నేనే ఆకాశాన్ని…

– పారుపల్లి అజయ్ కుమార్

పల్లెకు, పట్టణానికి మధ్యస్తంగా వుండే వేములపల్లి నందిత పుట్టి పెరిగిన వూరు. చిన్నప్పటి నుంచే నందిత చదువులోనూ, ఆటలలోనూ చాలా చురుకుగా వుండేది. పాఠశాలలో ఏ పోటీ జరిగినా ముందుండేది. టీచర్లు చెప్పే పాఠాలను ఒక్కసారి వింటే చాలు, వెంటనే అర్థం చేసుకునేది. అందుకే క్లాసులో తెలివైన విద్యార్థినిగా టీచర్ల ప్రశంసలు అందుకునేది. స్నేహితురాళ్లందరిలో నందితకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఎదుర్కొనేది. అందుకే అందరూ ఆమెను ‘ధైర్యవంతురాలు’ అనేవారు.

నందిత తండ్రి రామయ్య ఒక చిన్న రైతు. తనకు ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వర్షాలు సరిగ్గా పడితే పంటలు బాగా పండేవి. లేకపోతే అప్పులు చేసి కుటుంబాన్ని నడపాల్సి వచ్చేది. తల్లి లక్ష్మమ్మ పల్లెటూర్లో పుట్టి పెరిగిన సాధారణ మహిళ. తను చదివింది వానాకాలపు చదువే అయినా నందిత చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించేది.

ఒకరోజు సాయంత్రం పొలం నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన రామయ్యను చూసి నందిత మంచినీళ్ళ గ్లాసు తెచ్చి ఇచ్చింది. నీళ్లు తాగి బరువుగా నిట్టూరుస్తున్న తండ్రిని చూసి “నాన్నా! చాలా అలసిపోయినట్టున్నారు. ఏమైంది?” అని అడిగింది.

“ఇంకా ఏమీ కాలేదు తల్లీ. ఈసారి వర్షాలు ఆలస్యంగా వచ్చేలా వున్నాయి. పంటల గురించి కొంచెం ఆందోళనగా ఉంది.” అన్నాడు రామయ్య.

“నాన్నా, నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తాను. అప్పుడు మన కష్టాలన్నీ తొలగిపోతాయి.” అంది నందిత.

ఆ మాటలు విన్న రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. కూతురిని దగ్గరకు తీసుకుని “తల్లీ, నువ్వు బాగా చదివి మంచి మనిషిగా ఎదగాలి. నీ జీవితం సుఖసంతోషాలతో సాగితే అదే మాకు చాలు.” అన్నాడు.
లక్ష్మమ్మ కూడా కూతురి వంక ఆనందంగా చూసి “నా కూతురు అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టదు. తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తుంది.” అంది.

నందిత జిల్లా పరిధిలో జరిగే వ్యాసరచన పోటీలు, క్విజ్‌లు, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలలో బహుమతులు గెలుచుకుని పాఠశాలకు మంచి పేరు తెచ్చింది. ఒకరోజు పాఠశాలలో జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలు నిర్వహించారు. గ్రామీణ బాలికల విద్య అనే అంశంపై మాట్లాడాల్సి ఉంది. చాలామంది విద్యార్థులు భయంతో వేదికపైకి వెళ్లలేకపోయారు. నందిత మాత్రం ధైర్యంగా లేచి నిలబడి, వేదిక పైకి వెళ్లి మాట్లాడడం ప్రారంభించింది.

“ఒక అమ్మాయి చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టే. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసం కాదు. జీవితాన్ని మార్చే శక్తి విద్యకు ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రతి బాలికకు చదివే అవకాశం రావాలి. ఆర్థిక పరిస్థితులు, సామాజిక అడ్డంకులు వారి కలలకు అడ్డుగా నిలవకూడదు. మన సమాజం అభివృద్ధి చెందాలంటే బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. చదువుకున్న మహిళ తన కుటుంబాన్నే కాదు, సమాజాన్నీ ముందుకు నడిపించగలదు. ప్రతి బాలిక తన కలలను సాకారం చేసుకునే హక్కు కలిగి ఉంది. ఆ కలలను నిజం చేయడానికి ప్రభుత్వం, అధికారులు, సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి సహకరించాలి.” అంటూ సుమారు అయిదు నిమిషాలపాటు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది.

నందిత ప్రసంగం ముగిసే సరికి సభ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ఆమె ఆత్మవిశ్వాసం, స్పష్టమైన ఆలోచనలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోటీలో మొదటి బహుమతి నందితకే వచ్చింది.
ముఖ్య అతిథి “ఇలాంటి బాలికలే దేశానికి భవిష్యత్తు.” అని ఆమెను ప్రశంసించారు.

ఆ రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన నందిత “అమ్మా! నాన్నా! నేను మొదటి బహుమతి గెలుచుకున్నాను.” అంటూ తల్లితండ్రులకు తనకు వచ్చిన షీల్డ్ ను, సర్టిఫికెట్ ను చూపించింది.
రామయ్య సర్టిఫికెట్ చేతిలోకి తీసుకుని గర్వంగా చూసాడు.

“నువ్వు మన ఇంటికే గర్వకారణం అమ్మా.” అన్నాడు.

కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ ఏడాది తీవ్ర కరువు వచ్చింది. పంట పూర్తిగా పోయింది. అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ క్షీణించింది. ఒక రాత్రి రామయ్య, లక్ష్మమ్మ మాట్లాడుకుంటున్న మాటలు నందిత విన్నది. “పరిస్థితులు ఇంకా ఇలాగే కొనసాగితే నందిత చదువు ఆపాల్సి వస్తుందేమో అని భయంగా వుంది లక్ష్మీ.” అన్నాడు రామయ్య బాధగా.
ఆ మాట విన్న నందిత గుండె బరువెక్కింది. ఆ రాత్రంతా నందితకు నిద్ర పట్టలేదు. తండ్రి చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ ఆమె చెవుల్లో మారు మోగుతున్నాయి.

