ఈ తరం నడక – 28

‘కడలి’ కథలు

సొంతిల్లు & ఇతర కథలు

-రూపరుక్మిణి 

 

కడలికి కథ రాయడం తెలుసు . వాస్తవాన్ని కథగా మలచడము తెలుసు. రీడర్ నాడీ పట్టుకుని నడిపిస్తుంది. తన కథా గమనాన్ని అన్వేషిస్తే దొరికేది ఆధునికతకు అద్దం పట్టే అనేక సమస్యలు, ప్రస్తుతం జరుగుతున్న సామాజిక వ్యవస్థలో మార్పులని, కొత్తగా స్త్రీలు ఎదుర్కొంటున్న మానసిక అస్తిత్వాన్ని గురించి ఈ కథల్లో ప్రస్తావిస్తూ ఉంటుంది. అవసరమైతే ఎదిరించి నిలబడడానికి స్త్రీ మరింత ఆత్మ స్టైర్యాన్ని పెంచుకోవాల్సిన సందర్భాలని గట్టిగా చెబుతుంది. అందుకే కడలి యువతరాన్ని ఆకట్టుకోగలిగిన యువ రచయితగా పేరు తెచ్చుకుంది.

అభినందనలు కడలి

ఈ పుస్తకంలో తొమ్మిది కథలు ఉంటాయి పుస్తకం టైటిల్ నుంచి వద్దాము

 ‘సొంతఇల్లు’ ఈ మాట వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మనకంటూ ఒక స్థలం. ఎవరి ఆంక్షలు లేని స్థలం. కళ్ళు మూసుకొని ధైర్యంగా నిద్రించే హామీ, ఇంత పెద్ద ప్రపంచంలో నేను ఒక స్థానాన్ని రూపొందించుకున్నాను అన్న తృప్తి,  మనిషి తనకు తెలియకుండానే అనుభవించే అనుభూతులు ఇవి ఆ అనుభూతిని పొందడానికి సామాన్యుడు అనేక రకాలుగా తనని తాను ఏమార్చుకొని అయినా సంపాదించుకునే ఇల్లు. ఎందరో కలల సౌధం అటువంటి ఇల్లు పితృస్వామ్య వ్యవస్థలో పురుష వర్గానికి మాత్రమే అధికారమున్నది ఈ సొంతింటి పై అన్నది కొట్టి వేయలేని సామాజిక సత్యం.   స్థిర, చర ఆస్తులు స్త్రీ, పురుషులు ఎవరి పేరు మీద ఉన్నా వాటిని అనుభవించే హక్కు మాత్రమే స్త్రీలకు ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని అమ్ముకునే హక్కును తన తర్వాత తరానికి తనకు నచ్చిన వాళ్లకు రాసే హక్కును ఆమె ఇంకా సంపాదించుకోవలసివుంది. చట్టాలు రూపొందించబడినా అమలు అయ్యేవి అతితక్కువ. సామాజిక వ్యవస్థలో రావలసిన మార్పు ఎంతో వుంది.

ఎవరో ఒకరు ఆ ఇంటి నుండి వెళ్లిపోవాల్సి వస్తే 99 శాతం బయటికి నెట్టివేయబడటమో లేదా బయటకు వెళ్లి పోవాల్సి వచ్చేది స్త్రీ మాత్రమే. అందుకు కారణం మన సామాజిక నిర్మాణంలో వెళ్ళూనుకుని పాతుకుపోయిన వ్యవస్థ. సామాజికంగా మనం ఎంత ఎదిగాం అని చెప్పుకున్న, ఎన్ని మార్పులు వచ్చినా సాంప్రదాయపు ముసుగులో అన్ని వర్గాలలో, మతాలలో ఉన్న సామాజిక అనైతిక వ్యవస్థ ఇది. మహిళలకు సొంతంగా ఇల్లు లేదు అనేది వాస్తవం. హక్కులు అణిచివేయబడిన బాధ్యతల మధ్య బంధి ఆమె. ఆర్థికంగా ఆమె ఎదిగింది అన్నది ఓ పెద్ద ప్రశ్నార్థకంలా మార్చింది ఈ సమాజం. ఆర్థిక స్థిరత్వంలో స్వాతంత్రం ఎరగని వాళ్లే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఎన్ని రకాల హింసలనైనా భరిస్తూ ఈ ఇంటికి బందీలు మగవలే. నేటికీ బయట వెతుక్కున్న దొరకని రక్షణ, ఆ రక్షణ ఈ నాలుగు గోడలు కూడా ఇవ్వలేవని తెలిసిననాడు గడప దాటేందుకు సిద్ధమవుతోంది మగవ. తన స్థిరత్వాన్ని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మరె మార్గము దొరకదు. అందుకే అంటుంది ఆడవాళ్ళకి సొంతంగా ఇల్లు లేదు అని కడలి. తన అభిప్రాయంతో నేను ఏకిభవిస్తాను.

