
దేవి చౌధురాణి
(రెండవ భాగం)
మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ
తెనుగు సేత – విద్యార్థి
నావ పైన అలజడి సద్దుమణిగింది. ఎవరూ లేరు, దారి సుగమం అనుకుని, వ్రజేశ్వర్ లోపలికి వచ్చి దేవి ప్రక్కన కూర్చున్నాడు. దేవి అతనితో “మీ ఆజ్ఞాపాలనగా నేను గంగా నిమజ్జనం పొందలేదు. కానీ, నేడు దేవి చౌధురాణి మరణించింది. ఇప్పుడు ప్రఫుల్ల మాత్రమే మిగిలి వున్నది. మరి ప్రఫుల్ల జీవించాలా లేక దేవితో పాటు ప్రస్థానం పొందాలా?” అని ప్రశ్నించింది.
వ్రజేశ్వర్ ప్రఫుల్లని తన బాహువులలోకి తీసుకున్నాడు. “ఇప్పుడు నా ప్రఫుల్లని నా నుంచి ఎవరూ విడదీయలేరు. నువ్వు నాతో రాకపోతే నేను కూడా ఇక్కడ నుండి వెళ్లను” అని అన్నాడు.
“నేను మీతోనే వస్తాను. కానీ మావగారిని అడిగారా?”
“ఆయన సంగతి నేను చూసుకుంటాను.”
“ఆ రోజు కూడా మీరు నన్ను ఇంటి నుండి పొమ్మన్నారని నేను అనుకోను. ముందు మావగారిని పంపించండి. మన ఇద్దరం తరువాత బయల్దేరుదాము.”
అదే సమయానికి రంగరాజు పల్లకి తీసుకుని వచ్చాడు. హరివల్లభ రాయ్ కూడా సంధ్య వార్చుకుని నావ పైకి వచ్చాడు.
నిశి హరివల్లభ రాయ్‌కి ఫలహారాలు ఏర్పాటు చేసింది.
“వ్రజేశ్వర్ ఎక్కడ? నిన్న రాత్రి నావ పైన కనిపించాడు, మళ్లీ కనబడలేదు” అని హరివల్లభ రాయ్ అడిగాడు.
“వ్రజేశ్వర్ ఇప్పుడు మాకు మరిది కాబోతున్నాడు కదా, అతని ప్రాణానికేమీ భయం లేదు. నేను తీసుకువస్తాను. ముందు కూర్చుని తిను.”
హరివల్లభ రాయ్ తినటానికి కూర్చున్నాడు. లోపలి నుండి వస్తున్న వ్రజేశ్వర్‌ని గమనించి ‘నా కొడుకు అందానికి ఆ డాకూది మోజుపడినట్టు వుంది. సరే, అంతా నా మంచికే, నా ప్రాణానికి ఇంకేం భయం లేదని అనుకున్నాడు.
“వ్రజేశ్వర్ నువ్వు ఇక్కడున్నావా? సరే, నీతో ఒక విషయం చెప్పాలి. నేను వీళ్లకి ఒక మాట ఇచ్చాను. ఆ మాట నువ్వు నిలబెట్టాలి. నిశి వాళ్లు కులీన బ్రాహ్మలట. ఇంకా పెళ్లి కాని చెల్లెలు ఒకటి వున్నదట. వీరి తండ్రిగారికి వరుడనేవాడు ఎక్కడా దొరకలేదట. అందుకని కులం పోతుందని అనుకుంటున్నారు. మన కులం వాళ్లకి మనం సహాయం చేసుకోకపోతే వేరేవాళ్లు ఎవరు చేస్తారు చెప్పు? కులీనులకి కులం పోకుండా చూసుకోవడం మన ధర్మం. అసలు మాటేమిటంటే నువ్వు వీళ్లని ఉద్ధరించాలి. మరి నువ్వు నిశి వాళ్ల చెల్లెల్ని వివాహం చేసుకుంటావా?”
“నిశి చెల్లెలని వివాహం చేసుకోవాలా?” విషయం అర్థం కాలేదు వ్రజేశ్వర్‌కి.
