ఏజంట్-2026 : అరగంట సినిమా వెనుక ఆరునెలల కథ! (భాగం-1)

ఇదంతా ప్రారంభమైంది 2026 ఫిబ్రవరి నెల మొదటి వారంలో. 2026 ప్రారంభం నించి వారం వారం నేను మా “సగీత్ యూట్యూబ్ ఛానల్”లో ఇంగ్లీష్ లో “ఏఐ(AI) టెక్ టాక్స్” ఇవ్వడం మొదలుపెట్టాను. ప్రతీరోజు లాగే ఆ రోజు కూడా నేను, సత్య వాకింగ్ చేస్తూ ఏఐ(AI) కి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మా మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో హాట్ టాపిక్ అయిన “అటానమస్ ఏజంట్స్” గురించి ప్రస్తావన వచ్చింది. ప్రముఖ ఏఐ(AI) కంపెనీ అనౌన్స్ మెంట్, స్టాక్స్ పడిపోవడం, ఉద్యోగాలు పోవడం మొ.న విషయాలెన్నో మాట్లాడుకున్నాం.

“ఇంత బాగా చెప్తున్నావు, ఇదంతా కథగా రాయొచ్చు కదా” అన్నాడు సత్య.

ఇంటికి రాగానే వంగూరి ఫౌండేషన్ ఉగాది కథల పోటీ గురించి ఈ మైయిల్ చూసాను. గడువు తేదీ ఫిబ్రవరి 19. సరే, ఇంతకు ముందు అనుకున్నట్టుగా కథ రాసి ఈ పోటీకి పంపితే బావుంటుందని అనుకున్నాను.

ఇక ఇదంతా “కథగా ఎలా రాయాలా?” అని దాదాపు రెండురోజుల పాటు ఆలోచిస్తూ ఉన్నాను. ఏఐ(AI) విధ్వంసంతో బాటూ ఈ కాలపు యువకుల జీవన విధానం, మానసిక బాధలు, భార్యాభర్తల మధ్య విభేదాలు మొ.న అంశాలన్నీ కలిపి రాయాలని అనుకున్నాను.

కథ మొదటి వాక్యం స్ఫురించంగానే ఇక ఆపకుండా ఏకబిగిన మూణ్ణాలుగు గంటల్లో కథ పూర్తి చేశాను. కృత్రిమ మేధ మనుషుల జీవితాల్లో ప్రవేశించి, ఆర్థిక పరిస్థితుల్ని తన చేతుల్లోకి తీసుకుని, వ్యక్తుల మధ్య అనుబంధాల్ని కూడా ఎలా చిన్నా భిన్నం చేస్తున్నదో ఇతివృత్తంగా రాసాను. కథ పేరు “అటానమస్ ఏజంట్” అని పెట్టాను.

ఆ సాయంత్రం సత్యకి కథ వినిపించి, టెక్నికల్ విషయాలు సరిచేసాను. అక్కణ్ణించి మరో రెండు మూడు రోజులు శ్రమించి కథలోని టైం లైన్స్, కథాగమనంలో అక్కడక్కడా మార్పులు చేర్పులు చేసాను. కథని వీలైనంతవరకు సంభాషణలతోనే నడిపించాను. మొత్తానికి అయిదు రోజుల్లో కథ సిద్ధం చేసి వంగూరి కథల పోటీకి పంపేసాను.

అదే సమయంలో ఇండియాలో రెండు, మూడు షార్ట్ ఫిలిమ్స్ కి కథలు, స్క్రీన్ ప్లే లు రాసి, అక్కడ టీమ్ తో నిర్మాతగా పని మొదలుపెట్టాను.

మార్చి 17న వంగూరి ఫౌండేషన్ కథల పోటీ ఫలితాల్ని ప్రకటించింది. అందులో నా “అటానమస్ ఏజంట్” కథకి $200 డాలర్ల మొదటి బహుమతి వచ్చింది. ఆ కథ కౌముది అంతర్జాల పత్రిక ఏప్రిల్ సంచికలో ప్రచురితమై అత్యంత ప్రజాదరణ పొందింది. అదే సమయంలో ఇండియాలో తీసిన రెండు షార్ట్ ఫిలిమ్స్ లో ఒకటి ఉత్తమ కథ అవార్డుకి, మరొకటి ఉత్తమ నిర్మాత అవార్డుకి ఎంపికయ్యాయి. చాలా సంతోషంగా, ఉత్సాహంగా అనిపించింది.

