నిరీక్షణ

इंतजार

హిందీ మూలం – డా. ఆశా పాండే

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

ఎంతోకాలంగా వ్యాకులతతో భారంగా ఉన్న ఈ కళ్ళలో కొద్దిరోజులనుంచి ఒక ఆశాకిరణం తొంగిచూస్తోంది. దాని మెరుపుతోనే నేను వరండాలో నిలబడి మోహిని కోసం ఎదురుచూస్తున్నాను. ఇవాళ నేను ఆమెతో మాట్లాడకుండా విడిచిపెట్టను.

ఈ రెండేళ్ళలో ఈ అమ్మాయి నాకు ఎంతగా లోటు తీర్చింది. ఎంతగా నాకు స్వంత మనిషిలా అయిపోయింది. నా జీవితంలో అయితే మొత్తం రంగులన్నీ అదృశ్యమైపోయాయి. నాకు మిగిలిందంటూ ఏం వుంది కనుక!ఒక రిక్తమైపోయి పాడుపడిన జీవితాన్ని ఎలాగో ఈడ్చుకుంటూ బతికేస్తున్నాను. అలా ఈడ్చుకుంటూ వస్తున్న సమయంలోనే ఒక పొరుగావిడ నాకు ఒక పోర్షన్ అద్దెకి ఇవ్వకూడదా, మీ ఒంటరితనం లేకుండా పోతుంది, కాస్త సాయంగా కూడా ఉంటుంది అని సలహా ఇచ్చింది. అది ఎంత మంచి సలహా అని, నాకు ఇంతవరకూ ఎందుకు తోచలేదని అనిపించింది. తరువాత బాగా ఆలోచించి, వెనకాల వైపు ఉన్న రెండు గదులని మోహినికి అద్దెకిచ్చాను.

మోహిని ఇంకా పెళ్ళికాని పిల్ల. ఒకత్తే ఉంటోంది. ఉద్యోగం చేసుకోవాలని ఈ పట్టణానికి వచ్చింది. తల్లిని తను ఎప్పుడో కోల్పోయింది. నేను తనకి తల్లిలాగా అనిపించానో ఏమో,  చివరికి నా బాధ్యతలన్నీ నెమ్మదిగా తను తీసుకోసాగింది. ఇప్పుడయితే తను లేకుండా నాకు అసలు ఏ పనీ జరగదు.

మోహిని ఆఫీసునుంచి వచ్చే సమయం అయింది. ఒక అరగంటనుంచి నేను వరండాలో నిలబడి తనకోసం ఎదురుచూస్తున్నాను. నాకు కాళ్ళలో కొంచెం వణుకు మొదలయింది.

“ఇప్పుడింకా డబ్భయ్యేకదా పూర్తి అయ్యాయి ఆంటీ, ఇంత నీరసంగా ఉండకూడదు. కాస్త భోజనం విషయంలో శ్రద్ధ తీసుకోండి.”

“డబ్భై మోహినీ, డబ్భై! ఇది తక్కువ వయస్సేమీ కాదు. దీనికి శక్తిహీనత అనేది వస్తుంది. జీవితంలో సుఖసంతోషాలు దూరమైపోయినప్పుడు వణుకు పుట్టడంలో ఎంతసమయం పడుతుంది.”

మోహిని కొంచెం తీక్షణంగా చూసింది. నేను నవ్వేశాను.

ఇవాళ ఈ అమ్మాయికి ఇంత ఆలస్యం ఎందుకవుతోంది? నా మనస్సులో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. వాటిని నేను అణిచేస్తున్నాను. ఏమిటో విచిత్రంగా ఉంది. నేను మంచిగా ఏమీ ఆలోచించలేకపోతున్నాను. నాగురించి కూడా, వేరేవాళ్ళ విషయంలో కూడా. వరండాలో చాలాసేపు నిలబడివుండిఅలిసిపోయాను. గదిలోకి వచ్చేశాను. వంటింట్లోకి వెళ్ళి ముందు ఒక గ్లాసుతో మంచినీళ్ళు తాగాను. తరువాత గదిలోకి వచ్చి మంచంమీద పడుకున్నాను.

పక్కమీద పడుకునివుండే, కాళ్ళని ఇటూ-అటూ తిప్పుకుంటున్నాను. కొంచెం చలిగా అనిపిస్తోంది. దుప్పటి దగ్గరగానే పెట్టి ఉంది. తీసుకుని కప్పుకుందామని అనిపిస్తోంది. నిజానికి ఈవూళ్లో ఇంత చలి ఉండదు. కాని ఈసారి ఇక్కడ చలి కొంచెం ఎక్కువగానే ఉంది.