‘నందిత చదువు ఆపాల్సి వస్తుందేమో…’

ఆ మాటలు ఆమె గుండెల్లో గుచ్చుకున్న ముల్లుల్లా బాధించాయి. కానీ ఆమె నిరాశపడలేదు. కన్నీళ్లు పెట్టుకోలేదు. ‘ఏ పరిస్థితి వచ్చినా నేను చదువు మానను. నా భవిష్యత్తు కోసం, మా కుటుంబం కోసం చదువు కొనసాగిస్తాను.’ అని దృఢంగా నిర్ణయించుకుంది.

మరుసటి రోజు ఉదయం స్కూల్‌కు వెళ్లిన నందిత మామూలుగా కనిపించినా, ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. మధ్యాహ్నం విరామ సమయంలో సరోజిని టీచర్ ఆమెను పిలిచారు.

“నందితా… ఈ రోజు ఎందుకో చాలా మౌనంగా ఉన్నావు. ఏమైనా సమస్య వచ్చిందా?” అని అడిగారు.

నందిత మొదట చెప్పడానికి సంకోచించింది. కానీ సరోజిని టీచర్ మరలా అడిగేసరికి “టీచర్… ఈ సంవత్సరం మా పొలంలో పంటలు పండలేదు. అప్పులు చాలా ఉన్నాయి. నా చదువు ఆపాల్సి వస్తుందని నిన్న రాత్రి మా అమ్మా, నాన్న అనుకుంటున్నారు.” అని చెపుతూ బాధపడింది.

సరోజిని టీచర్ నందిత భుజంపై చేయి వేసి “నందితా… జీవితంలో కష్టాలు రావడం సహజం. కానీ నీ లాంటి తెలివైన పిల్ల చదువు ఆగిపోవడానికి నేను ఒప్పుకోను.” అన్నారు.

“కానీ టీచర్… డబ్బు లేకపోతే ఎలా?”

“దానికి మార్గం వెతుకుదాం.” అన్నారు నందితకు ధైర్యం చెపుతూ.

ఆ మాటలు నందితకు కొత్త ఆశను ఇచ్చాయి. మరుసటి రోజు పేపర్లో వచ్చిన వార్తను తరగతి గదిలో చదివి వినిపించింది సరోజిని టీచర్.

‘ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగించేలా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి నెల రూ.1,000 చొప్పున, ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం అందుతుంది. మొత్తం నాలుగేళ్ల పాటు ఈ ప్రయోజనం లభిస్తుంది.’

సరోజిని టీచర్ నందితను ప్రత్యేకంగా పిలిచి “ఇది నీకు వచ్చిన గొప్ప అవకాశం. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధిస్తే ప్రభుత్వ స్కాలర్‌షిప్ లభిస్తుంది. నాలుగు సంవత్సరాల పాటు చదువు నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు.” అన్నారు.

“నేను ప్రయత్నిస్తాను టీచర్.”

“ప్రయత్నించడం కాదు…సాధించాలి.” అన్నారు చిరునవ్వుతో.

ఆ రోజు నుంచి నందిత మరింత కష్టపడి చదవడం ప్రారంభించింది. ఉదయం నాలుగు గంటలకే లేచి చదివేది. స్కూల్ ముగిశాక ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేసేది..రాత్రిళ్లు లాంతరు వెలుగులో పుస్తకాలు చదివేది. “గుడ్డిదీపం వెలుగులో ఏం కనపడుతుంది?” అన్న తల్లితో “చీకటిని పారద్రోలడానికి పెద్ద వెలుగు అవసరం లేదు అమ్మా! చిన్న దీపం చాలు.” అంది.

ఒకరోజు రామయ్య ఆమెను చూసి

“అమ్మా… ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ చదువు ఆగకూడదని చాలా కష్టపడుతున్నావు. నిన్ను చూస్తుంటే ఒకపక్క గర్వంగా వున్నా, మరొక పక్క బాధగా కూడా వుంది.” అన్నాడు ఆవేదనతో.

“నాన్నా… మన పరిస్థితులు మారాలంటే తప్పదు నాన్నా. నాకు ఇది కష్టంగా అనిపించడంలేదు. ఇష్టంగానే వుంది.” అంటూ నందిత నవ్వింది.

“నిన్ను చదివించలేకపోతానేమోనని భయపడ్డాను. ఆ దేవుడే మీ టీచర్ రూపంలో వచ్చి దారి చూపించాడు.” అన్నాడు.

“నాన్నా… మీరు నన్ను ఇంతవరకు చదివించారు. ఇక నుంచి నా చదువుకు నేనే దారులు వెతుక్కుంటాను. నేను బాగా చదివి మిమ్మల్ని బాగా చూసుకుంటాను.”. అంటూ నందిత తండ్రి చేతిని పట్టుకుంది.

ఆ మాటలు విన్న రామయ్య కళ్లలో ఆనందబాష్పాలు తిరిగాయి.

పరీక్ష రోజు వచ్చింది. జిల్లా కేంద్రంలోని పెద్ద పాఠశాలలో పరీక్ష నిర్వహించారు. అక్కడ వందలాది మంది విద్యార్థులు వచ్చారు. వారిని చూసి కొందరు భయపడిపోయారు. కానీ నందిత మాత్రం ప్రశాంతంగా కూర్చుంది.

