
కనక నారాయణీయం -84
–పుట్టపర్తి నాగపద్మిని
కనకమ్మ అంది,’అది కాదమ్మా! కరపాత్రీ స్వామీజీ వారికి మొదటినుంచే యీ ప్రపంచంలోని సుఖాలూ, బాధలూ అంటే పడేది కాదట! ముందే సన్యాసం తీసుకుందామనుకుంటే వాళ్ళ తండ్రిగారు ఒప్పుకోలేదంట! చివరికి 19 సంవత్సరాల వయసులో సన్యాసం తీసుకుని, హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ వేద పాఠశాలల్లో, వేదాలూ, ఉపనిషత్తులూ, వేదాంతం, వ్యాకరణం ఇంకా వేరే శాస్త్రాలూ అన్నీ, అంటే భారత దేశ సంస్కృతికి సంబంధించిన గొప్పదనమంతా చక్కగా ఆకళింపు చేసుకున్నాక, భారతీయ ధర్మాన్ని రక్షించాలంటూ ప్రచారం మొదలు పెట్టినాడంట ధర్మ సంఘ్ అన్న పేరుతో! ఆయన మాటలకు ప్రభావితులైన వాళ్ళు కొందరు, ఆయనతో పాటే ఉంటూ, భారతీయత గొప్పదనం గురించీ, వేదాల గొప్పదనం గురించీ ప్రచారం చేయడం మొదలు పెట్టినారట! ఆయన తనకంటూ ఒక నియమం భోజనానికి సంబంధించి పెట్టుకున్నాడు. తిండి మీద ధ్యాస ఎక్కువైతే, లక్ష్య శుద్ధి వుండదని ఆయన అభిప్రాయం. తన నియమాన్ని తాను పాటిస్తూ, భారతీయత గొప్పదనం గురించి పిల్లలూ, యువకులూ అందరికీ అర్థమయ్యే విధంగా యీ విధంగా తన బృందం వాళ్ళను పంపి బోధిస్తూ ఉంటాడన్నమాట!’
నాగ అంది,’అవునమ్మా! ఆయన శిష్యులు భలే మాట్లాడినారు. ఒకాయన హిందీలో మాట్లాడుతూ ఉంటే, ఇంకొకాయన తెలుగులో చెబుతున్నాడు. ఆ పెద్ద స్వామి అనుభవాలూ, ధర్మమంటే అర్థమేమిటి? ఎట్లా పాటించవలె అన్నీ! నాకు భలే నచ్చిందమ్మా.’
కళ్ళు తిప్పుతూ చెబుతున్న నాగను చూసి ముచ్చటగా దగ్గరకు తీసుకుని కనకమ్మ అడిగింది,’అబ్బో, చాలా విషయాలు తెలుసుకున్నావన్నమాట! ఐతే ఇప్పుడు అమ్మకు చెప్పు, ధర్మమంటే ఏమిటి?’
ఊహించని ప్రశ్నకు నాగ తెల్లమొహం వేసింది. ‘అంటే..అంటే..!’
‘నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నిజం చెప్పడం, పెద్దవాళ్ళను గౌరవించడం, ఎవరికైనా సహాయం చేయడం, నీకున్నదాన్ని వేరే వాళ్ళతో పంచుకోవడం, వేరేవాళ్ళకు కష్టం కలిగించకుండా వుండడం, ఎక్కువ మందికి ఏది మంచైతే అదే చేయడం, మన పనులన్నీ సక్రమంగా చేస్తూ ఉండడం – ఇవన్నీ ధర్మం కిందికే వస్తాయి తల్లీ!!’
శ్రద్ధగా వింటున్న నాగ అంది,’నిజమేమ్మా! ఆ పెద్దాయన ఇవన్నీ ఆ రోజు మాకు చెప్పినారు. మా పిల్లలకు చెప్పిన సంగతులు.ఎవరితోనూ కొట్లాడవద్దు. వాళ్ళ వస్తువులు బలవంతంగా తీసుకోవద్దు. టీచర్లనూ, ఇంట్లో అమ్మా అయ్యా వాళ్ళనూ, ఇంకా వయసులో పెద్దవాళ్ళనూ గౌరవించాలనీ చెప్పినారు. ఇంకొకటి, నీ చుట్టుపట్ల నీకెట్లా వుంటే బాగుంటుందనిపిస్తుందో, అంటే కొట్లాటలూ, ఏడుపులూ.. ఇవన్నీ లేకుండా వుంటే బాగుంటుందనిపిస్తుంది కదా, అట్లా నువ్వూ వుండాల, నువ్వుంటే, నీ చుట్టు పక్కల కూడా అట్లే ఉంటుందని చెప్పినారు.’
