
చేయిజారి పోయింది
– చెళ్ళపిళ్ళ శ్యామల
ఎంతగాచెప్పిందో….. సోనూ ఆమాటలు నమ్మొద్దని, తనకేపాపం తెలియదని. కానీ శ్రావణి వింటేనా?
నిప్పులేనిదే పొగరాదని మొండిగా వాదించాడు.
పచ్చని పందిళ్లింకా తీయనేలేదు. పెళ్లికోసం దిద్దిన రంగులముగ్గులు మాయనేలేదు. పిండివంటల గుభాళింపులు పలకరిస్తూనే ఉన్నాయి. పెళ్లినుంచి వెళ్లిన బంధువులు పెళ్లిముచ్చట్లు చెప్పుకుంటూ…. వాట్సాప్ లో ఫోటోలు షేర్ చేసుకుంటూనేవున్నారు.
మేడ్ ఫర్ ఈచ్ అదర్… మీజంట అంటూ ఫ్రెండ్స్ పంపిన మెసేజ్లు చూస్తున్నసోనూ “ఇద్దరూ భోజనాలకి రండి సోనూ”అన్న అమ్మమాటలతో… జారుతున్న కన్నీటి చుక్కలను చెంపలమీదికి రానీకుండా చున్నీతో తుడిచింది.
నలుగురు మధ్య నవ్వుతూ భోజనాలుకానిచ్చి తమగదికి వచ్చారాదంపతులు. చెరోవైపూ తిరిగి పడుకున్నవారిని ఒకటిచేయాలని ఏసీగది చాలాఆరాటపడింది. చెరోదుప్పటి వాళ్లిద్దరూ కప్పుకోవడం తో….తెల్లార్లూ…. మౌనాన్నే మోసిందా గది.
తెల్లారి ప్రయాణం. అమ్మా, నాన్న, మేనమామలు, అత్తలు కొత్తకాపురానికి కావల్సిన వస్తువులు సర్దుతున్నారు తెల్లవారిచూసుకుంది. శ్రావణ్ మెసేజ్ చేసాడు. ‘అంతా మాములుగా జరిగిపోనీ. ఎవరికీ అనుమానంరాకుండా నడుచుకో. ఇంటికివెళ్ళాక విడాకులకి అప్లైచేద్దాం. విడాకులువచ్చేదాకా సైలెంట్ గా ఉందాం.
మెసేజ్ చూడగానే కాళ్లకింద భూమి కంపించినట్టయింది. చివురుటాకులా వణికిందిసోనూ. అన్నీఅనుకున్నట్టుగానే జరిగాయి. అప్పుడేవారంఅయింది వాళ్లాఇంటికి వచ్చి. మూడునెలల తర్వాత ఇంట్లోవాళ్ళకి తెలిసింది. నెత్తినోరుకొట్టుకున్నారు. అమ్మాయి అలాంటిది కాదని ఎంతగానో నచ్చచెప్పే ప్రయత్నంచేసారు. ఇరుపక్షాల వారు కూర్చుని మాట్లాడుకున్నారు. అయినా అనుకున్నది
జరగక కోర్ట్ మెట్లు ఎక్కారు. కాలం కఠిన శిక్షవేసింది. సోనూ ఇప్పుడు వాళ్ళఊరులోనే ఉంది.
కష్టాల ప్రయాణం సోనూని శిల్పంగా మార్చింది. అనుకున్నలక్ష్యాన్ని సాదించి ఇప్పుడు హైదరాబాద్ లో బ్యాంకుఆఫీసర్ గా చేరింది. తనచిన్ననాటి నేస్తం సరళతో కలిసి పీజీలో ఉంటోంది “అసలుఆరోజు జరిగిందేమిటి? ఎందుకు శ్రావణ్ విడాకులదాకావెళ్ళాడు”
ఆరోజు పదహారు రోజుల పండక్కని అత్తవారి ఇంటికి సోనూతో బయలు దేరాడు శ్రావణ్. ఊరు ఎంట్రన్స్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళదాం అంది సోనూ. నేనంతగా గుళ్ళు, గోపురాలకు రాను. అలాగే నిన్ను వెళ్లొద్దని చెప్పనులే. నువ్వెళ్ళి రా నేనిక్కడే వుంటా అనడంతో గుడి లోపలకు వెళ్ళింది సోనూ.