‘తమ మీద తమకు నమ్మకం ఉన్నవాళ్లు గెలుస్తారు.’ అని సరోజిని టీచర్ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. పరీక్ష మొదలైంది. ప్రతి ప్రశ్నకు ఆలోచించి సమాధానాలు రాసింది. పరీక్ష పూర్తయ్యాక బయటకు వచ్చింది.

“ఎలా రాశావు?” అని స్నేహితురాలు రేఖ అడిగింది.

“నా శక్తి మేరకు బాగా రాశాను.” అంది నందిత.

కొన్ని రోజుల తర్వాత ఫలితాలు వచ్చాయి. ఆ రోజు ప్రధానోపాధ్యాయులు చేతిలో ఒక జాబితా పట్టుకుని స్కూల్ అసెంబ్లీకి వచ్చారు. అందరూ నిశ్శబ్దంగా నిలబడి వున్నారు. “ఈ సంవత్సరం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ కు అర్హత సాధించిన వారిలో మన వేములపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నందిత కూడా వుంది.” అని ప్రకటించారు.

అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు.

నందిత ఆశ్చర్యంతో, ఆనందంతో నిలబడిపోయింది.

“నేను చెప్పాను కదా! నువ్వు గెలుస్తావని.” అంటూ సరోజిని టీచర్ నందితను ప్రశంసించారు. నందిత కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. సాయంత్రం ఇంటికి చేరుకున్న నందిత పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లి

“నాన్నా!” అని గట్టిగా పిలిచింది.

“ఏమైంది అమ్మా?” అంటూ రామయ్య బయటకు వచ్చాడు.

“నేను స్కాలర్ షిప్ పొందటానికి అర్హత సాధించాను నాన్నా!” అని చెప్పింది.

“నిజమా?” రామయ్య ఆనందంతో అడిగాడు.

“అవును నాన్నా! నిజమే.”

“అయితే నీ చదువు ఆగదు కదా?” అని ఆశగా అడిగాడు.

“నాలుగు సంవత్సరాల దాకా ఆగదు నాన్నా. నాకు ప్రభుత్వ స్కాలర్‌షిప్ వస్తుంది.” అని చెప్పగానే రామయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
లక్ష్మమ్మ దేవుడి ఫోటో ముందు దీపం వెలిగించింది.

“నా కూతురు జీవితంలో మొదటిసారిగా పెద్ద విజయం సాధించింది.” అంది గర్వంగా.

***

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒకరోజు ఉదయం రామయ్య సమీప పట్టణానికి ఎరువులు కొనడానికి బయలుదేరాడు.

“అమ్మా, సాయంత్రానికి వచ్చేస్తాను.” అని నందిత తల నిమిరి బయలుదేరాడు.

“జాగ్రత్త నాన్నా.” అని నవ్వుతూ చెప్పింది నందిత.

అది తండ్రితో ఆమె మాట్లాడిన చివరి మాట అవుతుందని అప్పటికి ఆమెకు తెలియదు. మధ్యాహ్నం సమయంలో స్కూల్లో మరుసటి రోజు జరిగే పరీక్ష కోసం ప్రిపరేషన్ క్లాస్ జరుగుతోంది. అప్పుడే ప్రధానోపాధ్యాయులు హడావుడిగా వచ్చి సరోజిని టీచర్‌ను బయటకు పిలిచారు. కొన్ని క్షణాల తర్వాత టీచర్ ముఖంలో కనిపించిన ఆందోళన చూసి నందిత గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. కొద్దిసేపటి తర్వాత సరోజిని టీచర్ ఆమె దగ్గరకు వచ్చారు.

“నందితా… వెంటనే ఇంటికి వెళ్లాలి. రా.” అన్నారు.

“ఏమైంది టీచర్?” అని అడిగింది.

టీచర్ సమాధానం చెప్పలేకపోయారు. ఆమె కళ్లలో నీళ్లు కనిపించాయి. నందిత గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఇంటికి చేరుకునేలోపే వీధిలో జనసమూహం కనిపించారు. ఇంటిముందు మహిళల రోదనలు వినిపిస్తున్నాయి. నందిత కాళ్లు వణికిపోయాయి.

“అమ్మా… ఏమైంది?”

అంటూ పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లింది.

అక్కడ నేలపై తెల్లని వస్త్రంతో కప్పబడిన రామయ్య మృతదేహం కనిపించింది. ఒక్క క్షణం ప్రపంచమే ఆగిపోయినట్లు అనిపించింది.

“నాన్నా…!” అని గట్టిగా అరుస్తూ అతని దగ్గరకు పరుగెత్తింది.

“లేవండి నాన్నా… నేను వచ్చాను చూడండి…” అని తండ్రి భుజాలు పట్టుకుని కుదిపింది.

కానీ స్పందన లేదు. అది శాశ్వత నిశ్శబ్దం.

“నాన్నా… మీరు నన్ను పెద్ద చదువులు చదివిస్తానని చెప్పారుగా… నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్లిపోయారు?” అని ఏడ్చింది. అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ప్రమాదం ఎలా జరిగిందో తర్వాత తెలిసింది నందితకు. పట్టణం నుంచి వస్తుండగా వేగంగా వస్తున్న లారీ రామయ్య ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో రామయ్య అక్కడికక్కడే మరణించాడు.
అప్పటికే సాయంత్రం అయిపోవడంతో అంత్యక్రియలు తెల్లవారి చేయాలని బంధువులు చెప్పారు. లక్ష్మమ్మ ఆ రోజంతా ఏడుస్తూనే ఉండేది. తెల్లవారింది. కానీ నందిత ఇంట్లో, నందిత మనసులో చీకట్లు ఇంకా ముసురుకునే ఉన్నాయి. కొద్దిసేపటి తరువాత నందిత మనసులో దుఃఖాన్ని గుండెలోతుల్లోకి తోసేసి ఒక స్థిర నిశ్చయంతో లేచి నిలబడింది. ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి స్కూల్ యూనిఫాం ధరించి బయటకు వచ్చింది. ఒక మూలన కూర్చుని దీనంగా విలపిస్తున్న తల్లి దగ్గరకు వెళ్లి “అమ్మా…” అని పిలిచింది.

