
నడక దారిలో-67
-శీలా సుభద్రా దేవి
జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం, సంగీతం, బొమ్మలు చూసి వేయటం. మా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, పాప రెండవ పుట్టినరోజు వేడుక, కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ పోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ గా రిటైర్ కావటం, పెద్దక్క మరణం, ప్రత్యేకతెలంగాణా, సరూర్ నగర్ అపార్ట్మెంట్ కు మారటం. డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం, వీర్రాజుగారికి బోయి భీమన్న, బాపూరమణల పురస్కారాలు-ఉమ్మడిశెట్టి రాధేయ ప్రతిభా పురస్కారం -చిన్నక్క మరణం, వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శనలూ, నాకు అమృతలత అపురూప పురస్కారం, ఆషీకి కాలేజీ ప్రహసనాలూ, కరోనా విజృంభణ, పల్లవికి కరోనా వచ్చి తగ్గటం, వీర్రాజుగారి పెయింటింగ్స్, సేకరించిన ఆర్ట్ పుస్తకాలు రాజమండ్రి దామెర్ల చిత్రకళా పరిషత్తుకి పంపటం, కుందుర్తి శతజయంతి, ప్రతిభా పురస్కారాలు ఎంపిక, వసుధ ఎంగేజ్మెంట్ తర్వాత—)
***
కరోనా విజృంభణ ఎదుర్కొని అప్పుడప్పుడే వూపిరి తీసుకుంటున్న ప్రజలకి కొత్త సంవత్సరం కొత్త ఆశల్ని మేల్కొల్పుతూ కొత్తవూపిరులూదింది. జనవరిలో బొమ్మలకొలువు హడావుడి వుంటుంది కనుక రచనలు తగ్గిపోతాయి. అయినా కరోనా కాలంలో చాలానే కవితలైతే చేసాను. చదవటం కొనసాగుతూనే వుంటుంది. ఎటొచ్చి ఇప్పుడు నారాయణరెడ్డి ట్రస్ట్ పుస్తకాలు ఎంపిక పని వలన ఇతర పుస్తకాలు చదవటానికి కుదరటం లేదు. ఇంచుమించుగా వాటిని చదవటం పూర్తి అయ్యింది.
” ఇన్ని పుస్తకాలు ఉంటాయనుకుంటే ఒప్పుకోకుండా వుండాల్సింది. నీ సమయం అంతా దీనికే అయిపోతుంది కదా! పోనీ రెమ్యునరేషన్ అయినా ఇస్తారో లేదో తెలియదు “అనేవారు వీర్రాజు గారు.
ఎప్పటిలాగే బొమ్మలకొలువు పెట్టటం, బిల్డింగ్ లో వాళ్ళూ, బంధుమిత్రులు రావటంతో ఆ వారం అంతా సందడిగా అయిపోయింది.
తర్వాత రోజు ఉదయమే చిన్న మరిది తోడల్లుడు చనిపోయాడని ఫోన్ వచ్చింది. చాలాకాలంగా అనారోగ్యంగా వున్నా బాగానే వున్నాడని రెండురోజులముందే బొమ్మలకొలువు చూడటానికి వచ్చిన అతని భార్య సంధ్య చెప్పింది. ఆంతలో ఇలా జరగటం నిజానికి ఒక షాకే. వాళ్ళ చిన్నమ్మాయి యూ ఎస్ లో వుంటుంది. వచ్చే పరిస్థితి లేదు. దగ్గర్లో వుండే మా మరిదీ, తోటికోడలూ కూడా యూ ఎస్ లోనే వున్నారు. హుటాహుటీన పల్లవీ, నేనూ వాళ్ళింటికి వెళ్ళాము. మా మరిదికోసం, వాళ్ళ చిన్నమ్మాయి కోసం మనవరాలు ఫోన్లో వీడియో కాల్ పెట్టి పరిస్థితి అంతటినీ చూపిస్తుంది. అది చూసి నాకు దిగులైంది.
