
ప్రేమా, ఏదీ నీ చిరునామా?
(నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-తాటిపాముల మృత్యుంజయుడు
అక్కడేదో సంచలనం జరగబోతున్నట్లు కోర్టు ముందు జనం గుమికూడారు. ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు ఉదయం ఆరింటికే సరంజామాతో తయారయ్యారు. టీవీ చానళ్లు రేటింగ్ పెంచుకోడానికి పోటీ పడుతున్నాయి. కొంతమంది విద్యార్థులు కాలేజీకెళ్ళకుండా కోర్టు దగ్గరికి చేరుకొంటున్నారు. గుంపును అదుపులో పెట్టడానికి, పరిస్థితి చెయ్యిజారితే అవసరమైన చర్యలు తీసుకోడానికి పోలీసు వ్యానులు ఆ స్థలానికి చేరుకొంటున్నాయి. ఈ హడావుడితో రోడ్డు పక్కనున్న టీకొట్టు వాళ్లకి అదే పనిగా వ్యాపారం జరుగుతోంది. ఇంతటి కలవరం చెలరేగటానికి కారణం వ్యభిచారం కేసులో నిందితురాలైన సినిమా
నటి నీలిమ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోటానికి కోర్టుకు వస్తున్నది. ఇందుకుగాను తన వాదన ప్రత్యక్షంగా వినవల్సిందిగా కోర్టును కోరింది. ఈ కేసులో మరొక అనూహ్యమైన మలుపు ఏమిటంటే ఇప్పటిదాకా ఈ కేసులో వెలుగులోకి రాని మగమనిషిని కూడా కోర్టుకు తీసుకురావాలని అభ్యర్థించింది. భద్రతా కారణాల దృష్టా కోర్టు, పోలీసులు ఆ మగమనిషి వివరాలను బయటకు పొక్కనీయకుండా గుప్తంగా ఉంచారు. యువకులు తమ కలల రాణి కొరకు కళ్ళు కాయాలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి మనసుల్లో ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి.
‘నీలిమ నిజజీవితంలో ఎలా ఉంటుందో? సినిమాల్లో చూసినంత గ్లామరస్ గా ఉంటుందా?’
‘అయినా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని సెటిల్ చేసుకోక కోర్టుల దాకా లాగటమెందుకూ?’
‘ఏ పుట్టలో ఏ పాముందో? ఇంకా ఎన్ని రహస్యాల్ని బట్టబయలు చేస్తుందో?’
“బహుశా ఇది పెద్ద రాకెట్ ఏమో? తీగ లాగితే డొంకంతా కదులుతుంది కాబోలు?’
మొదలైన ప్రశ్నలెన్నో అందరి మనసుల్లో చోటుసేసుకొన్నాయి. పదవటానికి పది నిమిషాలముందే పోలీస్ కమీషనర్ బందోబస్తును పర్యవేక్షించడానికి అక్కడకు చేరుకున్నాడు. సరిగ్గా పదిగంటలకు ముందు ఒక పోలీసు వ్యాను రాగా దాని వెనకాల ఒక కారు వచ్చి కోర్టు ఆవరణ ముందు ఆగింది.
‘అదిగో నీలిమ వచ్చేసింది ‘ అన్న మాట క్షణాల్లో చేరిపోయింది. జనాల్లో కలవరం మొదలయ్యింది. పత్రికల వాళ్లు, న్యూస్ ఛానెళ్ళ వాళ్ళు కెమెరాలు, మైకులు చేతబట్టుకొని ముందుకు ఉరికారు. యువకులు తమ అందాలరాశిని చూడటానికి కారువైపు పరిగెత్తారు. వీళ్లను అదుపులో పెట్టడానికి పోలీసు విజిల్సు మోగాయి. లాఠీలు గాల్లోకి లేచాయి. కారులోనుండి మొదట డ్రైవర్ దిగి వెనక డోరు తెరిచాడు. నీలిమ కారు దిగింది. పసుపు, ఆకుపచ్చ రంగులు కల పంజాబీ డ్రెస్ వేసుకొంది. ఎరుపు రంగు చున్నీ కప్పుకొంది. జుట్టును వదులు చేసి క్లిప్పు పెట్టుకొంది. కళ్ళకు పెద్ద సన్‌గ్లాసెస్ పెట్టుకొంది.