“ఇక్కడ చలి ఏముంది ఆంటీ, మీరు మనస్సుని నిబ్బరం లేకుండా చేసుకుంటున్నారు. అందుకే మీకు చలి అనిపిస్తోంది. ఇది వయస్సు సమస్య కాదు. మీ ఆశలని, సంతోషాన్ని దూరంగా నెట్టివేసుకున్నదానికి  ఫలితం. మనస్సుని చల్లగా ఉంచుకుంటే ఒళ్ళు కూడా చల్లగానే ఉంటుంది కదా.”

ఎంత ఆత్మీయంగా కోప్పడుతూ ఉంటుంది మోహిని!

నేను మంచంమీదనుంచి లేచి వెళ్ళి డ్రస్సింగ్ టేబిల్ ముందు కూర్చున్నాను. కొంచెంసేపు అలాగే కూర్చుని వుండి, తరువాత దువ్వెన తీసుకున్నాను. అద్దంలో చూసుకుని నవ్వుకున్నాను.- “జీవితాన్ని ఉత్సాహంగా గడపండి ఆంటీ.” మోహిని తరచు అంటూఉంటుంది.

ఉత్సాహం! ఉత్సాహంతోనే జీవితం నిండిపోయి ఉండేది. కాని అనుకోకుండా…

తల దువ్వుకుని నేను ముఖం కడుక్కున్నాను. క్రీమ్ రాసుకున్నాను. మళ్ళీ వరండాలోకి రావాలని అనుకుంటున్నాను. చూడు మోహినీ, నేను ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండటం మొదలుపెట్టాను. కాని, డ్రస్సింగ్ టేబిల్ దగ్గరనుంచి లేచి వరండాలోకి వెళ్ళేబదులు మళ్ళీ నేను మంచం మీదనే కూర్చున్నాను. అప్పుడప్పుడూ రోజు గడవడం అనేది ఎంత భారంగా ఉంటుంది. అది గడవదు. దాన్ని గడపవలసి వస్తుంది. ఈరోజులే ఒకప్పుడు చిన్నవిగా అనిపించేవి. ఈ పగళ్ళు అనేవాటిని కొంచెం లాగి పెద్దవిగా చేస్తే ఇంకా నాలుగు పనులు పూర్తిచేసుకోవచ్చుకదా అని ఎన్నోసార్లు అనిపించేది. అప్పుడు ఎంత ఉత్సాహం, ఎంత ఉల్లాసం నిండి ఉండేదో.కాని మరి ఇప్పుడు…! ఇప్పుడైతే ఉత్సాహాన్ని పిలవవలసి వస్తుంది. అయినా కూడా అది రాదు.

వరండాలోకి వెడదామని ఉంది. కాని మంచంమీదనే కూర్చుండిపోయాను. ఇప్పుడు పడుకున్నాను కూడా. అలసటతో ఒత్తిగిల్లాను. ఒళ్ళంతా కొంచెం నొప్పులుగా ఉన్నట్లు అనిపించింది. ప్రకాశ్ కనుక ఉంటే నవ్వుతూ అనేవారు- “ఇప్పుడు నీ ఎముకలకి నూనె పట్టించు. ఎంత సన్నబడిపోయాయో చూడు.”

సన్నబడిపోకుండా ఇప్పుడు ఏంమిగిలిందని. మనస్సు కూడా మొత్తం అంతా శుష్కించిపోయింది. ఎముకలకైతే నూనె పట్టిస్తాను. కాని మనస్సుకి ఏం చెయ్యను ప్రకాశ్!

సంజచీకటి చిక్కబడుతోంది. బలవంతంగా కప్పుకున్న నా ఉత్సాహం ఇంక నీరుకారిపోతోంది. బహుశా మోహిని ఇవాళ ఆలస్యంగా వస్తుందేమో… తను ఎప్పుడైనా రానీ, ఇవాళ నేను తనతో మాట్లాడతాను.

