
స్వరాజ్య ప్రకాశం..
(నెచ్చెలి-2026 కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)
– సురేష్ బాబు
వెన్నెల జలపాతం నింగి నుంచి జాలువారుతున్నట్టు రేయి ప్రకాశిస్తోంది. సమయం సరిగ్గా రాత్రి ఏడు గంటలు. తణుకు వెళ్లడానికి ఏలూరు బస్టాండ్ వద్ద వేచి ఉన్నాను. ఏలూరు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. భాషంటే మమకారం, విద్యార్థులంటే బాధ్యతతో కూడిన ఇష్టం. అందుకే సాహిత్యంతో పాటు జీవితంలో అనుభూతుల, విలువల సాన్నిహిత్యపు అవసరాన్ని వివరిస్తుంటాను.రోజూలాగే సాయంత్రం ఐదు గంటలకే పాఠశాలమూసివేసినా, పాత మిత్రుడైన ఆనందం ఏలూరులోనే ఉన్నాడని తెలుసుకొని ఇంటికి వెళ్లి పలకరించి వస్తున్నాను. తాను నాకు డిగ్రీలో సహాధ్యాయి. కవి మిత్రుడు కూడా. నేను ఎంత గుంభనగా ఉంటానో తాను అంత సరదా మనిషి. అందుకే బహుశా అరమరికలు లేకుండా గంటలకొద్దీ మాట్లాడుకునేవాళ్ళం. ఇంటి వద్ద నన్ను చూడగానే “ ఏరా ప్రకాశం , ఎలా ఉన్నావురా, అసలు మనిషి ఊసే లేకుండా పోయావు , ఈ జనారణ్యంలో తప్పిపోయావేమో అని కంగారుపడ్డాను. మొత్తానికి బతికే వున్నావ్ఇంకేంటి కబుర్లు” అంటూపలకరించాడు .
“ఏలూరు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పలుకులు చెప్పుకుంటూ బతుకుతున్నాను .తణుకులో సొంతింటిలోఅమ్మానానాన్నతో కలిసి కాపురం ఉంటున్నాను. నా భార్య పేరు సుశీల. తనది తాడేపల్లిగూడెం. మా మేనత్త గారి మూడో అమ్మాయి.”నా ప్రస్తుత కాలరూప పరిస్థితిని విశదపరిచాను.కబుర్లన్నీ అవగానే మిత్రుడైన ఆనందం దగ్గర సెలవు తీసుకుని బస్టాండ్ దగ్గర వేచి ఉన్నాను.
సమయం ఏడయ్యింది. సూర్యుడు మనదనుకునే ఆకాశాన్ని వదిలి సంధ్య దారిలో ఎప్పుడో వేరే కొమ్మ మీద వాలినట్టున్నాడు. వెన్నెల జలపాతం వెలుగులు చిమ్ముతూ ఆ రేయి ప్రకాశిస్తోంది . ఇంతలో నా చూపు అటుగా వచ్చిన ఒక నీలవేణి మీద పడింది ఎక్కడో చూసిన గుర్తు.ఆనందాన్ని చూసినప్పుడు కలిగిన అనుభూతే ఇప్పుడూ కలుగుతోంది. మెల్లగా కాలేజీ రోజులు గుర్తుకు రాసాగాయి. తన పేరు స్వరాజ్యం. ఎవరితోనూ అంతగా మాట్లాడని ఒక మౌని. మేమందరం మగవాళ్ళం కాబట్టి ఒక గుంపుగా ఉండి చలోక్తులతో, ప్రపంచ చరిత్ర విషయాల మీద ఎంతో ఆసక్తికరమైన చర్చలుగా సాగుతుండే వాళ్ళం అందుకే ఆమె గురించి అట్టే తెలియదు కానీ ఆమె కళ్ళలో మాత్రం ఎన్నో భావాలు. ఎప్పటికప్పుడు నవోన్మేష ఊహాలను నింపుకుని కనికట్టు చేస్తుండేవి . స్త్రీ అంటే ప్రబంధ కవులు వర్ణించే దేహసౌందర్యంగా నేనెప్పుడూ చూడలేదు. ఏ స్త్రీ అయినా జన్మాంతరాలు దాటి పలకరించడానికొచ్చిన స్నేహితంగా భావిస్తాను.లాలిత్యం , ఆమె జన్మతః పొందిన వరమేమోనని భావించేవాడిని . సరిగ్గా అవే భావ సంచలనాలు ఇప్పుడు కూడా.