‘అబ్బే అంత అందంగా ఏమీ లేదు? అయినా సినిమాల్లో మేకప్ ఉంటుంది కాబట్టి గ్లామరస్ గా ఉంటుంది ‘ పెదవి విరిచారు కొందరు.
‘అయినా ఈమె ఈ పని చేసిందంటావా? చేసే ఉంటుందిలే. సినిమా వృత్తిలో ఇవన్నీ మామూలేనట ‘ ఇంకొందరు తమ ప్రశ్నకు తామే సమాధానం చెప్పుకొంటున్నారు.
‘పాటల్లో పొట్టి డ్రెస్సులు వేసుకొని డాన్స్ చెయ్యలేదూ… శోభనం సీన్లలో యాక్టు చేసిందిగా… ముద్దులు కూడా పెట్టిందిగా… బయట చేసి దొరికిపోయింది కాబట్టి కేసయ్యింది ‘ మరికొందరి ఊహాగానాలకు హద్దులే లేకున్నాయి.
పోలీసులు రెండు పక్కలా నిలబడి రక్షణ ఇవ్వగా కోర్టు ఆవరణలోనికి ప్రవేశించింది నీలిమ. వెనకాలే జనం పరిగెత్తారు. మళ్ళీ పోలీసులు విజిల్సు, లాఠీలకు పని చెప్పారు. జనంలో ఉత్కంఠ మొదలైంది. ఇక ఆ మగమనిషి రావాలి. అతనెవరో, ఎలా ఉంటాడో?
అంతలో ఓ పెద్ద మెర్చిడెస్ కారు ముందురాగా వెనక కొన్ని కారులు, జీపులు వచ్చాయి. జనంలో కదలిక మొదలయ్యింది. ముందు కారు నుండి ఒకతను బయటకు వచ్చాడు. అయితే ముఖం చాలావరకు కర్చీఫ్ తో కప్పబడి ఉంది. పూర్తిగా తలవంచుకొని ఉన్నాడు కాబట్టి అతనెవరో, వయసెంతో చెప్పటం కష్టమే. పైగా, అతని చుట్టూ అతని వెంట వచ్చిన మార్చలం, బౌన్సర్లు గబగబా లోనికి
తీసుకెళ్ళటం చేత అతన్ని గుర్తించటం కష్టమైంది. మళ్ళీ జనాన్ని దారిలో పెట్టటానికి పోలీసులు లాఠీలు ఝుళిపించారు.
***
కోర్టు హాలు నిశ్శబ్దంతో నిండి ఉంది. ఒక పక్క బోనుకు కొద్ది దూరంలో బెంచీపై కూర్చుని వుంది నీలిమ. ఇంకో బోను పక్కన తన లాయరుతో కూర్చుని ఉన్నాడు మగమనిషి. జడ్జి హాలులోనికి ప్రవేశించే సరికి అందరు లేచినిబడ్డారు. జడ్జి పేరు పద్మనాభరావు. కేసు హియరింగ్ మొదలుపెట్టమని నీలిమను ఆదేశించారు. నీలిమ బోనులోకి ఎక్కింది.
“నీ తరఫున వాదించడానికి ప్రాసిక్యూషన్ లాయరు ఎవరూ లేరా?” – జడ్జి ప్రశ్న.
“లేరు యువర్ ఆనర్” – నీలిమ జవాబు.
“నువ్వు కోరితే కోర్టు ఒక ప్రాసిక్యూటర్ని ఏర్పాటు చేస్తుంది”
“అవసరం లేదు, యువర్ ఆనర్! అనుభవించపడ్డది నేను, అటుపై అవమానింపపడ్డది నేను. ఆ సమయంలో అతను, నేను తప్ప ఆ గదిలో మూడోమనిషి లేడు. కాబట్టి, నేను అనుభవిస్తున్న వ్యథను చెప్పుకోటానికి నేనే సమర్థురాల్ని. వేరే లాయర్ని ఏర్పాటు చేస్తే నా మనసులోని భావాల్ని అతను తన మాటల్లో చెపుతున్నపుడు కొంత అర్ధం తప్పిపోవచ్చు, కొన్ని ఆపార్థాలు అనుకోకుండా రావచ్చు”
ఆత్మస్థైర్యంతో మాట్లాడుతున్నది నీలిమ.
“ముద్దాయిని బోనులో ప్రవేశపెట్టండి” ఆదేశించాడు జడ్జి.