చదువుకూ, వుద్యోగాలకూ పిల్లల్ని విదేశాలు పంపించేసి ఇక్కడ తల్లిదండ్రులు దిక్కులేని వారిలా అత్యవసర సమయంలో ఒంటరి వాళ్ళైపోతున్నారు. అందులోనూ ఇంకా కోవిడ్ భయం వెంటాడుతూనే వుంది. వేరియంట్స్ గా మారుతూనే వుంది. మూడోరోజు దినాలు కూడా వెళ్ళి వచ్చాం. అయిదురోజులు అయ్యేటప్పటికి నాకు తలనొప్పి వళ్ళునొప్పి మొదలైంది. డా.సూర్యప్రకాష్ గారు ఇప్పుడు వొమిక్రాన్ వేరియంట్ వూర్లో వుంది.
ఐసొలేట్ అయిపోతే మంచిదని చెప్పి వాడాల్సిన మందులు చెప్తే వాడటం మొదలు పెట్టాను. మూడురోజులకే నాకు నార్మల్ కి వచ్చింది. కానీ మరో రెండు రోజులుకి పల్లవికి జ్వరం మొదలైంది. ఇమ్యూనిటి పల్లవికి తగ్గిందనుకుంటాను. అందుకే ఏడాదికే మళ్ళా వచ్చేసింది. ఇక ఈ జ్వరాలతో దినాలకు రాలేమని సంధ్య కూతురు రేఖకి ఫోన్ చేసాము.
జ్వరాలవీ తగ్గినా నీరసం చాలా కాలమే వుంటుంది. కోవిడ్ అంతే మరి. మాకు వచ్చిన జ్వరాల అనుభవాలతో మళ్ళా మళ్ళా కొత్త రూపాలతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూనే వుందనిపించింది.
అందుకే ఈ సారి కూడా మాడభూషి పురస్కారాలు వాయిదా వేసి వచ్చే ఏడాది అన్నీ కలిపి నిర్వహించుకుందామని వీర్రాజు గారు లలితా దేవిని వప్పించారు.
రాజమండ్రి దామెర్ల చిత్రకళా పరిషత్ లో వీర్రాజు గారి పెయింటింగ్స్ ఫిక్స్ చేయాలంటే ఇనుప రాడ్స్ తో రెండు స్థంబాల మధ్యా స్క్రీన్ పెట్టాలని, ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయాలని అంటే విడతల వారీగా ఒక ఎనభై వేల వరకూ పంపించాల్సి వచ్చింది. అయితే అక్కడ జరుగుతోన్న పనిని ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు రవి పపుతుండటంతో డబ్బు ఏమీ వృధా కావటం లేదులే అనుకున్నాము. గ్యాలరీ ప్రారంభం గురించి సంప్రదిస్తే వీర్రాజుగారు “నేనిప్పుడు రాలేను. వాడ్రేవు చినవీరభద్రుడుగారితో ప్రారంభోత్సవం చేయించు” అని రవిప్రకాష్ కి ఫోన్ చేసారు. అయితే వీరభద్రుడు గారు మాత్రం “వీర్రాజుగారు ఎప్పుడు వస్తే అప్పుడే ప్రారంభోత్సవం చేద్దాం” అన్నారు.
ప్రపంచీకరణ ప్రభావంతో ఏ దేశానికి ఆ దేశపు పండుగలతో పాటూ ప్రపంచమంతా చేసుకునే కొత్త పండుగలు వచ్చాయి. అటువంటి వాటిలో ఫిబ్రవరి పధ్నాలుగున యువతరమంతా జరుపుకునే ప్రేమికుల రోజు ఒకటి. ఆ రోజు ప్రేమికుల రోజుని తెలియని కాలంలో ఇద్దరం ఇష్టపడి ఒకటైన రోజు. జీవితంలో ఎన్నో అనుకూలతలు, ప్రతికూలతలు మధ్య ఎన్నో పూలూ, ముళ్ళను దాటుకుంటూ ఈ నాటికి యాభై దాటి మరొక్క ఏడాది కూడా గడిచింది. మేము ఇద్దరం ఒకసారి గుర్తు చేసుకోవటమే తప్ప పెళ్ళిరోజు జరుపుకోవటం మానేసి చాలా ఏళ్ళే అయింది.