నాగ మాటలు వింటూ ముచ్చటేసి కనకమ్మ దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది.
***
‘అమ్మా? అమ్మా?’
తళిహింట్లో ఉన్న కనకమ్మ తలవాకిటిదాకా వచ్చింది,’ఎవరూ?’ అంటూ!
ఎదురుగా వెంకట సుబ్బయ్య చేతిలో బరువైన రెండు సంచులతో!
‘నువ్వా వెంకటసుబ్బయ్యా! రారా!’ అన్నదామె, నవ్వు ముఖంతో!
చేతిలోని బరువైన సంచులు ఆమెకందించాడు వల్లంపాటి.
‘ఎందుకయ్యా ఇవన్నీ ఇప్పుడు?’
‘అమ్మా! మీరు మంచిమాటొకటి చెప్పడం వల్లే కదా, మా మునిసిపల్ కమీషనర్ గుంటూరు శేషేంద్ర శర్మ గారి కావ్యానికి అయ్యగారు ముందు మాట వ్రాసినారు. ఈ సంగతి మా తండ్రిగారితో అంటే, ఆయన న్నారు, విష్ణుమూర్తి ప్రక్కన పురుషకార స్వరూపిణి మహాలక్ష్మి లేకపోతే, ఈ ప్రపంచం ఇట్లా ఉండేది కాదూ! అని! స్వామి, ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో వచ్చి, తనను ఇబ్బంది పెడుతున్న భక్తులను చూసి, విసుగుతో తల తిప్పుకుంటాడట! అప్పుడు ఆయమ్మ,’ఏమి స్వామీ ఇది? వాళ్ళంతా మన పిల్లలు కదా? తల్లిదండ్రులను కాక ఇంకెవరిని అడుగుతారు వాళ్ళు? ధర్మ బద్ధంగా వున్న వాళ్ళ కోరికలు మీరు తీర్చవలసిందే!’అని గట్టిగా చెబుతుందట! అప్పుడింక స్వామికి భక్తుల కోరికలు తీర్చక తప్పదంట! లక్ష్మీదేవి స్వామితో యీ పనులు చేయిస్తుంది కాబట్టే ఆమె పురుషకార స్వరూపిణి. అట్లే నారాయణా చార్యులకు వారి శ్రీమతి కూడా!’అని!
కనకమ్మ ముఖంలో పల్చటి చిరునవ్వు.
‘శేషేంద్ర శర్మ గారు మాకందరికీ చిన్న పాటి పార్టీ ఇచ్చినారమ్మా! అయ్యగారి అభిప్రాయం, తన కావ్యం విలువ పెంచిందన్నారాయన! ప్రింటింగ్ లో ఉందా బుక్కు! ఆయనే పుట్టపర్తి వారి ఇంటికి పోయి యీ సంగతి చెప్పి రమ్మని పంపినరు. ఆయన రావాలంటే. తొందరగా వీలవదు. అందుకనీ కాకినాడ నుంచీ కాజాలు పూతరేకులూ తెప్పించినారు. నా ద్వారానే యీ పని జరిగింది కాబట్టి నా ద్వారానే ఇవన్నీ మీకు చేరాలని నన్నే మీకు, స్వామికీ కృతజ్ఞతలు చెప్పమని పంపినరాయన!
అయ్యగారెక్కడమ్మా?’
‘రామకృష్ణ సమాజంలోనే ఉంటారు . ఇంకెక్కడికీ పోరు. చూడు మరి. కాఫీ తెస్తానుండు.’
‘వద్దమ్మా! అయ్యగారిని కలుసుకొని వీలైతే వారితోపాటూ ఇంటికొస్తాను మళ్ళీ!’
నమస్కరించి వల్లంపాటి వెళ్ళిపోయాడు.
అతను తెచ్చిన ఒక సంచీ నిండా ఆపిల్ పళ్ళూ, అరటి పళ్ళూ, మరో దానిలో జాగ్రత్తగా పేక్ చేసిన కాకినాడ కాజాలూ, పూతరేకులూ ఉన్నాయి.