ఇన్నిరోజులుగా మోహిని ఇంతగా తనకి ఆత్మీయురాలైపోయింది. రానూ స్థానాన్ని తను తీసుకుంది. కాదు-కాదు, రానూ స్థానాన్ని కాదు. ఈ ఆలోచనతోనే నాకు కలవరం కలుగుతుంది. తను రానూ కన్నా కూడా ఎక్కువ. రానూ నా కడుపున పుట్టిన బిడ్డ. కాని నన్ను ఒంటరిగా విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోయింది. ఎవరన్నారు కూతుళ్ళు తల్లిని విడిచిపెట్టి వెళ్ళరని! విడిచిపెడతారు. అంతేకాదు. పూర్తిగా విడిచిపెట్టేస్తారు… పెళ్ళి చేసుకుని వెళ్ళి కెనడాలో సెటిల్ అయింది! ప్రకాశ్ అన్నది, ఈ అబ్బాయి తనకి ఇష్టంలేదనే కదా. ఆయనకి తిరిగి పెడసరంగా ఎలా జవాబిచ్చింది- “అయితే నా జీవితంలో ఏం జరగాలి, ఎలా జరగాలి అన్నది మీరు నిర్ణయిస్తారా?”

దిమ్మతిరిగేలాగా చెప్పిన జవాబు తో ప్రకాశ్ దవడమీద వాయించినట్లయింది. ప్రకాశ్ ఏమీ మాట్లాడలేదు. కేవలం మౌనం వహించడమేనా! కాదు. అంతకన్నా ఎక్కువగా, కూతురినుంచి దూరంగా జరిగారు. కూతురు కూడా దూరంగా వెళ్ళిపోయిందంటే, మళ్ళీ తిరిగి రాలేదు. తండ్రిగారి మౌనం తనని ఏమీ విచలితురాలిని చెయ్యలేదు. నేను హితవు చెబుతూ అన్నదానివల్ల కూడా తనమీద ఏమీ ప్రభావం పడలేదు. తను స్వతంత్రమైన ఆలోచనలతో నిండిపోయింది. వద్దని చెప్పిన ఒక్కమాట కూడా సహించలేకపోయింది. అసలు నేనే కన్నానా దీన్ని!  అప్పుడప్పుడూ భ్రమ కలుగుతుంది. నేను ఒక సంప్రదాయకమైన  ఆలోచనలు ఉన్నమనిషిని. తను పూర్తిగా ఆధునికంగా ఉన్న ఒక మోడరన్ అమ్మాయి. తనకి సంస్కారం ఇవ్వడంలో ఏమన్నా పొరపాటు జరిగివుంటుందా? ఇప్పుడు అసలు సంస్కారం అనేది ఎవరికి కావాలి!  కొడుకులకీ అక్కరలేదు, కూతుళ్ళకి కూడా అవసరం లేదు. సంస్కారం అనే దానికి నిర్వచనం మారిపోయింది! ఈ తరం వాళ్ళమైన మనం మన పెద్దవాళ్ళని కూడా సహించాము, మన పిల్లలని కూడా సహించుకోవలసి వస్తోంది… పెద్దలనైతే సహించుకున్నాం. కాని మరి పిల్లలు!! సహించుకునే అవకాశం కూడా ఇవ్వరు వీళ్ళు. ఏమాత్రం వ్యతిరేకత కనిపించినా విడిపోయి దూరంగావెళ్ళినుంచుంటారు…రానూ దూరంగానే వెళ్ళిపోయి నిలబడింది. దాని మనస్సులో మమత అనేది ఏమాత్రం మిగల్లేదు! పెళ్ళి చేసుకున్నప్పుడు ఇంట్లో చెప్పింది. కాని ఒకింత వ్యతిరేకత పొడచూపగానేదూరంగా వెళ్ళిపోయింది.

ఆరోజునుంచి ప్రకాశ్ మౌనంగానే ఉండసాగారు. కాని, నాకు చెప్పేవారు- “ఎందుకింత బాధపడతావు నువ్వు, సంతోషంగా ఉండు. లేకపోతే నీకు షుగర్ పట్టుకుంటుంది. లేదా కిడ్నీ ఏదయినా పాడైపోతుంది… జీవితంలో కేవలం పిల్లలు మాత్రమే సర్వస్వం కాదు వాళ్ళకోసం నీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడానికి.” మరి మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నేను అడగాలనుకునేదాన్ని. కాని నేను మాత్రం ఎలా అడగ్గలుగుతాను. నాకు సలహా ఇచ్చే సమయంలో ప్రకాశ్ చెమ్మగిల్లిన కళ్ళు నానుండి ఎలా తప్పించుకోగలిగేవి? నాకు అంతా అర్ధమయ్యేది. ప్రకాశ్ తనలో తానే మథన పడేవారు. … విచిత్రం ఏమిటంటే, నేను బాగానే ఉన్నాను. కాని ప్రకాశ్ కి కిడ్నీ పాడైపోయింది! ఆయన వెళ్ళిపోయిన తరువాత కూడా రానూ రాలేదు. దాని స్నేహితురాలి ద్వారా కబురు అందజేశాను. తన నెంబరు సేకరించి మాట్లాడాను కూడా. దాని కంఠస్వరం కూడా ఎంత నిర్వికారంగా ఉంది- “రావడానికి ప్రయత్నిస్తాను.”