వయసుపిల్లలా వేళ్ళతో ముంగురులను ఆడిస్తున్న తనను చూసి ముచ్చటేస్తోంది. కానీ తప్పుగా భావిస్తుందేమో అన్న భయం ఉంది. అందుకే ఆ నగుమోము నవ చంద్రికను అలా కళ్ళార్పకుండా చూస్తుండిపోయాను. ఇంతలో తణుకు బస్సు రానే వచ్చింది. జనాలందరూ ఒక్కొక్కరుగా ఎక్కి కూర్చొన్నారు. నా సీటు వరుసలోనే అటువైపుతనది.తను అలా కిటికీలోంచి చూస్తుంటే చేరవలసిన తీరాలు చాలా ఉన్నట్టు అనిపించింది. ఇంతలో బస్సు కదిలింది. అందరం ప్రయాణికులమే. దారంట జ్ఞాపకాలను నెమరుకుంటూ, తలపులను తడుపుకుంటూ, తాత్కాలిక సాహచర్యాన్ని స్వాగతిస్తూ,అన్నింటినీ ముడివేసుకుంటూబస్సు నిదానంగా సాగుతోంది. కానీ నా చూపులు మాత్రం నిండు చందమామ నుంచి చంద్రకిరణాలను తాగుతున్న చకోరాన్ని గుర్తుచేస్తున్నాయి. ఇంతలో ఆమె ఈ లోకానికి వచ్చినట్టుగా ధ్యానం భగ్నమై నా వైపు చూసింది ఆ చూపులో లాలిత్యం, ఆ వదనంలో ప్రశాంతత, ఆ మనిషిలో నిండుతనం నా మనసు నాతో మాట్లాడేలా చేస్తున్నాయి.జన్మలు ముడిపడే క్షణాలు ఇలానే ఉంటాయేమో అనేంతలా భావావేశం నన్ను అలుముకుంది. నాలో చలనం లేదు. అప్పటికి నేనొక పాషాణాన్ని. నన్ను స్వర్ణమయంచేస్తున్న పరుసవేదితను. తన సొగసు కళ్ళతోపెదవంచులోంచి ఒక చిన్న మెరుపు నా గుండెను తాకింది. మీరు ప్రకాశం గారు కదా. అంతే జన్మాంతర రహస్యాలన్నీవిచ్ఛిన్నమై,నిద్రాణమైన అహల్య, రామునిపదస్పర్శకు నిందను బాపుకుని ప్రాణం తెచ్చుకున్నట్టు “అవునండి. మీరు స్వరాజ్యం గారే కదా”అని లోగొంతుకలోని చైతన్యాన్ని పెదాల మీద ప్రసరించుకున్నాను. ఆమె అంది “ఎలా ఉన్నారండి ఇప్పుడు. ఎంతో చలాకీగా ఉండేవారు. ఏం చేస్తున్నారు”. నా గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి నా ప్రస్తుత కాలస్థితిని తెలుపుకుని అలా చూస్తుండిపోయాను. మేము సహాధ్యాయులుగా ఉన్నప్పుడు మాకు జాతి మత కుల భేదాలు ఏమీ లేవు. మాదో ప్రపంచం. ఆ ప్రపంచంలో మేము మాత్రమే సర్వాధికారాలు అనుభవించే పౌరులం. స్వరాజ్యం తన గురించి చెప్పుకుంది కాలేజీ చదువు అయిపోగానే తనకు తన బావతో వివాహం అయింది. వివాహమైన మొదటి ఏడే తను పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన భర్తకు మిలటరీలో ఉద్యోగం రావడంతో బిడ్డను తనకు వదిలేసి తను మిలటరీలో చేరిపోయాడు . దురదృష్టవశాత్తు, పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందాడు. అప్పటినుంచి తన భర్త పెన్షన్ మీద, తను ఇంట్లో ఏర్పరచుకున్న చిన్న ట్యూషన్ మీద ఆధారపడి జీవిస్తోంది. తనుండేది తాడేపల్లిగూడెం.తన అన్నగారికి ఏలూరులో జరిగిన అపెండిక్స్ ఆపరేషన్ తర్వాత పరామర్శించేందుకు వచ్చి వెళుతోంది. తన దురదృష్టానికి మనసులోనే చింతించాను కానీ అంత వేదనున్న ఆమెలో ఏమాత్రమైనా అశాంతి గాని బాధ కానీ నాకు కనీసం సూచనప్రాయంగా కూడా కనపడలేదు.
