యాత్రాగీతం

అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-16

-డా||కె.గీత

ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*

***

ఇంగ్లాండ్ (రోజు-3) ఇంగ్లాండ్ దేశ విహారం -రోమన్ స్నానవాటిక “బాత్”- షేక్స్ పియరు జన్మస్థలం 

స్టోన్ హెంజ్ నించి మరో గంట పాటు ప్రయాణించి లండను నించి 97 మైళ్ళ దూరంలో ఉన్న రోమనుల కాలం నాటి స్నానవాటికలకు ప్రసిద్ధి చెందిన “బాత్” అనే ఊరికి చేరుకున్నాం. ఊరంతా అతి ప్రాచీన కట్టడాలతో చూడచక్కగా ఉంది ఊరు. రోడ్ల మీద పలకలు పేర్చి ఉన్న చిన్న వీధులు. బస్సు దిగుతూనే గైడుననుసరించి చిన్న చిన్న దుకాణాల్ని దాటి అయిదు నిమిషాల్లో పెద్ద చర్చి ప్రాంగణంలోకి ప్రవేశించాం. అది ఒక పెద్ద నలుచదరాకారపు ఆవరణ. మా బస్సులో వచ్చిన వారినందరినీ  ఆ ప్రాంగణం వరకు తీసుకొచ్చి, అక్కణ్ణించి నచ్చిన చోటికి వెళ్ళి రెండు గంటల్లో బస్సు దిగిన చోటికి వచ్చెయ్యమని వెళ్లిపోయేడు గైడు. 

 ఆ ప్రాంగణానికి ఒక వైపు చర్చి ఉంటే, మరోవైపు స్నానవాటిక ఉంది. స్నానవాటిక బయటినించి ఏవీ కనిపించకుండా ఏదో ప్రాచీన భవంతిలా ఉంది. మరో పక్క భోజనదుకాణాలు ఒకట్రెండు, ఆ పక్కనే పర్యాటకుల కోసం చిన్న చిన్న బహుమతులు అమ్మే దుకాణాల వరుసలు.  

తీరా చూస్తే “ప్రధాన స్నానవాటిక టిక్కెట్టు ఈ టూరులో భాగం కాదు, పైగా లోపలికెళ్ళి వాటికని చూడాలంటే ఆన్ లైనులో టిక్కెట్లు ముందుగా బుక్ చేసుకోవాలి” అన్న విషయం అప్పుడే తెలిసింది. అయితే మేం అప్పటికప్పుడు బుక్ చేయడానికి ప్రయత్నించాం. ఆ రోజు వారాంతమైనా అదృష్టం కొద్దీ మాకు మరొక్క గంట సమయంలో అంటే ఒంటిగంటంపావుకి టిక్కెట్లు దొరికాయి. టిక్కెట్టు పెద్దవాళ్లకు 27పౌండ్లు, పిలల్లకు ఇరవై పౌండ్లు. 

సరే, వేచి చూసే సమయంలో భోజనం చేద్దామని స్నానవాటికకు ఎదురుగానే ఉన్న చిన్న రొట్టెల దుకాణంలోకి వెళ్ళాం. ఆవరణలో వేసి ఉన్న కుర్చీల్లో ఖాళీ  లేక దగ్గర్లోని బెంచీ మీద కూర్చుని కొనుక్కున్న శాండివిచ్ లు, బిస్కెట్లు తిన్నాం. చర్చి ఆవరణని ఆనుకుని యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపమని కొందరు ప్లే కార్డులు పట్టుకుని ప్రొటెస్టు చేస్తున్న వాళ్లు కనిపించారు. 

కాస్త పక్కగా మరోవైపు ఉన్న కూడలిలో వీథి నృత్య కార్యక్రమం జరుగుతూంది. ఆ సంప్రదాయ నృత్యాన్ని చూస్తూ ఉంటే, మరేదో కాలానికి వచ్చిపడ్డట్లు విచిత్రంగా అనిపించింది. సత్య, సిరి నెమ్మదిగా తింటూ ఉండగా, నేను త్వరగా కానిచ్చి, అలా రెండు మూడు వీథులు తిరిగి అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసిన మేకరూన్ కుకీలు, సిరికి ఐస్ క్రీము వంటివి కొనుక్కొచ్చాను. 