“ప్రయత్నించడం కాదమ్మా. తప్పకుండా రా. ఆయన మీ నాన్నగారు.”నేనెంత వేడుకున్నా, నా మాట కూడా నిరుపయోగమైపోయింది. కాస్తంత వ్యతిరేకత కనిపించగానే, దానికి ఇంతగా దూరమైపోవాలా?

రానూ ఏమైనా అంతర్మథనం చెందడంలేదు కదా. తను ఎదుగుతున్నకొద్దీ మమ్మల్ని ఎదిరించడం మొదలుపెట్టింది. చాలాసార్లు నేను దీనికి కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించాను. కాని ప్రతిసారి, తను విసుగుదలతో అరవడం మొదలుపెట్టింది. పోనీలే, టీనేజ్ కదా, అంతా తనంతట తానే సర్దుకుంటుందని నేను ఊరుకునేదాన్ని. ఇదేకదా మేము ఆలోచించేవాళ్లం… రానూకి ఏవిధంగానూ దేనికీ ఎటువంటి లోటు ఉండకూడదనే ప్రకాశ్ మరోబిడ్డ కలగకుండా జాగ్రత్తపడ్డారు. ఇంత ప్రేమ, ఇంత మమకారం చూపించినాకూడా దానికి పరిణామం ఇదా!  బహుశా ఇదే కారణమేమో!

“పాజిటివ్ గా ఆలోచించండి ఆంటీ!” మోహినీ తరచు అడ్డుచెప్పేది. “మీ జీవితంలో మంచిసమయం కూడా వచ్చి ఉండవచ్చుకదా. రానూతో కూడా మీరు సమయం బాగా గడిపి ఉండవచ్చునేమో. అదంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. చుట్టాలు, పక్కాలు, తెలిసినవాళ్ళు, స్నేహితులు… ఎంతమందినుంచో మీకు ఫోన్ లు వస్తాయి. మీరు మాత్రం అందరితోనూ మీ బాధనే చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు.  ఇంకేమైనా విషయాలు మాట్లాడుతూ ఉండండి.”

“ప్రకాశ్ వెళ్ళిపోవడం, కూతురు విడిచిపెట్టి దూరమైపోవడం, ఇవన్నీ ఎలా మరిచిపోను మోహినీ? ఎలా?”

“మీరు ఈ లోకాన్ని చూశారు ఆంటీ… జరిగిపోయినదాన్ని మరిచిపోవడమే మేలు. వాస్తవం కాకుండా కలల్లో విహారం చెయ్యడంలోనే ఆనందం లభిస్తుంది. కలలు కనండి. ఇది సులభం కాదని నాకు తెలుసు. నేను కూడా చాలా కాలం క్రితమే మా అమ్మని కోల్పోయాను. అయినా నేను బతుకుతున్నాను కదా ఆంటీ…! నవ్వుతున్నాను. నాక్కావలసింది తింటున్నాను, తాగుతున్నాను. ఉద్యోగం చేసుకుంటున్నాను… అన్నీ చేసుకుంటున్నాను ఆంటీ.”

“ప్రకాశ్ వెళ్ళిపోవడాన్ని ఎలాగో అలా సహించుకుంటాను మోహినీ, కాని రానూ ఇలా దూరాన్ని ఏర్పరుచుకోవడం… నువ్వు మోహినీ, బాగా లోకంతీరుని అర్థంచేసుకున్నదానివి. అయినా నేనెందుకు నీలా కాలేకపోతున్నాను.”

