నీహార పథం – భాగం-1

తొలి తొలి అడుగుల చిన్నారి లోకం – 2

-డాక్టర్ కొండపల్లి నీహారిణి

మా బాల్యమేమీ భారంగా గడవలేదు, అలా అని బంగారుమయమూ కాలేదు. ఈ సమాజంలో చాలా మంది కన్నా మేం సంతోషంగానే పెరిగాం.

“ఉన్న దాంట్లో తృప్తి పడాలి, లేని వాళ్ళని చూసి జాలి పడాలి, ఇంతనైనా మనకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ” అని అమ్మ చెప్పేది. ఇదే మా నమ్మకమైంది. ఇదే మేము ఆచరించేది. ఆనాటి సమాజం దాదాపు ఇలా మా ఇంట్లో లాగే ఉండడం సర్వసాధారణం అని అనుకుంటా! మా చిన్నతనం అంతా ఇలాంటి చైతన్యం తోనే పెరిగాం.

మా ఇంటి పెద్దర్వాజ తలుపులు నగశీ చెక్కణాలతో ఉండేది. ఆ తలుపు తీయడం, పెట్టడం మా చిన్ని చేతులకు కష్టంగా ఉండేది, అది పెట్టాము అంటే కళ్ళు కాస్త గర్వంగా మెరిసేవి. అవి అంత బరువు ఉండేవి. ఇంటి ముందు గొడ్ల కొట్టాలు, అంటే పశువుల పాకలు రెండు ఉండేవి. ఒకటి బర్రెలకు అంటే గేదెల కోసం, ఒకటేమో ఆవులకు, ఎడ్లకు కలిపి ఉండేది. చాలా ఏళ్లు గొర్రెలకు, మేకలకు కూడా వేరువేరు చిన్న చిన్న కొట్టాలు ఉండేవి . కాలక్రమాన అన్నీ పోయాయి. పాలు పిండడం, గడ్డి వేయడం పశువులను విప్పడం, మేతకు తీసుకుపోవడం వంటి పనులకు జీతగాళ్లు ఉండేవాళ్లు. ఇలా పశువుల పనికి , పంట పొలాల పని చేసే వాళ్ళుండేది. ఆవులకు లక్ష్మీ, సీత , దుర్గ వంటి పేర్లు, ఎడ్లకు రాముడు, లక్ష్మణుడు, భీముడు వంటి పేర్లు ఉండేవి. మా చిన్నన్నయ్య విజయరామారావు ఈ కోడెలను, ఎద్దులను అలా పేర్లు పెట్టి పిలవగానే వచ్చేవి, అన్నయ్య పెట్టే దానా తినేసేవి.

పెద్దదర్వాజ కింద మెట్లు ఉండడం ఆ మెట్లకు ఒక వైపు అరుగులు ఉండడం ఆ అరుగుపై కూర్చొని మేము బస్సు ఆట ఆడుకోవడం మా ఉదయపు చురుకుదనానికి వేదికలు. ఇంకోవైపు ‘బంకులు’ అని పిలవబడే కారిడార్ లో కూర్చుని ఇవన్నీ గమనిస్తూ, ఈ పశు సంపద విశేషాలనూ తెలుసుకునేవాళ్ళం. ఇంటికి వచ్చిపోయే వాళ్ళనూ, మా బాపు చేసే సామాజిక వ్యవహారాలనూ, ప్రజల పంచాయితీలకు ఇచ్చే తీర్పులను చూసేవాళ్ళం. ఇది మరో రకమైన చురుకుదనానికి వేదిక . ఇంటి ముందు పెద్ద వాకిలి మా క్రీడా ప్రాంగణం. కోకో, కబడ్డీ ఆటలు మా ఫ్రెండ్స్ , మా కజిన్స్ అందరం కలిసి ఒలంపిక్స్ లెవల్ లో ఆడుకునేవాళ్ళం.

మా ఊళ్లో ఏ కులం వాళ్లకు ఆ కులం ‘వీధులు’ అనేవి లేవు. మా ఇంటి ముందు గౌండ్లోళ్ళు, ఇంటి వెనుక సాలోళ్ళు అంటే పద్మశాలీలు, ఒకవైపు కమ్మరోళ్ళు ఇట్లా అన్ని కులాల వాళ్ళ ఇండ్లు కలిసే ఉండేవి. మేం అందరితో కలిసి మెలిసి ఉండేవాళ్ళం. ముఖ్యంగా నేనైతే అన్ని ఇండ్లనూ చుట్టబెట్టి వచ్చేదాన్ని. మా వయసు పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళంతా మాకు స్నేహితులే! “దోస్త్ మేరా దోస్త్ … ” భావనలతోనన్నట్టు ఉండేవాళ్ళం.

