బహదూర్ (ఒక వీర సైనికుడు)

-పద్మావతి నీలంరాజు

కాశ్మీర్ వెళ్ళడం ఒక అనుభూతి ! ఒక భయం! ఒక్కసారయినా కాశ్మీరం అందాలను చూడాలన్న ఆశ మనసుని వదలకపోవడంతో కాశ్మీర్ కి బయలుదేరాము ఉత్సాహంగా. మొదటిసారి కాశ్మీర్ వెళ్లడం చేత విమానం ఎక్కినప్పటి నుండి ఆ సుందర ప్రదేశం గురించిన  ఊహలతో  మనసు నిండిపోయింది. కాశ్మీర్ పరిసరాల దగ్గరికి వెళ్లే కొద్దీ వెండి కొండలు దర్శనమిస్తున్నాయి. వాటి పైనుంచి  విమానం వెళ్తూ ఉంటే విమానం కిటికీ నుంచి బయటికి చూస్తూ ఉన్న నాకు ధవళ కాంతులీనుతున్న ఆ పర్వత శిఖరాఖరాగ్రాలను తడిమి చూస్తూ, ఆ చల్లటి స్పర్శను  అనుభూతి చెందాను. అక్కడికి చేరుకున్న సాయంత్రమే పాదయాత్ర చేశాను దాల్ సరుస్సు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ వెంబడి. ప్రతి ఫరలాంగ్ దూరంలో ఒక సైనికుడు శిలా విగ్రహంలా నిలబడి ఉన్నాడు. అందమైన సరస్సులో చిన్న చిన్న పడవలలో తామర తూడులను ఏరుతూ తిరగాడుతున్న కాశ్మీరీ పల్లె జనం కనిపించారు. అక్కడక్కడ ఇంకా వసంతమే రాని కాశ్మీరం చల్లగా మంచి ముద్దల్లే  కనిపించింది. కొంచెం నీరెండ ఆ తెల్లని శిఖరాగ్రాల  పైన పడుతూ బంగారు ఛాయను ఆ శిఖరాలకు అద్దినట్టుగా కనిపిస్తున్నది. ఆ సౌందర్యో పాసనలో నన్ను నేను మరిచి సరస్సు యొక్క ఫెన్సింగ్ని ఆనుకొని నిలుచున్నాను.

కొంచెం ఎండ, కొంచెం నీడల మధ్యన ఏదో జీవితే సత్యం బోధిస్తున్న బోధిసత్వునిలా కనిపించాయి ఆ హిమాలయాలు. అ తన్మయత్వంలో ఉన్న నాకు ఎవరో వెనక నిలుచున్నారన్న భావన, ఒక క్షణం ఒళ్ళు గగుర్పొడిచింది. వెనక ఎవరో నిలబడ్డారు భయంతో అంత చల్లని వాతావరణంలో కూడా గొంతు పిడచ కట్టుకుపోయింది.

“ఇక్కడ నుంచో కూడదు, వెళ్లండి,” కంఠం కర్కశంగా ఉన్న, మన తెలుగులో హెచ్చరించాడు.

మన భాషలో చెప్పడంతో కొంచెం ధైర్యం చేసి వెనక్కి తిరిగి చూశాను. సైనికుడి భుజానికి వేలాడుతున్న  రైఫిల్, తల మీద ఇనుపటోపి, పాచిరంగు సైనిక యూనిఫాంలో ఉన్నాడు. అంత చల్ల గాలి కూడా అతని దగ్గర నుండి వచ్చే చెమట వాసనని నా నాసికకు చేర్చింది. ఒక్క అడుగు వెనక్కి వేశాను ఫెన్సింగ్ మీదకు ఒరిగి వెనక్కి పడబోయాను.

