యాత్రాగీతం

అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-20

-డా||కె.గీత

ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*

***

ఫ్రాన్స్ దేశం (రోజు-1) – సేక్రె కోర్ బసీలికా

మొత్తానికి పదిన్నరకి పారిస్ రైల్వే స్టేషనులో దిగాం. మేం దిగిన ఎదురు పట్టాలమీద కూడా మరో యూరోస్టార్ రైలు ఆగి ఉంది. ప్లాట్ ఫారమ్మీద జనాలు లేరు. కానీ పాతది అని మాత్రం తెలుస్తూ ఉంది. అక్కడక్కడా ప్లాట్ ఫారం ఊడ్చే వాళ్లలో నల్లవాళ్ళతో బాటూ, ఇండియన్స్ కనిపించారు. ప్లాట్ ఫారాల మీంచి పైన డూమ్ కప్పివున్న రెండు అంతస్తుల స్టేషను లోపలకి అడుగుపెడితే పూర్తిగా గతకాలపు భవంతిలోకి వచ్చినట్లే ఉంది. బయటికి దారి తెలీక ముందు ఎడమ  వైపుగా నడిచాం. బయట రెండవ ప్రపంచ యుద్ధం నాటి జర్మన్ సినిమాలోని వీథిని చూసినట్టు అనిపించింది. పెద్ద కట్టడం బయట నిర్మానుష్యంగా ఉంది. పైగా బయట ఎముకలు కొరికే చలిగా ఉంది.

మళ్ళీ వెనక్కొచ్చి జనాలు లోపలికి వస్తున్నట్లు అనిపించిన దారి గుండా వెళితే ప్రధాన ద్వారం కనిపించింది. రోడ్డుకి ఎదురుగా ఇలాంటిదే మరొక పెద్ద కట్టడం కనిపించింది. స్టేషను బయట అటూ ఇటూ తిరుగుతూ జనం ఉన్నా ఎందుకో క్షేమంగా అనిపించలేదు. అక్కడక్కడా తాగి పారవేసిన డ్రింక్ డబ్బాలు, సిగిరెట్ పీకెలతో అపరిశుభ్రంగానే ఉంది స్టేషను బయట. స్టేషను గట్లకి, రోడ్డుకి తేడా లేకుండా సిమెంటు ఇటికెలు పేర్చినట్లు ఉంది రోడ్డు. ఆ సర్కిల్ చుట్టూ అంతా ఒకేలాంటి కట్టడాలున్నాయని గమనించాను.

పారిస్ లోని ఈ ప్రధాన రైల్వే స్టేషను పేరు “గారే డు నోర్డ్” (Gare du Nord).  ఇది 1861లో ప్రారంభించబడినప్పటి  నించి నిరంతరాయంగా ఇతరదేశాల నించి రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయట. యూరపు ఖండంలోనే అతి పెద్ద స్టేషనట ఇది. సంవత్సరానికి దాదాపు రెండు వందల మిలియన్ల మంది ఈ స్టేషను గుండా వెళ్తూ ఉంటారట.

స్టేషను రోడ్డు దాటి ఎదురుగా ఉన్న భవంతి వైపు నడిచి లగేజీలు ఆన్చుకుని టాక్సీ వచ్చేవరకు చలిలో కూర్చున్నాం. పాపం మా సిరి ఎంత చలైనా “కియ్ కయ్” అనకుండా ఊరుకుంటుంది. పదకొండు గంటల వరకు అక్కడే ఉండిపోయాం.

మొత్తానికి మమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చిన పెద్ద షేర్డ్ ఆటో లాంటి వ్యాను ఎక్కాం. వ్యాను పైన రూఫ్  మొత్తం అద్దం ఉండడంతో చుట్టూ భవంతులు చక్కగా కనిపించసాగేయి. డ్రైవర్ కి మాకు మధ్య గ్లాసు బిగించి ఉంది.