మగమనిషి బోనులోకెక్కాడు. ఇప్పుడు అతని ముఖం అందరికి సృష్టంగా కనిపిస్తున్నది. స్ఫురద్రూపి. చూట్టానికి అందంగా ఉన్నాడు. మంచి శరీరచ్చాయ. వయసు ముప్పైలలో ఉంటుంది. తన తరఫున వాదన మొదలెట్టింది నీలిమ.
“యువరానర్. ఇతని పేరు రాఘవ్. ఆ రోజు పోలీసులు వచ్చి నన్ను వ్యభిచార నేరం కింద అరెస్టు చేసినప్పుడు ఆ హోటల్ గదిలో అతను, నేను మాత్రమే ఉన్నాం. మూడో మనిషి లేడు. అది నిజమేనా మిస్టర్ రాఘవ్? ” అడిగింది నీలిమ.
“అవును” అన్నాడు రాఘవ్.
“మీ ఇల్లు సిటీలోనే ఉంది కదా. అయినా ఆ రోజు మీరు ఆ హోటల్లో రూం ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవచ్చా?” మరో ప్రశ్న సంధించింది నీలిమ.
వెంటనే డిఫెన్సు లాయర్ లేచి నిలబడుతూ “ఆబ్జెక్షన్ యువర్ ఆనర్! ఆ ప్రశ్న అనవసరం. నా క్లయింట్ పేరొందిన బిజినెస్ మాన్. లావాదేవీల విషయాల్లో అతను ఎంతమందితోనో సంప్రదింపులు జరుపుతుంటాడు. కాబట్టి, కొన్ని సమయాల్లో ప్రైవసీ ఉండాలి కాబట్టి ఫైవ్ స్టార్ హొటలే సరైన స్థలం” అన్నాడు.
“థాంక్స్ డిఫెన్సు లాయర్ గారు… మిస్టర్ రాఘవ్! ఆ రోజు మనం కలుసుకొంది అదే మొదటిసారా? ” నీలిమ మరో ప్రశ్నసంధించింది.
“అవును”
“నో! అది అబద్దం. నేను, నువ్వు… సారీ… కోర్టులో గౌరవంగా పిలవాలి కదూ… అదే, నేను, మీరు, అదే హోటల్లో ఎన్నో రాత్రులు గడిపాము. అవునా? కాదా?”
డిఫెన్సు లాయర్ లేస్తూ “అదీ సంగతి! ఇప్పుడు అసలు పాయింటుకు వస్తున్నావు. నువ్వు కాల్ గర్ల్ వన్నమాట. నా క్లయింట్ లాంటి వాళ్ళతో ఇంకెంతమందితో నీకు సంబంధం ఉందో తెలియాలి. ఇలా ఎంతకాలం నుండి వ్యభిచరిస్తున్నావో? ” వెకిలిగా నవ్వాడు.
“అదే పాయింట్ కు వస్తున్నాను లాయర్ గారు, నేను చేసింది వ్యభిచారమా లేదా అన్నది నిరూపించటానికి. యువర్ ఆనర్! ఈ ముద్దాయి గురించి మీకు కొంత తెలియాలి. ఇతను సిటీలో పెద్ద వ్యాపారవేత్త. సినిమా పరిశ్రమతో కూడా సంబంధం ఉంది. అప్పుడప్పుడు సినిమా నిర్మాణంలో పెట్టుబడులు పెడుతుంటాడు. ఆ విధంగా నాకు అతనితో పరిచయం అయ్యింది. అది స్నేహంగా మారి ఒకరంటే ఒకరం
ఇష్టపడ్డాం.”
“అసలు పాయింటుకు రాకుండా ఏవో కాకమ్మ కబుర్లు చెబుతున్నది, యువర్ ఆనర్! అసందర్భ ప్రేలాపనతో విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నది” ఆబ్జెక్షన్ లేవదీసాడు డిఫెన్స్ లాయర్ .
“ఆబ్జెక్షన్ ఓవర్ రూల్‌డ్! ప్లీజ్ ప్రొసీడ్, నీలిమ!” అన్నాడు జడ్జి.
