
అనుబంధాలు-ఆవేశాలు – 11
– ప్రమీల సూర్యదేవర
సురేష్ వచ్చేవరకు ఏ పని మీద మనసు నిలువ లేదు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా! అని పదే పదే గడియారం వైపు చూస్తూ గడిపాను.
సుమారు ఆరుగంటల ప్రాతంలో వచ్చాడు సురేష్. పచ్చని పసుపుఛాయ, లేతగోధుమ రంగు కళ్ళు , నున్నటి పట్టుకుచ్చులాంటి జుట్టు , అందమైన ముఖం, ఎత్తుకి సరిపడ లావు—చూపరుల దృష్టిని ఇట్టె ఆకట్టుకుంటాడు. అతని ముఖకవళికల్లో భ్రమర పోలికలేమీ లేకపోవటంతో అక్క, తమ్ముడు అనుకోలేం.
“నమస్కారమండి, నాపేరు సురేష్, భ్రమర తమ్ముడిని,” అని వస్తూనే పరిచయం చేసుకున్నాడు. “మా అక్కకు మీరు సాయం చేస్తున్నారని తెలిసి కృతజ్ఞతలు తెలుపు కోవాలని వచ్చాను.” కళ్ళల్లో ఉబికి వస్తున్న నీరు దాచుకోవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు.
“రండి, కూర్చోండి. ఎంత వరకు సాయం చేయగలనో నాకే తెలియదు. అసలు చేయగలనో లేదో అని కూడ అనిపిస్తుందొక్కొక్కసారి.” అతని కెదురుగ కుర్చీలో కూర్చుంటూ అన్నాను.
“తన మనస్సులో బాధ ఎవరితో చెప్పుకునే అలవాటు లేదు మా అక్కకు. శంకరుడిలా గరళాన్ని మ్రింగి అయినా నవ్వుతూ గడప గలదు.” పెదవుల పైకి నవ్వు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ అన్నాడు.
“గ్రహించాను ఆమె మనస్తత్వం. ప్రస్తుతం భ్రమర ఉన్న స్థితిలో మనసు విప్పి మాట్లాడ గలగటం అంత సులభం కాదు. మనం ఓపిక పట్టాలి.” అమ్మ పంపిన కాఫీకప్పు అతని చేతికిస్తూ అన్నాను. “మీరు కూడా వైద్యశాస్త్ర విద్యార్దులని విన్నాను. ఇక్కడే చదువుతున్నారా?”
“లేదండి, గుంటూరులో చదువు పూర్తి చేసాను. నా చదువు పూర్తి అయిపోయిన తరువాత నేను, అక్క, శంకర్ కలిసి వైద్యశాల కట్టుకుందాం అనుకుని భవిష్యత్తు గురించి ఎన్నో పధకాలు వేసుకున్నాం.” బాధగ అన్నాడు. అతని ఆలోచనలు సుదూర ప్రాంతాలకు వెళ్ళి పోయాయి.
శంకర్ ఎవరో అడగాలనిపించినా భ్రమర ద్వారా తెలుసుకోవటమే సబబనిపించి ఆలోచన విరమించుకున్నాను.
ఇద్దరం కొంతసేపు మౌనంగ ఉన్నాం. తరువాత అతనే అడిగాడు, “మాఅక్క ఏమైన మాట్లాడుతుందాండి?”
“క్షమించండి, భ్రమర అనుమతి తీసుకోకుండ నేనామె గురించి ఏం మాట్లాడలేను. తోటి వైద్యుడిగా మీరు అర్దం చేసుకుంటారనుకుంటాను.”
“తమ వరకు వస్తే నియమాలు గుర్తుండవేమో.” సిగ్గుపడుతున్నట్లు అన్నాడు.
“మీ ఆరాటం, బాధ నేనర్దం చేసుకోగలను. భ్రమర సహకరిస్తే ఆమె అనుమతి తీసుకుని తప్పకుండా మీకు తెలియ జేస్తాను. సహకరిస్తుందనే నా నమ్మకం. హత్య విషయమై తను ఏదో దాస్తుందని నాకనిపిస్తుంది.”
“నూటికి నూరుపాళ్ళు భ్రమర అమ్మను హత్యచేసి ఉండదు. ఒక్కసారి నోరువిప్పి జరిగిందేమిటో చెప్తేనే కద ఎవరమైనా ఏమైనా చేయగలం.” దోసిలిలో ముఖం దాచుకుంటూ అన్నాడు. వేగంగా ఎగసి పడ్తున్న అతని ఉఛ్వాస నిశ్వాసలను బట్టి అతను శబ్దం పైకి రానీయకుండ లోలోపలె కుమిలి పోతున్నాడనిపించింది. శరీరం ఒడ్డూ, పొడుగు ఎదిగినా పసితనం ఛాయలు ఆ ముఖంలొ స్పష్టంగ కనుపిస్తున్నాయి. అతని చేతులు ముఖం మీది నుండి తొలగించి, అనునయ వాక్యాలు చెప్పాలనిపించింది. కాని నా వృత్తిధర్మం నన్నాపేసింది.