లక్ష్మమ్మ కూతురుని చూసి కన్నీళ్లు తుడుచుకుని, “ఏమిటమ్మా?” అని అడిగింది.

“ఈ రోజు పరీక్ష వుంది. రాయడానికి వెళుతున్నాను.” కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా అంది నందిత.

లక్ష్మమ్మ కూతురివంక అభావంగా చూసింది. వాకిట్లో చాప మీద పడుకోబెట్టి ఉన్న భర్త పార్థీవ దేహాన్ని చూసింది. కళ్ల వెంబడి నీళ్ళు కాలువలై ప్రవహించాయి.

“ఈ పరిస్థితుల్లో వెళ్లి పరీక్ష రాస్తావా తల్లీ!” అంటూ కూతురిని పట్టుకుని ఏడ్చింది.

నందిత తల్లి చేతులను తన చేతుల్లోకి తీసుకుని “అమ్మా… నాన్న ఎప్పుడూ ఏమంటారో నీకే తెలుసు కదా! ‘ఏ పరిస్థితి వచ్చినా చదువును మాత్రం వదలకూడదు’ అని. నేను ఇప్పుడు పరీక్ష రాయకపోతే నాన్న కల నెరవేరదు. ఆయన మనతో లేకపోయినా, ఆయన ఆశలు, కలలు మనతోనే ఉన్నాయి.” అని మెల్లగా అంది.

ఆ మాటలు విన్న లక్ష్మమ్మ గుండె మరింత భారమైంది. భర్త జ్ఞాపకం కళ్లముందు మెదిలింది. నిజంగానే రామయ్య తన కూతురు చదువు కోసం ఎంత కష్టపడ్డాడో ఆమెకు గుర్తొచ్చింది. లక్ష్మమ్మ కన్నీళ్లు తుడుచుకుని కూతురి తలపై చేయి వేసి “వెళ్లమ్మా… పరీక్ష బాగా రాసిరా. నీ నాన్న ఆత్మ కూడా అదే కోరుకుంటుంది.” అని గుండె నిబ్బరంతో చెప్పింది.

నందిత తండ్రి పార్థివ దేహం దగ్గరకు వెళ్లి మౌనంగా నిలబడింది. వణుకుతున్న చేతులతో ఆయన పాదాలను తాకి నమస్కరించింది.

‘నాన్నా… నువ్వు నాకు ఇచ్చిన ధైర్యంతోనే ఈ రోజు పరీక్ష రాయడానికి వెళ్తున్నాను. నువ్వు ఎప్పుడూ నా వెంట ఉంటావని నాకు తెలుసు.’ అని మనసులోనే అనుకుంది. నందిత పరీక్ష ప్యాడ్ తీసుకుని ఒక్కసారి తండ్రి వైపు చూసింది. కళ్లలో బాధ ఉన్నా, అడుగుల్లో మాత్రం దృఢ సంకల్పం కనిపించింది.

వరుసకు పెదనాన్న అయిన అనంతయ్య వేగంగా నందిత ముందుకు వచ్చి నిలబడ్డాడు. “ఏమ్మా నందితా! ఇంట్లో ఇంత పెద్ద విషాదం జరిగితే ఇంకా పరీక్షలేంటి? ఇప్పుడు బయటకు వెళ్లకూడదమ్మా!” గంభీరంగా అన్నాడు.

చుట్టూ ఉన్న అమ్మలక్కలు కూడా గుసగుసలాడసాగారు.

“అయ్యో పాపం! తండ్రి చనిపోయి ఇంట్లో ఉండగానే పరీక్షకు వెళ్తుందట!”

“ఈ పిల్లకి చదువు తప్ప ఇంకేమీ కనిపించడం లేదేమో!”

“ఇలాంటి సమయంలో ఇంట్లోనే ఉండాలి కదా!” అని చెవులు కొరుక్కుంటూ మాట్లాడుకున్నారు.

ఆ మాటలు నందిత చెవుల్లో పడినా, ఆమె తల వంచుకుని మౌనంగా నిలబడింది. కళ్లలో మాత్రం బాధ స్పష్టంగా కనిపించింది. అప్పుడే ఇంటి ముందుకు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటోలో నుంచి సరోజినీ టీచర్ దిగింది. నందితను చూసి ఆమె దగ్గరకు వచ్చింది. ఆమె ముఖంలో కొద్దిగా ఆందోళన కనిపించినా “నందితా! సిద్ధంగా ఉన్నావా?” అని ప్రేమగా అడిగింది.

అనంతయ్య ఆశ్చర్యంగా టీచర్ వైపు చూశాడు. “టీచర్ గారూ! ఇలాంటి పరిస్థితిలో పరీక్ష రాయించడం అవసరమా? పిల్ల మనసు ఎలా ఉంటుందో మీకు తెలియదా?” అని అన్నాడు. సరోజినీ టీచర్ కాసేపు మౌనంగా రామయ్య పార్థివ దేహం వైపు చూసింది. తర్వాత నెమ్మదిగా మాట్లాడింది.

