ముందు జాగ్రత్త

-కాయల నాగేంద్ర

చల్లని సాయంసంధ్య;

ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరిన ఆమె, బస్సు స్టాపు చేరేలోపల విపరీతమైన వర్షం మొదలయింది. గబగబా వరుగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న ఇంటి వరండాలో నిల్చుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. దానికి తోడు గాలి తోడయింది. ఉరుములు, మెరుపులతో అంతకంతకూ విజృంభిస్తోంది.

గాలి,వాన సహనాన్ని చంపేస్తుంటే, నేనూ ఉన్నానంటూ సంధ్య వెలుగుని మింగేసి చిక్కబడి పోతోంది చీకటి. కరెంట్ పోవడంతో ఆమె తల దాచుకున్న ఆ ఇంటి వరండాలో మరీ చిక్కగా ఉంది చీకటి. చిత్తడిగా ఉన్నవరండా, జోరు తగ్గని గాలివాన, తడిసి ఒంటికి అంటుకుపోయిన బట్టలూ ఆమెలో చిరాకును పెంచుతున్నాయి. చీర పైట కొంగు భుజం మీదుగా తీసి కప్పుకుంది. వానకి తడిసిన చీర రివ్వున వీస్తున్న గాలి మరింత బాధ పెడ్తున్నాయి.

అంతలో ఆ ఇంటి తలుపు తెరుకుకుంది.  “లోపలికి రండి” అన్న మాటలు వినబడినాయి. గుమ్మంలో నిలబడిన యువకుడు పక్కకు జరిగి ఆమెకు దారి ఇచ్చాడు.

‘అమ్మయ్య’ అనుకుంది ఆమె.  ‘ఇంటికి వెళ్ళడం దేవుడెరుగు, ముందు ఈ వర్షం నుంచి బైట పడటం ముఖ్యం’ అనుకుంటూ లోపలికి నడిచింది.

ఆమె అతనికేసి పరిశీలనగా చూసింది. నమ్మకస్తుడిలాగే కనిపించాడు ఆమెకి.  ‘అందగాడు, సంస్కారవంతుడు’ అని మొదటి చూపులోనే గ్రహించిందామె.

“కూర్చోండి.. ఎంత సేపటినుంచి తడుస్తున్నారో పాపం. ఈ టవల్ తీసుకొని తల తుడుచుకొని కాస్త రిలాక్స్ అవండి” అంటూ వంట గదిలోకి వెళ్ళాడు.

ఆమెకు హాయిగా అనిపించింది. అంత ఆదరణగా అతను మాట్లాడుతుంటే, ఆ ఇంట్లో ఉన్నది అతనొక్కడే అని తెలుస్తోంది. ఇంతలో వంట గదిలోంచి కాఫీ కప్పుతో వచ్చి “తీసుకోండి” అన్నాడతను.

“థాంక్యూ” అంటూ కాఫీ కప్పు అందుకుంది. వేడి కాఫీ గొంతులోనుంచి దిగుతుంటే ఎంతో హాయిగా అనిపించి, తనకింత మర్యాద చేస్తున్న యువకునిపట్ల ఆత్మీయత అనిపించగా “మీకు శ్రమ ఇచ్చాను” అంది.

“కాఫీ చేయటం కూడా శ్రమేనా?” అంటూ నవ్వాడు.

“మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పరిచయం చేసుకుంటే సంతోషిస్తాను” అన్నాడు.

“నా పేరు అవని. బ్యాంక్ లో పని చేస్తున్నాను. ఆఫీసు అయిపోగానే బైటకొచ్చి ఇలా వానలో చిక్కుకున్నాను” క్లుప్తంగా చెప్పింది.

‘ఎంత అందమైన పేరు. పేరులో తియ్యదనం, రూపంలో కమ్మదనం’ అనుకున్నాడు.

“మీ గురించి చెప్పాక నా గురించి చెప్పకపోతే బాగోదు.  నా పేరు రవిచంద్ర, మాది విజయవాడ. ఇక్కడ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాను”. తన గురించి చెప్పాడు.

టైమ్ చూసుకుంది అవని. ఏడయింది, వాన తగ్గేటట్టు లేదు అనుకుంది.

ప్రకృతికాంత నల్లని గొంగళి కప్పుకున్నట్టుంది కటిక చీకటిలో వాతావరణం. ఉరుములు, పిడుగులతో ప్రకృతి విలయతాండవం చేస్తోంది.

