
సహస్రధార
सहस्रधारा
హిందీ మూలం – డా. బలరామ్ అగ్రవాల్
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
దెహరాదూన్.
రోడ్డుమ్యాప్ చూపిస్తున్న ప్రకారం నేను సరిగానే రోడ్డు పట్టుకున్నాను. అయినా, బాగా ముందుకి వెళ్ళిపోయే బదులు, కాస్త ఎవరినైనా అడిగి తెలుసుకోవడం మంచిదని అనిపించింది. తెల్లవారడానికి ముందు మసకమసకగా ఉండే మునిచీకటి ఇంకా బాగా మిగిలివుంది. రోడ్డునిర్మానుష్యంగా ఉంది. ఆఖరికి రోడ్డుమీద కుక్కకూడా ఏదీ కనిపించడంలేదు. వీపుకి కట్టుకుని మోస్తున్న నా బ్యాగేజిని నేను రోడ్డు పక్కన ఉన్న పార్కులోని బెంచీమీద పెట్టాను. కాస్త తేలికపాటి వ్యాయామం చేస్తూ కాలక్షేపం చెయ్యసాగాను. చాలాసేపు తర్వాత ప్యాంటు-షర్టు ధరించిన ఒక ఆకారం జాగింగ్ చేస్తూ పార్కువైపుకి రావడం కనిపించింది. కొంచెంసేపట్లోనే అది బాగా దగ్గరికి వచ్చింది. ఆమె ఒక పర్వతప్రాంతానికి చెందిన యువతి. పార్కులో నన్ను వ్యాయామం చేస్తూ చూసి ఆమె ముఖంలో కాస్త ఆశ్చర్యం కనిపించింది. కాని మామూలుపద్ధతిలోనే ఆమె పార్కులో ప్రవేశించి జాగింగ్ చేయసాగింది.
“ఎక్స్క్యూజ్ మీ…” రెండో రౌండులో ఆమె నాకు దగ్గరగా వచ్చి ముందుకు వెడుతూఉంటే నేను ఆపుజేశాను.
ఆమె ఆగింది.
“నేను సహస్రధార వెళ్ళాలి” నేను చెప్పాను.
“సరయిన చోటనే ఉన్నారు మీరు.” ఆమె అంది, “మొదటిబస్సు సరిగా ఆరుగంటలకి ఇక్కడినుంచి వెడుతుంది.”
“మరి లేట్ అయితేనో?” నేను నా సందేహం వెలిబుచ్చాను.
“గడిచిన అయిదు సంవత్సరాల్లో ఎప్పుడూ అలా కాలేదు.” ఆమె నవ్వుతూ అంది.
“అంటే గడిచిన అయిదుసంవత్సరాలనుంచి మీరు విడవకుండా ఇక్కడ జాగింగ్ చేస్తున్నారన్నమాట?” ఆమె వైఖరిని పట్టించుకోకుండా నేను అడిగాను.
“సో వాట్?” నేను అన్నదానికి ఆమె ముఖం ఒక్కసారిగా వేడెక్కింది.
“డోంట్ బీ యాంగ్రీ.. కోపగించుకోకండి. నేను ఊరికేనే అడిగాను.” నేనన్నాను, “నాకు మీరు కాస్త రోడ్ వే చెప్పండి… నడిచి వెడదామనుకుంటున్నాను.”
“నడిచా!!!” ఆమె ఆశ్చర్యంగా నోరు తెరిచింది, “చూడబోతే మీరు టూరిస్టు అనిపించడంలేదు.”
“అయితే?” నేను అడిగాను.
“నిజం చెప్పనా?”
“చెప్పండి.”
“వద్దులెండి…”
“నేనేమీఅనుకోనులెండి. కోపగించుకోనుకూడా.”
“వస్తువులు ఎత్తుకుపోయే దొంగవాడిలా ఉన్నారు.” నామాట విని ఆమె కొంచెం పరిహసిస్తూ అంది.
“ఆ పని కూడా ఎవరైనా తిరుగుబోతు మాత్రమే చెయ్యగలడు మామ్!” నేను కూడా మందహాసం చేస్తూ అన్నాను.
“ఇంక చాలు.” ఒకే చోట లెఫ్ట్-రైట్ జంప్ చెయ్యడం మొదలుపెట్టి ఆమె చిటికవేస్తూ అంది, “మిగిలిన కబుర్లు సహస్రధార దగ్గర….ఇంక పదండి.”
“సహస్రధార దగ్గరా!…అంటే?”