మొత్తానికి నిర్ణీత సమయానికి స్నానవాటికలోనికి  పంపించే లైనులోకి వెళ్లేం. ఆ భవంతిలోని ప్రధానమైన పెద్ద హాలుదాటి లోపలి ఆవరణలోకి అడుగుపెడితే, సుద్దరాయితో కట్టి ఉన్న రెండస్తుల ప్రాచీన కట్టడంలోకి  అడుగుపెడతాం. ఆకు పచ్చని మడుగు చుట్టూ స్తంభాలతో  పైకప్పు లేని ఆవరణ ఆ స్నానవాటిక. ముందుగా పై అంతస్తులోకి అడుగుపెడతాం. డాబా మీద వరసగా అప్పటి కాలపు రోమను చక్రవర్తుల చిన్న చిన్న విగ్రహాలు పిట్టగోడల మీద దర్శనమిచ్చాయి. 

పై అంతస్తులో చుట్టూ తిరిగి, గదుల లోపలికి  వెళ్తే ఒక మూలగా రాళ్ల లోంచి ప్రవహిస్తూ, ఎక్కణ్ణించో  ఉబికి వస్తున్న వేడి నీటి జల దర్శనమిచ్చింది. అయితే అక్కడ లోపలికి ఎవరినీ దిగకుండా అడ్డంగా గోడ కట్టి వేసారు. ఆ చుట్టూ ఉన్న గదుల్లో రకరకాల ఆకృతుల్లో తవ్వకాల్లో దొరికిన శిలల్ని, సామగ్రిని ప్రదర్శనకు ఉంచారు. అక్కడే ఒకవైపుగా గిఫ్ట్ షాపు ఉంది. వాటిని దాటి కింది అంతస్తులోని వసారాలోకి అడుగుపెడితే పెద్ద నలుచదరపు పచ్చని మడుగు. అయితే అక్కడిప్పుడు మడుగులోకి దిగి స్నానించేందుకు ఎవరికీ అనుమతి లేదు. 

తలెత్తి పైకి చూస్తే పైన అంతస్తులో చుట్టూ కనిపిస్తున్న నలుచదరాకారపు వరండాలు. కాళ్ళ కింద చుట్టూ వరండాల్లోని రాళ్లు మొత్తం పైకి లేచి వస్తూ ఉన్నా, కొంత మేర మాత్రం బాగుచెయ్యకుండా వందల ఏళ్ల నాటి సాక్ష్యంగా ఆ పాత రాళ్లని, పెళ్లలు ఊడిన గచ్చుని అలాగే భద్రంగా ఉంచారు. రెండుగా విడదీసి ఉన్న అప్పటి స్నానవాటికల్లోకి నీళ్లు వెళ్ళేందుకు ఆ కాలంలోనే నిర్మించిన చూడడానికి పైప్ సిస్టం భలే అబ్బురమనిపించింది. 

మేం పైనించి చూసిన డాబా, పై అంతస్తు 1897లో సందర్శకుల కోసం నిర్మించబడినదట. కింది అంతస్తులోని నీళ్లు రోమను కాలంలో నాలుగు మీటర్ల (13 అడుగుల) దిగువన ఉండేవట. జార్జి ఏండర్సన్ లాసన్ అనే ఆర్కిటెక్టు ఈ భవంతిలోని  ప్రధానహాలుని, స్నానవాటిక చుట్టూ ఉన్న కట్టడాన్ని, డాబా మీద ఉన్న విగ్రహాల్ని, రోమన్ల కాలంనాటి ఆకృతులని ఎన్నిటినో జాగ్రత్తగా పరిశీలించి ప్రత్యేకంగా రూపుదిద్దాడట. అందుకే మనకు వేల ఏళ్లనాటి  స్నానవాటికకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది అక్కడ. ప్రాచీన కాలంలో ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా అనేక స్నానవాటికలకు నిలయం. వాటి నానుకుని ఒకప్పుడు గొప్ప ఆలయం కూడా ఉండేదట. 

మొత్తానికి తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఇది. అయితే దీనికి టిక్కెట్టు మా బస్సు టిక్కెట్టులో కలిపి ఉండి ఉంటే అంత సమయం అక్కడ వృథా అయ్యేది కాదనిపించింది. మాకేదో అదృష్టం కొద్దీ అప్పటికప్పుడు టిక్కెట్లు దొరికాయి, లేకపోతే అంత దూరం వెళ్లి కూడా ఈ  స్నానవాటికని చూడకుండా  వెనక్కి మరలాల్సి వచ్చేది.   