దీన్నిగురించి నేను ఆలోచించాను. కాని ఈవిషయంలో ఏమీ చెప్పలేదు. మోహిని కూడా ఒంటరితనంతో కుమిలిపోతోంది. తను మాట్లాడుతున్నంత సహజంగా తన జీవితం లేదు. నాకంతా తెలుసు మోహినీ, నీ హృదయంలో అగ్నిపర్వతం దహించేస్తోంది.

సాయంత్రం చాయ్ తాగే సమయం గడిచిపోతోంది. నేను మోహిని కోసం ఎదురు చూస్తున్నాను. ఒకరోజున పొద్దున్నే తను అడిగింది- “ఆంటీ, మీరు చాయ్ తాగారా?”

“ఇంకా లేదమ్మా, నువ్వు కూడా తాగుతానంటే చాయ్ పెడతాను.”అన్యమనస్కంగా నేను జవాబిచ్చాను.

“అలాగా ఆంటీ, నేనెక్కడ తాగుతాను చాయ్… మీరు లేచి ఇంతసేపు అయింది కదా, ఇంతవరకూ మీరు చాయ్ కూడా తాగలేదా… ఉండండి నేను పెడతాను. మీరు అలా కూర్చోండి.” చెయ్యి పట్టుకుని నన్ను కుర్చీలో కూర్చోబెట్టింది. “రేపటినుంచి రోజూ పొద్దున్నే నేనే మీకోసం చాయ్ పెడతాను. పదినిమిషాల పనే కదా.”  నేను ఆలోచనలో పడ్డాను. నీతో ఏ జన్మలోని సంబంధం ఇది మోహినీ, నేను లేచినదగ్గరనుంచి పడుకుని నిద్రపోయేవరకూ నాగురించిన దిగులు నీమనస్సులో పెట్టుకుంటున్నావు! నిన్ను కలుసుకున్నరోజు ఎంత మంచి రోజో కదా. ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు సుమా.

నాకే మళ్ళీ అనిపించింది అద్దెకి ఉండే అమ్మాయి విడిచిపెట్టి వెళ్ళకుండా ఎన్నాళ్ళు ఉంటుంది.

ఇవ్వాళ తను రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేస్తోంది, మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళనా? నేను అనుకున్నాను. కాని వెళ్ళలేదు. కాని, లేచి తలగడని సహాయంగా పెట్టుకుని దానికి ఆనుకుని పడుకున్నాను. ఎదురుగా ఉన్న గోడ ఖాళీగానే ఉంది. అటు చూడాలని కూడా నాకు అనిపించడం లేదు.

పెయింటింగ్ తీసేసినా కూడా రానూ జ్ఞాపకం రాకుండా ఉందా, ముందు పెయింటింగ్ జ్ఞాపకం చేస్తూ ఉండేది. ఇప్పుడు ఖాళీగా ఉన్న గోడ తనని గుర్తు తెప్పిస్తోంది.  రానూ ఎంతో శ్రద్ధగా ఈ పెయింటింగ్ వేసింది – తల్లి ఒడిలో చిన్నబిడ్డ – తను అంటూ ఉండేది ఇది నీ ఒళ్ళో నేనేనమ్మా అని. నువ్వు ఎందుకు పెద్దగా ఎదిగిపోయావమ్మా. నా ఒడి నీకు చిన్నదైపోయిందా, కిందకి దిగి దూరంగా పారిపోయావు.

పెయింటింగ్ మాటిమాటికీ చూసుకుంటూ నేను ఏడుస్తూ ఉండేదాన్ని. మోహిని అక్కడినుంచి తీసి స్టోర్ రూంలో పెట్టింది ఆ పెయింటింగ్ ని… “ఇక్కడ ఇంకేమైనా తగిలించండి ఆంటీ, మీకు మనశ్శాంతిని ఇచ్చేది ఏమయినా. జీవితం అంటే ముందుకు వెళ్ళడమే కదా.”

