మా నాయనమ్మ కథలు-4

మొగుడూ – మొబైలూ

-లక్ష్మిమదన్

“ఏవండీ! కాఫీ తాగుతారా? టీ తాగుతారా?” అడిగింది పార్వతి.

మొబైల్ చూస్తూ బిజీగా ఉన్నా గంగాధర్ ఏమీ జవాబు ఇవ్వలేదు.

దగ్గరకొచ్చి గట్టిగా అరిచింది..

“ఏంటి ఇక్కడ టిఫిన్ పెడితే తినలేదా?”అన్నది కోపంగా.

గంగాధర్ ఒక్కసారిగా పార్వతి వైపు చూసి ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయాడు.

ఇక అసలు విషయం గుర్తొచ్చి లోపలికి వెళ్లి మొబైల్ తీసుకుని గంగాధర్ కు ఫోన్ చేసింది. వెంటనే ఫోన్ ఎత్తాడు.

“ఏంటి పార్వతి” అని అడిగాడు మృదువుగా..

నా కర్మ కర్మ అని పళ్ళు నూరుకుంటూ..

“అక్కడ టేబుల్ మీద ఇడ్లీ పెట్టాను తినండి! ఇడ్లీ తిన్న తర్వాత టీ తాగుతారా? కాఫీ తాగుతారా?”అని అడిగింది కోపాన్ని అణచుకొని..

“ఓ ఇడ్లీలు పెట్టావా? మరి అప్పుడే ఫోన్ చేసి చెప్పలేదు ఎందుకు? సరే నువ్వు అడిగిన రెండవ ప్రశ్నకు మళ్ళీ ఫోన్ చేస్తే చెప్తాను” అంటూ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని తినసాగాడు.

పార్వతికి కోపం మామూలుగా రావడం లేదు. చక్కగా రిటైర్ అయిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేయడం కాఫీ తాగడమో చేద్దాం అనుకుంటే.. ఆ దిక్కుమాలిన ఫోన్ పట్టుకొని వదలడం లేదు. ఏది అడగాలన్నా ఫోన్లో అడగాల్సి వస్తుంది”అంటూ తల బాదుకుంది.

గంగాధర్ నిజాయితీ, బాధ్యతగల ఉద్యోగి. ఉద్యోగం చేసినన్ని రోజులు ఆఫీసు పని తప్ప దేనిమీద ధ్యాస ఉండేది కాదు. చివరికి భార్య పిల్లల పేర్లు కూడా మర్చి పోయేవాడు.

ఒకసారి భార్య పిల్లలతో కలిసి ఆఫీసు వాళ్ళు భోజనానికి పిలిస్తే వెళ్లాడు. వెళ్లినప్పటి నుండి ఆఫీసు విషయాలే మాట్లాడసాగాడు. ఆ ఆఫీసర్ భార్య వచ్చి..

“ఇక్కడ కూడా ఆఫీస్ విషయాలేనా? కాస్త అందరం మామూలు విషయాలు మాట్లాడుకుందాం!”అన్నది.

పార్వతికి కూడా మనసులో అదే ఉంది. కానీ గంగాధర్ తను చెప్తే అసలు వినడు. ఆమె ఆ మాట అన్న తర్వాత హమ్మయ్య అని మనసులో అనుకుంది.

ఆ ఆఫీసర్ గంగాధర్ ను అడిగాడు..

“గంగాధర్! పిల్లలు చక్కగా ఉన్నారయ్యా వాళ్ల పేర్లు ఏంటి! ఏం చదువుతున్నారు?”అన్నాడు.

“వీడి పేరు పేరు…”అంటూ నసుగుతుంటే పక్కనుండి పార్వతి మెల్లగా పేరు అందించింది.

చదువు గురించి అడుగుతే అసలు సంబంధం లేని క్లాస్ చెప్పాడు. పార్వతికి తల తీసేసినట్లు అనిపించింది.

ఇంటికి వచ్చాక గంగాధర్ తో పెద్ద గొడవే పెట్టుకుంది. నీ పిల్లల పేర్లు, చదువులు మరిచిపోతే ఇంకెందుకు? అసలు మేము కాకుండా ఇంకా వేరే కుటుంబం ఉందా ఏంటి నీకు? నాకు అదే అనుమానంగా ఉంది. చివరికి మన పనిమనిషి ముందు కూడా నా పేరు పార్వతి అయితే సరస్వతి అని పిలిచావు”అంటూ ముక్కు చీదుతూ ఏడవ సాగింది.

