
కిడ్నాప్
-కందేపి రాణి ప్రసాద్
అడవిలో అన్ని జంతువులు కలసిమెలసి ఉండేవి. అన్నింటితో పాటు జింకలు కూడా నివసిస్తున్నాయి. జింకలు చాలా కలిసి గుంపులుగా ఉంటాయి. ఇవి గుంపులుగా జీవించడం వలన రక్షణ లభిస్తుంది. ఏదైనా ప్రమాదాన్ని పసిగడితే ఒక దాని నొకటి హెచ్చరించుకుంటాయి. ఈ జింకల మందకు నాయకుడున్నాడు. నాయకుడి సూచనల మేరకే మిగతా జింకలు నడుచుకుంటాయి. అన్నీ కలసి కట్టుగా ఉండడం వలన అపాయాల నుంచి బయట పడగలుగుతాయి.
ఒక జింకల కుటుంబంలో భార్యా భర్తలు, కొడుకు ఉన్నారు. కొడుకు పుట్టి రెండు వారారే అయింది. ఇంకా నడవడం రాలేదు. కాబట్టి జాగ్రత్తగా కాపాడుతుంది. ఆహారం తేవడానికి భార్యాభర్తలు ఇరువురూ అడవిలోకి వెళతారు. ఆ సమయంలో తన బిడ్డను జాగ్రత్తగా దాచి వెళతారు. బాగా దట్టంగా పెరిగిన గడ్డిలో తమ బిడ్డను దాచి ఉంచుతారు.
తాము అడవి నుంచి తెచ్చిన ఆహారాన్ని బిడ్డకు తినిపిస్తారు. మొదట్లో ఆడజింక, తన పాలే ఇస్తుంది. బిడ్డ కొద్దిగా ఎదిగాక బయటి నుంచి ఆహారం తెచ్చి ఇస్తుంది. జింకలు పూర్తిగా శాకాహారమే తింటాయి గడ్డి, ఆకులు కోసుకుని తింటాయి. అందుకే చెట్లు పెరిగే ప్రాంతాల్లోనే నివసిస్తాయి. మగ జింకలకు కొమ్ములు పెద్దగా పెరుగుతాయి. ఆ కొమ్ములతో ఎలాంటి జంతువునైనా చీల్చి చెండాడ గలదు. జింకలకు కొమ్ములే ఆయుధంగా పనిచేస్తాయి. అంతేగాక జింకలు చాలా వేగంగా పరిగెత్తగలవు. పులి, సింహం లాంటి శత్రువుల నుంచి తప్పించుకోవటానికి పరిగెత్తి పారిపోతాయి.
ఎప్పటిలాగే ఒకరోజు తమ బిడ్డను గడ్డిలో దాచి జింకలు రెండూ ఆహారానికి వెదుక్కుంటూ వెళ్లాయి. ఆ విషయాన్ని నక్క ఒకటి గమనించింది. వాళ్లు బయటికి వెళ్లాక మెల్లగా వెళ్లి బిడ్డను ఎత్తుకు పోవాలనుకున్నది. అనుకున్నట్లుగానే జింకలు బయటకు వెళ్ళగానే నక్కి నక్కి చూస్తూ గడ్డి పొద వద్దకు వెళ్ళింది. పాపం జింక పిల్ల చాలా చిన్నది. భయం భయంగా చూస్తున్నది, తినేయాలనుకున్నది. కానీ చాలా చిన్నది కావటాన వద్దులే అనుకున్నది.
ఏం చేయాలా అని ఆలోచించింది. ఇలా కాదు కానీ జింక బిడ్డను తీసుకెళ్లి దాచిపెడదాం అనుకున్నది. పిల్లను దాచిపెట్టి జింకల కుటుంబాన్ని భయపెట్టి ఆహారం సంపాదించాలనుకున్నది. ఆ విధంగా ఒక ఆలోచన మదిలో రూపుదిద్దుకున్నది. నక్క మొహంలో నవ్వు వచ్చింది.