తెలంగాణా సారస్వత పరిషత్తు నుండి చెన్నయ్యగారు వీర్రాజుగారికి ఫోన్ చేసి తన జీవితం సాహిత్యం గురించి పరిణతి వాణి ప్రసంగం చేయాల్సిందిగా ఆహ్వానించారు. గంటసమయంలో అన్ని విషయాలూ చెప్పలేకపోయినా ప్రసంగం వ్యాసాన్ని సమగ్రంగా రాసి పంపమని తెలియజేసారు.
ఇటీవల రాయటం కొంత అలవాటు తప్పిపోవటం వల్లా, వయసు చేత కొంత జ్ణాపకశక్తి తగ్గుతూ వుండటం వల్లా ఒక్కొక్కటే బాల్యం నుండి గుర్తు చేసుకుని రాయటానికి వీర్రాజుగారు కొంచెం కష్టపడటం చూసి మనసులో నాకు బెంగగా అనిపించింది. చెక్కినట్లుగా వుండే అందమైన దస్తూరికూడా చెదిరినట్లైంది. మామూలుగానే రచన ఏదైనా ఒక విడతలో వీర్రాజుగారు రాయరు. పర్ఫెక్టుగా వచ్చేవరకూ రచన పదే పదే రాయటం, రాసినది కొట్టేసి మళ్ళా రాయటం ఆయనకు అలవాటే. అయినా ఇప్పుడు మాత్రం రాతలో తడబాటు అర్థం అవుతూనే వుంది. మొత్తం మీద తన జీవితం, సాహిత్యం పరిణతవాణికోసం రాయటం పూర్తి చేసారు. దానిని స్కాన్ చేసి చెన్నయ్య గారికి పంపించేసాను. ఇక ప్రసంగం చేయాల్సి ఉంది.
ఒక ఆదివారం ఉదయం పదిగంటలకు సారస్వత పరిషత్తుకి మేమిద్దరం వెళ్ళాము. కందుకూరి శ్రీరాములు, శంకరం, సిధారెడ్డి మొదలైన ఆత్మీయ మిత్రులు వచ్చారు. ప్రచారం ఎక్కువగా చేయకపోవటం వలనో, ఎందుచేతనో సభలో ఎక్కువ మంది వుండరు. చేతిలో పాయింట్స్ కాగితంమీద రాసుకుని వెళ్ళినా అవి చూడకుండానే వీర్రాజుగారు ప్రసంగించారు. కానీ చాలా వరకూ తడబడుతూనే మాట్లాడారు. వయసువలన ఆయన మర్చిపోతున్నారనేది అర్థమైంది.
కె. గీత తన నెచ్చెలి పత్రిక కోసం ఒక రోజు ఫోన్ చేసినన్ను ఇంటర్వ్యూ చేస్తానంది. అదే విధంగా ఒక గంటసేపు సమగ్రమైన ఇంటర్వ్యూ జూమ్ ద్వారా చేసింది. ఇంటర్వ్యూ తర్వాత కాసేపు పర్సనల్ గా మాట్లాడుకున్నాము. నేను మానసికంగా డిసేబుల్డ్ అయిన బాబును పెంచటంలో మూడున్నర సంవత్సరాలు అనుభవించిన బాధ మరువలేనిది. గీతకూడా ఆ పరిస్థితి గురించి చెప్తుంటే మనసంతా బరువెక్కి దుఃఖం కంఠంలో వుండకట్టినట్లయ్యింది. ఒకవైపు వుద్యోగం బాధ్యత నిర్వహిస్తూనే మరోవైపు పత్రికానిర్వహణ, సాహిత్య సృజన , టోరీ రేడియో, సాహిత్య వీక్షణం ఇలా ఇన్ని బాధ్యతలు ఈ అమ్మాయి ఎలా నిర్వహిస్తూ ఉంది. ఈ గీత మనిషా, రోబోటా అనేది నాకు వూహకి అందలేదు. మనసారా ఆమెకి అభినందనలు తెలియజేసాను.
