
నా జీవన యానంలో- రెండవభాగం- 63
-కె.వరలక్ష్మి
2016 నవంబర్ 8 రాత్రి 9 గంటల న్యూస్ లో హఠాత్తుగా ఒక ఎనౌన్స్ మెంటు విని జనం బిత్తరపోయారు. ఆ రాత్రి 12 నుంచీ 500, 1000 నోట్లు చెల్లవని, కేంద్రప్రభుత్వం నవంబరు 9, 10 తేదీలు బేంకులు బంద్ చేసేసింది. జనంలో కలకలం మొదలైంది.
తిరుపతి నుంచి సాకం నాగరాజు గారు ఫోన్ చేసి పాతికమంది రచయితల కొత్తకథలతో ఒక సంకలనం తేబోతున్నామని, నన్నో కథ పంపమని అడిగేరు, పది రోజుల్లో ‘పుష్పాంజలి’కథ రాసి పంపేను. అప్పటి వరకూ గాంధీ సిరీస్ తో ఉన్న 500, 1000 నోట్ల రద్దు చిల్లరకొరతను, ద్రవ్య సంక్షోభాన్ని సృష్టించింది, బేంకులు, ATM ల దగ్గర పొడవైన క్యూలు, నగదు తీసుకోవడంలో జనం పడిన ఇబ్బందులు, రోజువారీ లావాదేవీలలో మరిన్ని ఇబ్బందులు – వాటిలో కొన్నిపుష్పాంజలి కథలో రాసాను.
ఆ నవంబర్ 23న సంగీత కళానిధి మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారు తన 86 వఏట చెన్నైలో స్వర్గస్థులయ్యారు. నా చిన్నప్పుడు పేపర్లలో చూసిన ఆయన యువ వయసులోని ఫొటోలు, రేడియోలో రోజూ విన్న ఆయన అద్భుతమైన గాత్రం, ఆ గళాన్ని అభిమానించి ఆరాధించడం అన్నీ గుర్తుకొచ్బాయి.
మా ఊరు నుంచి రాజమండ్రి వెళ్లేదారిలో రాజానగరం దాటేక వంద ఎకరాల పైన స్థలం కేటాయించి పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మించి నన్నయ్య యూనివర్సిటీని స్థాపించేరు. అక్కడ నవంబర్ 30న జరిగిన బహుజన సదస్సుకు పిలిస్తే వెళ్లేను. పుట్ల హేమలత, మానస వచ్చారు. రచయిత సలీంకి సన్మానం జరిగింది, 75 రోజులుగా చెన్నై ఆపోలోలో కోమాలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి డిశంబర్ 5న వెంటిలేటర్స్తీసేసి మరణించినట్టు డిక్లేర్ చేసారు. 6 వ తేదీ ఉదయం నంచీ న్యూస్ ఛానల్స్ అన్నీ జయలలిత గురించే కార్యక్రమాలు ప్రసారం చేసాయి, ఆ సాయంకాలం మెరీనా బీచ్ లో MGR స్మారకం పక్కనే అతి విలువైన మంచి గంధం చెక్కపెట్టెలో పట్టు చీరతో పడుకోబెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాంఛనాలతో అంతులేని జనసమూహం మధ్య ఖననం చేసారు. రాష్ట్రపతితో సహా ఎందరో రాజకీయ నాయకులు, సినీజనాలు హాజరయ్యారు. ఈ మధ్యకాలంలో అంత గ్రాండ్ ఫ్యునరల్ ఎవరికీ జరగలేదట.
ఆ సంవత్సరం డిశంబర్ 10 న దాట్ల దేవదానం రాజుగారి కోరిక మేరకు సాహిత్య అకాడమీ కథ – కవిత కార్యక్రమం యానాంలో జరిగింది. నేను 7 AM కి బయలుదేరినా వెంటవెంటనే బస్సులు దొరికినా కాకినాడ, అక్కణ్ణుంచి యానాం చేరేసరికి పదకొండైంది. సభ జరుగుతున్న మహాత్మాగాంధీ హైస్కూలు బస్టాండుకి దగ్గర్లోనే ఉంది, అప్పుడే సభ ప్రారంభమైందట, అక్కడి మినిస్టర్ మల్లాడి కృష్ణారావు, N. గోపి గారు, అకాడమీ కార్యకర్త దేవదానం రాజుగారు స్టేజి పైన ఉన్నారు, వీరలక్ష్మి, చింతకింది శ్రీనివాసరావు, ప్రభు, జి.లక్ష్మి, దాట్ల తమ కథలు చదివేరు. లంచ్ తర్వాత ఎండ్లూరి సుధాకర్ తో పాటు ఎనిమిది మంది కవులు తమ కవిత్వం వినిపించేరు, గోపీగారు నాకు తన ‘ఆకాశంలో మట్టి’‘ఓ కవి స్వీయకథ’పుస్తకాలు ఇచ్చేరు. ఇలాంటి సభల్లో కొందరు అతిశయ ప్రదర్శన చేస్తూ ఉంటారు, చుట్టూ చేరిన వాళ్లు భజన చేస్తూ ఉంటారు. 4.30 కి వీరలక్ష్మి గారు తన కారులో నన్ను కాకినాడ పాతబస్టాండు దగ్గర దిగబెట్టగా, నిండుచూలాల్లాగా వస్తున్న బస్సుల్ని ఎక్కలేక, కాళ్లుపీక్కుపోతూండగా, దోమల్ని కొట్టుకుంటూ నిలబడి, నిలబడి మొత్తానికి 8.30 కి ఒక బస్సు ఎక్కగలిగేను. కండక్టరమ్మాయీ తన సీటు నాకిచ్చి, తను నిలబడి నా ప్రాణం కాపాడింది. ఒకరోజు ‘నామిని’ ఫోన్ చేసి నేను పంపిన పుష్పాంజలి కథ బావుందని ఎందుకు బావుందో కూడా చెప్పేడు, 2016 ఫిబ్రవరిలో ‘పువ్వులు’కథ విశాఖ రేడియోలో ప్రసారమైంది.
