
ఆమె
(నెచ్చెలి-2026 కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)
– మానస రెడ్డి చిచిలీ
అద్భుత వరంగా,
సృష్టిలో ఆవిర్భవించిన,
శక్తిస్వరూపిణి .
అమ్మగా మారితే…
అమృత ధారలు కూరుస్తాయి.
అక్కగా నిలిస్తే…
ఆత్మీయతారాగాలు పలుకుతాయి.
చెల్లిగా చేరితే…
అనురాగం పువ్వై విరుస్తుంది.
భార్యగా వరిస్తే…
ఇంటిదీపమై వెలుగునిస్తుంది.
కూతురై పుడితే…
లక్ష్మీ కళనిస్తుంది.
కోడలై వస్తే…
వంశాన్ని నిలుపుతుంది. .
ఆమె అడుగు అడుగులో,
ఆశల మార్గం.
కంటి చూపులో…
ప్రేమ స్వరూపం.
బంధుజనంలో…
ఆప్యాయతా దీపం.
ఆమె నవ్వు వెనక…
కన్నీటినీ,కష్టాలనూ,
గుండెనిండా మోసే ధైర్యం.
రోజూ, సూర్యుడిని నిద్రలేపుతూ,
ముందే ఇంటిని వెలిగిస్తుంది.
ఆమె చేతి స్పర్శ…
ఓదార్పు మంత్రం.
ఆ గురువు మాట…
ఒక జీవన పాఠం.
అవమానాల్నిభరిస్తూ,
అభిమానాన్ని పంచుతుంది.
తుఫానుగాలులు వీచినా,
కొమ్మలను కాచే వటవృక్షం.
అర్థం చేసుకుంటే…
అఖండ దీపం.
గౌరవిస్తే…
ఆ ఇల్లు స్వర్గం.
స్త్రీ అంటే…అందమైన అధరమే కాదు,
బ్రతుకు ఆధారాలను అందించే అద్భుతం.
ఆమె వెలుగై నిలిస్తేనే,
ప్రపంచం వెలుగుతుంది.
*****

మానస రెడ్డి చిచిలీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు చెందిన కవయిత్రి. ఆమె రచించిన హైకూ మరియు టాంకా కవితలు Under the Basho, Mainichi Haiku వంటి అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆమె హైకూ 2025 సంవత్సరానికి సంబంధించిన Touchstone Award కు నామినేట్ చేయబడింది. అంతేకాకుండా, ఆమె నేరుగా జపనీస్ భాషలో కూడా హైకూ రచనలు చేసారు.