ఎదురుబొదురుగా మూడు మూడు సీట్లు ఉన్నాయి. మా ఎదురుగా ఎవరూ లేనందున ఆ సీట్లు మడిచి మా లగేజీ మా కాళ్ళ దగ్గిరే సర్దిపెట్టేడు మా డ్రైవర్. ఇక అతనితో మాట్లాడాలంటే వ్యాను డోర్ కి ఉన్న ఎర్ర బటన్ నొక్కి మాట్లాడొచ్చని చెప్పాడు. నేను వ్యాను ఎక్కగానే వీడియో తీసుకునే హడావిడిలో సీటు బెల్టు పెట్టుకోకపోతే ముందాపని చెయ్యమని మా  డ్రైవర్ స్పీకర్ లో చెప్పాడు.

స్టేషను 10వ వీథిలో ఉంటే మా హోటల్ 17 వ వీథిలో ఉంది. దార్లో రోడ్లన్నీ చిన్న సందుల్లా చాలా సన్నగా ఉన్నాయి. పైగా అటూ ఇటూ పార్కు చేసి వున్న కార్లొకటి. మొత్తానికి ఓల్డ్ సిటీ లాగే అనిపించింది. దాదాపు ఇరవై నిమిషాల్లో హోటలుకి చేరేం.

ట్రిప్ మాస్టర్స్ లో బుక్ చేసుకున్న టూర్ కాబట్టి వాళ్ళు రికమండ్ చేసిన హోటలు బెస్ట్ వెస్ట్రన్ ప్లస్ ని తీసుకున్నాం. హోటల్లో లాబీ అనబడే చిన్న హాలు, మెట్లెక్కితే పైన చిన్న చిన్న గదులు కాసిన్ని, అంతే. అయితే అన్ని చోట్లకీ అనువుగా ఉందా ప్రదేశం. దగ్గర్లోనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. అయినా మేం ఇంగ్లాండ్ లో లాగా ఇక్కడ బస్సుల్లో, లోకల్  రైళ్లల్లో  మా సిరితో తిరగడం కష్టమని అనిపించి, ఆ పని విరమించుకున్నాం.

లాబీలో పాతకాలపు కుట్టు మిషను, టైపు మిషను వంటివి ఆర్ట్ పీసుల్లా అలంకరించారు. హోటలు బయటంతా ఎలా ఉన్నా గది మాత్రం ఉన్నంతలో విశాలంగా బానే ఉంది.

అప్పటికి మధ్యాహ్న భోజన సమయం కావడంతో హోటల్లో సామాన్లు పడేసి బయటికొచ్చి అలా నడిచి చూద్దామని అనుకున్నాం. అయితే పక్కనే చిన్న లెబనీస్ రెస్టారెంటు ఒకటి కనబడగానే వెంటనే మరో ఆలోచన లేకుండా లోపలికి వెళ్లి కూర్చున్నాం. ఎందుకంటే ఫ్రాన్స్ కి చెందిన మా కొలీగ్ ఒకమ్మాయి పారిస్ లో లెబనీస్ ఫుడ్ కాస్త స్పైసీగా బావుంటుందని చెప్పింది. నిజంగానే ఫుడ్ చాలా బావుంది.

అమెరికాలో మేం వెళ్లే మిడిల్ ఈస్ట్ రెస్టారెంట్ల కంటే చాలా రుచిగా వండేరు. ఫలాఫెల్ ర్యాప్, చికెన్ వంటివేవో ఆర్డర్ చేసాం. అయితే హడావిడిగా తినాల్సి వచ్చింది. ఎందుకంటే ఒంటిగంటకల్లా మేం మా టూర్లో భాగంగా ఊర్లో ప్రధాన విశేషాలు తిప్పి చూపించేందుకు ఒక “టుక్ టుక్” అనబడే ఆటోని మాట్లాడుకున్నాం.