“తెలుసు అనంతయ్య గారూ. ఈ బాధ ఎంత పెద్దదో నాకు తెలుసు. కానీ రామయ్య గారు బతికి ఉంటే ఈ రోజు ఏమనేవారో కూడా నాకు తెలుసు. ఆయన తన కూతురు చదువుకోసం ఎంత కష్టపడ్డారో మేమంతా చూశాం. నందిత పరీక్ష రాయడం అంటే కేవలం ఒక పరీక్ష రాయడం కాదు… తన తండ్రి కలను గౌరవించడం.” అక్కడున్నవాళ్లు నిశ్శబ్దంగా ఉండిపోయారు.

సరోజినీ టీచర్ నందిత భుజంపై చేయి వేసి

“నీ నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజు ఇది. కన్నీళ్లు, బాధ ఎప్పుడూ ఉంటాయి. కానీ ఈ పరీక్ష మళ్లీ రాదు.” అంది మెల్లగా. నందిత కళ్లలో కొద్దిగా ధైర్యం కనిపించింది. లక్ష్మమ్మ కూడా కన్నీళ్లు తుడుచుకుని, “వెళ్లమ్మా… నీ నాన్న ఆశయాన్ని నిలబెట్టు.” అంది. అనంతయ్య కొద్దిసేపటి తర్వాత ముందుకు వచ్చి నందిత తలపై చేయి వేసి

“వెళ్లు తల్లీ… బాగా రాసిరా.” అన్నాడు.

నందిత సరోజినీ టీచర్‌తో కలిసి ఆటో ఎక్కింది. ఆటో నెమ్మదిగా స్కూల్ వైపు కదిలింది. స్కూలు దగ్గర ఆటో దిగి నేరుగా పరీక్ష హాలు వైపు అడుగులు వేసింది. నందిత ప్రతి అడుగులోనూ తండ్రి జ్ఞాపకం, ప్రతి శ్వాసలోనూ ఆయన కల, ప్రతి ఆలోచనలోనూ చదువుపై ఉన్న లక్ష్యం ఆమెకు తోడుగా నిలిచాయి.

***

రామయ్య తీసుకున్న అప్పుల కోసం కొందరు అప్పుదారులు ఇంటికి రావడం ప్రారంభించారు.

“లక్ష్మమ్మా! రామయ్య తీసుకున్న డబ్బు ఎప్పుడు ఇస్తావు?” అని అడిగారు.

“కొంత సమయం ఇవ్వండి అన్నా.” అని లక్ష్మమ్మ వేడుకుంది.

“మాకు అంత సమయం లేదు. అప్పు తీర్చకపోతే ఇల్లు, పొలం జప్తు చేయాల్సి వస్తుంది.” అన్నారు కఠినంగా. ఆ మాటలు విన్న నందిత కోపంతో ముందుకు వచ్చి “మా నాన్న చనిపోయి నెల కూడా కాలేదు. కొంచెం కూడా మానవత్వం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు. మేము ఈ ఊరు విడిచిపోవడం లేదు కదా. మీ అప్పు అణాపైసలతో సహా చెల్లిస్తాం. రేపు రండి. మా బంధువులతో, ఊరి పెద్దలతో మాట్లాడి మీ అప్పు తీరుస్తాం.” అంది.

“చిన్న పిల్లవి. పెద్దల విషయాల్లో మాట్లాడకు.” అంటూ వారిలో ఒకడు వెటకారంగా నవ్వాడు.

“చిన్న పిల్లనే కావచ్చు. కానీ నేను ఈ ఇంటి మనిషిని. మీరలా మాట్లాడుతుంటే నోరు మూసుకుని ఎలా ఉంటాను. నాన్న చేసిన అప్పు తీర్చాల్సిందే. ఖచ్చితంగా తీరుస్తాం.” నందిత అతని కళ్లలోకి చూస్తూ అంది.

ఆమె ధైర్యం చూసి వారు ఆశ్చర్యంతో నిలబడి పోయారు. కొద్ది సేపటి తరువాత “సరే రేపు వస్తాం.” అని వెళ్ళిపోయారు.

ఆ రాత్రి నందిత ఇంటి ముందు కూర్చుని ఆకాశాన్ని చూస్తోంది. అక్కడ నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆ నక్షత్రాల్లో తండ్రి కూడా ఒక నక్షత్రంలా మెరుస్తూ కనిపించాడు.

‘నువ్వు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేయాలి తల్లీ.’ అని తండ్రి చెప్పే మాటలు చెవుల్లో వినిపించాయి.

‘నాన్నా… మీరు లేరు. కానీ మీ కలలు ఉన్నాయి. ఈ కష్టాలకు, కన్నీళ్లకు నేను జడవను. ఎంత కష్టం వచ్చినా నేను వెనక్కి తగ్గను. నా చదువు ఆపను.’ అని మనసులో ప్రతిన బూనింది. మరునాడు ఊరిపెద్దలు, బంధువుల సమక్షంలో రామయ్య కు వున్న మూడు ఎకరాల పొలంలో సగం అమ్మి అన్ని అప్పులు తీరేలా నందిత, లక్ష్మమ్మ లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు.

***

ఇంటర్ పూర్తి కాగానే “నందితా… బహుశా నువ్వు చదువు మానేయాల్సి రావచ్చు.” లక్ష్మమ్మ వణుకుతున్న గొంతుతో చెప్పింది.

తల్లి కళ్లల్లో కన్నీళ్లు చూసి నందిత ఏడవలేదు.

“అమ్మా… నేను చదువు మానను.” అంటూ తల్లి చేతులు పట్టుకుంది.

“కానీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?”

“వస్తుంది.”

“ఎలా?”

