
మట్టి పరిమళం — మన తెలంగాణ
– మంగలి వంశీకృప్ణ
మాటలు కఠినమైనా
మన తెలంగాణ మనసులు మాత్రం
కల్మషమెరుగని వెన్నెల వెన్న.
చెట్టునీడలో ముసలవ్వ ముచ్చట్లు,
మట్టి వాసనలో బాల్యపు ఆటలు,
టైర్లను తిప్పుకుంటూ పరుగులు తీసే
పసిబిడ్డల కోతి చేష్టలు
అవి మా పల్లె జ్ఞాపకాల పద్యపంక్తులు.
మేడారం మాగాణిలో
సమ్మక్క–సారలమ్మల జాతర,
భక్తి కెరటమై ఉప్పొంగే జనసంద్రం,
ఒక్కటై మోగే గొంతుల నాదం
అది తెలంగాణ గుండె చప్పుడు.
కొండగట్టు కొండలపై
అంజన్న దర్శన భాగ్యం,
నిండైన భక్తి వెలుగుల్లో
గుండెల్లో ధైర్యదీపం
అది తెలంగాణ ఆత్మవిశ్వాసం
లాభనష్టాల లెక్కలు చూడక,
వాన కోసం ఆకాశాన్ని చూస్తూ,
మట్టిని తల్లిగా ముద్దాడుతూ
వ్యవసాయాన్ని వదలని రైతాంగం
అది తెలంగాణ మట్టికి ఉన్న మహత్తర ఋణం.
మనుషుల్లో కత్తిలాంటి చురుకుతనం,
మాటల్లో మిరపకాయంత ఘాటు,
అవసరమైతే పిడుగులాంటి ప్రతిఘటన,
తలవంచని మొండితనం
అది తెలంగాణ జీవన తత్వం.
గోదారి ఒడ్డున కొలువైన రామయ్య,
భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన
ఆ దివ్యనామం
భద్రాద్రి రాముని నామస్మరణ
తెలంగాణ గుండెల్లో చెరగని శాసనం.
మట్టిని నమ్మి,
మట్టిలోనే పుట్టి,
చెమటను చిందించి
బతుకులను పండించిన జనజీవనం
అదే తెలంగాణ మట్టిమనిషి మహాకావ్యం.
డోలు మోగితే దిక్కులన్నీ దద్దరిల్లే,
ఒగ్గుకథ మొదలైతే చరిత్రే పలికే,
జానపద గీతం ఎగసిపడితే
పల్లె ప్రాణమే పరవశించే
జానపదులే తెలంగాణ గుండె చప్పుడు.
యాదాద్రి నరసింహుని
ఉగ్రనాదం దిక్కులను దద్దరిల్లించగా,
వేయి స్తంభాల గుడి శిలల్లో
కాలమే చెక్కుకున్న చరిత్ర
తెలంగాణ సంస్కృతికి శిలాక్షర ప్రతిరూపం.
పువ్వులను ప్రేమగా పేర్చి
పూలనే దేవతలుగా కొలిచే బతుకమ్మ,
బోనాలు ఎత్తితే భక్తి ప్రవాహమై
ఊరంతా కన్నుల పండుగయ్యే
అది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ గీతం.
అన్యాయాన్ని సహించని పిడికిళ్లు,
అణచివేతను ఎదిరించిన గుండెలు,
రక్తం చిందినా వెనక్కి తగ్గని అడుగులు
స్వేచ్ఛ కోసం రగిలిన
తెలంగాణ పోరాట జ్వాలలు.
చీకటి ఎంత గాఢమైతే
వెలుగు అంత విలువైనదవుతుంది.
నిశీధి గుండెలోనే
ఉదయపు తొలి కిరణం పుడుతుంది.
అలాంటి చీకట్లను చీల్చుకొని,
అణచివేత సంకెళ్లను తెంచుకొని,
ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసి,
మట్టిమనిషి మహాస్వరంగా,
పోరాటాల పురిటిగడ్డగా,
పల్లెపాటల పరిమళంగా,
సంస్కృతికి సజీవ సాక్ష్యంగా,
ఉదయించింది తెలంగాణ.
తెలంగాణ అంటే మట్టి కాదు
మట్టిలో మొలిచిన మనిషి గుండె.
తెలంగాణ అంటే భాష కాదు
బతుకంతా పలికే ఒక భావగీతం.
తెలంగాణ అంటే భూభాగం కాదు
తరతరాల త్యాగాలతో
చెక్కిన ఒక చిరస్మరణీయ చరిత్ర.
*****

మంగలి వంశీకృప్ణ చిన్న కంజర్ల-పటాన్ చెరు..
