అనుసృజన

రైతుల నెత్తుటి కుండలు

హిందీ మూలం: రిషబ్ దేవ్ శర్మ

అనుసృజన: ఆర్ శాంతసుందరి

రిషబ్ దేవ్ శర్మ కవి, విమర్శకులు, స్నేహశీలి. హైదరాబాద్ లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. చిల్లర భవానీదేవి, పెద్దింటి అశోక్ కుమార్, సలీం లాంటి ఎందఱో తెలుగు రచయితల రచనల హిందీ అనువాదాలకు విశ్లేషనాత్మకమైన ఉపోద్ఘాతాలు రాసారు. ఈ కవిత వారి కవిత్వానుభావానికి ఒక మచ్చు తునక.

***

రైతుల నెత్తుటి కుండలు
పాతి ఉన్నాయి
ఈ నేలలోనే ! తిండిగింజలు పండిచినవాడు
బట్టల కోసం పత్తి పెంచినవాడు
నేల ఒడిని పచ్చగా ఉంచేందుకు
అనునిత్యం తన ఒంటిని ఎండబెట్టినవాడు
అతను. తడిపాడు పాదులను
తన నెత్తుటి లోహంతో
తన కన్నీటి వెచ్చదనంతో
చెమట వాసన వేసే ఉప్పుతో.
తన కోరికలని రగిలించి రగిలించి
సృష్టించాడు కలల మబ్బులను
మెరుపులా అల్లల్లాడాడు
పిడుగులతో నింపాడు దిగంతాలను. అతని కళ్ళలో…
శూన్యమా?
అతని గుండెల్లోనూ
శూన్యమేనా?
ప్రతి రుతువులోనూ వాగ్దానాలు
అన్నీ అబద్ధాలు;
ప్రతి మబ్బులోనూ
మోసం-మోసం !
నమ్మకంతో అమాయకమైన మనసుతో
నమ్మక ద్రోహం చేసే పెనుగాలులతో
ఇంకెంతకాలం పోరాడగలడు?
ఇప్పటికే ఈ నేలకి
రైతుల రక్తం బోలెడంత తాగించాడు రాజు;
భూగర్భంలో అణచిపెట్టాడు
తను చేసిన పాపాలన్నీ.
ఇంత పాపభారాన్ని ఇముడ్చుకుని తనలో
గొడ్రాలయింది ధరిత్రి,
కామధేనువు సారవంతమైన గర్భాశయం సైతం వట్టిపోయింది.
పసుపు రంగు సంతరించుకున్నాయి
కల్పతరువు ఆకులన్నీ !
గద్దెలెక్కినవారందరూ దిగండి
నేలమీదికి తక్షణం
నాగలి ఎత్తుకోండి భుజాలకి,
పదండి దున్నేందుకు పొలాలు.
నేల దున్నినవాడే ‘జనకుడు’
రాజు అతనే ఈ భూమికి,
అతనే భూపతి
కష్టకాలాన్ని ఎదిరించగలవాడూ అతనే !!

*****

Leave a Reply

Your email address will not be published.