గ్రామపంచాయతీ వాళ్ళు పెట్టిన రేడియో నుండి వచ్చే కార్యక్రమాలను వినడం మాకు పెద్ద సరదా , ఇష్టం. మా ఇంటి ప్రక్కన మా బంధువుల ఇల్లు కూలి శిధిలమైంది. ఇంకో తాతయ్య కుటుంబం వాళ్ళు ఉండేది. ఈ ఇంటికి కూడా చరిత్ర ఉన్నది, తర్వాత చెబుతాను. వీళ్ళ ఇంటి ముందే కచ్చీర్ ఉంటుంది. కచ్చేరు, కచ్చీరు ఇలా అంటాం. సిమెంటు గద్దెపై షాబాద్ బండలు వేసిన పెద్ద వేదిక. దీనికి నాలుగు గుంజలు ఉండేవి. పైన గూన పెంకుల కప్పు ఉండేది. మా పిల్లకాయలందరమూ బడి నుంచి వచ్చామంటే ఇక్కడే చేరి మా వీర ప్రతాపాలు ప్రదర్శించేవాళ్లం. కచేరికున్న స్థంబాలతో నాలుగు గుంజలాట ఆడేవాళ్ళం. కచేరి చుట్టూ ఖాళీ స్థలం ఉండేది. ఎన్నో సంఘటనలనూ, ఎంతో చరిత్ర నూ తన గర్భంలో దాచుకున్నది ఈ కచేరి. కచ్చీరు దగ్గర జరిగే చర్చలు వింటే చైతన్యం కలుగుతుంది. ఇక్కడ అదంతా చెప్పాల్సిన అవసరం లేదు. సమస్త జన బాహుళ్యానికి ఇటువంటి నాలుగు బాటల కూడలిలో చెట్టు కింద కూడి తీర్పులిచ్చే గ్రామ సంప్రదాయాలు అందరికీ తెలుసు. దీన్నే కొన్ని చోట్ల “రచ్చబండ” అంటారు కదా? అదే ఇది. తెలంగాణలో ముఖ్యంగా మా ఊళ్లో కచ్చీరు అంటారు. ఇక్కడే గ్రామపంచాయతీ రేడియో ఉండేది. కోమటి కొండయ్య ఇల్లు ప్రహరీ గోడకు ఎత్తైన కర్ర నాటి దానికి పెద్ద మైక్ ఉండేది. కొండయ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఈ రేడియోను ఆపరేట్ చేసేవాళ్ళు.

తెల్లవారుజామున రేడియోలో వచ్చే మొట్టమొదటి మ్యూజిక్ వినడం మా అందరికీ అలవాటు.
“క్లూం…… కు కు కూం….. క్లూం…. కు..కు…కూమ్…….” ,
” టూం…టు..టు..టు..టుం టురుడుమ్…” అని వచ్చే ఓ చక్కని చిక్కని మ్యూజిక్ మ్యాజిక్ శక్తి ఇంతా అంతా కాదు. ప్రొద్దున్నే 5.45 కు అనుకుంటా రేడియోలో వినిపించే స్వరాలే మా అలారం. ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రం 738 MW khz అంటూ ఏవేవో మీడియం వేవ్.. షార్ట్ వేవ్ లపై ప్రసారం అంటూ చెప్పేవాళ్ళు. అవన్నీ నాటకీయంగా మానోట పాటగా, మాటగా రావాల్సిందే ! ఇలాంటి అనౌన్స్మెంట్ కాగానే, ” వందేమాతరం సుజలాం సుఫలాం… మలయజ శీతలాం…..” ఆరు గంటలకు వచ్చే మన జాతీయ గీతం పాడాలని తొందరగా నిద్ర లేచేవాళ్ళం. ఇందులో విశేషం ఏముంది ? అనుకోకండి… పాచి నోటి తో పాడొద్దు అనే కండీషన్! వందేమాతరం పాడడం కోసం పళ్ళు తోముకుని రెడీ గా ఉండాలి. లేదంటే పాడే అర్హత లేదు. ఈ రూల్ ను మాలో మేమే, పిల్లలమే పెట్టుకున్నాం. అందుకే ముందే లేచేవాళ్ళం. దేశభక్తి ఇక్కడే మొదలైంది క్రమశిక్షణ ఇక్కడే పుట్టింది. పిల్లలు పెట్టుకున్న నియమం ప్రకారం నోరు శుభ్రత ఉండాలి. ఆవు పేడ తో చేసిన పిడకలను కాల్చిన బొగ్గు తో పళ్ళు తోముకుని సిద్ధంగా ఉండేవాళ్ళం. కొన్నేళ్ల తర్వాత ఫారోకీ మంజన్ అనే ఎర్ర పొడిని వాడాం. మా ఇంటర్ అప్పుడనుకుంటా కోల్గెట్ పేస్ట్ వచ్చింది. బ్రష్ పేస్ట్ వాడడం అంటే ఓ..గో…ప్ప!!

*****

( ఇంకా వుంది )

Leave a Reply

Your email address will not be published.