నిజంగానే సరిగ్గా ఒంటి గంట కొట్టే సరికల్లా ఆ టుక్ టుక్ హోటలు ముందుకొచ్చి ఆగింది. ఆరుగురు కూర్చోగలిగే పెద్ద ఆటో అది. పైనంతా కూడా సీత్రూ తెరలు కట్టడం వల్ల చుట్టూ బిల్డింగులన్నీ బాగా కనిపించసాగేయి. అంతా బానే ఉంది కానీ చుట్టూ వర్షం వగైరా రాకుండా పలుచని ప్లాస్టిక్ తెరలు కట్టి ఉన్నా, ఆ రోజు మబ్బుగా ఉండడంతో చలి గాలిని తట్టుకోవడం కష్టమైపోయింది. మా బాధ భరించలేక డ్రైవరుకి చెపితే, అక్కడికీ ఒక చిన్న దుప్పటీ ఒకటి కప్పుకోమని ఇచ్చాడు మా డ్రైవరు కమ్ గైడు.  కానీ ముగ్గురికీ అది ఏపాటి! టుక్ టుక్ ని మేం అయిదు గంటల పాటు అద్దెకి బుక్ చేసుకున్నాం. అంటే సాయంత్రం ఆరుగంటల వరకు ఆ ఆటో వంటి టుక్ టుక్ మాతోనే ఉంటుందన్నమాట!

ఇక టూరులో పారిస్ లోని ప్రధాన ప్రదేశాల్లో మేం అక్కడుండే రెండు రోజుల్లో చూసేవి తప్ప, మిగతా వాటిల్లో వీలైనన్ని చూడాలని నిర్ణయించుకున్నాం.

అందులో మొదటిదైన సేక్రె కోర్ బసీలికా (Sacre Coeur Bascilica) కి ఇరవై నిమిషాల్లో చేరుకున్నాం. దార్లో చాలా వీథుల్లో రోడ్లు ముందు చెప్పినట్టు పలుచని రాళ్లు పేర్చినట్లు ఉండడంతో మా టుక్ టుక్ ఎగుడు దిగుడు రోడ్లలో పడ్డట్లు దడదడా అనసాగింది.

మొత్తానికి కాస్సేపట్లో  బసీలికాకి వెళ్లే దారి ఉన్న మెట్లకి దగ్గర్లో ఆపేడు మా డ్రైవరు. తలెత్తి చూస్తే ఎదురుగా ఎత్తున గుట్ట మీద ఆ మూల నించి ఈమూల వరకు ఉన్న మూడు వందల వెడల్పైన మెట్ల పైన అతి పెద్ద గోపురంతో “సేక్రె కోర్ బసీలికా” అత్యద్భుతంగా దర్శనమిచ్చింది. అప్పటి వరకు అంత పెద్ద డోముతో ఉన్న చర్చిని ఎక్కడా చూడలేదు మేం. చుట్టూ బానే రద్దీగా ఉంది. చుట్టూ ఇనుప చువ్వలకి గేటు మీద ఎక్కడ చూసినా లక్షలాది తాళం కప్పలు వేసి ఉన్నాయి. మెట్ల మీద తాళం కప్పలు, ఏవేవో చిన్న చిన్న బొమ్మలు అమ్మేవాళ్లు ఎక్కే వాళ్లు, దిగే వాళ్ళని కొనుక్కోమని అడుగుతున్నారు.

ఆ ప్రదేశాన్ని చూస్తే ఎందుకో ఆగ్రాలోని తాజ్ మహల్ ని మొట్టమొదటిసారి చూసినప్పటి ఆశ్చర్యానుభూతి గుర్తుకు వచ్చింది నాకు.

ఈ తాళం కప్పల్ని “లవ్ లాక్స్” అంటారట. అప్పుడప్పుడు ఈ తాళాలన్నిటినీ నగర నిర్వాహకులు తీసి పారవేయిస్తూ  ఉంటారట. పారిస్ లోని సీన్ నది (Seine River) మీద ఉన్న బ్రిడ్జిల మీద ఈ సంప్రదాయం అత్యధికంగా కనిపిస్తుంది. పారిస్ ప్రేమికుల నగరం కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రేమికులు ఇలా తాళం కప్ప మీద పేర్లు రాసి,  ఇలా రెయిలింగులకి తాళం వేస్తే తమ ప్రేమ భద్రంగా ఉంటుందని నమ్మకమట. పైగా తాళం భద్రంగా ఉండడానికి, తాళాలు నదిలో విసిరివేస్తారు కూడా. ఈ బసీలికా దగ్గిర మేం చూసినది ఆ సంప్రదాయమే.