“జాగ్రత్త మేడం నేనేమీ చేయను మిమ్మల్ని. ఇక్కడ నిలబడ కూడదు. మీరు యాత్రికులు అనుకుంటా. ఇలా ఒంటరిగా బయటికి రాకూడదు. ఇక్కడంతా సెక్యూరిటీ చెక్ జరుగుతుందండి. మీరు త్వరగా మీ బసకు వెళ్లిపోండి,”  చెప్పి వెళ్ళిపోయాడు.

బతుకు జీవుడా  అనుకుంటూ చకచకా నడుస్తూ కొంత దూరంలోనే ఉన్న కాశ్మీర్ విశ్వవిద్యాలయం గేట్ లోకి ప్రవేశించి గెస్ట్ హౌస్ కి చేరుకున్నాను. మరునాడు పెహాలగామ్ వెళ్లడానికి టాక్సీ మాట్లాడు కున్నాము. ఉదయాన్నే ఎనిమిది గంటలకు మా ప్రయాణం మొదలైంది. దారంతా పోయిన మేర హిమాలయ పర్వత శ్రేణులు మాకు అండగా మాతో పాటు వస్తున్నట్లు అనిపించింది. ఇంకోవైపు లీదర్ నది స్వచ్ఛమైన జలధార అద్భుతమైన శివాకృతి  కలిగిన గులకరాళ్ళతో నిండిపోయి శివుని ఝటాఝుటం నుండి నేరుగా  భువికి దిగిన నదిలాగా అనిపిస్తున్నది. కొద్దిసేపు ఆ నది  ప్రవాహంలో కాళ్లు పెట్టి కూర్చుంటే నవనాడులు ఆ చల్లదనానికి సంకోచ వ్యాకోచాలు చెందినట్లనిపించింది. కుండలినీ సర్పం నా వెన్ను కింద భాగం నుండి నిద్ర లేచి నట్లనిపించి, కొద్ది సేపు ధ్యాన నిమగ్నురాలనయ్యాను. ఆ తరువాత 11 గంటల సమయంలో మేము పెహాలగామ్ చేరుకున్నాము. అప్పటికి ఎండ పెరగడంతో వెచ్చగా హాయిగా అనిపించింది.

***

నేను మా వారు గుర్రాలు మాట్లాడుకున్నాం పైవరకు వెళ్ళటానికి. నన్ను ఒక తెల్లటి గుర్రం మీద కూర్చోపెట్టాడు గుర్రం సంచాలకుడు (horse guide). కాళ్ళకి పై దాక వచ్చే బూట్స్ వేశారు. నేను ఎక్కిన గుర్రపు డెక్కలు చూస్తే అర్థమైంది ఆ బూట్స్ నాకెంత అవసరామోనని!  ముందు ఒక మైలు గుర్రం పట్టుకుని  ఫౌజి నాతో పాటు నడిచాడు. నేనడిగాను,” నీ  పేరు ఫౌజీ కదా! ఆ పేరేలా పెట్టారు నీకు?”

“ మా నాయన భారతీయ ఫౌజీ మేడమ్. ఒక లాండ్ మైన్ ప్రమాదంలో కాలు పోగొట్టుకొని సైనికుడిగా పదవి విరమణ చేయాల్సి వచ్చింది. ఆయనకి తను భారతీయ సైనికుడినన్న తృప్తితో నాకా పేరు  పెట్టుకున్నాడు. నన్నలా పిలిచినప్పుడల్లా తను ఇతర ఫౌజీలతో కలిసి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న భావన కలుగుతుందని చెప్పేవాడు. నాకు చిన్నప్పటినుండి  ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండేది. అందుకే నేను ఫౌజీగా చెరలేక పోయాను,” అంటూ చెప్పుకొచ్చాడు. అలా కబుర్లు వింటూ  అసలు దారి మొదలైందన్న విషయమే గుర్తించలేదు.