నిశికి నవ్వు వచ్చింది. అయినా నవ్వు ఆపుకుని గంభీరంగా ఇద్దరినీ చూసింది.
“నువ్వేమీ చిన్న పిల్లాడివి కాదు మళ్లీ మళ్లీ చెప్పటానికి. ఇప్పుడు మనమున్న పరిస్థితిని అర్థం చేసుకో. నేను ఈ వివాహానికి నీకు అనుమతి ఇస్తున్నాను.”
“మీ ఆజ్ఞను పాటిస్తాను” అన్నాడు వ్రజేశ్వర్.
హరివల్లభ రాయ్ గొంతు దించి, వ్రజేశ్వర్ చెవి దగ్గరగా “ఎంతో కొంత కట్నం కానుకలు గురించి మాత్రం అడగటం మర్చిపోమాకు” అంటూ గుసగుసగా చెప్పాడు.
వ్రజేశ్వర్ అలాగే అన్నాడు. నిశికి నవ్వాగటం లేదు. అయినా ఆపుకుంటున్నది.
హరివల్లభ రాయ్‌ని పల్లకీ ఎక్కించారు. నాల్గడుగులు పడగానే “నా కొడుకుని ఆ ముండలకి వదిలేసి బయటపడ్డా. వాడికేమి కాదులే, వాడి అందానికి వాళ్లు మోహావేశంలో మునిగారు. హమ్మయా, ఏదో ఒక రకంగా బ్రతికి బయటపడ్డా” అనుకున్నాడు.
తండ్రి వెళ్లిన తరువాత వ్రజేశ్వర్ నిశిని అడిగాడు, “ఈ గందరగోళం ఏమిటి? నీ చెల్లెలు ఎవరు?”
“ఇంకా తెలీదా? ప్రఫుల్ల” అంటూ నవ్వింది.
“నిశి, నువ్వు గొప్ప టక్కరిదానివే! ఈ పన్నాగంతో మా తండ్రిగారిని లోబరిచావన్నమాట! మా నాన్నగారితో అన్ని విషయాలు చెప్పకుండా వుండను, ఏమనుకుంటున్నావో.”
“సరే, అసలు మీ నాన్న చౌధురాణిని గడప తొక్కనిస్తాడా, లేదా?”
అక్కడికి వచ్చిన దేవి, “నిశి, దేవి మరణించింది, ఇప్పుడు ప్రఫుల్ల విషయం మాత్రమే మాట్లాడు” అన్నది.
“మీ నాన్న ప్రఫుల్లను గడప తొక్కనిస్తాడా లేదా? ఇంతకు క్రితం ప్రఫుల్లనే కదా మీ నాన్న ఇంటిలో నుంచి తరిమేసింది!” అన్నది నిశి.
“నిశి, ఈ విషయాలన్ని ఇప్పుడు నేను చక్కదిద్దాలి, వేరెవ్వరు కాదు. ఇప్పుడు నన్ను ప్రఫుల్ల నుండి విడదీయగలిగేవారు ఎవరూ లేరు. వ్రజేశ్వర్ ఎక్కడ వుంటాడో, ప్రఫుల్ల అక్కడే వుంటుంది” అన్నాడు వ్రజేశ్వర్.
ఈ మాటలు వింటూనే ప్రఫుల్లకి ఎంతో ఆహ్లాదం కలిగింది, మనసు కుదుట పడింది. మొత్తానికి, ఈ నాటికి వ్రజేశ్వర్‌కి బుద్ధి కుశలత కలిగిందన్న మాట అని అనుకున్నది నిశి.
***
నావ భూత్‌నాథ్ వెళ్లి అక్కడ నుండి దేవిగఢ్ వెళ్లటమని దేవి నిర్ణయించింది. భూత్‌నాథ్‌లో అందరికి వీడ్కోలు పలికి వ్రజేశ్వర్‌తో కలసి రంగాపురం వెళ్లాలని దేవి నిర్ణయం.
“మాతా, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్తావని నేను నా జీవితంలో ఎప్పుడూ ఊహించుకోలేకపోయాను” అంటూ రంగరాజు విలపించసాగాడు. వెంటానే నిశి, దివ, దేవి, అందరికీ దుఃఖము కమ్ముకొచ్చి అందరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.
