
ఈ తరం నడక – 26
విజయ మహల్ సెంటర్ కథలు – రోహిణి వంజారి
-రూపరుక్మిణి

బాల్యం అందించిన తగరపు బుట్ట
ఈ కథలన్నీ చదువుతున్నంత సేపు ఇది ఒకే కథ అనేక భాగాలుగా రాసారు అనిపించింది. ఈ కథలకి మూలం బుజ్జమ్మ చిన్ననాటి జ్ఞాపకాలే. ప్రతి కథలోని ముగింపు సాంప్రదాయాల అస్తిత్వానికి ప్రతీకలుగా కనిపిస్తాయి.
నెల్లూరులో ఉండే ప్రజల ఆచార, వ్యవహారాల్ని గురించి వివరిస్తూనే పసితనం నిండిన మనసుకు పడ్డ గాయాల్ని పలుకరిస్తారు. తాను పెరిగిన వాతావరణంలో బంధువులు – ఆత్మీయతల మధ్య బంధాలకి ఆర్ధిక వెసులు బాట్లు అడ్డురావని చెప్తారు. కుల మతాల జోలికి పోదు ఏ కథ. అయినా సమాజంలోని అన్నీ వర్గాల ప్రజలు ఈ కథల్లో తారసపడతారు. విజయమహల్ సెంటర్ చుట్టూ వుండే ఒక నాటి వాతావరణం గురించి చెప్తున్నప్పుడు అమాయకమైన పసిబిడ్డ చిట్టి చిట్టి మాటల ఊసులు వినిపిస్తాయి. వాటితోపాటు ఆనాటి తిరణాలు, పొంగళ్ళు పూజలు మొక్కుబడులు మొత్తంగా అక్కడ సంస్కృతిని అంతా తడిమి చూపిస్తుంది బుజ్జమ్మ పాత్ర.
కళా సంస్కృతికి అద్ధం పడుతూ విజయ సెంటర్ మహల్ చుట్టూ జరిగే అనేక మంది జీవితంలో జరిగిన విశేషాలు ఈ పుస్తకంలో భద్రపరిచారు. బడుగు జీవితాల్లో జరిగే జీవన పోరాటాన్ని, పకీరు వేషాలతో పాటు జనాల్లోని సాంప్రదాయపు లోగిళ్ళని పరిచయం చేస్తుంది. కాయ కష్టం చేసుకుంటూ వళ్ళు దాచుకోవడం రాని రిక్షా రవణుడి మానవత్వ పరిమళాన్ని చెప్పినప్పుడు డబ్బుకంటే సహృదయానికి ఎంత విలువిస్తుందో ఈ సమాజం గురించి మాట్లాడుతారు. మహారాజు కథలో.
ఇప్పటి జనరేషన్ కి హీరో ఫాంటసీ ఉండొచ్చేమో కానీ సినిమా హీరోనే పెళ్లి చేసుకోవాలని ఇల్లువదిలి పోయేంత అమాయకత్వం నేటి సమాజంలో లేదు కానీ పాతిక 30 ఏళ్ల క్రితం ఈ ఫాంటసీ ఉన్న మాట వాస్తవం ఆ వాస్తవాన్ని మన కళ్ళ ముందుకు తెస్తూ “చిరంజీవి నా మొగుడు” అంటూ పరిగెత్తే విజయశాంతి అనే అమ్మాయి కథని చెప్తారు.
పారిశుద్ధ కార్మికురాలుగా జీవనం సాగించే నరసమ్మ ఒక్క రెండు రోజులు ఆ ఇళ్ల వైపు రాకపోతే మరుగుదొడ్లు శుభ్రం చేసే మనిషి లేక ఊరు ఊరంతా అల్లాడిపోతారు. కానీ ఆ మనిషిని అణగారిన జీవితాల్లోని దుర్భలతకు నిదర్శనంగా ఈ సమాజం చూస్తుంది. అలా చూస్తున్నారన్న అవగాహనతో ఓ పసి హృదయం బాధపడడం ఇక్కడ గమనించాల్సిన విషయం. నరసమ్మ రాక ఆ గ్రామ ప్రజలకు ఓ కర్పూర దీపం లాంటిది అని చెప్పిన తీరు కదా ఎత్తుగడ, ముగింపు, నడక ఆకట్టుకుంటాయి.
ఆనాటి కాలంలో సినిమా సాధారణ జీవితాలపై ఎంతగా ప్రభావం ఉంటుందో చెప్తారు.
కుల మతాల అడ్డుగోడలు లేకుండా జరుపుకునే గణపతి ఉత్సవం, కరీం భాషా తయారు చేసిన గణపతి మూర్తి, అంటూ ముట్టు వ్యవహారాల మధ్య గణపతి పూజని మాత్రం వదులుకొని క్షణాన్ని బాల్యం అందించిన మనోధైర్యాన్ని సంతోషాన్ని సమంగా చూపిస్తారు. కుడుముల స్వామి కథలో.
ఈ కథలో కులాంతర వివాహం ఉంటుంది. బుజ్జమ్మ చేతులు మారిన ప్రేమ లేఖలు ఉంటాయి. కులాంతర వివాహం చేసుకున్న కూతురిని ఆదరించిన తండ్రి ఉంటాడు. సమాజంతో నాకు పని లేదు నా కూతురు బ్రతుకే నాకు ముఖ్యం, ఆ పిల్ల సంతోషం ముందు ఈ సమాజం చాలా చిన్నదిగా చూసే తండ్రి మనకు కనిపిస్తాడు.
వైద్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని ఆలోచింపజేసే కథ రూపాయి దేవుడు. వైద్యుడు ఎందుకు దేవుడు అవుతాడు ఏ సందర్భంలో అవుతాడు గురించి మాట్లాడుతూనే మారుతున్న సమాజంలో రావలసిన మార్పును గురించి చర్చిస్తారు.
ఇలా తన కథల్లో సామాజిక బాధ్యతలు చైతన్యాలు అనే బరువైన పాత్రలేమి కనిపించవు. కానీ బలమైన వ్యక్తీకరణ కనిపిస్తుంది చెప్పదలుచుకున్న విషయంలో స్పష్టత ఉంటుంది తన చుట్టూ జరిగిన ప్రతి సంఘటనని కథగా మలచడం ఆ కథలోని మంచి చెడుని బెరీజు వేసే లక్షణాన్ని పునికి పుచ్చుకోవడం కథలో ఏ ఒక్క పాత్ర వెంట పరిగెత్తకుండా ప్రతి పాత్రను సమానంగా ప్రజెంట్ చేయడంలో రోహిణి మంజరి గారు సక్సెస్ అయ్యారు.
విజయ మహల్ సెంటర్ పుస్తకంతో పాటు నల్ల సూరీడు, దిగులు వర్ణం వంటి కవిత్వ కథల పుస్తకాలు విడుదల చేశారు.
రోహిణి వంజారి గారి నేపథ్యాన్ని, నెల్లూరు రోడ్డు విశేషాలను బాల్యం వీడని తగరపు బుట్టలో పెట్టి ఈ కథల్ని మన ముందుకు తీసుకుని వచ్చారు. మరిన్ని కథలు మీ నుంచి రావాలని ఆశిస్తూ.
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