ఇదేమీ అర్థం కాని పిల్లలు వాళ్ళ ఆటల ధ్యాసలో వాళ్లు ఉన్నారు.

అసలు ఏ పని చెప్పినా కూడా ఒకటి చెప్తే ఒకటి చేసేవాడు. లిస్టు రాసిస్తే ఆ లిస్టు ఎక్కడో పడేసి అవసరం ఉన్నవి మానేసి అవసరం లేని తెచ్చేవాడు.

ఒకసారి పార్వతి 25 కిలోల బియ్యం 5 కిలోల కందిపప్పు తీసుకొని రమ్మని చెప్తే..

5 కిలోల బియ్యం 25 కిలోల కందిపప్పు తెచ్చాడు. అది కూడా టూర్ వెళ్లి వస్తూ మధ్యలో కొన్నాడు కనీసం వాపస్ ఇవ్వడానికి కూడా వీల్లేదు.

“ఉన్నది నలుగురం 25 కిలోల కందిపప్పు నేను నెత్తిలో పోసు కోవాలా?”అంటూ గుడ్లు ఉరిమి చూసింది.

అవేమీ పట్టించుకోని గంగాధర్..

“నేను నీకు ముందే చెప్పాను. ఇలాంటి పనులు నాకు గుర్తుండవు. ఆఫీసు పనులు బోలెడు ఉంటాయని! అయినా నువ్వు వెళ్లి తెచ్చుకోవచ్చు కదా”అన్నాడు కోపంగా..

“కూరగాయలు ఇంకా మిగతా సామాన్లన్నీ నేనే తెచ్చు కుంటున్నాను. బియ్యం, పప్పులు మాత్రమే మీకు చెప్పాను. అది కూడా ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుందని! ఈ రెండు పనులు కూడా చేయకుంటే ఎందుకండీ! రేపు ఆఫీసు వాళ్ళు మీకు సన్మానం చేసి కిరీటం ఏం పెట్టరు! ఎంత ఎక్కువ పని చేసినా, అదే జీతం ఇస్తారు! మమ్మల్ని కూడా మరిచిపోయి ఆఫీస్కు ఊడిగం చేస్తున్నారు”అంటూ అరిచింది.

ఇవన్నీ ఏమీ వినకుండా టీవీ చూస్తూ కూర్చున్నాడు గంగాధర్.

అది కూడా ఎప్పుడు న్యూస్ ఛానల్ మాత్రమే పెట్టుకుంటాడు. విన్న వార్తలే వినడం. ఓ ఛానల్ లో వార్తలు అయిపోతే మరొక ఛానల్ కి వెళ్లడం.. ఇంతే తప్ప ఒక సినిమా కానీ పాటలు కానీ ఏవి ఇష్టమే ఉండదు.

ఎన్నోసార్లు బ్రతిమిలాడితే సినిమాకు తీసు కెళ్లేవాడు. అది కూడా కష్టంగా వచ్చేవాడు.

సీట్లో కూర్చొని సినిమా మొదలు కాగానే ఇక రన్నింగ్ కామెంట్రీ మొదలు పెట్టేవాడు..

సినిమానా ఇది! దరిద్రం సినిమా వాడేంటి అలా ఉన్నాడు!ఏమిటి హీరోయిన్ అలా ఉంది”ఇలా కామెంట్రీ మొదలయ్యేది.

సినిమా చూడటం కన్నా ఇంట్లో ఉండటమే హాయి భగవంతుడా అనిపించేలా చేసేవాడు. ఇలా కామెంట్రీ పెట్టి కాసేపటికి నిద్ర పోయేవాడు.

టికెట్ వేస్ట్ అయితే అయింది ఆయన నిద్ర పోవడమే బాగుంది అనుకునేది పార్వతి.

దురదృష్ట వశాత్తూ సినిమా మొత్తం ఆయన చూసి ,ఒకవేళ ఆ సినిమా బాగా లేకుంటే..

ఆ సినిమా డైరెక్ట్ చేసింది పార్వతి అన్నంతగా తిట్టేవాడు. ఇంటికి వచ్చేవరకు ఆ తిట్ల పురాణం కొనసాగేది.

పార్వతి కర్మానికి ఇంటికి వచ్చేవరకు ఇంటి ముందు చుట్టాల మంద ఎదురుచూస్తూ కూర్చునేది. మొబైల్ ఫోన్లు లేని కాలం అది.