పిచ్చిపిల్ల! అమాయకురాలు. ఒక్క పెయింటింగ్ తీసేస్తే ఏమయింది. రానూ చిన్నతనంనుండి పెద్ద అయ్యేవరకు ఎన్నో చిత్రాలు నా హృదయంలో పదిలంగా ఉన్నాయి. వాటిని నేను ఎలా తీసెయ్యను? మొదటి నవ్వు, మొదటిగా తప్పటడుగులు వెయ్యడం, , మొట్టమొదటి మాట, చిన్నచిన్న కేశాలు, గట్టిగా లాగివేసిన రెండు జడలతో వీపుమీద మోస్తున్న స్కూలుపుస్తకాల బ్యాగ్ తో స్కూలుకి వెడుతూ, లేకపోతే స్కూలునుంచి వస్తూ ఉన్న రానూ, కథక్ నృత్యం చేస్తున్న డ్రస్సులో, స్టేజి షో లో… మాటకారిగా, నెమ్మదిగా తను పట్టినపట్టు వదలకుండా ఏర్పడుతున్న రూపం. ఆల్బం మీద ఆల్బం నా మనస్సులో తయారుగా ఉంది. ఎంత తీసి పారెయ్యను, ఎంత తుడిచిపారెయ్యను? ఈ చిత్రాలకి బదులుగా వేరే ఏ చిత్రాలైనా నేను పెట్టగలనా? పైగా ఈ గోడమీద! నేను ఇక్కడ ఇంక ఏం పెట్టగలను రానూ! నీ స్థానంలో మరొకటి ఏదయినా ఎలా ఉంటుంది? కాని ఈ మోహిని, ఈ స్థానాన్ని కొద్దికొద్దిగా నింపిందని నాకు ఎందుకు అనిపిస్తోంది!

ఈరోజున నేను ఇంకో లోటు కూడా తీర్చెయ్యమని చెప్పేస్తాను… ఆంటీ అనకుండా నన్ను మమ్మీ అంటూ పిలుస్తూ ఉండమని. ఎంతో విస్తారం కలిగించే ఈ మాట, నువ్వు ఉన్నా కూడా, ఇది వినడానికి నేను తపించిపోతున్నాను. కాని మోహిని ఒప్పుకుంటుందా? సరేనంటుందా? ఒకవేళ ఒప్పుకోకపోతేనో? తన తల్లి స్థానంలో మరొకరిని మమ్మీ అనడం గాని, అలా భావించడం గాని అంత తేలిక కూడా కాదు. ఎన్నో రోజులనుండి ఆలోచిస్తున్నాను, అనుకుంటున్నాను. కాని నోట్లోంచి ఈమాట బయటికి రావడంలేదు…. మోహిని నిరాకరిస్తుందేమోనన్న భయం మనస్సులో గూడుకట్టుకుంది…. కాని ఈనాడు….చెప్పేస్తాను.

రానూ ఉన్న పాత ఆల్బంలన్నీ చూసుకుంటూ, రానూ స్థానంలో మోహిని ని ఉంచుతూ నా కళ్ళు వర్షిస్తున్నాయి. నేను వాటిని తుడుచుకుంటున్నాను. ఇంతలోనే నాకు ఎప్పుడు కునుకు పట్టిందో తెలియనేలేదు.

నేను ఇప్పుడే లేచాను. వెనకాల గదిలోంచి వెలుతురు వస్తోంది. బహుశా మోహిని వచ్చినట్లుంది. నేను మంచం మీదనుండి లేచి బేసిన్ దగ్గరికి వచ్చాను. అద్దంలో నా ముఖం చూసుకున్నాను. కన్నీళ్ళ చారలు ఎండిపోయి ముఖాన్ని జిడ్డుగా చేస్తున్నాయి. నేను ముఖం కడుక్కున్నాను. మంచిదయింది మోహిని చూడలేదు. తల దువ్వుకుని అప్పుడు తన దగ్గరికి వెడతాను. ఉత్సాహంతో, తాజాతనంతో. ఆలోచిస్తూనే నేను నవ్వుకున్నాను. తల దువ్వుకుని వెనకాలఉన్న గదివైపుకి  నడిచాను.

“ఎప్పుడు వచ్చావమ్మా మోహినీ? ఇవాళ నీకోసం చాలా ఎదురు చూశాను.” అంటూ నేను మోహిని గదిలోకి ప్రవేశించాను. ఇదేమిటి, గది అంతా చెల్లాచెదురుగా ఉంది! మోహిని సూట్ కేస్ తీసుకుని అందులో బట్టలు సర్దుకుంటోంది. నేను రావడం చూసి తను అడిగింది- “నాకోసం ఎందుకు వెయిట్ చేశారు ఆంటీ? ఏమయినా పని ఉందా?… ఏమన్నా తేవాలంటే చెప్పండి. తెచ్చిపెడతాను.”

“లేదమ్మా, ఏమీ తేవక్కరలేదు. నువ్వు ఈ బట్టలు ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నావు? ఈ సామానంతా ఎందుకు చెల్లాచెదురుగా ఉంది?”