“అక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మే ఒక చిన్న షాపు ఉంది మాది.” ఆమె చెప్పింది, “ఆరుగంటల బస్సులో వెళ్ళి రోజూ నేనే ఓపెన్ చేస్తాను దాన్ని. తొమ్మిదింటికి డాడీ వస్తారు. అప్పుడు నేను తిరిగి వచ్చేస్తాను.”
నాకు ఎదురుగా ఆమె మరోరూపాన్ని నేను చూస్తున్నాను. ఆమెతో ఇంకా మాట్లాడాలని అనిపించింది. చీకటిని చీల్చుకుంటూ ప్రాతఃకాలంలో ముందుగా వచ్చే వెలుగు కనిపిస్తోంది. ఇంకా అక్కడ ఆగివుండటం అంటే… నడిచివెళ్ళాలనే ఆకాంక్షని వదిలెయ్యడమే. నాకు అది బాగున్నట్లు అనిపించలేదు.
“మీరు అబ్బాయి అయివుంటే మిమ్మల్ని ఈరోజు నాతో నడిచి రావలసిందిగా నేను తప్పకుండా పట్టుపట్టేవాడిని.” కొంచెం ఆలోచిస్తూ నేను అన్నాను.
“అబ్బాయా!… మీరు అబ్బాయి కావడంవల్ల చాలా గర్వంగా ఉన్నట్లుంది మీకు.” నేనన్న మాటకి ఆమె ఈసారి పూర్తిగా సహనం కోల్పోయింది, “టిబెట్ బిడ్డని నేను… మీకన్నా ఎక్కువ వేగంగా ఎక్కువ దూరం నడవగలను నేను… మాగురించి ఇంకెప్పుడూ ఇంత తక్కువగా ఆలోచించకండి.”
ఓరి నాయనో! ఎంత ప్రమాదకరమైన అమ్మాయి ఈమె!! తన ధోరణి చూసి నేననుకున్నాను. సహజంగా, నిష్కపటంగా ఉన్న వేళాకోళం కూడా సహించలేకపోతోంది!!
“ఓకే.!” విషయాన్నివెంటనే మార్చేసి నేను అక్కడినుంచి సెలవు తీసుకోవడమే శ్రేయస్కరం అనుకున్నాను. అందుకే అన్నాను, “మీ షాపు దగ్గర కలుస్తాను…గుడ్ డే.”
“తప్పకుండా!” ఆమె సామాన్యమైన కంఠస్వరంతో అంది-“మీరు తొమ్మిదిగంటలకి అక్కడికి చేరుకుంటే.”
“అరే, మరిచిపోయాను.” బ్యాగేజి ఎత్తుకుని నడుస్తూ వెనక్కి తిరిగి నేను అన్నాను, “మీ పేరు నేను అడగనేలేదు?”
“చాలా పవిత్రమైన పేరు.” ఆమె నవ్వుతూ అంది, “స్నానం చేశాక అడగండి.”
అలా అంటూనే ఆమె ముందుకి పరుగెత్తింది.
నేను సహస్రధార వైపుకి తిరిగాను. ఎత్తయిన రోడ్లమీద వెళ్ళడం నాకు ఇదే మొదటిసారి. సూర్యోదయం అయేవరకు కాస్త ఉపశమనం గా ఉంది. ఆ తరువాత ఎండ చుర్రుమని గుచ్చుకోసాగింది. సరదాగా షికారుగా తమ ఇళ్ళనుండి వచ్చినవారు కూడా ఇంక ఊరివైపుకి తిరిగి వెడుతూ కనిపిస్తున్నారు. నేను పట్టణం లోని జనం విహరించే ఆనందాన్ని పొంది, ఇంటికి వెళ్ళాలని ఆలోచించే హద్దుకన్నా ఇంకా ముందుకి చేరుకున్నాను. రోడ్డుమీద ఇంక జనం ఎవరూ కనిపించడంలేదు. వృక్షాలమీద పక్షుల కలకలారావాలు ఎక్కువ కాసాగాయి. పక్షులు తమ నివాసాలని విడిచిపెట్టి, రోజంతా సరిపడే భోజనం, విశ్రాంతి లభించే చోట్లవైపుకి ఎగిరివెళ్ళి పోయాయి. చెట్లు, పర్వతాలకి చెందిన శిఖరాలు అక్కడక్కడ గులాబీరంగులో కనిపిస్తున్నాయి. కొండదారిలో నడుస్తూ వెడుతున్న కారణంగా శరీరం బాగా శ్రమపడవలసి వస్తోంది. ఆ చలిగా ఉన్న ఉదయంలో కూడా నాకు నుదుటిమీద చెమట చిమ్ముకువచ్చింది. కాని నేను నడుస్తూనే ఉన్నాను. నా బనీనుకూడా చెమటతో తడిసిపోయినట్లు అనిపించింది. పరిస్థితి ఇలాగే ఉంటే బహుశా కొద్దిసేపట్లోనే నేను నా జెర్కిన్ని, స్వెటర్ ని నా భుజంమీద వేసుకుని మోసుకువెళ్ళాలేమో.