ఇక అక్కణ్ణించి మా బస్సు ఎక్కాల్సిన రోడ్డు వరకు నడిచి వచ్చేసరికి దాదాపు రెండు అయ్యింది. మరో అరగంటలో బస్సు అక్కణ్ణించి తిరిగి బయలుదేరి తిన్నగా స్ట్రాట్ ఫర్డ్ కు చేరుకుంది. అప్పటికి నాలుగున్నర అయ్యింది. 

ఆ ఊరి పూర్తి పేరు స్ట్రాట్ ఫర్డ్ అపాన్ ఏవన్(Stratford-upon-Avon). అది షేక్స్ పియర్ జన్మస్థలం. కావడానికి చిన్న ఊరే గానీ, నడిచి చుట్టి రావడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. 

మా బస్సులో అందరినీ ఊరి మొదట్లో ఉన్న బస్టాండులో దించేసి నడిపించడం మొదలు పెట్టేడు మా గైడు. ముందుగా షేక్స్పియరు పుట్టిన ఇల్లు బయటి నించి చూపించి, ఫోటోలు తీసుకోనిచ్చి అక్కణ్ణించి మరో పదిహేను నిమిషాలు నడిపించి షేక్స్పియరు చదువుకున్న స్కూలుకి తీసుకెళ్లేడు. దానిపేరు కింగ్ ఎడ్వర్డు -6 వ వారి స్కూలు. 

అది చాలా చిన్న బడి. అప్పటికాలపు బడిని పునరుద్ధరిస్తూ, ఆ కాలంలో ఉన్నట్టే కాపాడుతూ వస్తున్నారు. ముందురోజు మేం లండనులో చూసిన గ్లోబు థియేటర్, ఈ బడి బయట ఒక్క లాంటి ఆర్కిటెక్చరునే కలిగి ఉన్నాయి. 

ఇక అక్కడికి వెళ్తూనే నేను వీళ్లని అక్కడొదిలి, షేక్స్ పియరు ఇంటిని లోపలికి వెళ్ళి చూసే టూరు ఉంటుందేమో చూసి వస్తానని మళ్ళీ వెనక్కి నడిచి వచ్చాను. తీరా అప్పటికే అయిదు దాటిపోవడంతో ఇంటి టూరు, ఆ ఇల్లు మూసేసారు. ఇక చేసేదేం లేక పక్కనే ఉన్న గిఫ్ట్ సెంటర్లో కెళ్లి అక్కణ్ణించి కనిపిస్తున్న ఆ ఇంటిని చూస్తూ, షేక్స్ పియరు పుస్తకాలు, నాటకాలు, పద్యాలు చదువుతూ గడిపేను. 

వస్తూ వస్తూ సెంటర్లో ఉన్న షేక్స్ పియరు విగ్రహం దగ్గిర ఫోటోలు తీసుకున్నాను. ఇంగ్లాండులో ఒక రచయితకి ఇస్తున్న గొప్ప గౌరవం ప్రపంచ రచయితలందరికీ ఇస్తున్న గౌరవంగా భావించి గర్వంతో  ఉప్పొంగిపోయాను. అదే సమయంలో మన గురజాడనో, కాళోజీనో ఇలా గౌరవించే సంప్రదాయం లేనందుకు బాధపడ్డాను కూడా. బహుశా: ఇటువంటి ఆర్కిటెక్చర్ మన దేశంలోనూ చూసి ఉండడం వల్లనో ఏమో, ఆ ఊళ్ళో నడుస్తూ ఉంటే ఎందుకో అది ఇంగ్లాండు అనీ, పాశ్చాత్య దేశమనీ అనిపించలేదు. ఇక ప్రధాన లండను నగరానికి, ఈ పల్లెటూరికీ భేదం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించినా అంతటా పాతకాలపు కట్టడాలని తిరిగి అలాగే పునర్నిర్మిస్తూ ఉండడం వల్ల లండను నగరంలో కూడా ఎక్కడిక్కడ చారిత్రక నగరానికొచ్చిన చక్కని అనుభూతి కలిగింది. 