“అలా దిగులు పడకండి!  వర్షం తగ్గగానే మిమ్మల్ని క్షేమంగా మీ ఇంటి దగ్గర దింపి వస్తాను” ఆమెకు దైర్యం చెప్పాడు రవిచంద్ర.

రెండు నిమిషాల్లోనే కుర్చీలో తలను ఓ పక్కకు వాల్చి నిద్రలోకి జారుకుందామె.

రవిచంద్ర రెప్ప వాల్చకుండా ఆమెనే చూడసాగాడు. అద్భుతమైన అందం ఆమెది.  ఆమె కన్నుల్లోనూ, చూపుల్లోనూ ఒక వింతైన సోయగం. ఒక్క మాటలో చెప్పాలంటే, సౌందర్యమంతా ఆమె సొంతం. ఎంత నిర్మలంగా ఉంది ఆమె ముఖం! ఎంత హాయిగా నిద్రపోతున్నదో, అమాయకంగా, పసిపాపలా.  ప్రకృతిలోంచి తవ్వి తీసిన అందమంతా ఆమె మేనిలో దాగినట్టుంది.

దీర్ఘంగా క్షణాలు గడిచిపోతున్నాయి.

వర్షం తగ్గింది. ఆమెకు నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేకపోయినా, లేపటం తప్పనిసరి అనుకుంటూ దగ్గరగా వెళ్ళి మృదువుగా పిలిచాడు “అవని గారు!”

ఆమె గాఢ  నిద్రలోనే ఉంది.

మళ్ళీ పిలిచాడు “ఏమండీ, అవని గారు లేవరూ?”

మత్తుగా కళ్ళు విప్పి టైమ్ చూసుకుని చటుక్కున లేచి నిల్చుంది.

“వర్షం తగ్గింది. మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్తే వచ్చి దిగబెడతాను” అన్నాడు.

“ఇ.సి.ఐ.యల్, శివాలయం దగ్గరకు వెళ్ళాలి. మీకెందుకు శ్రమ నేను ఒక్కదాన్నే వెళ్లగలను” అంది.

“ఇంత రాత్రివేళ ఒక్కరే వెళ్ళటం మంచిది కాదండీ! రోడ్డు అంతా నీళ్ళతో నిండి ఉంది” అంటూ బైక్ స్టాట్ చేశాడు.

చలిగాలి వీస్తుంటే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.  బైకు రివ్వున పోయి అవని చెప్పిన ఇంటి ముందు ఆగింది,

“థాంక్యూ గుడ్ నైట్” అంది బైకు దిగి.

గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది అవని.

“ఎవరే అతను?”  అడిగింది ఆమె తల్లి జానకమ్మ.

ఆమె జరిగినదంతా చెప్పింది.

“మొత్తానికి పెళ్ళిళ్ళ పేరయ్య చూసిన అబ్బాయిని ఈ విధంగా కలుసుకున్నావన్నమాట!”  అంది జానకమ్మ.

“కలుసుకోడమే కాదు అతనే నా భర్త అని నిర్ణయించుకున్నానమ్మా!  అతనికి తెలియకుండా నేను పెట్టిన పరీక్షలో పాసయ్యాడు” అంది సంతోషంగా.

“నీలాగా ఈ కాలం ఆడపిల్లలు పెళ్లి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే!” కూతుర్ని మెచ్చుకుంది.

“అవునమ్మా! నేను అనుకున్నట్లే అతన్ని కలిశాను, అందుకు వర్షం కూడా సహకరించింది. అతని ప్రవర్తన నాకు బాగా నచ్చింది.  ఇలాంటి వారికి భార్య కావడం ఎంతో అదృష్టం ఉండాలి.  పాల నూరుగులాంటి స్వచ్చమైన మనసు, ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహశీలత అతనిలో ఉంది. అలాంటి వ్యక్తికి నేను భాగస్వామి కాబోవడం వా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. మీరు అనుకున్నట్లే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి” అంది కాబోయే భర్తను సెలెక్ట్ చేసుకున్నఅవని.

“ఒక్క రోజులోనే అతన్ని ఎలా అంచనా వేయగలవు అవని?” అంది జానకమ్మ.

“అమ్మా..! అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. అతని ప్రవర్తన, చల్లని మాటలు తీయని అనుభూతిని కలిగించాయి.  నాలో ఏవో కొత్త ఆశలు చిగురింపజేశాయి” అతనితో భవిష్య జీవితం తియ్యగా ఊహించుకుంటూ అంది అవని.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.