
అనుసృజన
నది
మూలం : కేదార్నాథ్ సింగ్
అనుసృజన: ఆర్ శాంతసుందరి
ఈ భూమి మీద అన్ని నాగరికతలు నదీ తీరాలలో ప్రారంభమై, స్థిరపడి సంస్కృతిగా అభివృద్ధి చెందాయి. కవి కేదార్నాథ్ సింగ్ నదితో మనిషికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ కవితలో చెప్పారు. మనిషి ఎక్కడున్నా నదితో సంబంధం తెగిపోదు. అత్యాధునికమైన జీవితం గడిపే వ్యక్తి శారీరకంగా నదికి దూరమైనా, అది (అతనిలో) ప్రవహిస్తూనే ఉంటుంది.
***
నువ్వు నెమ్మదిగా నడిస్తే
నిన్ను తాకుతుంది సుతారంగా అది
పరిగెత్తావో ఇక చేజారిపోతుంది నది
వెంట పెట్టుకుని వెళితే
ఎక్కడికైనా వచ్చేస్తుంది నీ వెంట
చివరికి పాత సామాన్లు కొనే కొట్టు దాకా కూడా
వదిలేశావా
ఇక అక్కడే చీకట్లో
కొన్ని కోట్ల నక్షత్రాల కన్నుగప్పి
ఒక పూర్తి ప్రపంచాన్నే సృష్టించుకుంటుంది అది
ఒక చిన్న నత్తగుల్లలో
నిజానికి
నువ్వెక్కడున్నా
ఏడాదిలో అన్నిటికన్నా ఎక్కువ కష్టాలు
అనుభవిస్తున్న రోజుల్లో కూడా
నిన్ను ప్రేమిస్తుంది నది
ఆ నది ప్రస్తుతం లేదు ఈ ఇంట్లో
కానీ ఉంటుంది ఎక్కడో ఒక చోట తప్పకుండా
ఒక చాప కిందో
ఒక పూలకుండీ కిందో
నిశ్శబ్దంగా ప్రవహిస్తూ
ఎప్పుడైనా విను
ఊరంతా నిద్రలో మునిగాక
తలుపులకి చెవి ఆనించి
నెమ్మదిగా విను
ఎక్కడో నీ చుట్టుపక్కలే
ఒక ఆడ మొసలి మూలుగులా
వినిపిస్తుంది నది !
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