సేక్రె కోర్ బసీలికా, సేక్రెడ్ హార్ట్ సంప్రదాయానికి చెందిన కేథలిక్ చర్చి. ఇది మోంట్ మార్త్రే (Montmartre) కొండ మీద ఉంది. ఈ మోంట్ మార్త్రే పారిస్ కి ఉత్తర భాగాన 430 అడుగులఎత్తున ఉంది. ఈ సేక్రె కోర్ బసీలికా పారిస్ లోని ఈఫిల్ టవర్ తరువాత అంతటి ప్రాముఖ్యాన్ని పొందిన కట్టడం. ఫెలిక్స్ ఫోర్నిర్ అనే క్రైస్తవ మత గురువు దీన్ని కట్టించాలని మొట్టమొదటగా తలపెట్టాడట.

1875లో మొదలుపెట్టి 1914 వరకు, అంటే  నలభై ఏళ్ల పాటు దీన్ని నిర్మించారట. పాల్ అబాదీ అనే ఆర్కిటెక్టు ప్రధానంగా దీని నిర్మాణానికి రూపురేఖలు దిద్దినా, మొత్తం అయిదుగురు భవనశిల్పులు (ఆర్కిటెక్టులు) దీని నిర్మాణ సారధ్యం వహించారట. దీని మధ్య గోపురం ఎత్తే 83 అడుగులు. మొత్తం ఎత్తు  దాదాపు 270 అడుగులు.

లోపల అతిపెద్ద హాలు ఉన్న ప్రధాన చర్చితో బాటూ, చుట్టూ విడివిడిగా ఉన్న చిన్న చిన్న ప్రార్ధనా ప్రదేశాలున్నాయి. అలాగే చిన్న మీనియేచర్ బసీలికా కూడా ఉంది. ఇక ఎంట్రన్సులో గాజు గిన్నెల్లో కొవ్వొత్తులు కొనుక్కుని వెలిగించడానికి పెద్ద స్టాండు ఉంది. అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలనుకునేవారు స్టాండుని ఆనుకుని ఉన్న బాక్సులో ఒక్కో కొవ్వొత్తికి  రెండు యూరోలు చొప్పున వేసి వెలిగించ వచ్చు. మేమిద్దరం చెరో కొవ్వొత్తీ వెలిగించాం.

దాదాపు అరగంటలో చర్చి సందర్శనను ముగించుకుని మెట్లు దిగి వస్తూ చెక్క బొమ్మలు అమ్ముతున్న ఓ సిక్కు పెద్దమనిషి దగ్గిర  పదేసి యూరోలు పెట్టి ఇంగ్లీషు అక్షరాల చెక్క బొమ్మలు కొన్నాం. అవి పిల్లల పేర్లలో అక్షరాల్ని కలుపుతూ రైలు బండి ఆకారంలో ఉన్న నేమ్ బోర్డులన్నమాట. విశేషంగా కనిపించింది నాకైతే. మా సిరికి కూడా బాగా నచ్చింది. ఇప్పటికీ తన గదిలో బుక్ షెల్ఫ్ మీద భద్రంగా దాచుకుంది దానిని.

అక్కణ్ణించి బయలుదేరి తరువాత ప్రదేశానికి చేరుకునేలోగా ఇండియలోలాగా ద్విచక్రవాహనాలు నడుపుతున్న వాళ్లని అధికంగా చూసేం. ఇక రోడ్లన్నీ రాళ్లు వరసగా పేర్చినట్లు ఉండడంతో ఎక్కడికక్కడ గతుకుల్లోంచి నెమ్మదిగా సాగసాగింది ట్రాఫిక్.

*****

(సశేషం)

Leave a Reply

Your email address will not be published.