
స్వర కోకిలకు నివాళి!
– గోపరాజు వెంకట సూర్యనారాయణ
తెలుగునేల గున్నమామిడి కొమ్మపై,
సరిగమల స్వరాలను మేటిగా కూసిన
మధుర గాయిని గాన కోకిల జానకమ్మ!
నాద స్వరంతో జత కలిపిన గాత్రం!
నీలి మేఘాలలో గాలి కెరటాలలో,
లీనమై పాటగా పల్లవించిన గళం!
పగలే వెన్నెల అనుభవాలను కురిపించి
జగాన్నే ఊయల లూగించిన గానం!!
‘ సిరిమల్లె పువ్వా! చిన్నారి చిలకమ్మా! ’ యంటూ,
పదహారేళ్ళ చిలిపి తలపు లాలపించినా,
‘మౌనమేలనోయీ మరపురాని రేయి’ యని
మార్దవంగా మోహ పరవశంగా పాడినా,
‘ మనసా! త్రుళ్లి పడకే ’ అంటూ,
పడుచు వలపు తలపులోలికించినా,
‘ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు ‘
అని ప్రేమలేఖ భావాన్ని పలికించినా,
‘ ఆకాశంలో ఆశల హరివిల్లు ‘ అంటూ,
కన్నెవయసు హుషారును మేళవించినా,
‘ నరుడా ఓనరుడా ఏమి కోరిక ‘ అంటూ,
కొంటె కవ్వింపుల శృంగార మొలికించినా,
‘ ఈ దుర్యోధన దుస్సాసన దుర్వినీతి పర్వంలో ‘
యని వేదనాభరిత భావాన్ని ప్రభవించినా,
‘ గోవుల్లు తెల్లన! గోపయ్య నల్లన! ఎందువలన? ‘ పాటలో,
పసివాని ముద్దుమాటల స్వరవిన్యాసం చేసినా,
పాడే స్వరంలో ముసలి గొంతు వణుకుతో మరపించినా,
గానకోకిల వైవిధ్య వైదుష్య భరిత గాన పాటవానికే చెల్లు!
ఆమె పాటలెన్నో బహుముఖ ప్రజ్ఞకు గీటురాళ్లు!
వేనవేల పాటల్లో ఆమె గాన మాధుర్యం నిక్షిప్తం!
ఆమె పాట పాడేటప్పుడు నిశ్చల స్థాణువు!
ఆమె గళం పలికే స్వరమాధుర్యం వేణువు!
అర్ధ శతాబ్దంపైగా వివిధ భాషల్లో వేలకొద్దీ,
పాటలు పాడిన మేటి దిగ్గజ గాయనీమణి!
ప్రముఖ గాయనిగా ప్రకాశించిన ధ్రువతార!
ఆమె మరణం సినీ జగత్తుకు తీరని లోటు!
ఆమె చిరునవ్వుమోము ఇక ఒక జ్ఞాపకమే!
ఆమె పాటల మధురాలు అజరామరాలే!!
*****

గోపరాజు వెంకట సూర్యనారాయణ తల్లిదండ్రులు శ్రీ గోపరాజు కృష్ణమూర్తి, శ్రీ మతి అనసూయ. కూకట్ పల్లి, హైదరాబాదు నివాసం.
వృత్తి రీత్యా, M.Tech. Machine design చదివి, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి, డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును. ఆ తర్వాత, విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో, డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.
స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కధలంటే బాగా ఇష్టపడతాను. ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత, స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల పత్రికా సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కధలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!
