కరదీపం

-శింగరాజు శ్రీనివాసరావు

చీకటిపడితే శరీరంమీద సమ్మెటపోట్లు
తెల్లవారితే ముందురోజు పడినకష్టానికి వచ్చేకాళ్ళు

ఎప్పటిలాగే సారాయిదుకాణం, చీరకొంగున కట్టిన
చిల్లరనాణాలను పట్టుకుని వెళ్ళిపోయింది

ఎండిపోయిన కళ్ళనుంచి చినుకు రాలలేదు
ఫర్లాంగు దూరంలో ఎదురుచూసే అంట్లబోకులు కనిపించాయి

తాళికట్టిన పశువు ఆకలితీర్చిన దేహానికి
బాధపెట్టే మరో జానెడు ప్రాంతం నేనున్నానని అరిచింది

చావలేక బ్రతుకుతున్న ఎండుకట్టె పెదవులు విరుస్తూ
తుడవలేని తలరాతమీద రుద్దుకుంటు పొయ్యి వెలిగించింది

వయసు వాంఛ నేలమీదకు వదలిన సాక్ష్యం
దేవునితో మంతనాలు ఆపి ఆకలికేక పెట్టింది

పేదరికం అంటని ప్రేమ పరుగున వెళ్ళి బిడ్డను ఎత్తుకుని
ఎండిన గుండెలనుండి పొంగిన అమృతాన్ని నోటికి అందించింది

లేతపెదవుల తాకిడికి హృదయంలో వేదన పారిపోయింది
“నీ కోసం ఎంత కష్టమైనా భరిస్తాను నాన్నా” అమ్మ మనసు పలికింది

నిత్యం జరిగే కురుక్షేత్రానికి ఆఖరురోజు అనేది లేదు
అందుకే ఆమె ఓటమికి భయపడడం లేదు

వాలిన సూరీడు మరల ఉదయం లేచినట్లు
చట్టిలోని ముద్దను మూటకట్టుకుని లేచింది

కొంగును బిడ్డకు ఊయలచేసి
కాసులకు చెమటను అమ్మడానికి తట్టను నెత్తికెత్తుకుంది

పేగుబంధానికి వెలుగులు పంచాలని
కాలిపోతూ వెలుగుతున్న కరదీపం ఆమె

*****

Leave a Reply

Your email address will not be published.