***
‘ఏమి స్వామీ? బాగున్నారా?’
కాళిదాసు రఘువంశం కావ్య పఠనంలో ఏకాగ్రతతో మునిగి వున్న పుట్టపర్తి ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. తలెత్తి చూస్తే, ఎదురుగా, గజ్జెల మల్లారెడ్డీ, రాచమల్లు రామచంద్రా రెడ్డీ, వై.సీ.వీ.రెడ్డీ నవ్వుతూ కనిపించినారు.
‘ఒరె ఒరె! అందరూ ఒకేసారి కట్టగట్టుకోని వచ్చినారేమప్పా?’ నవ్వుతూ పలకరించారాయన.
గజ్జెల మల్లారెడ్డి, అక్కడే ఓ మూల ఉన్న చాపను తీసి కింద పరుస్తూ అన్నాడు,’ఎంతమందొస్తే ఏమి స్వామీ? నువ్వు తలెత్తి మమ్మల్ని చూడనే లేదే?’
ఫెళ్ళున నవ్వుతూ వై.సీ.వీ. అందుకున్నాడు,’మా సామికి ఆ కావ్యాటవుల్లో విహరిస్తూ ఉంటే, ఎదురుగా సింహమొచ్చి నిలబడినా పట్టించుకోరులేబ్బా!’
వాళ్ళ ఈ పరిహాసాలను తానూ చిరునవ్వుతూనే స్వీకరిస్తూ పుట్టపర్తి అన్నారు,’అది సరేలేగానీ, ఇంతకూ ముగ్గురూ ఒక్కసారి నామీద దాడికి వచ్చినారెందుకప్పా?’
*****
(సశేషం)

సరస్వతీపుత్ర గా, చతుర్దశభాషా పరశేషభోగిగా చిరపరిచితులైన పుట్టపర్తి నారాయణాచార్యులవారు (1914 – 1990) , వారి ధర్మపత్ని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సత్కార గ్రహీత శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ (1921 – 1983) దంపతుల కుమార్తెగా జన్మించటమే గొప్ప వరమనీ, ఆ ఇంటిపేరే గొప్ప బిరుదని నాగపద్మిని గారంటారు. విద్యార్హత – హిందీలో ఎం.ఏ ఎం.ఫిల్. పీహెచ్.డీ. తెలుగు ఎం.ఏ. జర్నలిజం, అనువాదకళ, టీవీ నిర్మాణకళలలో పీజీ డిప్లమోలు; ఆకాశవాణి, దూరదర్శన్ లలో ముప్పైఐదేళ్ళ ఉద్యోగ జీవితంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుధా ప్రశంసనీయమైన వందలాది కార్యక్రమాల నిర్వహణ; తెలుగు హిందీలలో యాభైదాకా పద్య, సాహితీ వ్యాస,కథ, నాటక, అనువాద రచనలు; తెలుగు విశ్వవిద్యాలయ, తమిళనాడు హిందీ అకాడెమీ, బిహార్ సాహిత్య సమ్మేళన్, గోఎంకా జాతీయ అనువాద పురస్కారాలూ, శ్రీయుత వైయస్. రాజశేఖర రెడ్డి, ఎన్.డ్.తివారీ,డా.రోశయ్య, డా. మృదులాసిన్ హా (ప్రస్తుత గోవా గవర్నర్) వంటి రాజకీయ ప్రముఖులచే సత్కారాలూ; తెలుగు రాష్ట్రాలలోనే కాక, ఖరగ్ పుర్, పాట్నా, చెన్నై, అమెరికాలో న్యూజెర్సీ, డల్లాస్, పెన్సిల్వేనియా, అట్లాంటా, వాషింగ్టన్ సాహిత్యసమావేశాల్లో ప్రసంగానంతర సత్కారాలు; . గత పదిహేనేళ్ళుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రత్యక్ష ప్రసారాలలో హిందీ/తెలుగు వ్యాఖ్యాత. జయజయశంకర, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ మొదలైన మాధ్యమాలలో యాభైకి పైగా ఆధ్యాత్మిక ప్రసంగాలు; అన్నిటికంటే మించి, పుట్టపర్తి వారి శతజయంతి (1914-2014)సందర్భంగా పుట్టపర్తి పద్య, కథ, నవల, అనువాద, విమర్శ సర్వస్వాల ప్రచురణ (నాలుగువేల పుటల బృహత్ ప్రచురణ).