ఇక నేను అయిదున్నర ప్రాంతంలో వెనక్కి మరొక దారి పట్టుకుని తిరిగొచ్చి షేక్స్ పియరు బడి వరకూ వచ్చి చూస్తే బయట రోడ్ల మీద మా బస్సు వాళ్లు అక్కడక్కడా కనిపిస్తున్నారు కానీ సత్య, సిరి ఎక్కడా కనిపించలేదు. “అప్పటికి టూరు అయిపోయి ఉండాలి కదా” అని, మళ్ళీ వెనక్కి బస్టాండు వరకు నడిచేను. అక్కడా లేరు. అక్కడెక్కడా సెల్ ఫోన్లలో వైఫై లేనందున మాకు  కమ్యూనికేషన్ కూడా లేదు. 

ఆ బస్టాండు చుట్టుపక్కల పిట్టమనిషి కాదుకదా, మా బస్సు వాళ్ళు కూడా కనిపించలేదు. ఒకవేళ బస్సు నాకోసం చూసి వెళ్ళిపోయి ఉంటుందా? అని అనుమానం కలిగింది. మేం ఎక్కడికి వెళ్లినా ఇలా నా అంతట నేనుగా చక్కర్లు కొట్టడం మామూలే.  పైగా ఎలాంటి పరిస్థితుల్నయినా చక్కబెట్టుకుని, నేను తిరిగి హోటలుకి రాగలిగే  ధైర్యవంతురాల్ని అని తెలుసు కాబట్టి సత్య, సిరి తప్పనిసరయ్యి బస్సులో వెళ్ళిపోయి ఉంటారా? సరే, అలా అయితే  నేను ఒక్కదాన్నీ అక్కణ్ణించి లండనుకి ఎలా వెళ్లాలా? అని త్వరత్వరగా ఆలోచించసాగేను.  ఏదో బాగా తెలిసిన ఊరైనట్లు ఇలా అందరినీ వదిలి, ఒక్కదాన్నీ వచ్చి తప్పుచేసానేమో మరోపక్క అనిపించసాగింది. 

అయినా ఎందుకైనా మంచిది ఈ సారి మా గైడు మమ్మల్ని మొదట తీసుకెళ్లిన దారిలోనే వెతుకుదామని మళ్ళీ ఊళ్లోకి బయలుదేరాను. అంతలోనే అదృష్టం కొద్దీ నాకు మా గైడు ఎదురుగా వస్తూ కనిపించాడు. హమ్మయ్య, బస్సు వెళ్లిపోలేదని ఊపిరి పీల్చుకున్నాను. 

ఇక తరువాత ప్రశ్న “సత్యని, సిరిని కనిపెట్టడం ఎలా?” అన్నది. అదే అతన్ని అడిగాను. మా గైడు నన్ను వెంటబెట్టుకుని బడి వైపుగా నడుస్తూ, పాపం నాకు ధైర్యం చెబుతున్నట్టుగా “ఒక్కదానివే తప్పి పోయావని కంగారు పడకు. వాళ్ళిద్దరూ ఇంకా బడిలోనే ఉండి ఉంటారు, బయటెక్కడా కనిపించలేదు”  అన్నాడు.  దార్లో నాకు షేక్స్ పియరు పెద్దయ్యాక ఉన్న నివాసం కూడా చూపించాడు.  చివరగా బడి దగ్గరికి  తీసుకెళ్లి “మీ వాళ్లు లోపల  ఉన్నారేమో కనుక్కో, లేకపోతే మళ్ళీ నా దగ్గరకి వస్తే కలిసి వెతుకుదాం, భయపడకు” అంటూ అభయమిస్తూ, ఇంతలో మరెవరో పిలిస్తే వెళ్లిపోయాడు. “నన్ను చూస్తే అంత బేలగా కనిపించానా?” అని నవ్వు కూడా వచ్చింది. 

నిజంగానే వీళ్ళిద్దరూ టూరు అయిపోయినా  ఇంకా అక్కడే ఉన్నారు. ఆ టూరులో భాగంగా వీళ్ళు షేక్స్ పియరు కాలం నాటి  క్లాసురూములో పాత కాలపు బెంచీల మీద కూర్చుని,  అప్పటి పక్షి ఈకల కలాలతో షేక్స్ పియరు సంతకాన్ని అనుకరిస్తూ పేర్లు రాసి, టీచర్లుగా ఆ కాలం నాటి దుస్తులు వేసుకుని ఫోటోలు తీసుకుని, క్లాసు విని, బాగా గడిపేరని విని, “అరే నేను మిస్సయ్యానని” బాధ పడ్డాను.