అదే నెలలో “ఈ కథని కూడా షార్ట్ ఫిల్మ్ గా తీయొచ్చు కదా” అన్నాడు సత్య. చిన్నగా నవ్వి ఊరుకున్నాను. కథ రాయడం వేరు, సినిమా తియ్యడం వేరు. తెరకెక్కించడం చాలా కష్టమైన పని. పైగా కథని అమెరికాలోని యువకులు ప్రధానపాత్రలుగా రాసాను. దానిని ఇండియాలో తీయాలంటే కథలో చాలా మార్పులు చెయ్యాల్సి ఉంటుంది. ఇక అమెరికాలో తియ్యాలంటే యాక్టర్స్, టెక్నీషియన్స్ దొరకడం చాలా కష్టం. మా కుటుంబ మిత్రులు, ఆత్మీయులు శ్రీ సుబ్బరాయ శర్మ గారితో మాట్లాడి చూసాను. ఆ కథని ఇండియాలో తియ్యడం కష్టమని, అమెరికాలో నన్నే డైరెక్ట్ చేసి తీసెయ్యమని అన్నారు. కానీ అదంతా అయ్యేపని కాదని అనిపించి ఆ విషయాన్ని పక్కన పెట్టేసాను.

మరుసటి వారంలో ఆటా 19వ మహాసభల షార్ట్ ఫిల్మ్ పోటీ ప్రకటన చూసాను. జూలై 10 వ తేదీ గడువు తేదీ. అమెరికాలోనే నిర్మించి ఉండాలని, అమెరికాలో ఉన్నవారే నటించాలని నిబంధన.

సాయంత్రం సత్యకి చెప్పగానే “మరెప్పుడు తీస్తున్నావు?” అని అడిగాడు. అప్పటిదాకా ఏదో సరదాగా అంటున్నాడని అనుకున్నాను. నేను ఫిల్మ్ తియ్యాలంటే పనిదినాల్లోనూ, వారాంతాల్లోనూ, ఇంటి పనుల్లోనూ, మా పాప సిరితోనూ మేమిద్దరం చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ మాట్లాడుకుని, “నేను చెయ్యగలను” అని అనిపించాక ఇక ఈ యజ్ఞానికి సీరియస్ గా శ్రీకారం చుట్టాను.

మే నెల మొదటి వారంలో స్క్రీన్ ప్లే, నటీనటుల ఎంపిక, రెండు, మూడు వారాల్లో షూటింగ్, నాలుగో వారం ఎడిటింగ్, డబ్బింగ్, జూన్ నెల మొదటి, రెండు, మూడు వారాల్లో పోస్టు ప్రొడక్షన్, ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగో వారానికి పూర్తి చేసి పంపాలని టైం టేబుల్ వేసుకున్నాను.

ఎందుకంటే జూలై ఒకటిన మేం పెరూ దేశానికి వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నాం. పైగా
జూలై పదిన నెచ్చెలి వార్షిక సంచిక విడుదల చెయ్యాలి, సిరికి పుట్టినరోజు పండుగ చెయ్యాలి. ఆటా పోటీలకు జూలై 10 వ తేదీ గడువు తేదీ.

ఒకపక్క నెచ్చెలి నెలవారీ సంచికల రిలేజెస్ తో బాటూ, కథలు, కవితలు పోటీ కోసం ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన రచనల్ని చదివి, ఎంపిక చెయ్యాల్సి ఉంది. నెలనెలా వీక్షణం సమావేశాల బాధ్యత సక్రమంగా నెరవేర్చాల్సి ఉంది. నేను నెలనెలా రాయాల్సినవి క్రమం తప్పకుండా రాయాల్సి ఉంది.

ఇన్నింటిలో ఒక్కరోజు నా టైం టేబుల్ అటూ ఇటూ అయినా ఈ షార్ట్ ఫిల్మ్ తియ్యడం కష్టం అయిపోతుంది.

ఇక బడ్జెట్ మరొక ముఖ్య విషయం. వీలైనంత తక్కువలో తియ్యాలి.

మొత్తానికి మే నెల మొదటి వారంలో స్క్రీన్ ప్లే తో బాటూ, లాంగ్ షాట్స్, క్లోజప్, మిడ్ షాట్స్ వగైరాలు తీయాల్సిన డిటైయిల్స్, కెమెరా మూవ్మెంట్స్, లైటింగ్ వగైరాలన్నీ వివరంగా రాసుకున్నాను.