“థాంక్స్, యువర్ ఆనర్, ఈ విషయాలన్నితెలుసుకోవడం ఈ కేసులో చాలా అవసరం. ఇతను పరిచయం అయిన కొద్ది నెలల్లోనే మా స్నేహం ప్రేమగా మారింది. తనకు పెళ్లి కాలేదు ఒంటరి వాడినని చెప్పాడు. ప్రేమ గుడ్డిదో, నా విచక్షణా జ్ఞానం గుడ్డిదో తెలియదు. నేను అతని మాటల్ని నమ్మాను. మాకు సమయం కుదిరినప్పుడు కలుసుకునే వాళ్లం. సినిమా నటిగా అప్పుడే ఎదుగుతున్న నేను కేరీర్ దృష్ట్యా మా ప్రేమ విషయాన్ని మీడియాకు వెంటనే బహిర్గతం చేయలేదు. ”
ఈ మాటలు వింటున్న రాఘవ్ ముఖకవళికలు మారిపోతున్నాయి. నిస్సహాయంగా తన లాయర్ కేసి చూశాడు.
“యువర్ ఆనర్! డబ్బులు తీసుకొని హైప్రొఫైల్ ఉన్న నా క్లయింట్ లాంటి వాళ్ళకి సుఖాన్ని అందించే ఈ కాల్ గర్ల్ నీలిమ ప్రేమ అంటు కట్టుకథలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈవిడ మాటల్ని శంకించాల్సి వస్తుంది” వాదించాడు డిఫెన్స్ లాయర్.
“ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్! డిఫెన్స్ లాయర్ గారు ఎలాంటి ఆధారాలు లేకుండా నాపై నిందలు వేస్తున్నారు. నాకు కాల్‌గర్ల్ అన్న పేరును కట్టబెడుతున్నారు” అన్నది నీలిమ.
డిఫెన్స్ లాయర్ వెంటనే అందుకొంటూ “పోనీ, కాల్‌గర్ల్ కాకుంటే మిస్ట్రెస్ అనుకోవచ్చా?” అన్నాడు. ఆర్థం కానట్టు చూసింది నీలిమ.
“అదే మిస్ట్రెస్ అంటే ‘ఉంచుకున్న ఆడమనిషి’ అని అర్థం. ఏ పేరైతేనేం, బజార్లో తిరిగే వ్యభిచారైనా, బ్రోతల్లో ఉన్న ఆడదైనా, హోటల్‌కు వచ్చే కాల్ గర్ల్, లేదా రహస్యంగా ఉంచుకున్న మిస్ట్రెస్ అయినా చేసే పని అదేగా” మూతి వంకర చేస్తూ ఇకిలించాడు డిఫెన్స్ లాయర్.
తనపై నీలాపనిందలు వేస్తుంటే నిస్సహాయురాలైంది నీలిమ. ఎంతైనా డిఫెన్స్ లాయర్. వృత్తిలో అనుభవముంది. ఇలాంటి కుతర్కాల్లో ఆరితేరినవాడు. “మిస్టర్ డిఫెన్స్ లాయర్! మీ వాదనను కేసు పరిధిదాటి తీసికెళ్ళొద్దు.
ప్లీజ్ స్టిక్ టు ద పాయింట్. నీలిమ, ప్లీజ్ ప్రొసీడ్ విత్ యువర్ పాయింట్!” అంటూ జడ్జి నీలిమ రక్షణకొచ్చాడు.
ఇంతలో డిఫెన్స్ లాయర్ అందుకొంటూ “యువర్ ఆనర్! ఒక ప్రశ్న అడగటానికి అవకాశమివ్వండి ” అభ్యర్థించాడు. జడ్జి అనుమతించాడు.
“చూడమ్మా! నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. నీవు ఆ రోజు రాత్రి గడపటానికి నా క్లయింట్ తో అయిదు లక్షలు బేరమాడుకున్నావా? లేదా?” ప్రశ్నించాడు.
నీలిమ నవ్వుతూ, “నేనేమో అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అన్నాను. మీరేమో నా ప్రేమను వ్యభిచారం అంటూ అయిదు లక్షలకు ఖరీదు కడుతున్నారు. ఆ వాదనను వ్యతిరేకించటానికే కదా నేను రాఘవ్ ను కోర్టుదాకా తీసుకొనివచ్చింది” అంది.