పది నిమిషాలు మా సంభాషణ తర్వాత ఒక ప్రశాంతత, ఒక నిశ్శబ్దం. ఇద్దరం నిశ్శబ్దంలో కొన్ని జన్మల పాటు ప్రయాణం చేశాం. బస్సు భీమడోలు దాటింది. ఇంతలో సన్నగా వాన మొదలయ్యింది అందరూ బస్సు కిటికీలు మూసివేస్తున్నారు. కానీ స్వరాజ్య౦ దగ్గర కిటికీ స్తంభించిపోయింది. ఆ వర్షం తాకిడికి తను మాత్రం ఆ చిరుజల్లులు చేతిలో ఆడించుకుంటూ చిన్నపిల్లలా సంబరపడుతోంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే నాకు నా తల్లి, నా భార్య, నా బిడ్డ ముగ్గురూ మూర్తీభవించిన రూపం కదలాడుతోంది. అదే స్త్రీత్వం. ఆమె పేరు స్వరాజ్యం. ఆమె మనస్సు స్వాతంత్రయం. ఆమె బుద్ధి స్వేచ్ఛ. ఆమెకు కావలసింది ఇప్పుడు రెక్కలు. మౌనంగా నాలో నిద్రాణమైన ఏ కవో నా మనసులో తాండవిస్తున్నాడు. సమాజ సీమలు దాటి నృత్యం చేస్తున్నాడు. ఆమె అల్లరిని చూసి నాలో పసితనం కమ్ముకుంది. అయినా పెద్ద మనిషినే కదా. “ రాజ్యం గారు ఏమిటండీ మీరు,జలుబు చేస్తుందేమో ఇలా వచ్చి కూర్చోండి”అని చనువు తీసుకున్నాను. శివుడి జటాజూటంలోకి సుర గంగ పరవళ్ళు తొక్కుకుంటూ వచ్చి ఒద్దికిగా కుదురుకున్నట్టు ఆవిడ నా పక్కన వచ్చి కూర్చుంది ఆ పరవశాన్ని వర్ణించడానికి ఎన్ని వసంతాలు సరిపోతాయో. ఒకరికొకరం కళ్ళలోకి అనిర్వచనీయమైన అలౌకికమైన ఆనందాన్ని సరఫరా చేసుకున్నాం. ఎంతటి మంచి మనుషులైనానెత్తుటి దేహాలతో సమాజ౦ ఆడుకుంటున్న బొమ్మలమే కదా . అడిగాను జీవితాన్ని ఎలా నిర్ణయించుకున్నారని.
‘ ఏముందండి ఆయన గారి పెన్షన్ వస్తుంది. ట్యూషన్ బాగా నడుస్తోంది. పిల్లను చదివించుకుంటాను. తన కాళ్ళ మీద నిలబడే అవకాశాన్ని కల్పిస్తాను. వ్యక్తిత్వంలో ఎప్పుడూ తగ్గవద్దని నేర్పిస్తాను. నాకు లేని రెక్కలు తనకు మొలిస్తే చూసి ఆనందిస్తాను.” ఆ క్షణం ఆమెలో ఒక నిండైన సముద్రాన్ని చూశాను. సముద్రం ఆటుపోట్లకు కొత్త కాదు. తుఫానులకు కొత్త కాదు. కానీ తన చలన సూత్రాన్ని మరచి ఏనాడు స్తంభించలేదు. ఈమె కూడా అంతే. తనొక ప్రవాహం ఆ ప్రవాహంలో అన్నిటిని కలిపేసుకుంటుంది. ఆ ప్రవాహం మరింత స్వచ్ఛంగా ఉండేందుకు అహరహం తనలో చైతన్యాన్ని నింపు కుంటుంది. ఆమె పాదాలవంకచూసాను. చరిత్ర పుటలన్నీ అక్కడే ఆగిపోయి భవిష్యత్తును నిర్దేశించే సాక్షి సంతకాలుగా కనిపించాయి.“సరే నీ జీవితం గురించి ఇంకేం ఆలోచించావు”అని మళ్ళీ అడిగాను.