“నేను కష్టపడతాను. స్కాలర్‌షిప్ తెచ్చుకుంటాను. అవసరమైతే ట్యూషన్లు చెబుతాను. పని కూడా చేస్తాను. కానీ చదువు మాత్రం ఆపను.” అంది దృఢంగా. ఆమె కళ్లలో కనిపించిన ఆత్మవిశ్వాసం చూసి లక్ష్మమ్మ ఆశ్చర్యపోయింది. అది చిన్న అమ్మాయి మాట్లాడుతున్నట్లు లేదు. జీవితంతో యుద్ధం చేయడానికి సిద్ధమైన యోధురాలు మాట్లాడుతున్నట్లు ఉంది.

***

డిగ్రీ సర్టిఫికెట్ చేతికి రాగానే బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్షలకు కోచింగ్ తీసుకుని ఆ పరీక్షలు రాసింది. కొద్ది నెలలకే బ్యాంకు పీవో గా ఉద్యోగం వచ్చింది నందితకు. అప్పుడే నందితకు మధ్యవర్తుల ద్వారా ఓ సంబంధం వచ్చింది. భూషణరావు వాళ్లు రామయ్యకు దూరపు బంధువులు కూడా అవుతారు. భూషణరావు కొడుకు ప్రదీప్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. నందితకు అప్పుడే పెళ్ళి ఇష్టంలేదు.

“నీ పెళ్లి అయితే నాకు నిశ్చింతగా ఉంటుంది. వాళ్లు చాలా ధనవంతులు. నీ జీవితం హాయిగా ఉంటుంది. నా ఈ ఒక్క కోరిక తీర్చు చిన్నూ.” అని తల్లి బలవంతం చేసింది. తల్లి కళ్లల్లో మెదిలిన కోరిక చూసిన నందిత పెద్దగా అభ్యంతరం చెప్పలేక పోయింది.

పెళ్లి చూపులప్పుడు ప్రదీప్ తో మాట్లాడుతూ “నేను ఇప్పుడు మా అమ్మను మీ ఇంటికి రమ్మన్నా రాదు. కానీ రేపు వృద్ధాప్యం మీద పడ్డప్పుడు మా అమ్మ బాధ్యత నాదే. మీ తల్లితండ్రులను నేను ప్రేమగా చూసుకుంటాను. గౌరవిస్తాను. అలాగే రేపు వృద్ధాప్యం మీద పడినప్పుడు మా అమ్మను కూడా మీరు అంతే ప్రేమతో, గౌరవంతో చూడాలి.” అని ఖచ్చితంగా చెప్పింది.

ప్రదీప్ సరేనని తలవూపాడు.

నందిత, ప్రదీప్ ల పెళ్లి జరిగి పోయింది.

పెళ్లి అయిన కొద్ది రోజులకే భూషణరావు కుటుంబం అసలు రూపం బయటపడింది.

“మీ అమ్మ కట్నం కింద ఇంకా ఐదు లక్షలు ఇవ్వాలి. పంపమని చెప్పు.” అని అత్త సుశీల గట్టిగా అంది.

నందిత ఆశ్చర్యపోతూ “కట్నం డబ్బులు ఏమిటి?” అని అడిగింది.

“పెళ్లిలో పది లక్షలు కట్నం ఇస్తానని ఐదు లక్షలే ముట్టచెప్పింది. ఈ విషయం నీకు చెప్పవద్దని అందిలే. పెళ్లి జరిగి పోయిందిగా. ఇప్పుడు తెలిసినా నువ్వు ఏం చేయలేవు. మర్యాదగా ఐదు లక్షలు పంపమని ఫోన్ చేయి. డబ్బులు లేకపోతే ఇల్లు, పొలం మా వాడి పేర రాయమని చెప్పు.” అంది అత్త.

తనకు తెలియకుండా తల్లి పది లక్షలు కట్నం ఇస్తానని చెప్పడం నందితకు మింగుడు పడలేదు.

“మీరు కట్నం అడుగుతారని తెలిస్తే ఈ సంబంధాన్ని ఒప్పుకునేదాన్ని కాదు. మీకు ఐదు లక్షలు ఇవ్వడమే దండగ. మా ఇంటినుండి ఒక్క రూపాయి కూడా మీకు రాదు.” అంది విసురుగా.
ఆ రోజు మొదలు అత్తమామల నుండి సూటిపోటి మాటలు మొదలయ్యాయి.

నందితకు ఆశ్చర్యం కలిగించిన మరో విషయం ప్రదీప్ ప్రవర్తన. ప్రదీప్ మొదట్లో చాలా మంచివాడిలా కనిపించాడు. కొన్ని నెలలు గడిచాక అసలు స్వరూపం బయటపడింది.

“నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఆడదానికి అంత పొగరు ఉండకూడదు. అసలు ఉద్యోగం నీకెందుకు? భార్యగా ఇంట్లోనే పడి ఉండు.” అంటూ మాట్లాడేవాడు.

“నువ్వు మా ఇంటికి దరిద్రంలా చుట్టుకున్నావు.” అని అవమానించేవాడు.

రోజులు గడుస్తున్న కొద్దీ మానసిక హింస పెరిగింది. తరువాత శారీరక హింస కూడా మొదలైంది. ఒక రోజు నందిత ఏదో చెప్పబోతుంటే “నాకు ఎదురు తిరిగి మాట్లాడే హక్కు నీకు లేదు!” అంటూ ప్రదీప్ కోపంతో ఆమెను తోసివేశాడు. నందిత నేలపై పడిపోయింది. ఆ రాత్రి నందిత మనసు బాధతో మూగబోయింది. గుండెల్లో సుడులు తిరుగుతున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేసింది. ‘నేను ఎందుకు ఏడవాలి? తప్పు చేస్తున్నవారు వాళ్లు. శిక్ష అనుభవించాల్సింది కూడా వాళ్లే.’ అని ఆమె మనసులో అనుకున్నది.