“డబ్బు తీసుకొని శరీరాన్ని అమ్ముకోవటాన్ని చట్టప్రకారం వ్యభిచారం అంటారు. ఆ రోజు రాత్రి నా క్లయింటుతో గడపటానికి అయిదు లక్షలకు బేరం కుదుర్చుకొన్నావు. కాబట్టి, నీపై వ్యభిచారం కేసు నమోదైంది.” పదేపదే వ్యభిచారం అన్న పదం ఉపయోగిస్తుంటే నిలువునా బోనులో కూలిపోతున్నట్టుగా అనిపించింది నీలిమకు. “అంతా అబద్దం” బిగ్గరగా అరిచింది నీలిమ. “ఆ అయిదు లక్షల గురించి నాకేమి తెలియదు, నన్ను నమ్మండి” జడ్జిని అభ్యర్థించింది.
డిఫెన్స్ లాయర్ అందుకుంటూ, “ఆ బేరం ఎలా కుదిరిందో నా క్లయింటే చెబుతాడు. రాఘవ్, మీరు చెప్పండి” అన్నాడు.
రాఘవ్ మొదటగా నీళ్ళు నమిలాడు. తర్వాత తమాయించుకొని చెప్పటం మొదలెట్టాడు. “నా బిజినెస్ డీలింగ్స్ లో భాగంగా ఒకతనికి చిన్న మాట సాయం చేసాను. ఆందుకు కృతజ్ఞతగా నాకు అయిదు లక్షలు ఇవ్వబోయాడు. నేను నిరాకరించాను. అతడు మళ్ళీ కాల్ చేసి ‘ఫైవ్ స్టార్ హొటెల్లో రూం బుక్ చేసాను. నువెళ్ళితే ఒక హీరోయిన్ నిన్నొచ్చి కలుస్తుంది ‘ అని అన్నాడు. ఆ బలహీనతకు లొంగి వెళ్లాను. హోటల్ రూం కి నీలిమ వచ్చింది…”
వింటున్న నీలిమ నిర్ధాయింతబోయింది. ఈ మాటల్ని మొదటిసారిగా వింటున్నది. ఇప్పుడు తనేం చేయాలి. ప్రేమ ముసుగులో ఇంతటి దారుణమైన మోసం ఉంటుందా? రాఘవ్ ఇప్పుడామెకు ఆవు తోలు కప్పుకున్న పులిలా కనిపిస్తున్నాడు. ఒళ్ళంతా నిస్సత్తువ ఆవహించింది. పాదాల్లో వణుకు మొదలైంది. ‘రోజూ ఫోన్లో నీ ఫోటోలను చూస్తూ ఎంత కాలం గడుపుతానో తెలుసా?’, ‘విల్ యూ ప్లీజ్ మ్యారీ మీ?’, ‘నా బిజ్ నెస్ కన్నా నీ ఆనందమే నాకు ముఖ్యం. అందుకు నేను ఏవైనా వదలుకోవడానికి నేను సిద్ధమే’ – రాఘవ్ చెప్పే ఈ మాటలన్నిఏవైనాయి? అవన్నీ నీటి మీది రాతలేనా? తేనె పూసిన కత్తులేనా?
ఆవేశం పొంగుకొచ్చి “నో, అంతా అబద్ధం! పచ్చి మోసం!!” గట్టిగా అరిచింది.
“ఇతడు ప్రేమ పేరుతో నన్ను నిలువునా దోపిడీ చేసాడు. మొదటగా తనకు పెళ్ళి కాలేదన్నాడు. ఆ తర్వాత నాకు తెలిసింది అతనికి పెళ్ళయిందని. నేను నిలదీసి అడిగాను. ‘మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. నేను త్వరలోనే విడాకులు ఇద్దామనుకుంటున్నాను ‘ అని అన్నాడు.” నేనతన్ని కలవటం మానేసాను. కాని, ఆ రోజు పదే పదే నాకు కాల్ చేసి నాతో అర్జెంట్‌గా మాట్లాడాలని అభ్యర్థించాడు. నేను కూడా చివరిగా అతనితో మాట్లాడి తెగతెంపులు చేసుకుందామని హోటల్ రూం కెళ్లాను.” గద్దదమైన గొంతుతో చెప్పింది.
“వ్యభిచారం కాకుంటే మరి పోలీసులు ఎందుకొచ్చినట్టే?” కనుబొమ్మలెగరేస్తూ కొంటెగా నవ్వాడు డిఫెన్స్ లాయర్.
“సరిగ్గా ఆ ప్రశ్నకే నాకూ సమాధానం కావాలి. మీ క్లయింట్‌నే చెప్పమనండి?” ధీటుగా ప్రశ్నించింది నీలిమ.
