మునిమాణిక్యం – హాస్యానికి తలమానికం

-అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము

రచయిత చేత పురుడు పోయించుకుని, శతాబ్దాల తరువాత కూడా ఆ పాత్ర సజీవమై పాఠకుల హృదయాల్లో నిలిచిపోవడమనేది చాలా అరుదైన విషయం.

ఇందుకు ఉదాహరణగా గురజాడ వారి ‘ కన్యాశుల్కం ‘ నాటకంలోని పాత్రలను ఇక్కడ ఉదహరించవచ్చు. ఒక మధురవాణి, ఒక గిరీశం, ఒక లుబ్ధావాదాన్లు, ఒక రామప్పపంతులు తెలుగునాట ఈనాటికీ సజీవమే-సుప్రసిద్దమే. నండూరి వారి ఎంకి ఇంకా జన బాహుళ్యంలోనే ఉంది.

మధ్యతరగతి జీవితాల్లోని సంక్లిష్టతను, సంఘర్షణను హాస్య చతుర చమత్కార ధోరణిలో మందహాసభరితంగా ప్రకటించడం కోసం జనించిన పాత్ర ‘ కాంతం’ కీ;;శే;; మునిమాణిక్య నరసింహారావు గారి అద్భుతమైన సృష్టి ఈ కాంతం తాలుకు అయస్కాంతశక్తి తరాలుగా సరళ హృదయుల్నీ , సాహితీప్రియుల్నీ ఆకర్షిస్తూ , ఆకట్టుకుంటూ తన అభిమానుల ఖాతాలో జమ కట్టుకుంటూనే వస్తోంది. నిజానికి ‘ కాంతం కథలను-మునిమాణిక్యం గారిని వేరుగా చూడలేము. రచయితది, రచనది మమేకమై అనుబంధం,.దశాబ్దాలు గడిచినా “ కాంతం” తెలుగు సాహితీహృదయాలను వీడి వెళ్ళ లేదు. అంతటి అద్భుత పాత్ర సృష్టికర్త మునిమాణిక్యం గారు ప్రాతస్మరణీయులు.

మాణిక్యం గారు బహుముఖప్రజ్ఞులు. మితభాషి. మాట కలిస్తే అమితంగా మాట్లాడే సంభాషణా చతురులు. నవలలు రాశారు. పద్యాలు రాశారు. నాటకాలు రాశారు. వందల్లో కథలు రాశారు. అయితే కాంతం కథల గురించిన కథల ముందు అవన్నీ , పెద్ద గీతముందు, చిన్న గీతల్లా అయ్యాయి. వీరికి అత్యంత కీర్తిని తెచ్చిపెట్టినవి వీరి కథలు. వాటిలో హాస్యరసం గుప్పించడమే అందుకు ప్రధాన కారణం. హాస్యం రాయడం ఎంతో కష్టం.-రాసి మెప్పించడం మరీ ఎంతో కష్టం. మాణిక్యం గారు వారి కథలలో తన వృత్తిని, ప్రవృత్తిని జోడించి , రంగరించి తన జీవితాన్ని “ ఉపాధ్యాయ వృత్తినీ, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితిని, వస్తువుగా తీసుకుని , తన భార్యామణి కాంతాన్ని హీరోయిన్ చేసి, అతి సున్నితమైన చిన్న విషయాలని సైతం ఎంతో ఉదాత్తంగా, హాస్యాన్ని గుమ్మరిస్తూ , అమృతగుళికల్లాంటి చిన్న చిన్న
కథలని తెలుగుజాతి కందించారు.

ఒక స్కూల్ మాస్టరు జీవితాన్ని, మధ్యతరగతి కష్టాలను, ఇష్టాలను వ్యక్తపరుస్తూ దుఃఖాన్ని తరిమేసి కరుణరసాన్ని గుప్పిస్తూ , హాస్యాన్ని గుమ్మరించిన మధ్యతరగతి మందహాసాలను వెలికిదీసారు తన కథల ద్వారా. మాణిక్యం గారు వారి కథల్లో అణకువ, మక్కువ, గడుసుతనం, చలాకీతనం, ఓర్పూ, నేర్పూ, అన్నీ మేళవించిన ఒక ముగ్ధమనోహరమైన ఇల్లాలిగా , పిల్లల ఆలనా పాలనా కోసం అనుక్షణం ఆరాటపడే బాధ్యత గల తల్లిగా , కాంతాన్ని చిరంజీవిని చేశారు.