వెంటనే జింక పిల్లను తీసుకెళ్లింది. ఎవరికీ కనపడని ఒక గుహలో దాచి పెట్టింది. తర్వాత ఒక పథకం ఆలోచించుకున్నది. సాయంత్రం జింకలు రెండూ ఇంటికి వచ్చేసరికి బిడ్డ కనిపించలేదు. చుట్టు పక్కలంతా వెదికాయి. ఎక్కడా కనిపించలేదు. జింకలు రెండూ బావురుమన్నాయి. చాలా సేపటిదాకా వెతుకుతూనే ఉన్నాయి. ఆ చుట్టు పక్కలే ఉన్న నక్క ఇదంతా గమనిస్తూనే ఉన్నది. సమయం కోసం ఎదురు చూస్తున్నది. జింకలు బిడ్డ కోసం వెతుకుతూ ఏడుస్తూ ఉన్నాయి. దగ్గరలోనే ఉన్న జంతువులను ఆడిగాయి. ఎవరూ తెలియదనే చెప్పారు. చూడలేదని చెప్పారు. అందరూ అలా చెప్పేసరికి అమ్మ జింక కళ్ళవెంట నీళ్ళు ధారాపాతంగా కారసాగాయి. ఏం చేయాలో అర్థం కాక ఒక చోట కూలబడ్డాయి.
నక్క గమనిసిస్తూనే ఉన్నది. అప్పుడే దొంగ చూపులు చూస్తూ మెల్లగా వెళ్ళింది. నక్కను చూడగానే జింకలు ఆదుర్దాగా అడిగాయి. “మా అబ్బాయిని చూశావా” అన్నాయి. నక్క దిగులగా మొహం పెట్టి “నేను చూడలేదు ఏమయింది” అని తెలియనట్లే అడిగింది.
“మా పిల్లవాడిని ఇక్కడ ఉంచి మేము బయటకు వెళ్లాం. మరల మేము తిరిగి వచ్చేసరికి మా బిడ్డ లేడు. మేము చుట్టు పక్కలంతా వెతుకుతున్నాం నీవేమైనా చూస్తే చెప్పు” కళ్ళ వెంట నీళ్ళు కారుతుండగా ఏడుపు గొంతుతో చెప్పాయి.
“ఇందాక ఇటువైపుగా పులి రావటం చూశాను. పులి నీ బిడ్డను ఎత్తుకుపోయిందేమో! అంత పసిదాన్ని తినటానికి మనసేలా ఒప్పిందో” అంటూ బాధగా మొహం పెట్టి అన్నది నక్క.
“ఆ మాటకు జింకలు రెండూ బావురుమంటూ ఏడ్చాయి. అయ్యో మా బిడ్డను తినేసిందా ఆ పులి పాడుగాను “అంటూ జింకలు గుండెలు బాదుకుంటూ పులిని తిట్టటం మొదలు పెట్టాయి. మేం వెళ్ళి మృగరాజుకు విషయం చెపుతాము” అని బయల్దేరబోయాయి.
“అరె తొందర పడకు మిత్రమా! నేను వెళ్ళి విషయం కనుక్కుని వస్తానుండు. కొద్ది సమయం వేచి చూడండి” అని నక్క కల్ల బొల్లి మాటలు చెప్పి బయటకు వెళ్ళింది. కొంచెం సేపు అటూ ఇటూ తిరిగి మెల్లగా మళ్ళీ జింకల దగ్గరకు వచ్చి నిలబడింది.
“ఏమైంది! విషయం తెలిసిందా అని జింకలు ఆదుర్దాగా అడిగాయి. నక్క విచారంగా మొహం పెట్టి “మిత్రమా! మీ బిడ్డను పులి తీసుకువెళ్ళింది. కానీ ఏదైనా పెద్ద జంతువును తెచ్చి దానికిస్తే మీ బిడ్డను వదిలి పెడుతుందట. అప్పటి దాకా వేచి చూస్తాను. అని చెప్పింది.” అని నక్క మంచి దానిలా నటించింది.
వేరే జంతువును పులికి ఇవ్వాలా! అంటే నేను మోసం చేసి నమ్మించి పులి వద్దకు తీసుకు వెళ్ళాలా! అలా చేస్తే నాకు పాపం తగలదా! మోసం చేయడం మా ఇంటా వంటా లేదని నీకు తెలియదా? అని మగ జింక కోపంగా అన్నది.
వెంటనే ఆడజింక అందుకుంటూ “మన బిడ్డను వదిలి పెడుతుంది కదా! అదే పది వేలు. లోకంలో అందరూ నీతినె నమ్ముకుని బతుకుతున్నారా! నాకు మాత్రం నా బిడ్డ కావాలి! నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎవర్ని తీసుకెళ్ళి అప్ప చెపుతావో నీ ఇష్టం” అన్నది.