ఆమె సూటిగా నా కళ్ళలోకి చూసింది. ఆ చూపు రాముడు విశ్వామిత్రుని యాగ రక్షణ కోసం వెళ్లి దిగ్విజయంగా పూర్తి చేసుకుని మిథిలానగరి వీధులలో నడుస్తున్నప్పుడు రాజభవంతి నుంచి సీత చూసిన చూపులా అనిపించింది. తను నన్ను నమ్మిందని తెలుసు. తను ప్రకృతి తను ఇస్తుంది తీసుకోదు. అందుకే నా చేతిలోకి తన చేతిని తీసుకొని నమ్మకం అనే సూత్రాన్ని కట్టాను. విచ్చుకున్న తన పెదాలలో ఒక హృద్యమైన బంధాన్ని రచించాను. ఆమె ఇలా అంది.
“ప్రకాశం గారు మీరు ఏదో ఒక నమ్మకాన్ని నాలో కలిగించాలని చూస్తున్నారు కానీ నా మీద నాకు నమ్మకం ఉందండి.మీ గురించి నాకు తెలుసు. మీరంతా సహృదయులు, సౌశీల్యురు.అది నేను మీతో కలిసి చదువుకున్న మూడు సంవత్సరాల కాలంలో తెలుసుకున్నాను. జీవితం ఎవరి తీరాన్ని ఏ విధంగా నిర్ణయిస్తుందో, ఏ పడవ ఎటు చేరాలో, ఎవరి గమనంలో ఏ తుఫానులు రాసి ఉంటాయో ఎవరికీ తెలియనప్పుడు గమనాన్ని ఆస్వాదిస్తూ సాగడమే మనం చేయగలిగిన పని. మీ హృదయ వైశాల్యాన్ని నా సంకుచితత్వంతో తగ్గించలేను. నేను ఒంటరిదాన్ని కాదు నా జీవితంలో ఒక చిన్న గులాబీ మొక్కను నాటుకున్నాను అది నవ్వినప్పుడు నన్ను చూసుకుంటున్నాను. నా పెరట్లో అలాంటి నవ్వులు ఉన్న మొక్కలని సాకుతున్నాను. వెన్నెలతో నాకెన్ని అనుభవాలో చెప్పనా. సాయంత్రం గాలులు నా చుట్టూ చేరి చేసే అల్లరిని వివరించనా . నా వద్దకు ట్యూషన్ కి వచ్చే నా స్నేహితాల ముద్దుముద్దు మాటలతో నా పొద్దు ఎప్పటికప్పుడు గుర్తుకురానంతగా గడిచిపోతోంది తెలుసా.” ఇంతలో బస్సు తాడేపల్లిగూడెం రావడంతో “విధి మళ్ళీ మనల్ని పరిచయం చేసే అవకాశం రావాలని కొరుకుంటున్నా, ఇప్పటికి మీ హృదయం వద్ద సెలవు తీసుకుంటున్నా”అనిబస్సు దిగి వెళ్ళిపోయింది.
ప్రకాశం మనసు కొద్దిగా నొచ్చుకుంది. సిగ్గు కూడా వేసింది. కానీఎందుకో ఆమె దగ్గర పెద్దరికం అడ్డు రాలేదు.సమాజపుబంధనాలు కనుచూపుమేరలో కనపడలేదు. పువ్వు వాసన తోటంతా పరిమళిస్తుం దన్నట్టు ఆమె గాలి ఏదో కనికట్టు చేసిందని సమాధానపడ్డాడు. తణుకు రాగానే బస్సు దిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన చాలా రోజులకి యథాలాపంగా తను స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పి,తరగతి ముగియగానే గదిలో తన కుర్చీలో విశ్రాంతి తీసుకుంటుండగా, ప్రధాన ఉపాధ్యాయుడు “తన పేరు స్వరాజ్యం అండి తనది తాడేపల్లిగూడెం మన స్కూల్లో కొత్తగా సాంఘిక ఉపాధ్యాయురాలిగా నియమితు లయ్యారు”అనిపరిచయం చేశాడు.
గుండెలో గుడిగంటలు మోగుతున్నప్పుడు కంటికి ఎదురుగా దేవత కళ్ళు తెరిచి శుభమని పలుకుతున్నట్టు ఆమె ముఖంలో నవ్వు చూశాను.
*****

నా పేరు సురేశ్ . నేను 1. విస్మృతి గానం 2. కెరటం నన్ను ఆవహించింది అనే కవితా సంపుటాలను రచించాను
వృత్తి రీత్యా ఆ. ప్ర ప్రభుత్వంలో సహాయ విద్యుత్ తనిఖీ అధికారిగా పనిచేస్తున్నాను