శైలి: ఈ కథల్లో అచ్చమైన తెలుగింటి ఇల్లాలు , పేదబడిపంతులుభార్య. భర్త అంటే ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలియదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి కురిపిస్తుంటుంది. ఆమె తన భర్తను వేళాకోళం చేస్తుంది కానీ కించపరచదు. ఆమె అపహాస్యం వెనుక భర్త అంటే అంతులేని ఇష్టం. సగటు తెలుగు మహిళ అని చెప్పవచ్చు.

ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారు మాణిక్యం గారిని ముట్నూరు కృష్ణారావు గారి దగ్గరికి తీసురువెళ్ళి పరిచయం చేస్తుంటే ఆయన వెంటనే “ కాంతం” భర్త కదూ అన్నారట. ఈ ఉదాహరణ తెలుగునాట కాంతం ఎంత ప్రసిద్దో తెలియ జేస్తుంది.

కాంతం కథల్లో ఆయన నిజజీవితంలో జరిగిన సంభాషణలు స్ఫూర్తి గా రాసేవారు. ఉదాహరణకు ఆయన ఓ సారి భార్యని పిలిచి “ నా కలం కనపట్లేదు. వెతికి పెట్టమంటే ఆవిడ వంటింట్లో నుంచి నాకు అట్లకాడ కనబడటం లేదు. కాస్త వెతికిపెట్టండి అందట. ఇలా నిజజీవితంలోనే దాంపత్య సన్నివేశాలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టి కథలు నిత్య నూతనంగా కనబడుతున్నాయి.

“ ప్రణయలేఖలు” కథలో కాంతం గారి ప్రణయాన్ని ముణిమాణిక్యం వారు ఎంతో అందంగా చూపించారు. డబ్బును పొదుపుగా వాడుకొంటూ కావలసిన వాటిని కొనుక్కుని కోరికలు ఎలా తీర్చుకోవాలో “ వెండికంచం” కథలో చూపించారు. పిల్లలు కాంతాన్ని “ కోర్ట్ లో ముద్దాయిగా ఎలా ఉంచారో “ కోర్ట్‌ లో కాంతం” కథలో చూపించారు.

కథల ఉదాహరణలు: కొత్తఎత్తు, కోటు, తేనేటిగిన్నెలో తుఫాను, నవ్వులాటకు,ఇంట్లో విరహం, దొంగ పెద్దమనిషి. కథకుడి కష్టాలు.

వారు సృష్టించిన కాంతం పాత్ర తెలుగువారిలో ముద్రపడిపోయింది. అనురాగం, ఆత్మీయతతో కూడిన చాతుర్యం, మాటకారితనం, కొద్దిగా వెటకారం, శృతిమించని శృంగారం, నిండుదనం, కొంటెతనం…ఇలా అన్ని ఉన్న స్వచ్చమైన తెలుగు ఇల్లాలు కాంతం. మునిమాణిక్యమే ఆ కథల్లో వెంకట్రావుగా మనకు కనిపిస్తాడు. అతను అమాయకుడు. అలాగని భార్య పై పెత్తనం చేసి తను నెగ్గుకు రావాలనుకున్నా చివరకు తనే లొంగిపోయే స్వభావాన్ని కలవాడు. జీవితానుభవాల నుంచి పుట్టినవే కాంతం కథలు. కథ సాధారణంగా ఒక వాక్యంతోనో, వర్ణనతోనో , సన్నివేశంతోనో మొదలవుతుంది. మధ్యలో పీటముడి పడుతుంది. చివరకు చురకతో ముగుస్తుంది. మనకు నవ్వు తెప్పిస్తుంది. చాలా కథల్లో అర్థాల ధ్వారా మునిమాణిక్యం హాస్యాన్ని సృష్టించారు. కాంతం మాట్లాడే మాటల్లో వెటకారంతో బాటు , ఆ మాటల వెనక అర్థవంతమైన లోగుట్టు ఉంటుంది. కాంతం భర్తతో చాలా చమత్కారంగా మాట్లాడుతుంది. సన్నివేశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి చతురోక్తులు విసురుతుంది.