అప్పట్లోనే చెన్నై విశ్వవిద్యాలయంనుండి మాడభూషి సంపత్ కుమార్ గారు కూడా నన్ను ఆన్లైన్ లోనే సమగ్రమైన ఇంటర్వ్యూ చేయడమే కాక నా జీవితం సాహిత్యం మొత్తం వ్యాసంగా రాసి పంపమని కోరటం మరో విశేషమే.
ఒకరోజు పి.సత్యవతిగారు నాకు ఫోన్ చేసి “అన్వర్ అని ఒక అబ్బాయి మీకు ఫోన్ చేసి మీ ఇంటికి ఒక పుస్తకం కోసం వస్తాడు. అన్వర్ మంచిఅబ్బాయే. ” అన్నారు. సరేనన్నాను. అంతలో అన్వర్ ఫోన్ చేసి “పోలాప్రగడ సత్యనారాయణ మూర్తిగారి “ఆ రోజుల్లో ” పుస్తకం కావాలి. సత్యవతిగారు మీ దగ్గర పుస్తకం దొరుకుతుంది అన్నారు. మీ దగ్గర వుందా. ఉంటే వచ్చి తీసుకుని. చదివి మళ్ళా భద్రంగా ఇచ్చేస్తాను ” అన్నాడు. ఉందని చెప్పి మా ఇంటి లోకేషన్ షేర్ చేసాను.
వీర్రాజుగారు ‘అన్వర్ ఎవరు ?’ అన్నారు. ‘కవి అనుకుంటాను. కవితలు పత్రికలలో చూసాను ‘ అన్నాను.
మరొక అతనితో కలిసి అన్వర్ వచ్చాడు. అతను అడిగిన పోలాప్రగడ రాసిన ఆరోజుల్లో పుస్తకం ఇచ్చాము. అతను మొహమాటంగా అతని ” ఒక చిత్రకారుని రేఖాయాత్ర” పుస్తకం వీర్రాజుగారికి ఇచ్చాడు. పుస్తకం గెటప్ అది అద్భుతంగా ఉండటంతో ప్రింటింగ్ గురించి సమాచారం అడుగుతే ఇప్పుడు డిజిటల్ ప్రింటింగ్ పద్ధతి వచ్చిందని ఎన్ని కాపీలు అవసరమైతే అన్నే ప్రింట్ చేసుకోవచ్చని చెప్పాడు. అయితే అప్పటికీ అన్వర్ కవేనా, రచయితా, చిత్రకారుడా అనేది మాకింకా అర్థం కాలేదు. సాక్షిలో వుద్యోగం అన్నాడు. అంతే తెలిసింది. అంతకన్నా వివరాలు అడగటానికి మాకూ మొహమాటం.
ఓ రెండు రోజుల్లో అన్వర్ ఇచ్చిన పుస్తకం వీర్రాజుగారు చదివి “సుభద్రా ఈ అన్వర్ చిత్రకారుడే కాక మంచి రచయిత కూడా. ఈ పుస్తకం అద్భుతంగా రాసాడు. నువ్వూ చదువు. ఇందులో చిత్రాలు చాలా బాగున్నాయి. చక్కటి లైన్ . బాపూ ఆరాధ్యుడు అనుకుంటా. కానీ బాపూని అనుకరించడం లేదు ” అన్నారు. ఆయన అంతగా పొగిడారంటే నాకు వెంటనే చదవాలనిపించింది. అన్వర్ పుస్తకం తీసి మొదలు పెట్టాక ఇంకా వదలలేదు. వాక్యాలతో చిత్రాలు వేసినట్లు మ్యాజిక్ చేస్తూ అద్భుతమైన వాక్య విన్యాసంతో అనేకమంది చిత్రకారుల, సాహితీవేత్తలు గురించీ, సినీమాలగురించీ భలేగా రాసాడు. చదవటం పూర్తిచేసిన వెంటనే నా అభిప్రాయం అన్వర్ కి వాట్సాప్ లో తెలియజేసాను.
తర్వాత మళ్ళా అన్వర్ తన కొడుకు మోహన్ ని తీసుకుని వచ్చాడు. అప్పుడు వీర్రాజుగారు తన పెయింటింగ్స్, ముఖచిత్రాలు, చిత్రాలు వేసే రకరకాల కొక్విన్లు అతనికి చూపించారు. మా స్వంతపుస్తకాలకు చీర ముక్కలతో వీర్రాజుగారు స్వంతంగా చేసిన బైండింగ్స్ చూసి అన్వర్ అబ్బురపడ్డాడు.