అప్పుడు జరిగిందా విషయం. గుడి ముందర బండి ఆపి ఇద్దరు యువకులు దిగారు.” ప్రతి వారం ఇదే టైమ్ కి నేనూ సోనూ ఈ గుళ్లోనే కల్సు కునే వాళ్ళం. ఈ రోజు కూడా తను వచ్చే ఉంటుంది. నే వెళతాను. కాసేపు నువ్విక్కడ వుండు”. అప్పుడే బండి మీద వచ్చిన ఇద్దరు యువకుల్లో ఓ యువకుడు అంటూ గుడి మెట్లు ఎక్కాడు. సోనూ ఇంకా రాలేదు. శ్రావణ్ గుండె వేగం పెరిగింది. సోనూ వెళ్లి పది నిముషాలు దాటింది.
సోనూ వస్తోంది. వెనకాలే ఆ యువకుడు. యువకుడు పిలవటం, సోనూకి పువ్వు ఇవ్వడం తను అది పెట్టు కోవడం కళ్ళారా చూసాడు శ్రావణ్. ఆ యువకుడు త్వరగా వచ్చాడు “సోనూ ని కలిసావా!” “ఆ తను వచ్చింది. “పద వెళదాం. వాళ్ళ మాటలు విన్నాక గుండె వేగంగా కొట్టుకుంది శ్రావణ్ కి. సోనూ…. వస్తూనే “ఆలస్యం అయింది. పూజ చేసారు. మీరూ రావాల్సింది “అంది. “నీ వెనకాలే వచ్చాడే ఆ అబ్బాయి ఎవరు. నీ కేదో ఇచ్చినట్టున్నాడు” అతనెవరో తెలీదు. దేముడు పూవు కింద పడిందని ఇచ్చాడు.అంతే ”
ఈ సంఘటనే అతడి అనుమానంకి ఆద్యం పోసింది. నిజా నిజాలు తెలుసు కోకుండా అతడిని విడాకుల వరకూ తీసుకెళ్ళింది.
సరళకు విషయం మొత్తం చెప్పింది. అది విని సరళ పగలబడి నవ్వింది. అతడు చెప్పిన సోనూ వేరే అమ్మాయి అయి ఉంటుంది. నీ మాటల్లో నిజాయితీని నమ్మలేక పోయాడు. అయినా” అబద్ధాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరు “. అబద్దం ఓ కుటుంబాన్ని విచ్చిన్నం చేసింది, అంది. సరళ కజిన్తోనే సోనూకి మళ్ళీ పెళ్లయింది.
అతను ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాడు. పెళ్లి సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో జరిగింది. కాలం వసంతాన్ని కానుకగా ఇచ్చింది సోనూకి. తన ఆనందాన్ని స్టాఫ్ తో పంచుకుందికి వీకెండ్లో ఓ రెస్టారెంట్ కి జంటగా వెళ్ళింది సోనూ. అక్కడ కనిపించాడు శ్రావణ్ ఒంటరిగా, దిగులుగా….ఆలస్యంగా తెలుసు కున్నాడతను ఆరోజు గుళ్లో కెళ్ళిన అబ్బాయి చెప్పింది. వేరే సోనూ గురించి అని. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? అబద్దం అతని జీవితాన్ని ఒంటరిని చేసింది. నిజం నిలకడ మీద తెలిసింది. అప్పటికే జీవితం అతని చేయి జారిపోయింది.
*****

చెళ్ళపిళ్ళ శ్యామల ఉపాధ్యాయిని. నివాసం విజయనగరం. ప్రవేశమున్న ప్రక్రియలు వచన కవిత, మినీ కవిత, పాట, వ్యాసం. బాలగేయాలు “పలకరింపులు” మినీ కవితా సంకలనం 2000 లో ప్రచురితమైంది. అనేక దిన వార మాస పత్రిక లలో కవితలు, కథలు, పాటలు ప్రసారం అయ్యాయి.
