“నెచ్చెలి”మా

ఎదురుచూపు

-డా|| కె.గీత 

ఎంతటి
కార్యసాధకులైనా
కొందరికి
ఎదురుచూపే
జీవితం!

అదేవిటి
అలాగంటారు?
కార్యసాధకులకు
తిరుగులేదు కదా!

తిరుగులేదని
ఎవరు
చెప్పారండీ!!

అంటే
ఏదో
లోకోక్తి కదా
అని…

లోకోక్తులు
ఏ కాలం
నాటివో!
ఈ కాలపు
ఉక్తులు
యుక్తులు
అన్నిటినీ
మార్చేస్తాయి!
రాసుకోండి-
ఎంతటి
కార్యసాధకులకైనా
తప్పని
ఓటమే
జీవితం!
అన్నదే
ఈ కాలపు
లోకోక్తి!

అదేవిటి
మొదట
ఎదురుచూపన్నారు!

అవునండీ
అవును-
అక్కడికే
వస్తున్నాను-
ఓటముల
నించే
ఒక్క
గెలుపు
కోసమైనా
ఒక్క
అవకాశం
కోసమైనా
జీవితకాలపు
ఎదురుచూపు
మొదలవుతుంది!

దేనికి
ఎదురుచూపు
చదువు
ఎప్పుడు
పూర్తవుతుందనా?!
ఉద్యోగం
ఎప్పుడు వస్తుందనా?!
పెళ్లి
ఎప్పుడు అవుతుందనా?!
పిల్లలు
ఎప్పుడు కలుగుతారనా?!
జీవితంలో
ఎదుగుదల
ఎప్పుడు వస్తుందనా?!
ఎప్పటికి
స్థిరపడతామనా?
దేనికి
ఎదురుచూపు??!!

ఆహా!!
అన్నీ
సెలవిచ్చి
ఇంకా
దేనికని
అడుగుతారేవిటి?!
ఇంకా
ప్రేమ
ఫలించడం
కోసమా?!
పరాయిదేశపు
వీసా కోసమా?
నేపాల్
బీభత్సంలో
కొట్టుకుపోయిన
వారికోసమా?
తీరి కూచుని
చేసే యుద్ధాల్లో
అసువులు బాసిన
వారికోసమా?
అని అడుగుతారనుకున్నాను

సరేనండీ
ఏదో
ఒకటి-
అసలు
దేనికంటా
ఎదురుచూపు?!
దేనికీ
తిరుగులేని
కార్యసాధకులకు
పైగా!

ఎంతటి
కార్యసాధకులకైనా
ముగింపు
అనేదొకటి
ఉంది కదా!
దానికి
ఎదురుచూపు
తప్పదు కదా!!

అదా
సంగతి!
ముగింపు కోసం
ఎదురుచూపు
ఎందుకు?

మొదలు
పుట్టినప్పుడే
ముగింపూ
పుడుతుంది
ఎప్పుడూ
వెంటాడుతూనే
ఉంటుంది
వద్దనుకున్నా
ముగిసిపోతుంది

మధ్య
మిగిలిన
కాసిన్ని క్షణాలూ
ఎదురుచూపులు
మానేసి
హాయిగా
అనుక్షణమూ
జీవించండి!!
ఎదురుచూపు
చూడకండి!
ముఖ్యంగా
“కార్యసాధకుల”మని
మేకతోలు కప్పుకుని
తిరగకండి

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఆగస్టు, 2026 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  చంద్ర మోహన్

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: కొడుకు  (కథ) – వెంపరాల దుర్గా ప్రసాద్

ఇరువురికీ  అభినందనలు!

****

Leave a Reply

Your email address will not be published.