తర్వాత కొన్నిరోజులకే నాకు(2021), పొత్తూరి విజయలక్ష్మి (2022)కు సుశీలానారాయణరెడ్డి పురస్కారం సమావేశం ఎమ్.కే.రాముగారి కిన్నెర సంస్థనిర్వహణలో జరిగింది. నా సాహిత్యం గురించి మూడు వ్యాసాలు రాసిన సి.హెచ్.సుశీలగారు నా సాహిత్యం గురించి కన్నా ఆత్మీయ పరిచయంగా మాట్లాడారు. పొత్తూరు విజయలక్ష్మి గురించి ప్రసంగించిన నెల్లుట్ల రమాదేవి పేపర్ మీద రాసుకొని సాహిత్యం గురించే మాట్లాడింది. తర్వాత స్పందన తెలియజేసినప్పుడు కూడా విజయలక్ష్మి తన సాహిత్యం గురించి చాలా చెప్పుకుంది.
నన్ను పురస్కారానికి ఎంపిక చేసేరంటే నా సాహిత్య సృజన చూసేకదా. ఇంకా నేనుకూడా నా గురించి చెప్పుకోవటంలో అర్థం లేదు అనిపించింది. అందుకే నా ప్రసంగంలో కేవలం రచయిత్రులకే పురస్కారాలు ఇవ్వాలనే సంకల్పానికి ధన్యవాదాలు తెలియజేసాను. అంతేకాకుండా “నలభై సంవత్సరాలకు పైగా రచయిత్రులకు పురస్కారాల్తో గౌరవించటం చాలాసంతోషం. ఈ సందర్భంగా మరొక విన్నపం చేస్తున్నాను. రచయితలకూ, కవులకూ శతజయంతులు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలూ అకాడమీలు నిర్వహించటం చూస్తున్నాము. కానీ మహిళాసాహితీవేత్తలకు ఎవరూ చేస్తున్నట్లుగా లేదు.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తొలి రచయిత్రి ఇల్లిందల సరస్వతి దేవిగారికి శతజయంతి సభ జరగలేదు. అలా ఎంతమందో. నలభై ఏళ్ళుగా పురస్కారం ఇస్తున్న శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రస్టు వారైనా పూనుకొని పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించనవసరంలేదు కానీ ఆ రచయిత్రి సాహిత్యం గురించి ఒక ప్రసంగం ఏర్పాటు చేసి కొన్ని ప్రసంగాలు అయిన తర్వాత ఒక పుస్తకంగా ప్రచురిస్తే ఇప్పటి తరం వారికి ఆనాటి రచయిత్రులు ఎన్నో అవరోధాలను అధిగమించి రచయిత్రులుగా నిలదొక్కుకున్నారు అనేది తెలుస్తుంది.” అని విన్నపం చేసాను. నా ప్రసంగానికి గంగగారు చాలా ప్రభావితులై కార్యక్రమం పూర్తై కిందికి వచ్చాక నన్ను ఆలింగనం చేసుకుని మీరు చెప్పినట్లే మేము నిర్వహించటానికి సిద్ధం గానే ఉంటాము. మీ సహకారం అందించండి అన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది.
ఆ తర్వాత కలిసిన వారంతా నేను చేసిన ప్రతిపాదన చాలా సమంజసంగా వుందని అభినందనలు తెలియజేసారు. పురస్కారం సందర్భంగా సారస్వత పరిషత్తు కార్యదర్శి డా.చెన్నయ్యగారు అందించిన సన్మాన పత్రం, ఫొటో ఫ్రేమ్ వీర్రాజు గారికి చాలా నచ్చాయి. నేను లోపల ఎక్కడైనా పెట్టాలనుకుంటే వీర్రాజుగారు హాల్ లోనే కొన్నాళ్ళవుంచు అన్నారు. ఇంటికి వచ్చిన మిత్రులు అందరికీ ఆయనే చూపించి పురస్కారం గురించి గొప్పగా చెప్తుండటం నాకే ఆశ్చర్యం వేసింది. నిజానికి ఇంతవరకూ నాకు నగదు రూపంలో కూడా పది పదిహేను వేలకు మించి రాలేదు. నాకు వచ్చిన పురస్కారాలలో ఇదే అత్యధికంగా వచ్చిన నగదు పురస్కారం. నగదుకన్నా గత నలభై ఏళ్ళుగా ఊటుకూరి లక్ష్మీ కాంతం యద్దనపూడి, రామలక్ష్మీ, లేత, సీతాదేవి వంటి వుద్దండులైన రచయిత్రులు అందుకున్న ప్రతిష్టాత్మకమైన పురస్కారం అనేది మాత్రం అక్షరాలా నిజం.
