
కనక నారాయణీయం -82
–పుట్టపర్తి నాగపద్మిని
‘అబ్బా! అమ్మా! పాటలో మాటలకు తగినట్టు ఆక్షన్ చేస్తాన్నేను. నన్ను చూసి తక్కిన వాళ్ళు నేర్చుకుంటారు. తెలుసా!’
కూతురు మాటలు వింటూ ప్రేమగా ముద్దుగా తన వైపే చూస్తూ కనకమ్మ అనుకుంది. ‘అమ్మయ్య! ఇప్పటికీ ఊరగాయ సంగతి మర్చిపోయింది. అంతే చాలు.’ అని.
ఇంతలోనే వీధిలోనుంచీ కేక..’మల్లే పూల్..మల్లే పూల్..’ అని!
చటుక్కున నాగ దృష్టి అటువైపు మళ్ళింది.
కనకమ్మ గుండెలో రాయి పడింది.
మళ్ళీ పూల జడ అంటూ రాగం మొదలుపెడుతుందేమో అని!
తన దృష్టి అటుపోకుండా వుండేందుకు కనకమ్మ అడిగింది. ‘అవునూ..ఇంకో పాట కూడా నువ్వు పాడుతుంటె విన్నానే? మధురా నగరిలో..అనుకుంటా!’
నాగ చటుక్కున మెరిసే కళ్ళతో అమ్మకేసి చూసింది. ‘అవునవును. అది కూడ నాకెంతో ఇష్టమైన పాటమ్మా! కొండప్ప సారు నేర్పించినారు కదా! నేను అందులో కూడ కృష్ణుణ్ణే! ముత్తులక్ష్మి, గోపికకు పాడుతుంది. నేను ఒట్టి ఆక్షన్ మాత్రమే! గోపిక మధురకు పాలూ వెన్నా అమ్ముకోడానికి పోతుంటే, కృష్ణుడు అడ్డుకుంటాడంట! అప్పుడు గోపిక బ్రతిమాలుతుంది, నన్ను పోనీయవయ్యా స్వామీ!’ అని!
కళ్ళు తిప్పుతూ నాగ మాట్లాడుతూ ఉంటే తెగ ముచ్చటేసింది వాళ్ళమ్మకు! ప్రేమగా దగ్గరికి తీసుకుని, బుగ్గ మీద ముద్దు పెట్టి అడిగింది, ‘ఈ పాట ఎవరు రాసినారో తెలుసా నీకు?’ అని!
‘కొండప్ప సారు చెప్పినాడులే! మర్చిపోయినాను.ఏదో..చిత్తూరుతో వస్తుందాపేరు!’
‘ఆ..కరెక్ట్! చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళైగారని, గొప్ప సంగీత విద్వాంసులు. ఆయనే వ్రాసి, స్వరపరచి పాడినారు చాలా చోట్ల! బాగుంటుంది కదా!’
‘ఔనమ్మా! భలే ఉంటుందాపాట! అదేమి రాగమమ్మా?’
‘ఆనంద భైరవి రాగం కదా!’
‘అమ్మా, ఈ మధురానగరిలో పాట పాడుతూ ఉంటె నాకు రావేమే మగువా..అనే స్వర జతి గుర్తుకొస్తుందే?’
‘ఎందుకు రాదూ? రెండూ ఆనందభైరవి రాగంలో ఉన్న పాటలే కదా?’
‘అమ్మయ్య! ఎప్పుడూ కొండప్ప సారును అడుగుదామనుకుంటా! మళ్ళీ మర్చిపోతా! అది సరేగానీ, నీకివన్నీ ఎట్ల తెలుస్తాయమ్మా? నువ్వూ సంగీతం నేర్చుకున్నావా?’
నాగ కళ్ళల్లో ఆసక్తి చూసి, కనక తనను దగ్గరికి తీసుకుని అంది, ‘ఆఆ.. నేనూ నేర్చుకున్నాలే చిన్నప్పుడు! ఇంట్లో మీ అయ్య రాసే పాటలన్నీ వింటుంటే, ఆ అభ్యాసమంతా పునశ్చరణ అవుతుంది.’
‘అంటే?’
‘మళ్ళీ ఒకసారి అన్నీ గుర్తుకు రావడం! మళ్ళి చదువుకున్నట్టనిపించడం!’
‘ఓహో!’
ఇంతలో ఇంటి ముందు రిక్షా ఆగింది. పుట్టపర్తి దిగారు, రిక్షాలోనుంచీ!
‘అయ్యొచ్చేసినారు!’ నాగ సంతోషంగా పరిగెత్తుకుంటూ పోయి, అయ్య చేతులోనుంచీ, సంచీ తీసుకుని లోపలికి నడిచింది.
పుట్టపర్తి లోపలికి వస్తుంటే, కనకమ్మ తళిహింట్లో నుంచి, మంచి నీళ్ళ చెంబు తెచ్చి పుట్టపర్తి కూర్చునే కుర్చీ దగ్గరున్న టేబుల్ పైన పెట్టింది.
పుట్టపర్తి అలసటగా కుర్చీలో కూర్చుని, ముందు గటగటా నీళ్ళ చెంబు ఖాళీ చేసి, వెంటనే జేబులోనుంచీ బీడీ తీసి వెలిగించారు.