సినిమాతో కొంత తలనొప్పి తెచ్చుకుంటే, భర్త తిట్లకు మరింత తలనొప్పి పెరిగి ఈ చుట్టాల మందను చూసిన తర్వాత తల పగిలిపోయేది.

ఇంట్లోకి వచ్చి చచ్చినట్లు వంట చేసి అందరికీ వడ్డించి పడుకునే వరకు 12 దాటేది.

అసలు సినిమా జోలికి పోవద్దు అనుకునేది. కానీ మానవ నైజం కదా! ఎప్పుడైనా మళ్లీ చూడాలి అనిపించేది.

ఉద్యోగం చేసినన్ని రోజులు అతని ప్రవర్తన అలా ఉండేది.

ఇక రిటైర్ అయ్యాడు సంతోషంగా ఏ యాత్రలో సాయంత్రాలు ఏ సినిమాకో పోవచ్చు అనుకుంటే, ఇలా మొబైల్కు అడిక్ట్ అయిపోయాడు.

అందులో పిల్లలు పెళ్లిళ్లు అయి ఉద్యోగాల పేరుతో దూరంగా ఉంటున్నారు. హాయిగా ఉందా మనుకుంటే గంగాధర్ ఇలా తయారయ్యాడు.

కాసేపయ్యాక మళ్ళీ ఫోన్ చేసింది పార్వతి.

“టీ తాగుతారా! కాఫీ నా?”అన్నది.

“ఏదో ఒకటి తీసుకొని రా! అయినా నాకు టిఫిన్ పెట్టలేదు ఏంటి” అన్నాడు.

“కాస్త కళ్ళు కిందికి చూడండి! టిఫిన్ ప్లేట్ కనిపిస్తుంది”అన్నది.

“అవును తింటున్నాను. దోస పేపర్ లా ఉంది ఏంటి?”అన్నాడు.

“దోస ఎక్కడినుండి వచ్చింది? నేను పెట్టింది ఇడ్లీ కదా”అంటూ కంగారుగా బయటకు వచ్చింది.

గంగాధర్ మొబైల్ చూసుకుంటూ న్యూస్ పేపరు చట్నీలో అద్దు కుంటూ నోట్లో పెట్టుకుంటున్నాడు.

పార్వతికి ఏం చేయాలో అర్థం కాలేదు.

దగ్గరికి వచ్చి ఆ పేపర్ లాక్కొని బయట పడేసి ఇడ్లీ ప్లేట్ ను గట్టిగా అతని ముందుకు జరిపింది.

మళ్లీ ఫోన్ చేసి “ఈసారి ఇడ్లీ ఉంది తినండి “అని చెప్పింది.

ఇలా ప్రతి విషయానికి ఫోన్లో చెప్పడం తలనొప్పి అయిపోయింది.

ఇంతలో పక్కింటి సీతా లక్ష్మి ఫోన్ చేసింది.

“ఏం చేస్తున్నావ్ పార్వతి! పక్క పక్కనే ఉన్నాం కానీ కలుసుకోవడం కూడా కుదరడం లేదు”అన్నది.

“ఏం చెప్పను సీతా నా కష్టాలు.. ఆయన రిటైర్ అయినప్పటి నుండి ఇలా చేస్తున్నాడు”అంటూ వివరంగా అన్ని చెప్పింది.

“బాగానే ఉంది సంబరం. డోలు వెళ్లి మద్దెలకు చెప్పిందట.. నా పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. అందులో ఈ మధ్య పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు నీతో మాట్లాడదా మంటే కూడా కుదరలేదు”అంటూ తన కష్టాలు చెప్పుకుంది.

“మరి దీనికి పరిష్కారం లేదా?”అన్నది పార్వతి.

“ఇన్ని రోజులు ఆఫీసు పనుల వల్ల అదే లోకంలో ఉన్నారు. ఇప్పుడు మొబైల్ దొరికేసరికి వారికి కొత్త ప్రపంచం చూసినట్లు అనిపించింది. కానీ కొన్ని రోజులు ఎంజాయ్ చేయని! తర్వాత వాళ్లే దారికి వస్తారు”అన్నది సీతాలక్ష్మి.

ఒకరోజు కూతురు పిల్లలను తీసుకొని వచ్చింది. పిల్లలతో కూడా ఏదో ముక్తసరిగా మాట్లాడి మళ్లీ అదే ఫోన్ పట్టుకుని కూర్చున్నాడు. పిల్లల కూడా తాతతో ఏదైనా మాట్లాడాలంటే ఫోన్లోనే అనే విషయం అర్థమైంది.

చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే బాత్రూంలోకి వెళ్లినా ఫోన్ తీసుకొని వెళ్లేవాడు.

ఒకరోజు పొరపాటున మొబైల్ టాయిలెట్ లో పడిపోయింది. మళ్లీ కొత్త ఫోన్ కొనే వరకు పిచ్చి పట్టిన వాడిలాగా ప్రవర్తించాడు.

చివరికి సీతాలక్ష్మి, పార్వతీ కలిసి ఒక ఉపాయం ఆలోచించారు.

ఓ రోజు పొద్దున్నే ఫోన్ పట్టుకొని కూర్చున్న గంగాధర్ కి ఒక ఫోన్ వచ్చింది.

“మీ పేరు గంగాధర్ కదా!”అన్నది అవతల గొంతు.

“అవును”అని చెప్పాడు.

“మీరు మొన్న రిటైర్ అయ్యారు కదా! మీ మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఆఫీసుల్లో అమ్మాయిలని వేధించే వారట! వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు. దీనికి మీ సమాధానం ఏమిటి”అన్నాడు.

“రామ రామ! నేను ఎవరి జోలికి వెళ్లే వాడిని కాదండి. నా పని ఏదో నేను చేసుకునే వాడిని”అన్నాడు కంగారుపడుతూ..

“అదంతా నాకు తెలియదు. రేపు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ ద్వారా నాకు క్లారిటీ దొరక కుంటే ఆ అమ్మాయిని తీసుకొని మీ ఇంటికి వస్తాను”అన్నది అవతలి గొంతు.

ఈ ఫోన్ కాల్ రావడంతో భయపడి పోయాడు గంగాధర్. అసలు ఫోన్ ముట్టు కోవాలంటే భయపడుతున్నాడు.

ఏమీ తెలియనట్లుగా పార్వతి అడిగింది..

“ఏమండీ! మొబైల్ ఛార్జింగ్ పెట్టారా! అసలు ఫోన్ పట్టుకోవడం లేదు”అన్నది.

“ఏమీ లేదులే తలనొప్పి వస్తుంది. నాకు ఏవైనా ఫోన్ కాల్స్ వస్తే నువ్వు ఎత్తు”అన్నాడు ఏమీ తెలియనట్లుగా..

వచ్చే నవ్వును ఆపుకుంటూ “సరే నండీ మీరు రెస్ట్ తీసుకోండి”అని చెప్పింది.

తెల్లవారి ఫోన్లో పార్వతి మాట్లాడింది.

“ఎవరు ఫోన్ చేసింది”అన్నాడు గంగాధర్..

“ఆఫీసు గురించి ఏదో మాట్లాడుతున్నా రండి! మీ గురించి ఏదేదో చెబుతున్నారు నేను గట్టిగా అరిచేశాను”అన్నది.

“అవునా! అసలు నాకు అర్థం కాలేదు పార్వతి”అన్నాడు.

“మీరు ఫోన్ ఎత్త కండి! నేను ఏదో విధంగా మాట్లాడేస్తాను”అన్నది పార్వతి.

అలా కొన్ని రోజులు ఫోన్ నుండి దూరంగా పెట్ట గలిగింది గంగాధర్ ని. అసలే సిన్సియర్గా ఆఫీసు పని చేసుకున్న గంగాధర్ కు బయట ప్రపంచం ఎక్కువగా తెలియదు. నోటి వాటం కూడా లేదు.

పార్వతి ఎలాగైనా మాట్లాడుకొని అని అనుకోని… పుస్తకాలు చదవడం, టీవీ చూడటం అలవాటు చేసుకున్నాడు.

సీత లక్ష్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే జరగడం వల్ల ఆమె భర్త కూడా ఎవరో ఒకరితో కబుర్లు చెప్పుకోవాలని ఆశిస్తూ వీళ్ళింటికి రావడం మొదలుపెట్టాడు. అలా వీళ్ళిద్దరూ స్నేహితులై బయటకు వెళ్లడం, ఏవైనా ఉపయోగమైన పనులు చేయడము చేస్తూ కాలం గడుపు కున్నారు.

సీతలక్ష్మీ ,పార్వతి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

*****

( సశేషం)

Leave a Reply

Your email address will not be published.