ఈ పుస్తకంలోని కథలు చదువుతున్నంత సేపు రీడర్ ప్రాస్పెక్ట్ లో సాగుతుంది రచన రచయిత నిలబడి మనతో మాట్లాడుతున్నట్టు ఫస్ట్ పర్సన్ లో కథలు ఉంటాయి. ఇందులో సొంత ఇల్లు అనే కథ ఒక స్త్రీకి వ్యక్తిత్వ హననం ఎలా చేయబడుతుందో చూపిస్తూ,  స్నేహం ఆర్థిక హెచ్చుతగ్గుల్లో లేదని, స్త్రీకి మరో స్త్రీ మాత్రమే సమస్యను ఎదుర్కొనే ఆత్మస్టైర్యాన్ని ఇచ్చేది, ఇవ్వగలరని  చెప్పే కథ.

మన దగ్గర లేనిది ఏదో ఎదుటి వ్యక్తిలో వెతుకుతూ ఉంటాం “ యూటోపియన్ ఊహ” ఈ గాధని ఎన్నిసార్లు చదివినా స్త్రీ అస్తిత్వాన్ని ప్రశ్నించే సమూహం నిజంగా ఏమాశిస్తుంది? అన్న ప్రశ్న వెంటాడు తుంది మనల్ని.  స్త్రీ స్వతంత్రంగా వేసే అడుగుని నిర్దేశించేందుకు, కట్టడి చేసేందుకు ఎంతలా ప్రయత్నిస్తుంది ఈ సమాజం. గాయపడడం అంటే ఒకప్పుడు శారీరక గాయాన్ని చూపించేవారు కానీ స్త్రీలు కాలం మొదటి నుండి తమ నెత్తురు కారని లోతైన గాయాలని మోస్తూనే ఉన్నారు. నేటి ఆధునిక వ్యవస్థలు పేట్రేగిపోతున్న మోరల్ హింస. ఈ హింస మానవత్వం లేని పైశాచికత్వానికి ప్రతీకగా ఆధునిక వ్యవస్థ నేటి స్త్రీలపై జుళిపిస్తున్న కొరడా ట్రోలింగ్. ఒక స్త్రీని కించపరచడానికి ఎంతటి నీచత్వం అయిన పదాన్ని అయినా ఉపయోగించడంతో బాటు ఆధునిక వ్యవస్థలో ఏ ఐ ద్వారా అదుపు లేని ట్రోలింగ్ నడుస్తుంది. మహిళల్ని అశ్లీలంగా చూపించడానికి కూడా వెనకాడడం లేదు. దీనివల్ల మహిళల మానసిక క్షోభకు అనేకరకాలుగా కారణం అవుతోంది.

అటువంటి సామాజిక స్థితిలో ఒక స్త్రీ ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నించిన కథ యుటేపియన్ ఊహ ఈ కథలో తనకు తానే ఓ అడవిగా కనిపించానని చెప్తుంది కడలి.

మనం నిలబడిన చోట సమస్య ఉంటే లోకాన్ని చూసే చూపు, లోకం మనల్ని చూసే చూపు రెండూ అర్థం అవుతాయి. అలాంటి ఓ సందర్భంలో లోపలి స్వరం ఎంత బలంగా నిలబెట్టుకోవాలో,  తానుపడిన అంతర్యుద్ధంలో ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకున్న తన కథని ఇందులో చెప్పింది కడలి.

గోడల్ని బద్దలు కొట్టి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం ఎంత అవసరమో చెప్తుంది. ట్రోల్ కి గురి అయిన స్త్రీలందరూ ఒక దగ్గర చేరితే,  భూమి మర్చిపోయిన రంగులతో అక్కడ ఆకాశం నిండిపోయింది అని చెప్తుంది. సమాజం కంట్రోల్ చేయాలని చూసిన ప్రతి స్త్రీ ఉనికి కొత్త నీరులా మళ్ళీ కొత్తగా ఉద్భవిస్తుందని చెప్పే కథ స్ఫూర్తిని నింపుకోమని చెప్పే కథ ఈ యుటేపియన్ ఊహ.