“నేనిలా నమ్మించి గొంతు కోయడం చాలా తప్పు. ఒక వేళ అవసరమయితే నన్నే తినమని చెపుతాను అంతేకానీ వేరే ఏ జంతువునూ పులికి ఆహారంగా ఇవ్వను. నువ్వే చెప్పు నక్కబావా నన్ను తీసుకెళ్ళు అంతే గానీ మోసం గీసం నావల్ల కాదు” అన్నది.
“నువ్వెందుకు మిత్రమా పులి దగ్గరకు వెళ్ళడం ప్రాణాలు పోగొట్టుకోవడం. అక్కడున్న ఆవును నమ్మించి పులికి అప్పచెబుదాం” అంటూ నక్క జిత్తులు వేసింది. ఆడ జింక కూడా ఇలా అన్నది. ఆవు చాలా మంచిది. నువ్వు అడిగితే ఒప్పుకుంటుంది.
మగ జింక స్పష్టంగా చెప్పింది. నేను మోసం మాత్రం చేయను. నేను పులికి ఆహరంగా వెళతాను. లేదంటే నా బిడ్డను ఆహారంగా ఇచ్చేస్తాను. మరొకరిని బలి చేయటం తప్పు .
అప్పుడే అటుగా పులి వెళుతున్నది. ఏమిటో మాట్లాడుకుంటున్నారు. అని చూసి ఆగింది “ఏమైంది జింకలూ! అలా విచారంగా ఉన్నారు.” అని అడిగింది జింకలు రెండింటికీ ఒళ్ళు మండి పోయింది. మా బిడ్డను ఎత్తుకు పోయింది కాక ఏమీ తెలియనట్లు ఎంత బాగా నటిస్తుందో అని మనసులో అనుకున్నాయి.
అదేమిటి పులి మామా! “నా బిడ్డను ఎత్తుకుపోయి పెద్ద జంతువును తెచ్చి ఇస్తే వదిలి పెడతానన్నావట కదా! మళ్ళీ ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుతున్నావు. నీకు ఆకలేస్తే నా పసి బిడ్డే కావలసి వచ్చిందా” అంటూ జింకలు ఆవేశంగా అడిగాయి.
“పులికి ఏమీ అర్ధం కాలేదు. ఏం మాట్లాడుతున్నారు. ఏదో బాధ పడుతున్నారని పలకరిస్తే నా మీదే నిందలు వేస్తారా? ఏమైంది మీకు అసలు విషయం వివరంగా చెప్పండి” అని కోపంగా అన్నది.
అప్పటికే నక్కకు చెమటలు పోస్తున్నాయి. తన గుట్టు బయట పడుతుందేమో అనే భయం మొదలయింది. మెల్లగా పారి పోదామని నిర్ణయించుకున్నది.
జింకలు విషయమంతా వివరించాయి. పులికి చాలా కోపం వచ్చింది. “నేను తినాలనుకుంటే తింటాను అంతే గానీ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఆహారం సంపాందించుకోను. అది నా జాతికే అవమానం. నక్కా! నువ్వు నా పరువు తీసే పనిలో ఉన్నావు. నీ సంగతి మృగరాజు దగ్గర తేల్చుకుంటాను. ఇలాంటి పనులు ఇంకోసారి చెయ్యకు. జింకల బిడ్డను నువ్వే ఎత్తుకుపోయినావు కదా! నీవు తీసుకెళ్ళి నా పేరు ఎందుకు చెప్పావు” అంటూ ఆగ్రహంగా ప్రశ్నించింది.
నక్క ఇరకాటంలో పడింది ఏదో చెప్పబోయింది. పులి గాండ్రించగానే నక్క వణికిపోయింది “నేనే తీసుకు వెళ్ళాను క్షమించండి. పెద్ద జంతువుని తిందామని ఆశపడ్డాను. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయను అంటూ దణ్ణం పెట్టింది.
ఏమ్ నక్కా! ముందు నా బిడ్డను తీసుకురా. ఎక్కడ దాచావో చూపించు అని గట్టిగా అడిగింది ఆడజింక. నక్క వణుక్కుంటూ దాచిన జింక పిల్లను తెచ్చింది. పిల్లను చూడగానే జింకలు రెండూ ఆనందంతో బిడ్డను దగ్గరకు తీసుకున్నాయి.
పులి మాత్రం నక్కను వదలలేదు. నక్కను పట్టుకొని సింహారాజు దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం నక్కను శిక్షించింది.
*****
