అనుబంధాలు-ఆవేశాలు – 9

– ప్రమీల సూర్యదేవర

అంజమ్మ హత్య చేస్తుండగా చూసిన వారి సాక్ష్యం ఉన్నది. స్నేహితురాలిని హత్య చేయాలనే ఉద్దేస్యం కాకపోయినా అది అలా జరిగిపోయింది. అంజమ్మ నిర్దోషి అని నిరూపించే అవకాశమే లేదు. ఆ రెండు కుటుంబాల దురదృష్టం—పిల్లలు తల్లులు లేని వారయ్యారు.

భ్రమర విషయం అలా కాదు. హత్య చేయగా చూసి సాక్ష్యం చెప్పిన వారు లేరు. కత్తిపై ఆమె చేతి గుర్తులు, రక్తసిక్తమైన దుస్తులు మాత్రమే సాక్ష్యం.

ఇరువురు తాము దోషులమని అంగీకరించటం వల్ల మరణ దండన విధించ లేదు. జీవించి క్షణక్షణం వేదన అనుభవించేకన్నా మరణమే మేలేమో అనిపిస్తుందొక్కక్కసారి.

దినపత్రికల్లో, రేడియో, టెలివిజన వార్తల్లో ఎన్నో హత్యల గురించి చదువుతాం, వింటాం.

‘తల్లిని హత్యచేసిన యువతి’ అని పెద్దపెద్ద అక్షరాల్తో వున్న వార్త చూసి,

కన్నతల్లిని చంపిందంట ఎంత దారుణం!

పిల్ల చదువుకున్నదట ఇదేం పోయే కాలం?

కలికాలం తల్లీ! కలికాలం! ఇలాంటివి ఇంకా ఎన్ని వినాలో!

తల్లికి ఇష్టం లేనివాడినెవడ్నో చేసుకోవటానికి అడ్డు తీర్చేసుకుని ఉంటుంది. ఇకనుండి మనం పిల్లల్తో జాగ్రత్తగ ఉండాలి. ఎవరేం చేస్తారో ఎవరికి తెలుసు? తండ్రి కూడ లేడట. బైక్ ప్రమాదంలో చనిపోయాడట. ఈ పిల్లే తండ్రిని కూడ ఏదోచేసి ఉంటుంది!

‘స్నేహితురాలిని దుడ్డుకర్రతో బాది చంపిన యువతి’ అన్న వార్త చూసి,

స్నేహానికి విలువ లేకుండా పోతుంది. మంచి స్నేహితులే కరువౌతున్నారు. స్నేహానికి కాదు మానవత్వానికే విలువ లేకుండా పోతుంది. ఎక్కడో అడవి జాతి వాళ్ళట. వాళ్ళలో ఇలాటి హత్యలు మామూలే!  నాగరికత లేని మనుష్యులు ఎంత దారుణానికైన ఒడిగడ్తారు!

ఈ రోజుల్లో ఎవర్ని నమ్మలేం.

చాలా రోజులక్రితం–భార్య, భర్తను గొడ్డలితో నరికి వేసిందన్న వార్త సమాజంలో కలకలం రేపింది.

తాళి కట్టిన వాడిని ఎంత తెగించిన మనిషి కాకపోతే ఇంత దారుణానికి పూనుకుంటుంది? ఇష్టం లేకపోతే విడాకులున్నాయి కదా మనిషి ప్రాణమే తీయాలా? ఇద్దరు పిల్లలు కూడానట. ఎలాటి తల్లమ్మా? ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించలేదు! ఏ విషమో పెట్టి చంపటం వేరు. కాని గొడ్డలితో నరకటానికెన్ని గుండెలు కావాలి!

కసిగా గొడ్డల్తో నరికిందంటే ఆమెను ఎన్ని హింసలు పెట్టాడో!