ఈలోగా రెండు బస్సులు నన్ను క్రాస్ చేసుకుని ముందుకి వెళ్ళిపోయాయి. నేను ఇదే వేగంతో వెడితే తొమ్మిది కాదు, పదిగంటలకి కూడా సహస్రధారకి చేరుకోలేను—నేను కాస్త దిగులుపడుతూ ఆలోచించాను. ఎక్కడివరకూ చేరుకున్నానో అక్కడే రోడ్డు పక్కనే నా బ్యాగేజి ఆన్చి ఉంచాను. కాస్త ఎదురు చూసినతరువాత వెనకనుంచి వచ్చిన మూడో బస్సుని ఆపుజేసి అందులో కూర్చున్నాను.
“చూడండి, ఆఖరి స్టాపుకి ఒక అరకిలోమీటరు ముందే చెప్పండి నేను దిగిపోతాను.” కండక్టరుని రిక్వెస్టు చేశాను. అతను సహస్రధారకి ఇంచుమించు ఒక కిలోమీటరు ముందే నన్ను దిగమన్నాడు. అక్కడనుండి నెమ్మదిగా నడుచుకుంటూ ఇంచుమించు ఏడున్నర-పావుతక్కువ ఎనిమిది గంటలకి నేను సహస్రధారకి చేరుకున్నాను. అనుకున్నట్లుగానే నా కాళ్ళు అన్నిటికన్నా ముందుగా అక్కడ ఉన్న షాపులవైపుకే ముందుకి సాగాయి. నా కళ్ళు ఉత్సుకతతో చాలా సులభంగానే ఆమె చెప్పిన దుకాణాన్ని గుర్తించాయి.
“ఎంతదూరం నడిచాక మీరు బస్సు ఎక్కి కూర్చున్నారు?” నన్ను చూడగానే ఆమె అడిగింది.
“బస్సులోనా!… ఆపాదమస్తకం ఓడుతున్న ఈ చెమట మీకు కనిపించడం లేదా?”
“అవుతుంది… కొండదారుల్లో అలాగే అవుతుంది.” నా వాలకాన్ని పట్టించుకోకుండా ఆమె అంది, “ఏం ఫరవాలేదు… కొండలు, పర్వతాలు ఎక్కనంతవరకే ఉంటుంది వీటిని అధిరోహించాలనే అభిలాష.”
“మీరు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి.”
“అవును కదా, మీరు చెప్పేది నిజమే,” ఆమె అంది, “ఓ పని చెయ్యండి. ఆ పక్కకి వెళ్ళి ముందు స్నానం చెయ్యండి. బయటా, లోపలా ఉన్న మలినం అంతా కడిగిపారేస్తుంది. చాలా పవిత్రమైన ధార ఇది.”
“బయటా, లోపలా ఉన్న మలినం అంటే ఏమిటి?”
“చెమట, అలసట, అంతకన్నా ఏముంది?” ఆమె అంది.
“ఇప్పుడైనా చెప్పండిమీ పేరు.” నేను మర్యాదగానే అడిగాను.
“చెప్పాను కదా, ఆ మోస్తున్న బ్యాగేజి దింపుకుని కింద పెట్టుకోండి. విశ్రాంతిగా కూర్చుని శిరస్సునుంచి పాదాల దాకా కారుతున్న ఆ చెమటని ఆరబెట్టుకోండి.” ముందునుంచి ఉన్న తన పద్ధతిలోనే ఆమె అంది, “ఆ తర్వాత… ధారకి మధ్యలో ఉన్న పెద్ద-పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, వాటిలోనే ఒకదానిమీద నా పేరు రాసి ఉంది… పేరు వెతికే వంకతో స్నానం చెయ్యడం కూడా అయిపోతుంది. అవునా?”
చాలా విచిత్రమైంది ఈ పిల్ల. అయితే కోపంగానన్నా ఉంటుంది. లేకపోతే వేళాకోళం చేస్తుంది. మాటిమాటికీ తను చేసే వేళాకోళానికి నేను లోలోపలే ఆహతుడినైపోతున్నాను. అయినా సౌమ్యతనూ, సరళతనూ దృష్టిలో ఉంచుకుని, వాటితో బంధితుడనై ఏమీ చెప్పలేకపోతున్నాను.
“సరే, ఆ సంగతి అలా ఉంచండి,” సహజంగానే నేను మళ్ళీ అడిగాను, “మీరు ఎంతమంది అన్నదమ్ములు-అక్కచెల్లెళ్ళు?”