స్క్రీన్ ప్లే రాసేటప్పుడు కథలో చాలా మార్పులు చెయ్యాల్సి వచ్చింది. టైం లైన్స్ మార్చడం, పాత్రలు పెంచడం, తగ్గించడం, సింపుల్ గా తియ్యడం కోసం కొన్ని సీన్లు తొలగించడం… ఇలా ఎన్నో మార్పులతో అయిదారు వెర్షన్స్ రాయాల్సి వచ్చింది.

చివరకు రాత్రీ, పగలూ శ్రమించి ఫైనల్ వెర్షన్ రెడీ చేసుకున్నాను.

అదే సమయంలో యాక్టర్స్ కావాలని ఫేస్బుక్ లో, ఇతర మాధ్యమాల్లో ప్రకటన ఇచ్చాను.

యాక్టింగ్, ఫిల్మ్ మేకింగ్ ఇంటరెస్ట్, ఎక్స్పీరియన్స్ ఉండి, నాకు చిరకాలంగా పరిచయం ఉన్న శశి ఇంగువ మొదటగా టీమ్ లో చేరాడు. తను కూడా ప్రకటనలు ఇచ్చి వెతక సాగేడు. మొత్తంగా దాదాపు ముప్పై ఏళ్ళున్న ఇద్దరు యువకులు, ఒక యువతి, మరిద్దరు చిన్న పాత్రలకు యాక్టర్స్ కావాలి.

ఒక పాత్రకి శశి సరిపోతాడు. రెండవ పాత్ర కోసం ఒకరిద్దరు ముందుకు వచ్చినా ఒకరు కథ విన్నాక చేయలేమని వెళ్ళిపోతే, ఒకరి నటన నచ్చక “నో” చెప్పాల్సి వచ్చింది. యాక్టర్స్ సెలక్షన్ లో శర్మ గారు కీలక పాత్ర వహించారు.

ఇక శశితో బాటూ, లాస్ట్ మినిట్ లో ఆదిత్య అభిరామ్ జొన్నలగడ్డ టీమ్ లో చేరాడు. అమ్మాయి పాత్రకి ఎంతో వెతకగా చివరకి నా స్నేహితురాలి కూతురు, మంచి డాన్సర్ పూర్వజ పెన్మెత్స ముందుకు వచ్చి టీమ్ లో చేరింది. అతిథి పాత్రల్లో ఒకటి నేను చేసాను. రెండవ పాత్ర అవసరం లేకపోయింది. ఎందుకంటే అప్పటికే నిడివి ఎక్కువై పోతుందనిపించి ఆ పాత్ర ఉన్న సీన్లు స్క్రీన్ ప్లే నించి తొలగించాల్సి వచ్చింది.

ఇక కెమెరా, సినిమాటోగ్రఫీ కోసం మేం చేసిన కృషి షూటింగ్ ముందు రోజు వచ్చేసినా ఫలించలేదు. ఒకరిద్దరు కథ విని చెయ్యలేమన్నారు. కొందరు వీకెండ్ టైం లేదన్నారు. మొత్తానికి అందరూ గంటకి రెండు వందల డాలర్ల పై చిలుకు అంటూ విపరీతమైన రేటు చెప్పసాగేరు. అంత బడ్జెట్ లేదు, ఎలా?

చివరికి ఐ-ఫోను 15/16 తో ఏదోలా మేమే షూటింగ్ చేసేయాలని నిర్ణయించుకున్నాం. ఇదివరకు 2023లో ఐ-ఫోను తోనే రెండు షార్ట్ ఫిలిమ్స్ చేసాం. మంచి క్వాలిటీతో వచ్చాయి.

మే నెల రెండు, మూడు వారాంతాల్లో షూటింగ్ షెడ్యూల్ వేసాను. అందరూ వర్కింగ్ కావడం వల్ల శుక్రవారం సాయంత్రం నించి ఆదివారం రాత్రి వరకే షూటింగ్ చెయ్యాల్సి ఉంది. ఒకరికి వీలైతే, మరొకరికి వీలు కావడం లేదు.

పద్మవ్యూహం లోకి అడుగుపెట్టడం వరకే తెలిసినట్లు అయ్యింది నా పరిస్థితి. అయినా ఎలాగైనా ఈ షార్ట్ ఫిల్మ్ తియ్యాలని పట్టుదల పెరిగింది.

Leave a Reply

Your email address will not be published.