ఇలాగే ప్రతి హత్యని గురించి తెలుసుకున్నప్పడు సహజంగా ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. నిజమె, కొందరు కక్షలు పెంచుకుని పధకం వేసుకుని హత్యలు చేస్తే మరి కొందరు క్షణికోద్రేకానికి గురై చేస్తారు. హత్య ఏ కారణాలవల్ల చేసినా అది శిక్షార్హమే. ప్రతి హత్యవెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని నా నమ్మకం.

నువ్వు ఎంచుకున్న వృత్తిలో ఇలాంటి జీవితాలు ఎన్నో చూస్తావు. ఇది నా ఉద్యోగం–వీరికి సహాయ పడటం నాధర్మం–అని నువ్వు ధైర్యంగ ఉండగలిగినప్పుడే నీబాధ్యత నువ్వు సరిగా నిర్వర్తించ గలవు. వారి దురదృష్టానికి నీవు నీరు కారిపోతే వాళ్ళ కెలా సాయ పడగలవని నా మనఃస్థితి చూసి అమ్మ, నాన్నగార్లు నాకు ప్రతి రోజు ఉపదేశం చేస్తున్నారు.

నేను మరల జైల్లో వారిని చూసి మాట్లాడితేనే కాని మనఃశ్శాంతి ఉండదని కారాగారం నుండి రావలసిన ఉత్తరం కొరకు రేయింబవళ్ళు ఎదురు చూస్తున్నాను.

ఎంతో ఆత్రంగ ఎదురు చూస్తున్న ఉత్తరం నెల రోజులకు వచ్చింది. మన ప్రభుత్వ కార్యాలయాల్లో నెల రోజుల లోపు ఏదైనా పని జరిగిందంటే చాలా త్వరగా జరిగినట్లే. కారాగార అధికారిణి, రాధాదేవి చేసిన ఒత్తిడి వల్లే పని త్వరగ జరిగి ఉంటుందని అంచనా వేశాను. ఆమె కళ్ళల్లో వున్న కాఠిన్యం వెనుక దాగి ఉన్న కారుణ్యం గుర్తించ లేక పోయాను. వెంటనే రాధాదేవికి కృతజ్ఞతలు తెలుపుతూ, నేను రావటానికి ఎప్పుడు అనుమతి ఇస్తారని అడుగుతూ ఉత్తరం వ్రాశాను.

ఎదురు చూసిన ఈ నెలరోజులు చాలా భారంగా గడిచిపోయయి. రోజులు గడిచే కొలదీ వారిరువురికి సాయం చేయలేనేమోననే నిరాశ కృంగ దీసింది. నా క్లినిక్ కి మానసిక బలహీనత వల్ల చికిత్స చేయించు కోవటానికి వచ్చే వారితో ఏకాగ్రతతో మనసు విప్పి మాట్లాడటానికి చాలా ప్రయత్నించ వలసి వచ్చేది. వారితో మాట్లాడుతున్నంత సేపు అంజమ్మ, భ్రమరలు కూడ వీరిలా మానసిక వైద్యుల వద్ద చికిత్స చేయించుకుని ఉంటే ఈ రోజు ఆ కటకటాల వెనుక ఉండ వలసిన పరిస్థితి వచ్చేది కాదేమోననే ఆలోచన బాధపెట్ట సాగింది. ఇలాంటి వైద్యం అనేది ఒకటుంటుందని అంజమ్మకు తెలియక పోవచ్చు. కాని భ్రమర కేమైంది? ఎందుకు నిర్లక్ష్యం చేసింది? ఆ అమ్మాయిపై నాకు కోపం కూడ వచ్చేది.

అంజమ్మ సత్ప్రవర్తన వల్ల ఆమెకు కొంత శిక్ష తగ్గించ వచ్చు. అంతకన్నా వేరే గత్యంతరం లేదు. భ్రమర విషయంలో హత్య గురించి స్పష్టత లేక పోవటం వల్ల తనతో మాట్లాడి నేనేమైనా సాయం చేయగలనేమోనన్న ఆశ అప్పుడప్పుడు మిణుకుమిణుకుమంటుంది.

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.