2017 జనవరిలో అజో-విభో – కందాళం సభలు పాయకరావు పేట సివార్లలో ఉన్న శ్రీ ప్రకాశ్ స్కూల్లో జరిగాయి. సంస్థవారి పిలుపుమేరకు 5వ తేదీ ఉదయం 10 కి మా ఊళ్లో బస్సెక్కి 11.30 కి చేరుకున్నాను. మధ్యాహ్నం 2 కి ప్రతిమ, గుంటూరు నుంచి కొత్తగా విజయశ్రీ గారు వచ్చారు. ఆఫీస్ రూం పక్కనున్న గెస్ట్ రూం ఇచ్చారు మాకు. శ్రీప్రకాశ్ హాస్టల్లోనే మంచి భోజనాలు,
6వతేదీ జగద్ధాత్రికి ‘సరిలేరు నీకెవ్వరు’పురస్కారం తర్వాత కథానాటికలు జరిగాయి, 7వ తేదీ విశిష్ఠ రంగస్థల ‘సరిలేరు నీకెవ్వరు’పురస్కారం నటుల్ని ట్రైనప్ చేస్తున్న వైజాగ్ కి చెందిన సత్యానంద్ కి ఇచ్చారు, మూడవరోజు విశిష్ట సాహితీ మూర్తి పురస్కారం ఆంధ్రపత్రిక ఎడిటర్ గా చేస్తున్న M.V.R. శాస్త్రిగారికి ఇచ్చేరు, ఓలేటి పార్వతీశం గారు సంచాలకులుగా వక్తలందరూ బాగా మాట్లాడేరు. ముందురోజు ఢిల్లీ సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజుని సభలో ఎనౌన్స్ చేసి 10 వేలతో సత్కరించారు. శ్రీప్రకాశ్ డైరెక్టర్ విజయ్ ప్రకాశ్ ఆయనకు వేరుగా ఒక హాల్లో సన్మానం చేసి, ఆయన చేత 50 మంది ఆర్ఫనేజ్ పిల్లలకి బట్టలు ఇప్పించారు. కొందరు చాలా స్నేహంగా ఉన్నట్టు నటిస్తూ లోపల చాలా జెలస్ తో ఉడికి పోతూంటారు. ఆరోజు సభ, నాటకాలకి బహుమతులు ఇవ్వడం అయ్యేసరికి బాగా పొద్దుపోయింది. మర్నాడు ఉదయాన్నే శ్రీప్రకాశ్ వ్యవస్థాపకులు విజయ్ ప్రకాశ్ తల్లిగారు, తండ్రిగారు ఆ కాంపౌండ్ లోనే నివసిస్తోన్న అందమైన ఇల్లు, గార్డెన్ చూసి ప్రతిమ, నేనూ బయలుదేరాం, ఇంటికి చేరగానే పుట్ల హేమలత గారి ఫోను‘తను విహంగ పత్రిక తరఫున ఏర్పాటు చేసిన ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’సదస్సు ఎల్లుండి బొమ్మూరు యూనివర్శిటీలో జరుగుతుంది, తప్పకరమ్మని. 11 వ తేదీ ఉదయాన్నే బస్సులో లాలా చెరువు వెళ్లి అక్కడి నుంచి ఆటోలో బొమ్మూరు తెలుగు యూనివర్సిటీకి చేరుకున్నాను, ఆ సదస్సుకి అప్పటి హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగుయూనివర్సిటీ V.C ఎస్వీ సత్యన్నారాయణగారు వచ్చి మంచి స్పీచ్ ఇచ్చేరు, నన్ను ఆత్మీయంగా పలకరించేరు, లంచ్ తర్వాత హేమలత విహంగలో రాస్తున్న రచయితల్ని పెద్దఫోటోతో వేసిన ప్రశంసా పత్రాలు, షాల్స్ తో సన్మానించేరు, గీత తరఫున కూడా నేనే అందుకున్నాను.