దేవికి దేవిగఢ్‌లో ఒక భవంతి, వేరే ఆస్తులు, జాగ్రత్త చేయబడిన ధనం కూడా వున్నాయి. ఒక దేవాలయం కూడా తనే నడుపుతున్నది. అవి అన్నీ రంగరాజుకి దత్తం చేసి, “రంగరాజు, నువ్వు వివేకతతో, సమర్ధవంతంగా జీవించు. దయాదాక్షిణ్యాలు కలిగి వుండు. పేదసాదలందు ఔదార్యం చూపు. ఇవి అన్ని నీకు తెలిసిన విషయాలు, చేతనయినవి కూడా” అని వాత్సల్యపూర్వకంగా చెప్పింది. “నువ్వు ప్రశాంత జీవనం గడుపు. భవానీ ఠాకూర్‌గారిని కలసినప్పుడు నా నమస్సులు తెలియచేయి. ఆయన నా జీవితాంలో ఒక గొప్ప మహానుభావుడు. ఆయనంటే నాకు మిక్కిలి గౌరవం అని చెప్పు.”
దేవి నావను నిశిదివలకు ఇచ్చింది. నావలోని విలువైన వస్తుసామాగ్రితో సహా. అత్యంత విలువైన తన నగలను కూడా నిశిదివలకు ఇచ్చి “వీటిని అమ్మి దీనులకు దిక్కులేనివారికి పంచి పెట్టండి”అన్నది.
నిశి కన్నీరు తుడుచుకుంటూ “అత్తవారింటికి ఆ నూలు చీరతో మాత్రమే వెళ్తావా, ఒక్క నగ కూడా లేకుండా?” అన్నది.
దేవి వ్రజేశ్వర్‌ని చూపుతూ “నా పతియే నాకు ఆభరణం” అన్నది.
“హు, సరేలే. ఒక స్నేహితురాలిగా బహుమతి ఇస్తున్నా, కాదనమాకు.” నిశికి సొంతంగా కొన్ని నగలు వున్నవి. వాటిలో నుంచి ఒక మంచి హారం తీసి దేవి మెడలో వేసి, చేతులకు గాజులు, ఒక ఉంగరం తొడిగింది.
నిశి మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంది. దివ దేవిలు కూడా దుఃఖం ఆపుకోలేకపోయారు. వారు ముగ్గురూ మంచి స్నేహితురాళ్లగా ఇంత కాలము ఒకరికొకరు చేరువయ్యారు. ఈ దుఃఖంలో కూడా నిశిదివలకు దేవి ఆనందంగా తన పతితో వెళ్తున్నదని తెలుసు. ఇది కొంత ఉపశమనం. దేవి జీవితం సుఖశాంతులతో నిండి వుండాలని కోరుకున్నారు.
నావ భూత్‌నాధ్ చేరుకుంది. అక్కడ దేవికి వీడ్కోలు పలికారు. నావ దేవిగఢ్‌కి ప్రయాణమయ్యింది. దేవిగఢ్‌లో నావికులందరికీ రంగరాజు జీతభత్యాలు, ధారాళమైన బహుమతులు ఇచ్చాడు. నావను మాత్రం పూర్తిగా విడగొట్టారు. ఎందుకంటే, ఈ నావను ఇంగ్లీషువాడు ఇప్పుడు తేలికగా గుర్తు పట్టగలడు. నావను విడగొట్టటానికి సంవత్సరం పైనే సమయం పట్టింది.
నిశిదివలకు కూడా ఇక్కడ వీడ్కోలు పలుకుదాము.
*****
(సశేషం)

విద్యార్థి నా కలం పేరు. నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చుకున్నది విజయవాడలో. రైతు కుటుంబం. గత 30 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజినీరుగా వృత్తి. ప్రవృత్తి ఫలసాయం. మూఢ నమ్మకాలు, స్త్రీ విజయం, నిజ జీవిత పోరటం సాగించే నాయికానాయుకలు మొదలైన సమకాలీన సామాజిక అంశాల గురించి అప్పుడప్పుడూ కథలు వ్రాస్తుంటాను.
