
వానకు తడవని రాయి
(నెచ్చెలి-2026 కవితల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)
– పొత్తూరి సీతారామరాజు
బంధాల పెనుగులాట నుండి నిర్బంధాల నియంత్రణల నుండి
జనవాసాల నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోకు తల్లీ..
గతం తాలూకు జ్ఞాపకాల దొంతరలను కాల్చేసి…
వర్తమానాన్ని నిలువునా పాతేసి..
భవిష్యత్తుకు అందకుండానే వెళ్ళిపోకు తల్లీ…
కాటేసిన మానాల్ని వదిలి
కుప్పలై వెక్కిరిస్తున్న శవ పేటికల నుండి అందలాలు అగాధాలు లేని చోటుకు నువ్వు వెళ్ళిపోకు తల్లీ..
నీ ప్రాణాన్ని నీ మానాన్ని వదిలి పురిటిలోనే చితిని ఎక్కి దయాదాక్షిణ్యాలు లేని దేవుడిని తిట్టుకుంటూ
భూమ్మీద మళ్ళీ ఆడపిల్లలా పుట్టబోనంటూ
నువ్వు ధిక్కారంతో వెళ్ళిపోకు తల్లీ…
వాళ్లకు స్వప్నాలు లేవు
వాళ్లు గతం తన్ను కుంటున్న రాబందులు
వాళ్లను అలానే వదిలేయకు తల్లీ
ఓ చెట్టు కింద గుంపుగా చేరి
లేనిపోని మాటలను మండిస్తారు.
నెత్తురు బొట్టు పేగు పాశం
తెలియని గుంజకు కట్టిన పశువులు
వాళ్లను అలా వదిలేయకు..
జీవితం తెలియకుండానే వాళ్ళు ముగిసిపోతారు. ..
ఆడదానిగా నువ్వు ఆదిమ కాలంనాడే అమ్మేయబడ్డావు.
సావిత్రిబాయి పూలేని నీతో పోలుస్తూ నిన్ను చెట్టు ఎక్కిస్తూనే ఉన్నారు.
సరోజినీ నాయుడు స్ఫూర్తి నువ్వంటారు
దుర్గాబాయి దేశ్ముఖ్ మళ్ళీ మా దేశంలోనే పుట్టిందని
ఆధునికంలో హక్కుల పత్రాలపై అక్షరాలు చూపించి ఓట్ల కోసం సీటు ఎక్కి స్వాతంత్రం వచ్చిన దగ్గరనుంచి మరిపించి మురిపిస్తూనే ఉన్నారు
నీ గర్భ వృక్షం మీద వీర్యపు గీతలు గీసే ఈ నీలి కళ్ళ గోళ్ళకు ఊపిరి ఆగిపోయే ఉరి ఏదైనా ఉంటే శిక్షాస్మృతిలో మళ్లీ చేర్చు తల్లీ.
బొడ్డు కోసిన నీ మాతృత్వంతో పూలు విసరకు తల్లి …
నువ్వు ఇంకా వానకు తడవని రాయిలానే ఉన్నావు.
*****

కవిత రచయిత పొత్తూరి సీతారామరాజు. కవితా ప్రస్థానంలో వంద కవితా పురస్కారాలు ఉభయ రాష్ట్రాల్లోనే కాక తెలుగు తల్లి కెనడా తానా నాటా బహుమతులు. కధారచయితగా తెల్సా కధల పోటీల్లో రాజవ్వ కథ విజేత స్వాతిలో 2025 భమ్రర కథకు 10000 మాస పత్రికలో రెండు కథలు మరియు 2025 భూపతి చంద్రస్మా రక కథానికల పోటీలు ద్వితీయ బహుమతి 8000 విజేత 75 కథా పురస్కా రాలు.
