కనక నారాయణీయం -83

పుట్టపర్తి నాగపద్మిని

పుట్టపర్తి శాలువా మడత విప్పి, నాగకు కప్పి, పూల మాల కూడా వేసి చప్పట్లు కొడుతుంటే, కనకమ్మ కూడా నవ్వుతూ చప్పట్లు కొట్టసాగింది.

నాగకు సిగ్గేసి, నవ్వుతూ, అమ్మ చీరలో తలదాచుకుంటుంది.

పుట్టపర్తి కనకమ్మకు జేబులోనుంచీ కొన్ని రూపాయల నోట్లు అందిస్తూ అన్నారు,’ఇదిగో కనకా! ఈ సంవత్సరం నీ ఊరగాయకు యీ సన్మానం డబ్బు ఇట్లా సమకూరింది.’ అంటూ!

నాగ కళ్ళల్లో మెరుపులు!

‘అమ్మా, నా పూల జడక్కూడా!!’

పుట్టపర్తి దంపతులకు నవ్వాగలేదు.

నాగ కూడా నవ్వేసింది ఆనందంతో!

***

నాగ జడ ముచ్చటా, ఇంట్లో గుడిపాటవ్వ సహాయంతో ఊరగాయ వేడుకా విజయవంతంగా ముగిశాయి.

ఒక రోజు, కనకమ్మ చాటలో బియ్యం పోసుకుని, అందులో రాళ్ళు ఏరుకుంటూ కూర్చుని వుంది. ఇంతలో గుడిపాటవ్వ అక్కడికి వచ్చి కూర్చుని అంది, ‘ఇదుగో కనకమ్మా! మొన్నో రోజు ఆ డాల్డా అన్నపూర్ణమ్మ వచ్చి చాలా సేపు కూర్చునింది, నీతో ఏదో మాట్లాడాలని! ఏమైనా చెప్పాలా అని ఎంత అడిగినా చెప్పనేలేదు. నువ్వేమో ఎంతకూ రాలేదు. ఇంతలో మీ ఆయన వచ్చేసరికి గబగబా పోనే పోయింది. ఇంతకూ ఆమె ఎందుకొచ్చినట్టూ, మీ ఆయన్ను చూడగానే ఎందుకు పోయినట్టూ? నాకైతే తెలీలేదమ్మా!’ అంది.

డాల్డా అన్నపూర్ణమ్మ అంటే రెండో గాంధీ బొమ్మ దగ్గర మూర్తీ ఫోటో స్టూడియో ఎదురుగా ఉన్న లాయర్ టీ.వీ.శ్రీనివాస రావు గారి తల్లి గారు. వాళ్ళకు డాల్డా వ్యాపారం ఉంది. వాళ్ళ ఇంట్లో, ముందు హాల్లో, డాల్డా డబ్బాలెప్పూడూ పేర్చి పెట్టి ఉంచుతారు, బహుశా, ఎక్కడెక్కడికో పంపేందుకేనేమో!

ఆమె భర్త ఏడెనిమిదేళ్ళ కిందటే చనిపోతే ఆయన ప్రారంభించిన వ్యాపారాన్ని, ఈమే, ఈమె పెద్ద లాయర్ కొడుకు శ్రీనివాసరావూ చూసుకుంటున్నారు. అందుకే ఇంటిపేరు, డాల్డా పడిపోయింది.

ఆమెకు అద్వైత వేదాంతం ప్రాణప్రదం. శంకరాచార్యులవారి గురించి ముచ్చటించుకునేందుకు అప్పుడప్పుడూ వస్తూ ఉంటుంది. అంతే కాదు పతంజలి అష్టాంగ యోగంలో సత్యం, అహింస, బ్రహ్మచర్యం వంటి నియమాల గురించి మంచి అవగాహన ఉన్నావిడ! సాధనా మార్గంలోని కష్ట నష్టాలూ, నిత్య జీవితంలో వాటివల్ల ఇబ్బందులూ ఇవే కాక, అద్వైత వేదాంత జ్ఞానాన్ని అప్పుడప్పుడూ కనకమ్మ దగ్గర కూడా పంచుకుని పోతూ ఉండటం ఆమె అలవాటు.

కవిగా పుట్టపర్తి దృష్టి వేరే. తన కల్పనాలోకంలో విహరిస్తూ ఉండే ఆయనకీ ఉపాసనకన్నా, అష్టాక్షరీ జప సాధనే ఉత్తమంగా కనిపిస్తుంది. లోకో భిన్న రుచి: కదా!

కనకమ్మ అంది,’నేను పెద్ద మార్కెట్ దాకా పోయి వస్తున్నా అవ్వా! పాపం ఆమెకు తెలీదు కదా, ఏమి చేసేది? పోనీలే, మళ్ళీ ఎప్పుడైనా వస్తుందామె!’ అంటూ లోపలికి వెళ్ళింది.

