాజు లెఫ్టినెంట్ దగ్గర నుండి రివాల్వర్ లాక్కుని నదిలోకి విసిరేసాడు. అదే సమయంలో దేవి శంఖనాదంతో నావ బయల్దేరుతూ ఒక ప్రక్కకు వంగటం జరిగింది. లెఫ్టినెంట్ అదుపు తప్పి దివ కాళ్ల దగ్గరగా మళ్లీ క్రింద పడ్డాడు. పిడికిలి బిగించిన వ్రజేశ్వర్ కూడా అదుపు తప్పి లెఫ్టినెంటు మీద పడ్డాడు. రంగరాజు ఇద్దరి మీద పడ్డాడు. హరివల్లభ రాయ్ నిశి కాళ్ల దగ్గరగా పడ్డాడు. నిశి కాలితో హరివల్లభ రాయ్్‌ను చిన్నగా తన్నితే నావ వంపుతోపాటు దూరంగా డొల్లాడు.

నావ ఊడిపడుతున్న ఉల్క లాగా వేగంగా తుఫాను గాలి సహాయంతో దూసుకుపోయింది. ఇంగ్లీషు వాడి నాగతరులు తుఫాను గాలికి, నదిలోని అలలకి అల్లకల్లోలమయినాయి. అయితే తీరానికి దగ్గరగా వుండటం వలన ఎక్కువ లోతు లేదు. ఇంగ్లీషు వాడి సిపాయిలు ఈదుకుని తీరానికి చేరుకుని బ్రతికి బయటపడ్డామనుకున్నారు. ఇంగ్లీషువాడి సిపాయి దళం చిన్నాబిన్నమయ్యింది.

లెఫ్టినెంట్, హరివల్లభ రాయ్ నావ పైన బందీలుగా మిగిలారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.