ఒక రోజు “మా ఇంట్లో తింటూ బ్రతుకుతున్నావు. డబ్బులు తీసుకురమ్మంటే కదలవు. నీకు సిగ్గు లేదా?” అని అత్త అంటున్నప్పుడు “అత్తయ్యా, ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. ఇక నుంచి అలా ఉండను.” నందిత ప్రశాంతంగా బదులిచ్చింది.

“ఏం చేస్తావు?” కోపంగా అరిచింది అత్త.

“నాపై జరుగుతున్న ప్రతి అన్యాయానికి నేను తగిన ప్రతీకారం తీర్చుకుంటాను.” అంది నెమ్మదిగా.

“నువ్వా? మమ్మల్ని ఏం చేయగలవు?” అంటూ ప్రదీప్ హేళనగా నవ్వాడు.

నందిత కళ్లలో ఏదో సాధించాలనే పట్టుదల కనిపించింది. ఆమె రహస్యంగా ఫోన్‌లో సంభాషణలు రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. చాటుగా వీడియో రికార్డింగ్ చేసేది. అత్త కట్నం గురించి మాట్లాడిన మాటలు… మామ బెదిరించిన మాటలు… ప్రదీప్ చేసిన దౌర్జన్యాలు… అన్నింటినీ రహస్యంగా ఫోన్ లో భద్రపరిచింది. తల్లితో చెపితే బాధపడుతుందని ఈ విషయాలన్నీ తల్లి దగ్గర దాచిపెట్టింది.

ఒక రోజు అత్తవారింటి నుండి బయటకు వచ్చి తన స్నేహితురాలు కావ్య వుంటున్న గదికి వచ్చింది. నందిత చెప్పింది విని

“నందితా! ఇలా ఎంతకాలం భరిస్తావు?” అంది కావ్య.

“ఇది భరించడం కాదు కావ్యా. పోరాటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాను.” అంది నందిత స్థిరంగా.

“భయంగా లేదా?”

“లేదు. చిన్నప్పటి నుండి పరిస్థితులతో పోరాడిన ధైర్యమే నా ఆయుధం.”

కావ్య సాయంతో నందిత కొన్ని మహిళా సంఘాలను సంప్రదించింది. సిటీలో ప్రముఖ న్యాయవాదిని కలిసింది. “నాకు న్యాయం కావాలి సార్.” అంటూ అన్ని ఆధారాలు చూపించింది.
‘మీరు చాలా తెలివిగా వ్యవహరించారు.” అంటూ న్యాయవాది ఆమెను ప్రశంసించాడు. “మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది.” అన్నాడు.

వరకట్నం వేధింపుల, గృహహింస కేసు నమోదు అయ్యేసరికి భూషణరావు కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. “ఈ అమ్మాయి ఇంత ధైర్యం చేస్తుందని అనుకోలేదు.” అన్నాడు భూషణరావు.
కేసు పెట్టిన తర్వాత నందితకు బెదిరింపులు మొదలయ్యాయి.

“కేసు వెనక్కి తీసుకో. లేకపోతే నీ జీవితం నాశనం అవుతుంది.” అని ప్రదీప్ ఫోన్ చేశాడు.

“నా జీవితం మీరు ఇప్పటికే నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు నా వంతు వచ్చింది.” అని నందిత ప్రశాంతంగా నవ్వింది. కోర్టులో విచారణ ప్రారంభమైంది.

“ఆమెను మేము చాలా ప్రేమగా చూసుకున్నాం.” అని భూషణరావు కుటుంబం అబద్ధాలు చెప్పింది.

అప్పుడు నందిత న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించాడు. రికార్డింగులు వినిపించబడ్డాయి. ‘డబ్బు తీసుకురాకపోతే నీకు ఈ ఇంట్లో స్థానం లేదు.’ అత్త మాటలు స్పష్టంగా వినిపించాయి.
కోర్టు హాలులో నిశ్శబ్దం నెలకొంది.

ప్రదీప్ తల వంచుకున్నాడు.

అత్తవారింటి పనివారు కూడా నందిత తరుపున సాక్ష్యం చెప్పారు. నెలల తరబడి విచారణ సాగిన తర్వాత తీర్పు వచ్చింది. “నందితపై తీవ్రమైన మానసిక, శారీరక వేధింపులు జరిగినట్లు స్పష్టమైంది.”
అని న్యాయమూర్తి అన్నారు.

ఐపీసీ సెక్షన్ 498-ఏ / భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85 ప్రకారం భూషణరావు కుటుంబానికి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు రూ.15000 వరకు జరిమానా విధించబడింది. నందిత కోరుకున్న విధంగా విడాకులు సులభంగానే లభ్యమయ్యాయి. నందిత కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి.

***

నందిత తన తల్లితో కలసి ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. బ్యాంకు జాబ్ కొనసాగిస్తూనే గ్రూప్ వన్ పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ అధికారిణి అయింది. అన్యాయానికి గురైన మహిళలకు సహాయం చేసే ఒక సంస్థ ప్రారంభోత్సవ సభలో ఆమె ప్రసంగించింది.

“మహిళలు తమకు అన్యాయం జరిగినప్పుడు కన్నీళ్లు కార్చడం సహజం. కన్నీళ్లు కార్చడంతో ఆగిపోవద్దు. ఆ కన్నీళ్లకు కారణమైన వారిని ఎదుర్కునే శక్తియుక్తులు అలవరచుకోవాలి. ఏ మహిళ బలహీనురాలు కాదు. ఆమె సహనానికి కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటితే ఆమెలో తిరుగుబాటు ఊపిరి పోసుకుంటుంది. నన్ను కూడా అవమానించారు. కొట్టారు. భయపెట్టారు. కానీ నేను భయపడి పక్కకు తొలగిపోలేదు. వారిని ఎదుర్కుని తగిన గుణపాఠం చెప్పాను.” అనగానే సభ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.