“నాకు ట్రాన్స్ ఫర్ అయింది ఆంటీ, వచ్చేవారమే జాయిన్ కావాలి… కొద్దికొద్దిగా సర్దుకుంటూ ఉంటే అంతా నెమ్మదిగా అయిపోతుంది… నేను వచ్చి చూస్తే మీరు నిద్ర పోతున్నారు. మిమ్మల్ని లేపలేదు.”

మోహిని చెబుతోంది. కాని ట్రాన్స్ ఫర్ తరువాత చెప్పిన మాటలు నాకు ఎక్కడో దూరంనుంచి వస్తున్నట్లు అనిపిస్తున్నాయి. నా కాళ్ళు వణుకుతున్నాయి. నేను మౌనంగా కొంతసేపు నా వ్యాకులతని తెలియనీయకుండా దాస్తూ, ఆమె గదిలో నిలబడి ఉన్నాను. తర్వాత వెనక్కి తిరిగి నెమ్మదిగా నా గదివైపుకి నడిచాను.

మోహిని అంటున్న మాటలు నన్ను వెంటాడుతున్నాయి- “మీరు చెప్పలేదు ఆంటీ, మీరు నాకోసం ఎందుకు ఎదురుచూస్తూ ఉన్నారు?”

***

డా. ఆశా పాండే – పరిచయం

14 నవంబరు 1964 న పీపర్ తాలీ, ప్రతాప్ గఢ్ (ఉత్తర్ ప్రదేశ్) లో జన్మించిన డా. ఆశా పాండే ఎం.ఏ.,పిహెచ్.డి. (ప్రాచీన చరిత్ర) చేశారు. వీరి 4 కథాసంకలనాలు, 1 నవల, 4 కవితాసంకలనాలు, 1 హైకూ సంకలనం,1 ట్రావెలాగ్, 1 వ్యాససంపుటి, బాలసాహిత్యంలో 4 కవితాసంకలనాలు, 1 కథాసంకలనం ప్రచురితం. వీరి నవల `ఖర్గాంవ్ కా చౌక్’ 2025 వరకు వచ్చిన పది ఉత్తమనవలల్లో ఒకటిగా పరిగణించబడింది. ఇంచుమించు పది ఇతర కథాసంకలనాల్లో వీరి కథలు కూడా ఉన్నాయి. కొన్ని కథలు నాటకరూపం ఇవ్వబడి ప్రదర్శించబడ్డాయి. అయిదేళ్ళపాటు `అమరావతి మండల్’ దినపత్రిక దీపావళి ప్రత్యేకసంచికలకు సంపాదకురాలిగా ఉన్నారు. వీరి రచనలు అగ్రశ్రేణి హిందీ పత్రికలలో ప్రచురితమయ్యాయి. చాలా రచనలు ఇతరభాషలలోకి అనువదించబడి ప్రచురించబడ్డాయి. ఆకాశవాణి, టి.వి.లలో కథలు, కవితలు ప్రసారితం. కొన్ని కథలు ప్రతిష్ఠాత్మకమైన పోటీలలో బహుమానం పొందాయి. మహారాష్ట్ర హిందీ సాహిత్య అకాడమీ ద్వారా 2010-11 మున్షీ ప్రేమచంద్ పురస్కారం తో సత్కరించబడ్డారు. సృజన్ లోక్, చెన్నై, శారదాసమ్మాన్, లేహ్, తులసీసమ్మాన్, భోపాల్, జైపూర్ సాహిత్య సమ్మాన్, జైపూర్ ద్వారా సన్మానం పొందారు. రాజస్థాన్ యూనివర్సిటీలో వీరి కథాసంకలనం `ఖారా పానీ’ పై డిజర్టేషన్ వ్రాయబడింది. అమరావతి యూనివర్సిటీ బి.కామ్., బి.ఏ. సిలబస్ లలో వీరి కథలు, కవితలు పాఠ్యాంశాలుగా చేర్చారు. అమరావతి యూనివర్సిటీకి అనుబంధ కళాశాలలో లెక్చరర్ గానూ, ఇగ్నూ లో కౌన్సెలర్ గానూ సేవలు అందించి రిటైర్ అయిన డా. ఆశా పాండే గారు అమరావతి (మహారాష్ట్ర) వాస్తవ్యులు.

*****

Leave a Reply

Your email address will not be published.