ఈ లోగా నాగ అమ్మ పక్కకు చేరి మెల్లిగా అడిగింది,’అమ్మా! అయ్య ఎక్కడినుంచీ వస్తున్నారు?’ అని!
కనకమ్మ చెవిలో చెప్పింది. ‘రాయచోటి నుంచీ!’
టకటకా కాఫీ వేడి చేసి నాగ చేతికిచ్చిందామె, మీ అయ్యకివ్వమని సైగ చేస్తూ!
నాగ కాఫీ లోటా జాగ్రత్తగా పట్టుకుని అయ్యదగ్గరికి పోయి నిలబడింది.
పుట్టపర్తి బీడి ఆర్పేసి, లోటా అందుకుని, తాను ఊరినుంచీ తెచ్చిన సంచీ తెచ్చి ఇవ్వమన్నట్టు సైగ చేస్తే, నాగ సంచీ తెచ్చి టేబుల్ మీద పెట్టి, కాస్త దగ్గరున్న స్థంభానికి ఆనుకుని నిలబడింది.
పుట్టపర్తి కాఫీ తాగడమైన తరువాత, సంచీ లోనుంచీ, పూలమాల, శాలువా తీశారు ముందు! నాగను దగ్గరికి రమ్మని పిలిచారు.
ఎందుకో అర్థం కాకున్నా, దగ్గరికి పోయి నిలబడింది.
పుట్టపర్తి శాలువా మడత విప్పి, నాగకు కప్పి, పూల మాల కూడా వేసి చప్పట్లు కొడుతుంటే, కనకమ్మ కూడా నవ్వుతూ చప్పట్లు కొట్టసాగింది.
నాగకు సిగ్గేసి, నవ్వుతూ, అమ్మ చీరలో తలదాచుకుంటుంది.
పుట్టపర్తి కనకమ్మకు జేబులోనుంచీ కొన్ని రూపాయల నోట్లు అందిస్తూ అన్నారు, ‘ఇదిగో కనకా! ఈ సంవత్సరం నీ ఊరగాయకు యీ సన్మానం డబ్బు ఇట్లా సమకూరింది.’ అంటూ!
నాగ కళ్ళల్లో మెరుపులు!
‘అమ్మా, నా పూల జడక్కూడా!!’
పుట్టపర్తి దంపతులకు నవ్వాగలేదు.
నాగ కూడా నవ్వేసింది ఆనందంతో!
*****
(సశేషం)

సరస్వతీపుత్ర గా, చతుర్దశభాషా పరశేషభోగిగా చిరపరిచితులైన పుట్టపర్తి నారాయణాచార్యులవారు (1914 – 1990) , వారి ధర్మపత్ని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సత్కార గ్రహీత శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ (1921 – 1983) దంపతుల కుమార్తెగా జన్మించటమే గొప్ప వరమనీ, ఆ ఇంటిపేరే గొప్ప బిరుదని నాగపద్మిని గారంటారు. విద్యార్హత – హిందీలో ఎం.ఏ ఎం.ఫిల్. పీహెచ్.డీ. తెలుగు ఎం.ఏ. జర్నలిజం, అనువాదకళ, టీవీ నిర్మాణకళలలో పీజీ డిప్లమోలు; ఆకాశవాణి, దూరదర్శన్ లలో ముప్పైఐదేళ్ళ ఉద్యోగ జీవితంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుధా ప్రశంసనీయమైన వందలాది కార్యక్రమాల నిర్వహణ; తెలుగు హిందీలలో యాభైదాకా పద్య, సాహితీ వ్యాస,కథ, నాటక, అనువాద రచనలు; తెలుగు విశ్వవిద్యాలయ, తమిళనాడు హిందీ అకాడెమీ, బిహార్ సాహిత్య సమ్మేళన్, గోఎంకా జాతీయ అనువాద పురస్కారాలూ, శ్రీయుత వైయస్. రాజశేఖర రెడ్డి, ఎన్.డ్.తివారీ,డా.రోశయ్య, డా. మృదులాసిన్ హా (ప్రస్తుత గోవా గవర్నర్) వంటి రాజకీయ ప్రముఖులచే సత్కారాలూ; తెలుగు రాష్ట్రాలలోనే కాక, ఖరగ్ పుర్, పాట్నా, చెన్నై, అమెరికాలో న్యూజెర్సీ, డల్లాస్, పెన్సిల్వేనియా, అట్లాంటా, వాషింగ్టన్ సాహిత్యసమావేశాల్లో ప్రసంగానంతర సత్కారాలు; . గత పదిహేనేళ్ళుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రత్యక్ష ప్రసారాలలో హిందీ/తెలుగు వ్యాఖ్యాత. జయజయశంకర, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ మొదలైన మాధ్యమాలలో యాభైకి పైగా ఆధ్యాత్మిక ప్రసంగాలు; అన్నిటికంటే మించి, పుట్టపర్తి వారి శతజయంతి (1914-2014)సందర్భంగా పుట్టపర్తి పద్య, కథ, నవల, అనువాద, విమర్శ సర్వస్వాల ప్రచురణ (నాలుగువేల పుటల బృహత్ ప్రచురణ).