ఆ మర్నాడే మా అబ్బాయి ఫోన్ చేసి కారులో వాళ్ల అత్త మామల్తో బాటు కేరళవెళ్తున్నామని చెప్పేడు. నన్ను పిలవలేదని మనసు చివుక్కుమని కళ్ళల్లో నీళ్లొచ్చాయి, మానవనైజం కదా! ‘పోనీలే హేపీగా వెళ్లిరానీ’అని నచ్చచెప్పుకొన్నాను.
13న భోగి, ఉదయాన్నే తలస్నానం చేసి అమెరికాలో షంషాద్ బేగం ఇచ్చిన చీర మొదటిసారి కట్టుకున్నాను. మా ఊరికి దగ్గర్లో మన్యం వైపున్న బలభద్రపురం అనే చిన్న ఊరు నుంచి ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు కొందరు వచ్చి వాళ్ల ఊళ్లో ముగ్గుల పోటీ పెడుతున్నామని, మార్కులు వెయ్యడానికి రమ్మని అడిగేరు, నాకు నవ్వొచ్చింది కాని, ఆపుకొన్నాను, ఆటో తెచ్చి తీసుకెళ్లేరు.
(L) షేపులో ఉన్న చిన్న ఊరు. మలుపు దగ్గర చిన్న వినాయకుడి గుడి, జగ్గంపేట పక్కనే ఉన్న కొత్తూరు ఊరు మధ్యనుంచి గతుకుల రోడ్డు, అందరి ఇళ్లముందో, పక్కనో పశువుల కొట్టాలు. పశువులు మేతకెళ్లినట్టున్నాయి. ఎంతోశుభ్రంగా, పండక్కి సున్నాలు వేసిన ఇళ్లతో మెరిసి పోతోంది ఊరు. జటాద్రి కొండ దాటితే ఉన్న ఆ ఊరిని అంతవరకూ నేను ఎప్పుడూ చూడలేదు. అన్ని ఇళ్ళ ముందూ అందంగా పచ్చని పేడ కళ్లాపు మీద వేసిన ముగ్గులున్నాయి, మంచి ఎండలో ముగ్గుల ఎంపిక, నాలుగడుగులు వెయ్యగానే ఒకబ్బాయి గొడుగు పట్టి సాయం వచ్చాడు. అంతమంచి ముగ్గుల్లోంచి మూడు ముగ్గులు సెలెక్ట్ చెయ్యడం కొంచెం కష్టమే అన్పించింది. మూడూ ఖరీదైన గిఫ్టులే కొన్నారు, గ్రైండరు, మిక్సీ, స్టేండ్ ఫేన్.పాల్గొన్న అందరికీ బకేట్ సైజు ప్లాస్టిక్ టంబ్లర్స్ ఇచ్చేరు, వద్దు వద్దంటున్నా నాకూ ఒక బహుమతి తెచ్చి ఇంట్లో పెట్టేరు. ఆ రోజు రొటీన్ కి భిన్నంగా ఎంతో బాగా గడిచింది,
ఫిబ్రవరి మూడున రాజమండ్రి మహాలక్ష్మి హోటల్లో దివంగత స్మైల్ గారి పేరున 2015, 16 సంవత్సరాల కథా కవితా అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. బారహమతుల్లా, ఎండ్లూరి మానస, ప్రసాదమూర్తి, క్రాంతి శ్రీనివాసరావు గార్లకు ఇచ్చేరు, కొత్త, పాత రచయితలు కొందరు కలిసేరు, ఫిబ్రవరి 13న దాసరి అమరేంద్ర కారులో మా జగ్గంపేట మీదుగా ఫ్రెండ్స్ తో కారులో ఫారెస్ట్ లోకి వెళ్తున్నామని ఫోన్ చేసాడు, తప్పకుండా వచ్చివెళ్లమని చెప్పేను, రజనీ గారబ్బాయి హేమచంద్ర, కాకినాడకు చెందిన గౌరీనాయుడు, నా ఆత్మకథ అభిమాని మరో అబ్బాయి – పేరు మరచిపోయాను తో కలిసి వచ్చాడు, అప్పటికప్పుడు కావడం వలన బిస్కెట్స్, కాఫీ మాత్రమే ఇచ్చేను, లంచ్ వరకూ ఆగమన్నారు, అమరేంద్ర ఫొటోలు తీసేడు, కాస్సేపు కబుర్లు చెప్పి వెళ్లేరు, ఆఫిబ్రవరిలో సాకం నాగరాజ గారు తెచ్చిన ‘నవ్యాంధ్ర’ ప్రత్యేక సాహిత్య సంచికలో నా ‘పుష్పాంజలి’కథ వచ్చింది. 2 పుస్తకాల కాపీలు పంపేరు.
*****

కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.
