పౌరాణిక గాథలు -46

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

ఇంటి దొంగలు
క్షేమదర్శి కథ

క్షేమదర్శి మహారాజు చాలా మంచివాడు. ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో ’కాలవృక్షీయుడు’ అనే పేరు గల ముని ఉండేవాడు. ఆయన దగ్గర భూత, భవిష్యత్తు, వర్తమానాల గురించి తెలిసిన ’కేశకి’ అనే పేరు గల కాకి ఉండేది. దానికి దొంగల్ని పట్టుకో గలిగిన శక్తి ఉంది.

ఒక రోజు మహర్షి రాజుని కలిసి “మహారాజా! మీ మంచితనమే మీకు శత్రువయింది. మీ చుట్టూ ఉన్నవాళ్ళే మీకు గోతులు తవ్వుతున్నారు. ఆ విషయం మీకు తెలియట్లేదు. మీరు మీ రాజ్యంలో ఉన్న దొంగల్ని పట్టుకుని శిక్షించాలని అనుకుంటున్నారు. మీ అంత:పురంలోను, కోటలోపల, తలుపుల దగ్గర ఉన్న దొంగల్ని పట్టుకోలేక పోతున్నారు. అందుకోసం మీ కోసం దొంగల్ని పట్టుకో గలిగిన ఒక కాకిని తెచ్చాను” అన్నాడు.

క్షేమదర్శి మహారాజు ఆశ్చర్యపోయాడు. “మహర్షీ! దొంగల్ని పట్టుకోవాలంటే కుక్క కదా ఉండాలి. మీరు కాకి అంటున్నారు?” అని అడిగాడు.

“మహారాజా! ఈ కాకి పేరు కేశకి. దీనికి మూడు కాలాల గురించి తెలుసు. దొంగల్ని కూడా పట్టుకుంటుంది. దీన్ని ఒకరోజు మీ దగ్గరే వదిలి వెడతాను. అప్పుడు నిజం అవునో కాదో మీకే తెలుస్తుంది” అన్నాడు మహర్షి.

రాజు ఆలోచనలో పడ్డాడు. “మహర్షీ! అయితే నా అంత:పురంలో దొంగలున్నారంటారా? మీరు చెప్పిందే నిజమైతే ఈ కాకిని ఇక్కడే ఉంచండి. రెండు రోజులు చూసిన తరువాత దీన్ని ఉంచాలా…లేదా అనేది నిర్ణయిస్తాను” అన్నాడు రాజు.

కేశకిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు మహర్షి. వెడుతూ వెడుతూ అంత:పురంలోను, కోట తలుపుల దగ్గరా ఆగి, రాజుగారి దగ్గర దొంగల్ని పట్టించే కాకి ఉందనీ…అది ఇప్పటికే కొంత మంది పేర్లు కూడా చెప్పేసిందనీ…దానికి మాటలు కూడ వచ్చనీ…అది చెప్పిన మాటల్ని బట్టి దొంగలందరూ కోట లోపలి వాళ్ళేనని రాజుకి తెలిసిపోయిందనీ…అందర్నీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి వెళ్ళిపోయాడు మహర్షి.

ఆ మాటలు విని భటులు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. వాళ్ళ భయం బయటికి కనిపించకుండా “మహర్షీ మీరు మంచిపనే చేశారు. ఈ రకంగా అయినా దొంగలు బయట పడతారు” అన్నారు.

రాత్రయింది అందరూ నిద్రపోయారు. దొంగల బాధ పడలేకుండా ఉన్నాము. ఈ ఒక్కరోజు గడిచిపోతే రేపటికి దొంగలు పట్టుబడి పోతారు” అనుకుంటున్నాడు రాజు. తెల్లారితే మన పని ఏమవుతుందో అనుకుంటున్నారు దొంగలు.

తెల్లారింది…ఎవరికి వాళ్ళే నిశ్శబ్దంగా ఉన్నారు. అలాగే నిశ్శబ్దంగానే కొంత సమయం గడిచి పోయింది. విషయం అందరికీ అర్ధమైపోయింది. కాకిని ఎవరో చంపేశారనీ…కాకిని చంపినవాడు దొరికాడనీ…కాకిని చంపిన వాడితోపాటు దొంగ కూడా పట్టుబడ్డాడనీ…దొంగ చుట్టూ ఉన్న ముఠా మొత్తం పట్టుబడ్డారననీ చెప్పుకుంటున్నారు.

దొంగని పట్టిచ్చే కాకిని ఇచ్చినందుకు మహర్షిని అభినందించారు రాజుగారు. ఏ తప్పూ చెయ్యని కాకి మాత్రం చచ్చి పోయింది. దాని చిన్న మెదడు, చిన్న శరీరం పెద్ద రాజ్యాన్ని కాపాడిందని ప్రజలందరూ కాకిని అభినందించారు.

రాజుగారు మహర్షిని పిలిచి “మహర్షీ! మీ వంటి వారు మా రాజ్యంలో ఉంటే మాకందరికీ సంతోషంగా ఉంటుంది. ఈ రోజు నుండి మీరే మా రాజ్యానికి మంత్రివర్యులు!” అని చెప్పారు.

మహర్షి రాజుగారి అభ్యర్ధనని మన్నించారు. ఆ రోజు నుండి క్షేమదర్శి మహరాజుకి మహర్షే మంత్రివర్యులుగా నియమించబడ్డారు. ప్రజలు కూడా సంతోషించారు.

కాని, అందరికీ తెలియనిది మాత్రం ఒకటి ఉంది. ఆ కాకి కాలజ్ఞాని కాదని, దానికి దొంగల్ని పట్టుకోడం రాదని, అది మామూలు కాకేనని!

ఇంటి దొంగల్ని ఈశ్వరుడే కాదు కాకి కూడా పట్టగలదు!

*****

Leave a Reply

Your email address will not be published.