“బిజినెస్ అంటే ఎంతోమంది శత్రువులు ఉంటారు. నేను నీలిమను కలువబోతున్న విషయాన్ని ఆసరా చేసుకొని నన్ను ఇరికించి ఉండవచ్చు” చాలా నింపాదిగా చెప్పాడు రాఘవ్.
“నేను వ్యభిచారినా? నా శీలం ఖరీదు అయిదు లక్షలా, మగమనిషి కౄరత్వమా, వ్యాపారంలో శత్రుత్వమా? యువర్ ఆనర్, మీరే సరిగ్గా ఆలోచించి నాకు న్యాయం చెయ్యండి” కళ్ళలో నీరు ఉబికి వస్తుంటే అభ్యర్థించింది నీలిమ.
“కోర్ట్ ఈజ్ అడ్జర్నుడ్!” అంటూ లేచాడు జడ్జి.
***
కోర్టుపని ముగించుకున్న తర్వాత రాత్రిపూట ఇంటికి చేరుకున్నాడు పద్మనాభరావు. వేణ్ణీలతో స్నానం చేసి డైనింగ్ టేబుల్ వద్దకు చేరుకున్నాడు. క్రమం తప్పకుండా తనతో ప్రతి రాత్రి భోజనం చేసే కూతురు అక్కడ లేదు.
“మేఘనా!” కూతుర్ని పిలిచాడు. సమాధానం లేదు. రెండోసారి పిలిస్తేగానీ తన గదిలో నుండి బయటకు రాలేదు. మేఘన ఒక్కగానొక్క కూతురు. వయసు పద్దెనిమిదేళ్ళు. మేఘనను చూడగానే పద్మనాభరావు మొహం విప్పారింది.
“రామ్మ తల్లీ, బోంచేద్దువు గానీ” ప్లేట్లో వడ్డించాడు. టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంది గాని అన్నం ముట్టలేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు రావుగారికి.
“ఏమ్మా, వంట్లో బాగోలేదా?” నుదిటిపై చేయి వేసాడు. కాదన్నట్టు తలూపింది మేఘన.
“మరేమిటి?” ఆతృతగా అడిగాడు.
“మొదట మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అటు పైనే భోజనం. సరేనా?” షరతు పెట్టింది మేఘన.
రావు ఆశ్చర్యపోయాడు. రోజు డిన్నర్ సమయంలో మనసులో ఏదీ దాచుకోకుండా గలగలా అన్ని విషయాలు మాట్లాడే మేఘన ఈరోజు మాట్లాడటానికి తన పర్మిషన్ అడుగుతుంటే అతని మనసు ఒకింత కీడు శంకించింది. తన కూతురికి ఏదో పెద్ద సమస్య వచ్చినట్టుంది. చదువా?, ప్రేమ విషయమా? లేదా, ఇంకేమన్నా…? తల్చుకోవాలంటే భయంగా ఉంది.
“తప్పకుండా, తల్లీ! చెప్పు, ఏమిటీ నీకొచ్చిన కష్టం?” ఆతృతగా అడిగాడు.
మాట్లాడటం మొదలెట్టింది మేఘన.
“ఈ రోజు టీవీలో కోర్టు బయట జరిగే హడావుడి చూపించారు. నీలిమ కేసు మీ ముందుకొచ్చిందా?”
“అవును”
“ఆవిడ కేసులోని మగమనిషిని కూడా కోర్టుకు తీసుకొచ్చింది. తన వెర్షన్ చెప్పే అవకాశం దొరికే వుంటుంది” ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం ఏమీ మాట్లాడకుండా అవునన్నట్టు తల కొద్దిగా పంకించాడు.
“గత కొన్నేళ్ళుగా బుల్లితెర, పెద్దతెరకు సంబంధించిన తారలపై ఇలాంటి కేసులు ఎన్నో వింటూనే ఉన్నాను. కాని, వ్యభిచారం మోపబడ్డ ఏ ఆడది కేసును ఇంత దూరం తీసుకొని రాలేదు. వివరాలు దాచబడ్డ మగమనిషిని ధైర్యంగా కోర్టుకు లాగలేదు. తన తరఫున తానే వాదించుకోలేదు. తనపై మోపబడ్డ ‘వ్యభిచారి‘ అన్న ముద్ర చేరిపేయడానికి పెద్ద సాహసమే చేస్తున్నది నీలిమ. ఆమెకు సరైన
న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నాను” తెరిపి లేకుండా మాట్లాడుతున్న మేఘనను చూస్తుంటే నీలిమ తరఫున వకల్తా పుచ్చుకుందా అన్న అనుమానమేసింది రావుకి.