ఆ రోజు వేదికపై నిలబడ్డ నందితను చూసి ఎంతోమంది మహిళలు స్ఫూర్తి పొందారు. వేలాది మహిళలకు నందిత జీవితం ఆశాకిరణంగా మారింది.

ఎందుకంటే ఆమె కృంగిపోలేదు…
కృశించిపోలేదు…
తలవంచలేదు…
తనపై జరిగిన అన్యాయానికి ఎదురు నిలబడి తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆ బావుటా కేవలం ఆమె విజయానికి కాదు… అన్యాయంపై న్యాయం సాధించిన ప్రతి మహిళ గెలుపుకు ప్రతీకగా నిలిచింది.

ఆమె ప్రారంభించిన మహిళా సహాయ కేంద్రం వేలాది మహిళలకు అండగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగింది. టీవీ ఛానెల్లు ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. విశ్వవిద్యాలయాలు ఆమెను ఆహ్వానించాయి.

“మీ విజయానికి కారణం ఎవరు?” అని ఒక సభలో విలేఖరి అడిగాడు.
నందిత కాసేపు ఆలోచించి

“ప్రధానంగా నేను. తరువాత నన్ను అవమానించిన వాళ్ళు.” అంది.
అందరూ ఆశ్చర్యపోయారు.

“ఎలా?”

“వాళ్లు నన్ను కిందకు నెట్టడానికి ప్రయత్నించారు. నేను పట్టుదలతో పైకి ఎక్కడం నేర్చుకున్నాను.” అంది నవ్వుతూ. సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది.

***

రాష్ట్ర స్థాయి మహిళా సదస్సుకు వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా నందితను పిలిచారు.

ప్రేక్షకులలో ప్రదీప్ కూడా వున్నాడు.

కాలం ఎంత విచిత్రమో కదా!
ఒకప్పుడు ఆమెను అవమానించిన వ్యక్తి… ఇప్పుడు ఆమె ప్రసంగం వినడానికి వచ్చాడు. నందిత వేదికపైకి వెళ్లి మైక్ చేతిలోకి తీసుకుంది.

“ఒకప్పుడు నన్ను ఎవరో అడిగారు.

‘నువ్వు ఎవరు?’ అని.

అప్పుడు నాకు సమాధానం వెంటనే స్ఫురించలేదు. ఈ రోజు నాకు స్పష్టంగా తెలుసు.” నందిత స్వరం గర్జించింది.

“నేను ఎవరి నీడను కాదు.

నేను ఎవరి దయ మీద బతికే వ్యక్తిని కాదు. నేను ఆకాశంలో సగం కాదు.”

హాల్ మొత్తం నిశ్శబ్దం అయింది.

నందిత క్షణకాలం అందరినీ చూసింది.

“దశాబ్దాలుగా మహిళలను ఆకాశంలో సగం అన్నారు. కానీ సగం అనే మాటలో పరిమితి ఉంది. సరిహద్దు ఉంది. కానీ నేను ఆ సరిహద్దు లోపల ఉండదలుచుకోలేదు. నేను పరిమితికి మించి ఉన్నదాన్ని.”
నందిత పిడికిలి బిగించింది.

“నేను ఆకాశంలో సగం కాదు. నేనే ఆకాశాన్ని!” అని స్పష్టంగా పలికింది. ఒక్కసారిగా సభ మొత్తం లేచి నిలబడింది. చప్పట్లు. కేరింతలు. ఆనందభాష్పాలు. ఆ క్షణం ఓ చరిత్రగా నిలిచిపోయింది…

సభ ముగిసిన తరువాత ప్రదీప్ ఆమె దగ్గరకు వచ్చాడు.

“నందితా… నన్ను క్షమించు.” అంటూ తల వంచుకున్నాడు.

నందిత అతన్ని రెండు కణాల పాటు ప్రశాంతంగా చూసింది.

“నేను నిన్ను చాలా కాలం క్రితమే క్షమించాను.” అంది.

“అయితే మనం తిరిగి కలసి జీవిద్దామా” ఆశగా అడిగాడు.

“ఒకసారి చేసిన తప్పును మళ్ళీ జీవితంలో చేయదలచుకోలేదు.” అంటూ నందిత చిరునవ్వు నవ్వింది.
ప్రదీప్ నిరాశగా చూస్తూ అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు.

‘స్త్రీని బలహీనురాలిగా చూసే సమాజం తప్పక మారి తీరుతుంది. మహిళలు అణగదొక్కే పరిస్థితులు ఎన్నో రావచ్చు. కానీ మహిళ తన విలువను తాను గుర్తించిన క్షణంలో ఆమెను ఓడించే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు.

ఆమె ఆకాశంలో సగం కాదు… ఆమే ఆకాశం.’ అనుకుంటూ నందిత ఆకాశం వైపు చూసింది.

ఆ ఆకాశం ఆమె విజయానికి సాక్షిగా నిలిచినట్లనిపించింది. ఆమె చుట్టూ వందలాది మహిళలు ఉన్నారు. వారి కళ్లలో ఆశ ఉంది. వారి గుండెల్లో ధైర్యం ఉంది. వారి పెదవులపై ఒకే ఒక నినాదం…
“మేము ఆకాశంలో సగం కాదు…”

నందిత చిరునవ్వుతో కుడి చేతి బొటనవేలు పైకి ఎత్తింది.
“మేమే ఆకాశం!” అంటూ అందరూ ఒక్కసారిగా గర్జించారు.

*****

Leave a Reply

Your email address will not be published.