“మేమా!… నేనొక్కదాన్నే నా అన్నయ్యని, అక్కయ్యని కూడా.” ఈసారి తను నెమ్మదిగా అంది.
“అలాగా…సారీ…”
“ఏం ఫరవాలేదు. మరి మీరు?”
“మేము చాలామందిమి ఉన్నాం. ఏడుమంది!అందరిలోనూ నేనే చిన్నవాడిని.”
“అక్కచెల్లెళ్ళు ఎంతమంది?” తను తడుముకోకుండా అడిగింది.
“ఒక్కరు మాత్రమే.”
“మీలాగే ఉండవచ్చునేమో…ఐ మీన్, నాటీ అండ్ బ్యూటిఫుల్.”
“నాకన్నా కూడా ఎక్కువగా…. అంతేకాక ధైర్యవంతురాలు కూడా.”
“అలాగా!” తను సంతోషభరితంగా అడిగింది- “పేరు కూడా అందంగా ఉండవచ్చుకదా. ఏమై ఉంటుందో?”
“అదేకదా నేను అడుగుతున్నాను పొద్దుటినుంచీ.” తన ముక్కుపట్టుకుని కుడివైపుకీ, ఎడమవైపుకీ ఇటూ అటూ కదుపుతూ కాస్త అధికారపూర్వకంగా నేను అన్నాను, “చెబుతావా లేదా?”
“సోనమ్… సోనమ్ నాంగ్యాల్!” ఒక్క కుదుపులో తన ముక్కుని వదిలించుకుని నా చేతిని మాటిమాటికీ చాలాసార్లు తన కళ్ళకి అద్దుకుంది తను. నేను ప్రతిసారి ఆ చేతులనుండి వెలువడుతున్న అనురాగపు, మమకారపు వేడి స్పర్శని నా దేహంలో, హృదయంలో, మనస్సులో అనుభూతి చెందాను.
స్పర్శకి చెందిన ఆ పవిత్రధార ఇంకా ప్రవహిస్తున్నట్లు నాకనిపిస్తోంది.
***
డా. బలరామ్ అగ్రవాల్ – పరిచయం
26 నవంబరు 1952 న బులంద్ షెహర్, ఉత్తరప్రదేశ్ లో జన్మించిన డా. బలరామ్ అగ్రవాల్ గారు ప్రఖ్యాత రచయిత, సమీక్షకులు, అనువాదకులు. వీరు సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో తన రచనాకౌశల్యం చూపించారు. వీరి విద్యార్హతలు- పిహెచ్.డి., అనువాదంలో పి.జి. డిప్లొమా, ఆయుర్వేదరత్న మొ. డా. అగ్రవాల్ గారి సాహిత్యసేవ వైవిధ్యభరితమైనది. మినీకథ, కథ, కవిత్వం, సమీక్ష, బాలసాహిత్యం, అనువాదం వీటిలో ఉన్నాయి. వీరి 9 మినీకథా/కథాసంకలనాలు, 6 సమీక్షాగ్రంథాలు, 15 బాలసాహిత్యానికి చెందిన పుస్తకాలు ప్రచురితం. ఇంచుమించు 25 కథాసంకలనాలకి సంపాదకునిగా ఉన్నారు. వీరి రచనలు సంఘంలోని చైతన్యాన్ని, లోతైన ఆలోచనని ప్రతిబింబిస్తాయి. వీరి శైలి సహజంగానూ, ప్రభావవంతంగానూ ఉంటుంది. కేంద్రప్రభుత్వంవారి సాంస్కృతికమంత్రిత్వశాఖకి చెందిన సి.సి.ఆర్.టి. నుండి వీరికి సీనియర్ ఫెలోషిప్ (హిందీ-2019-21) లభించింది. సెకండరీ స్థాయి విద్యార్థులకోసం పాఠ్యపుస్తకాల నిర్మాణానికి సంబంధించిన ఎన్.సి.ఇ.ఆర్.టి. వారి 2 ప్రాజెక్టులలో సంపాదకత్వం నిర్వహించారు. వీరి సాహిత్యసేవకు చాలా సన్మానాలు, బహుమానాలు లభించాయి. 2023లో వీరిని ఉత్తరప్రదేశ్ హిందీ సంస్థాన్, లక్నో ద్వారా `డా. రామ్ కుమార్ వర్మ బాలనాటక సన్మానం’ ప్రదానం చేసి సత్కరించారు. డా. బలరామ్ అగ్రవాల్ నోయిడా (ఉత్తరప్రదేశ్) వాస్తవ్యులు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