ఒకరోజు గంగగారు ఫోన్ చేసి రచయిత్రుల శతజయంతులు దాటిన వారిని లిస్ట్ చేయమని అడిగారు. నేను ముఖ్యంగా సుశీలానారాయణరెడ్డి పురస్కారం అందుకున్న వారితో ప్రారంభించటమే బాగుంటుందనే అభిప్రాయంతో అక్కడినుంచి మొదలుపెట్టి రచయిత్రుల పుట్టిన సంవత్సరాల లిస్ట్ తయారుచేసి పంపించాను.
శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రష్ట్ ఆర్థిక సహాయానికి పుస్తకాల ఎంపిక పూర్తి చేసాను. కథలు, కవితలు కలిపి సుమారు పదిపన్నెండు పుస్తకాలు ఎంపిక చేసి ఎందుకు బాగున్నాయో నా అభిప్రాయం కూడా రాసి వాళ్ళకు పంపించేసాను. అంత సమగ్రంగా నా అభిప్రాయాలతో ఎంపిక చేసినందుకు గంగగారు చాలా సంతోషం వ్యక్తం చేసారు. అంతేకాదు రెమ్యునరేషన్ గా అయిదువేలు పంపించటం మరింత ఆనందం.
నేను ఎంపికచేసిన వాళ్ళు తర్వాత్తర్వాత మంచి కవయిత్రులుగా, రచయిత్రులుగా బహుమతులూ గుర్తింపూ పొందటం కూడా నాకు సంతోషం కలిగించింది.
నేను ఒక లలితగీతాల వాట్సాప్ సమూహంలో వుండటం వలన సినారె గేయాలు ఆ సమూహంలో వచ్చినప్పుడు గంగకు షేర్ చేస్తూ వుంటాను. అందువలన ఆమె ఏ పాట కావాల్సినా, ఎవరైనా రచయితలకు చెందిన వివరాలు కావాల్సి వచ్చినా నన్ను సంప్రదించటం వలన తరుచూ మాట్లాడుకొంటూ వుంటాము. ఆ విధంగా ఆమెతో కొంత స్నేహం పెరిగింది.
నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ డీటీపీ కూడా పూర్తి చేసాను. అనల్ప బలరాంగారికి పి.శ్రీదేవి కథల్ని ” వాళ్ళు పాడిన భూపాలరాగం “పేరుతోనూ, ఆమె కవితల్ని “మథుకలశమ్” పేరుతోనూ సంపాదక బాధ్యతల్ని వహించిన పరిచయంతో నిడదవోలు మాలతి మోనోగ్రాఫ్ ని వాళ్ళ బేనర్ పై ప్రచురిస్తారా అని అడుగుతే తప్పక ప్రచురిస్తానని అన్నారు. అయితే మరికొన్ని ప్రచురణలలో బిజీగా వున్నానని అవి అయిపోయాక చేస్తానన్నారు. ఆ పుస్తకానికి పల్లవి చేతే ముఖచిత్రం వేయించుతానని కూడా చెప్పాను. బలరాం సరేనన్నారు. మాలతి రచనలో విశాఖమాండలిక సొబగులే కాక విశాఖసంపంగి పరిమళాలు మనసుని తాకుతూనే వుంటాయని ముఖచిత్రంగా సంపెంగలతోనే డిజైన్ చెయ్యమని పల్లవితో చెప్పాను.
*****

జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.