ప్రేమలో స్త్రీ పురుష బేధాలు లేవు. ఓడిపోవడం, గెలవడం అనేది ఇరువురికి సమానమైన సంతోషాన్ని, బాధని పంచి పెడుతుంది. అయితే కొన్ని సార్లు ప్రేమలో ఓడిపోయేది ప్రేమే అవుతుంది అటువంటి సందర్భాన్ని కధగా మలిచింది కడలి.

ప్రేమలు -వ్యక్తిత్వాలు  ఇవి రెండు ఒక జీవితానికి రెండు పార్శ్వాలు. మనం ఎంచుకున్న వారి కంటే మనల్ని ఎంచుకున్న వారి వద్ద ప్రశాంతత దొరుకుతుందని చెప్పకనే చెప్తుంది ఈ కథ. ప్రేమలో నమ్మకం ఎంత ఉంటుందో బ్రమలు కూడా అంతే ఉంటాయి. ఊహతొలగి నిజ జీవితంలో అడుగుపెట్టినప్పుడు వెన్నంటి వచ్చే బాధ ఆ బాధని మోయాలా వద్ద అని తెలుసుకోవలసింది మాత్రం ప్రేమ పై ఆధారపడదు వ్యక్తి వ్యక్తిత్వం పై ఆధారపడి ఉంటుంది.

తీరిక దొరికినప్పుడు వ్యక్తం చేసే ప్రేమ కంటే ప్రేమను బాధ్యతగా తీసుకొని కలిసి నడిచే ప్రేమను కనుగొని జీవితానికి ఆపాదించుకోవడం ముఖ్యం. టాక్సిక్ రిలేషన్ కి, ప్రేమలో చూపించే నిర్లక్ష్యానికి మధ్య ఉన్న తేడాని గుర్తించి నడుచుకోవడం ముఖ్యమని గుర్తుచేస్తుంది ఈ కథ.

ప్రేమించిన వ్యక్తుల మధ్య అర్థం చేసుకునే గుణం ఉన్నప్పుడు జీవితం ఎన్నిరకాల మాధుర్యాలు అనుభవిస్తుందో చెప్తుంది అమీతో మాకే భాలో భాషి కథ.

ఆదర్శాలకి-అవలక్షణాలకి సంబంధం లేదని తేల్చి చెప్పిన కథ ‘పర్ఫామేటీవ్ మెన్’ ఒక్కోసారి మనుషులు ఎన్ని రకాల వస్తువులు తొడుక్కొని ఆదర్శాలు వల్లే వేస్తారో. అవి నిజం అనుకొని వారితో మనం నడుస్తుంటే అసలు మనిషి రంగులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కథ కూడా వ్యక్తిత్వ నిర్మాణం పట్ల కడలికి ఉన్నా బలమైన అభిప్రాయాలను స్పష్టం చేస్తాయి.

ఏమి ఎరుగని ఎల్లిపాయ. ఈ కథ చదువుతున్నంత సేపు ఎక్కడో తప్పిపోయిన జీవితం నా కళ్ళ ముందు తారాడింది. చేయని తప్పుకి ఇల్లే నరకంగా మారుతుంది. ఎదుగుతున్న అమ్మాయిలకి ఒక్కోసారి సానుకూలంగా ఉండే ఒక్క సందర్భము ఎదురుపడదు. అన్నింటికీ తప్పున పడ్డాక గడప దాటేందుకు ఏ ఆడపిల్ల వెరవదు. అని గుర్తుచేసే వాస్తవానికి అద్ధం పట్టే గాథ కుటుంబంలో ఎందరున్నా అర్థం చేసుకునే వారు లేనప్పుడు నిన్ను నీవు కాపాడుకోవడానికి నిన్ను నువ్వు ఎంచుకోవడం తప్పనిసరి అని చెప్తుంది.

ప్రతి మనిషి  మనసులో అనేక భయాలు ఉంటాయి. ఆ భయాన్ని ఎదిరించడం నిజజీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఒక్కోసారి మనలో ఎడతెగని భయాన్ని, ఒంటరితనాన్ని మిగిల్చిపోతాయి. తెలియని వారి మధ్య వున్నా, అయినవారి మధ్య వున్నా మనల్ని మనం నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో చెప్తాయి ఈ కథలు.

ఈ పుస్తకంలోని కథలు అలసిన మనసుకి థెరఫీలా వుంటాయి, కొన్ని కథలు ఫిలసాఫికల్ థియరీలా ఉంటాయి.

పుస్తకం – సొంతిల్లు & మరికొన్ని కథలు

(కడలి కథలు -2)

రచయిత –  కడలి

  • కడలి పబ్లికేషన్స్

*****

Leave a Reply

Your email address will not be published.