ఉదా: కొండపల్లి వెళితే మీకు కొయ్యబొమ్మలు కనబడతాయా …అంటే అక్కడ కూడా అమ్మాయిలను చూస్తూంటారు కదా అని ఆమె ఉద్దేశ్యం. ఆ అమ్మాయిని అంత దైర్ఘ్యంగా ప్రేమించేశారేం..మరి ఆ సమయంలో మీదగ్గర అద్దం లేకపోయినా …అలానే మరో చోట..మా వాళ్ళందరూ తోకలేని కోతులు..పాపం మీ వాళ్ళకు ఆ లోటు కూడా లేదులెండి అంటుంది. ఇంకొన్ని వాక్యాల్లో హాస్యం చాలా గొప్పగా
ఉంటుంది. విరహం అంటూ అనుభవించాలే గానీ హంసతూలీకాతల్పమే కావాలా…నులకమంచంలో పడి దొర్లినా నానా హంగామా చేయకూడదా…….లెంపలేసుకున్నారా..స్వయంగానా లేక మీ ఆవిడా…పిల్లలు కోతి బొమ్మ కావాలంటున్నారు వచ్చేటప్పుడు తెస్తారా లేక మీరే వస్తారా….ఇక కొన్ని కథల్లో కాంతం తన భర్త వెంకట్రావు మాటలైతే ఆయనకు భార్య పై కోపాన్ని చతురోక్తులతో చెబుతారు .కోతి కనిపించేసరికి మా ఆవిడ గుర్తుకొచ్చింది. నేనా పిల్లను ఆటపట్టిద్దాం అనుకున్నాను. కానీ నాఊహల్లో మాకాంతం ముఖం సూపర్ ఇంపోజ్‌ అయ్యింది. ఇలా ఎన్నో సున్నితమైన హాస్యపు చెణుకులు వారి
కథల్లో మనకు కనిపిస్తాయి.

అసలు కాంతాన్ని పెళ్ళి చేసుకున్న కొత్తల్లో భర్త వెంకట్రావ్ పై చేయి సాధించేవాడు. భార్య ఎంత లొంగదీసుకోవాలనుకున్నా కుదిరేది కాదు. అసలు దగ్గరకు వస్తే చిర్రుబుర్రులాడే వాడు. కానీ క్రమంగా కాంతం మచ్చిక చేసుకుంది. లొంగదీసింది. ఇక అమాయకుడైన వెంకట్రావు సాధుజీవిలా మారిపోతాడు. కాంతం చిరునవ్వు కు అర్థం ఇదేనట. ఇలా కథలన్నీ సున్నితమైన హాస్యంతో పాఠకుల పెదవిపై చిరునవ్వు చెరగనివ్వవు. మిగిలిన పాత్రలు వచ్చీ పోతున్నా, కథల్లో హాస్యానిదే రాజ్యం. అందుకే ఇవి ఏవో టైంపాస్ కథలు కావు. చదివిన ప్రతి కథను గుర్తు పెట్టుకుని మీమీ జీవితాల్లో ఎదురయ్యే సన్నివేశాలకు , సంఘటనలకు ఆపాదించుకుంటుంటే జీవితమే హాస్యపు జల్లులా కురుస్తుంది. నవ్వుకరువై, తోటి మనుషులతో మాట్లాడే తీరికే లేని అత్యాధునిక బిజీ సమాజానికి మునిమాణిక్యం వారి కథలు తేనె పట్టులాంటివి. హాస్య రసమాధుర్యాన్ని పంచే మందుల్లాంటివి. అందుకనే నేటి యువతీయువకులు తోపాటు పెళ్ళైన ప్రతీ ఒక్కరూ చదవాల్సిన మంచి కథలు ఇవి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.