“పురుషాధిక్యం ఇంకా చెల్లుబాటు అవుతున్న ఈ కాలంలో నీలిమ ఇలా బయటకు వచ్చి తన ఇమేజ్‌కు ఏమైనా ఫర్లేదు అన్నట్టుగా న్యాయం కోసం పోరాటం చేస్తుంటే సాటి ఆడదానిగా ఇలా మాట్లాడాలనిపించింది, అంతే” అంది మేఘన.
పెద్ద ఆరిందలా మాట్లాడుతుంటే కళ్ళప్పగించాడు చూసాడు రావు.
“ఒక మగాడు ‘ఐ లవ్ యూ’ అంటే ఏ మాత్రం సంకోచించకుండా నిజమేనని నమ్మేస్తారు చాలా మంది అమ్మాయిలు. కాని, ఆ మాటల వెనకాల వేరే స్వార్థం దాగుందని తెలియదు. అలాంటి అమాయకపు ఆడదే నీలిమ అని నా అభిప్రాయం…” మాట్లాడుతున్న మేఘనను ఆపుతూ, “ఇంక డిన్నర్ చేద్దామా?” అన్నాడు రావు.
“ష్యూర్… చివరిగా ఓ మాట” అంది నీలిమ.
ఏంటన్నట్టు చూసాడు రావు.
“ఇట్స్ ఎ ప్యూర్ కేస్ ఆఫ్ డిసెప్షన్ అని నేననుకుంటున్నాను డాడీ. ఎప్పటిలాగే, ప్రేమ ముసుగులో మరో అమ్మాయి మోసబోయింది…” మాట్లాడుతున్న మేఘనను ఆపుతూ, “నువ్వు చెప్పిందంతా విన్నాను. ఇక ఇప్పుడూ నా వంతు… ఏదీ నోరు తెరువు” అంటూ అన్నం, పప్పు కలిపిన ముద్ద మేఘన నోట్లో పెట్టాడు రావు.
బోజనాలు అయిన తర్వాత తన గదిలోకి వెళ్ళిన రావుకు నీలిమ కేసుపై తదుపరి చర్య ఏమిటో స్ఫష్టమైంది. “నా బిజ్ నెస్ కన్నా నీ ఆనందమే నాకు ముఖ్యం… మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు…త్వరలోనే విడాకులు తీసుకుంటాము” అంటూ ముద్దాయి చెప్పినట్టు నీలిమ చెప్పిన గొంతు పదేపదే మనసులో వినిపించింది.
***
కొద్ది రోజుల తర్వా పత్రికల్లో మొదటి పేజీలో వచ్చిన వార్త – “నీలిమ కేసులో ముద్దాయికి మానసిక పరీక్షలు జరపాలని, ఆ పైనే కేసు తిరిగి కోర్టు పరిధిలోకి వస్తుందని జడ్జీ తీసుకున్న నిర్ణయం.”
ప్రేమించకుంటే సెల్ టవర్ ఎక్కి దూకి చనిపోతాననడం, ప్రేమించడం లేదు అని అమ్మాయి అంటే ముఖంపై యాసిడ్ పోసే యువతకు ఇలాంటి మెంటల్ ఎవాల్యుయేషన్ చేయాలంటూ సైక్రియాస్టులు, మహిళాసంఘాలు టీవీ ఛానెళ్ళలో అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ విధానం సమాజానికి మేలు చేస్తుందని, అమ్మాయిలకు మేలు చేస్తుందని భావించారు.
*****

పేరు తాటిపాముల మృత్యుంజయుడు. అమెరికా కాలిఫోర్నియా బే ఏరియా నివాసం. రాసినవి కొన్నే కథలు, కొన్ని గల్పికలు. సరదా కోసం రాసినవి కొన్ని నాటికలు. ఏదైనా ప్రత్యక్ష సంఘటన చూసి, మనసు కదిలినపుడు కథాంశం దొరుకుతుంది. శిల్పం జోడిస్తూ, మంచి ముగింపు ఇస్తే చదివించగల కథ అవుతుందని గట్టి నమ్మకం.