ముఖ్యంగా సిరి ఎంతో ఆసక్తిగా ఆ బళ్ళో గడపడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అయినా స్కూలు మూసేసే చివరి నిమిషంలో  నిర్వాహకులని రిక్వెస్టు చేసి ఒక్క పరుగున వెళ్లి గదులన్నీ తిరిగి చూసి వచ్చాను. 

ఆ చిన్న రెండంతస్తుల ఇల్లు వంటి బడిలో షేక్స్ పియరు కూర్చున్న బల్లని  కూడా చెక్కుచెదరకుండా కాపాడుతున్నారు వీళ్లు. అక్కడ 1893 నించి వరసగా ఒక్కో సంవత్సరంలో “కెప్టెన్ ఆఫ్ ది స్కూలు” అయిన విద్యార్థుల పేర్లు బోర్డుమీద రాసి ఉన్నాయి.  పాత కాలం నాటి ఆ బడిని ఇప్పుడు ప్రదర్శన శాలగా మార్చినా, చూడడానికి నిజంగానే అక్కడ అప్పటి బడి ఇంకా ఉందనిపించింది. ఏదో మూల చిన్నపిల్లవాడిగా షేక్స్ పియరు ఇంకా అక్కడే తిరుగాడుతూ ఉన్నాడనిపించింది. 

ఆ ఊళ్ళో గడిపిన రెండుగంటల కాలంలో  ఆ ఉరంతా ఎప్పటి నించో బాగా తెలిసినట్టుగా అనిపించింది. బహుశా: మనసు మూలల్లో ఎక్కడో చిన్నప్పుడు చదివిన ఆయన సాహిత్యం అంతా గుర్తులుగా గడ్డకట్టి ఉన్నందువల్లనేమో. 

అక్కడ ఆయన నడయాడిన గుర్తుల్ని భద్రంగా దాచుకున్న వీరి పట్ల ఎనలేని గౌరవం కలిగింది. 

ఇదే కాదు ఇంగ్లాండు దేశం ఎంత సామ్రాజ్యదాహానికి చిహ్నమైనా, అంతకంతా కళాకారుల, సాహిత్యకారుల నిలయం. దాదాపు ఆరున్నర ప్రాంతంలో బస్సు తిరిగి లండనుకి బయలుదేరింది. 

మొత్తానికి ఆ రోజు మేం చూసిన మూడు ప్రదేశాలైన  స్టోన్ హెంజ్, బాత్, స్ట్రాటఫర్డ్ వేటికవే విభిన్నమైనవి. 

తిరిగి మా బస్సు లండను చేరేటప్పటికి ఎనిమిది కావొచ్చింది. చివరి స్టాపుగా పొద్దున్న మేమెక్కిన విక్టోరియా సెంటరులో కాకుండా, కోర్టు ఫీల్డు ప్రాంతంలో దించారు. అప్పటికి రాత్రి భోజన సమయం కావడం వల్ల మేం దగ్గర్లో కనిపించిన “లైట్ ఆఫ్ ఇండియా” రెస్టారెంటుకి నడిచి వెళ్లి భోజనం చేసాం. అరగంట పాటు వేచిఉండాల్సి వచ్చినా, ఖరీదు బాగా ఎక్కువ అయినా,  భోజనం రుచికరంగా ఉంది. తమాషాగా అక్కడ మేం తప్ప తినేవాళ్లలో ఇండియన్సు ఎవరూ లేరు. ముఖ్యంగా “బట్టర్ మసాలా” అనేది లండనులోనే పుట్టిందని ప్రసిద్ధి గాంచడం వల్ల ప్రత్యేకంగా ఆ ఐటంని తెప్పించుకుని తిన్నాం. నార్త్ ఇండియను స్టయిల్ శాకాహార భోజనం తిని, మేం తిరిగి మా బసకి ఊబర్ లో చేరుకునేసరికి పదిన్నర అయ్యింది. 

ఇక ఆ రోజు అనుభవంతో మాకిద్దరికీ కమ్యూనికేషన్ కోసం అప్పటికప్పుడు డేటా కార్డులు కొనుక్కున్నాం. మొత్తానికి ఆ రోజు ఇంగ్లాండు దేశంలోని పల్లెటూళ్ళని దర్శించి రావాలన్న నా కోరిక సజావుగా నెరవేరింది.

https://www.facebook.com/geetamadhavikala/posts/

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.