
నెచ్చెలి
(నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– టి.జ్యోతి
నిండు జీవితపు ప్రేమ పెట్టుబలో
కాసింత ఆప్యాయతకు అర్రులు చాస్తూ,
రద్దీ రహదారికి ,
ఓ పక్క, ఓరగా
చూస్తున్న ఓ చిలుక,
తోడుగా వారగా నుంచున్న ఓ గోరువంక
పరస్పర విరుద్ధ భావాల మధ్య సంఘర్షణ.
ఆప్యాయతను పెంచిన ప్రేమ అస్త్రమై
ఆవేదనకు గురిచేస్తుంటే విరహాన్ని ఓపలేక
ఒకరు తూర్పునకు,
మరొకరు పడమరకు.
కానీ
తోడుగా ప్రయాణం
మనసులు యుద్ధం చేస్తుంటే,
చేతలు సంధికి రాయబారాన్ని నడుపుతున్నాయి.
వాలిన పొద్దు చేసిన సంకేతానికి,
ఆగని ఆ యుద్ధం.
నిశ్శబ్దపు వొప్పందానికి
నిలువునా కరిగిన నెచ్చెలి
చిరునవ్వే సంకేతంగా శాంతి పతాకాన్నెగుర వేసింది
అపరాద సుంకం కింద
సామ్రాజ్యాధి నేత్రి
అనుగు నెచ్చెలికి
జీవిత కాలం
ఖైదీగా బంధీ అయ్యేందుకు
ప్రకటన
దాడి జరగని దండయాత్రలో
విస్తరించిన ప్రేమ సామ్రాజ్యానికి
నెచ్చెలే నియంత
*****

టి. జ్యోతి ఉపన్యాసకురాలు, తెలుగు విభాగం రాయగడ స్వయంప్రతిపత్తి కళాశాల, రాయగడ (ఒడిశా)