నాదగ్గరకు వచ్చేవారి భావోద్వేగాలకు చలించకుండా ధైర్యంగా ఉండి వారికి సాయం చేయగలగాలి.
“మీ చదువు ఇంకా ఎంత కాలం ఉన్నది?” మాట మారుస్తూ అడిగాను.
“ఇదే ఆఖరి సంవత్సరం. అక్కకు దగ్గర్లో ఉండాలని ‘హౌస్ సర్జన్సీకి’ ఇక్కడకు మార్చుకున్నాను.
ఆ తరువాత కొంచెంసేపు సంభాషణ, అభివృద్ది చెందుతున్న వైద్యచికిత్స, అందులో ఉన్న ఉపయోగాలు, సాధకబాధల గురించి, వేరే ఏవో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్న తరువాత వెళ్ళి వస్తానని లేచాడు.
“ఎవరే ఆ అబ్బాయి? అమ్మ ఇందుకోసమే ఎదురు చూస్తున్నట్లు, నేను లోపలకు రాగానే అడిగింది.
“స్నేహితుడు.” కాఫీ కప్పులు లోపలకు తీసుకు వెళ్తూ చెప్పాను.
“ఇంతకు ముందెప్పుడు చూడలేదే.” నాస్నేహితులందరు అమ్మ, నాన్నగార్లకు తెలుసు.
“ క్రొత్తగా పరిచయమయ్యాడు.”
“ఎలాంటి పరిచయం? నాన్నగారికి తెలుసా ?” అనుమానంగా అడిగింది.
అమ్మ చాలా పాతకాలం మనిషి. ఆ పల్లెలో వున్న పాఠశాలలోనే ఐదవ తరగతి వరకు చదువుకుంది. ప్రక్క ఊరికి పంపించి చదివించాలనే తాతగారి ప్రయత్నాన్ని అమ్మమ్మ ఆదిలోనే త్రుంచి వేసింది.
ఆ పల్లెలో అమ్మకు లోకజ్ఞానం ఎదగక పోయినా, నాన్నగారిని పెండ్లాడి పట్నంవచ్చి, చదువుకున్న వారితో పరిచయాలు పెంచుకుని కొంత మెరుగైనా–నా విషయంలో మాత్రం ఆడపిల్ల—పరిచయాలు అంటూ పాత పుస్తకమె తెరుస్తుంది. నేను హద్దులు మీరనని అమ్మకు నా మీద పూర్తినమ్మకమె. కాని అప్పుడప్పుడు అలా హెచ్చరించటం తన బాధ్యత అనుకుంటుంది. తను అలా హెచ్చరిస్తూ వుండటంవల్లే నేను హద్దులు మీరనని గర్వ పడుతుంటుంది.
“దగ్గర పరిచయమేలె, నాన్నగారికి తెలియదు.” ఒక్కొక్కసారి అమ్మ అనుమానాలను పెంచి, నాన్నగారు ఇంటికి వచ్చే వరకు ఆమెను ఆటపట్టించటం నాకు సరదా.
“అందుకేనే మీ నాన్నగరితో మొత్తుకుంటున్నా. పిల్ల పెళ్ళీడుకొచ్చింది, త్వరపడండి అని. వింటేనా! ఆయనకు ఆ న్యాయస్థానం, తీర్పులు తప్ప వేరే ఏమీ పట్టవు.” అమ్మ గొంతు వణికింది. సురేష్ ఎవరో అమ్మతో నిజం చెప్పాలనిపించనా ఆ నిజం అమ్మతో ఆగిపోదు. ఆ అక్కా, తమ్ముళ్ళ దీనగాధ బయటపెట్టే హక్కు నాకు లేదు. బల్లమీద ఉన్న వారపత్రిక తిరగేస్తూ “ఈ నగ చూడు, చాలా బాగుంది కదూ!” అని అమ్మను ఆమె ప్రపంచంలోకి లాగేశాను.
* * * * *
(మళ్ళీ కలుద్దాం )

1974, సెప్టంబర్ నుండి ఒహాయో రాష్ట్రంలో సిన్సనాటిలో నివసించి, 2004, జనవరి నెలలో టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోకి చేరుకున్నాము. నా మొట్ట మొదటి కథ ‘భయం’ 2007 డిసెంబర్ మరియు 2008 జనవరి ‘తెలుగునాడి’ మాసపత్రికలో ప్రచురించబడింది. రెండవ కథ ‘కదిలే బొమ్మలు’ 2010 ఏప్రియల్ నెలలో ‘విపుల’ మాసపత్రికలో ప్రచురించబడింది. 2003 ఫిబ్రవరిలో ప్రచురింపబడిన మొదటి నవల ‘అనుబంధాలు-ఆవేశాలు’ చదివిన పాఠకులు ఇచ్చిన స్పందనతో రెండవ నవల ‘ అనురాగ సంగమం ‘ 2024 ఫిబ్రవరిలో ప్రచురించటం జరిగింది. హస్తినాపురం (ఆస్టిన్) సాహిత్య సభలో పాల్గొని నా స్వీయ రచనలు కొన్ని చదువుతుంటాను.