***

‘అమ్మా అమ్మా!! మా స్కూల్ లో ఈ రోజు ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఎవరో స్వామీజీలు వచ్చినారు. ఆవులను కాపాడండి, ధర్మాన్ని రక్షించండి..అని ఇంకా దేశ భక్తి గురించీ చాలా సేపు చెప్పి, ఇదిగో యీ పేపర్లు పిల్లలందరికీ పంచినారు. వాళ్ళ గురువుగారి పేరు చాలా సార్లు చెప్పినారు మర్చిపోయినాను. నువ్వూ చూడు.’ అంటూ తన సంచీలోనుంచీ ఒక ఫాంప్లెట్ లాంటిది తీసి ఇచ్చింది.

అప్పుడే తులజా ఇంట్లోకి వస్తుంటే అడిగింది కనకమ్మ,’తులజా! ఎవరే వచ్చింది స్కూల్ కు?’ అని!

‘అదేనమ్మా కరపాత్రీ స్వామీజీ అని నువ్వు కూడ చెబుతుంటావే అప్పుడప్పుడు! ఆయన శిష్యులు. వాళ్ళే ఆయన గొప్పదనం గురించి చెప్పి, ఇదిగో యీ సమాచారం పిల్లలందరికీ ఇచ్చి పోయినారు.’ తులజ లోపలికి వెళ్ళిపోయింది.

కనకమ్మ ఆ ఫాంప్లెట్ చదువుతూ ఉంటే ఉత్సాహం పట్టలేక నాగ మళ్ళీ అడిగింది.’ అమ్మా! ఈ స్వామీజీ, చాలా గొప్పవాడంట! రెండు చేతులూ దొప్పమాదిరి పెట్టుకుని, అందులో ఎంత అన్నం పడితే అంతే తిని నీళ్ళు తాగేస్తాడంట! ఎప్పుడూ, మన దేశం గురించే ఆలోచనంట! దేశం గురించి పాటు పడాలంటే భోజనం చేయకూడదామ్మా?’

‘కథంతా విని నీకు ఇదే అర్థమైందన్నమాట!’ నవ్వేసింది కనకమ్మ.

నాగ కూడా నవ్వేస్తూ అంది,’మరి ఆయనెందుకట్లా నియమం పెట్టుకున్నాడు?’ అని!

కనకమ్మ అంది,’అది కాదమ్మా! ఆయనకు మొదటినుంచే యీ ప్రపంచంలోని సుఖాలూ, బాధలూ అంటే పడేది కాదట! ముందే సన్యాసం తీసుకుందామనుకుంటే వాళ్ళ తండ్రిగారు ఒప్పుకోలేదంట! చివరికి 19 సంవత్సరాల వయసులో సన్యాసం తీసుకుని, హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ వేద పాఠశాలల్లో, వేదాలూ, ఉపనిషత్తులూ, వేదాంతం, వ్యాకరణం ఇంకా వేరే శాస్త్రాలూ అన్నీ, అంటే భారత దేశ సంస్కృతికి సంబంధించిన గొప్పదనమంతా చక్కగా ఆకళింపు చేసుకున్నాక, భారతీయ ధర్మాన్ని రక్షించాలంటూ ప్రచారం మొదలు పెట్టినాడంట ధర్మ సంఘ్ అన్న పేరుతో! ఆయన మాటలకు ప్రభావితులైన వాళ్ళు కొందరు, ఆయనతో పాటే ఉంటూ, భారతీయత గొప్పదనం గురించీ, వేదాల గొప్పదనం గురించీ ప్రచారం చేయడం మొదలు పెట్టినారట! ఆయన తనకంటూ ఒక నియమం భోజనానికి సంబంధించి పెట్టుకున్నాడు. తిండి మీద ధ్యాస ఎక్కువైతే, లక్ష్య శుద్ధి వుండదని ఆయన అభిప్రాయం. తన నియమాన్ని తాను పాటిస్తూ, భారతీయత గొప్పదనం గురించి పిల్లలూ, యువకులూ అందరికీ అర్థమయ్యే విధంగా యీ విధంగా తన బృందం వాళ్ళను పంపి బోధిస్తూ ఉంటాడన్నమాట!’

నాగ అంది,’అవునమ్మా! ఆయన శిష్యులు భలే మాట్లాడినారు. ఒకాయన హిందీలో మాట్లాడుతూ ఉంటే, ఇంకొకాయన తెలుగులో చెబుతున్నాడు. ఆ పెద్ద స్వామి అనుభవాలూ, ధర్మమంటే అర్థమేమిటి? ఎట్లా పాటించవలె అన్నీ! నాకు భలే నచ్చిందమ్మా.’ కళ్ళు తిప్పుతూ చెబుతున్న నాగను చూసి ముచ్చటగా దగ్గరకు తీసుకుని కనకమ్మ అడిగింది,’అబ్బో, చాలా విషయాలు తెలుసుకున్నావన్నమాట! ఐతే ఇప్పుడు అమ్మకు చెప్పు, ధర్మమంటే ఏమిటి?’

ఊహించని ప్రశ్నకు నాగ తెల్లమొహం వేసింది. ‘అంటే..అంటే..!’

*****

  (సశేషం)

Leave a Reply

Your email address will not be published.