ఒకవైపు తెల్లటి గోడల్లే పరుచుకొని ఉన్న పర్వతాలు మంచుతో నిండి ఉన్నాయి కేవలం రెండు గుర్రాలు మాత్రమే ఎదురు బొదురుగా నడవగలిగేటంత దారి మాత్రంమే!  ఏ మాత్రం గుర్రం కాలు జారిన లోయల్లోకి జారిపోవడమే. అలా ఎప్పుడూ గుర్రం మీద కూర్చోవడమే తెలియని నాకు కాస్త భయం వేసింది. కానీ బింకంగా’ఆహా ఎంత బావుంది’ అనుకుంటూ గట్టి గట్టిగా గుర్రం మెడకి ఉన్న తాడుని లాగుతూ నా గుర్రం నడిపే చాకచక్యం అంతా చూపిస్తున్నాను. మెడతాడు లాగినప్పుడల్లా నా గుర్రం మెడను కిందకు వంచుతూ తాడును కిందకి లాగడం. నేను కాస్త అటు ఇటు వరగడం జరుగుతున్నది. ఫౌజి చెప్పాడు “ఆంటీ మీరు బహదూర్ మెడకి  కట్టిన తాడును ఎక్కువగా గుంజకండి. వాడు నడవలేడు. వాడికి అన్నీ తెలుసు మీరు బేఫికర్ గా ఉండండి. వో దిల్ కి అచ్చా హై!” అని  అన్నాడు. ఓహో గుర్రం పేరు ‘బహుదూర్ ’ అనుకుంటూ ‘శభాష్! గుడ్ బాయ్ బహుదూర్,” అంటూ మెడ చరిచాను ప్రేమగా. దానికి బహదూర్ ధన్యవాదం చెప్పినట్టు తలెత్తి సకిలించి నింపాదిగా ముందుకు నడవసాగాడు. దారంతా కరుగుతున్న మంచు మట్టి తోటి కలిసి బాగా బురదగా ఉంది।  ఆ బురదలో అడుగున ఉన్న రాళ్లపైన నడుస్తున్నగుర్రాల డెక్కల చప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నది.

***

గుండె చప్పుడు, డెక్కల చప్పుడు వింటూ మంచుతో పరుచుకుని ఉన్న పర్వతాలు పైకి పోయే కొద్ది కాస్త భయపెడుతున్నా, 20 కిలోమీటర్ల పైకి వచ్చాం. పెద్దపెద్ద దేవదారు చెట్లు. వాటికి తెల్లటి శాటిన్ చీర కట్టినట్లు నీరెండలో మెరుస్తున్నదృశ్యం, వాటి పక్కనుండి సులువుగా పక్కకి తప్పుకుంటూ సైనిక కవాతు జరుతున్నట్లు పైపైకి వెళుతున్న గుర్రాలను చూస్తుంటే మనసుకి ఎంతో అద్భుతంగా ఉందా ప్రదేశం. అలా కాస్త మైదానంలాగా ఉన్న ప్రదేశం చేరాము. దారిలో చిల్లి పడ్డ నీళ్ల పైపు నుండి ఫౌంటెన్ లాగా నీళ్ళు చిమ్ముతున్నాయి. అలా చిమ్ముతున్న నీళ్లు అక్కడికక్కడే పడి, గట్టిపడి స్పటికాకారంలో ఉన్న అమర్నాధ్ లింగమూర్తి దర్శనమిస్తున్నాడు. కొద్ది దూరం పోయాక బహదూర్ నిలబడిపోయాడు. ఫౌజీ నన్ను కిందకి దించి, “ఆంటీ మీరు, అంకుల్ చేతులు పట్టుకుని జాగ్రత్తగా నడవండి. మంచులో కాళ్లు కూరుకుపోతాయి. ఎక్కువ పైకి పోకండి. మీరు త్వరగా కిందకు రాలేరు. ఇక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. మన జాగర్తలో మనం ఉండాలి,”  అంటూ జాగ్రత్తలు చెప్పాడు. దిగాక ‘అమ్మయ్య’ అనుకోని కాళ్లు కాస్త సాగదీసి, ఆ పర్వతాల సౌందర్యం చూస్తూ మధ్యాహ్నం రెండు గంటల దాక అక్కడ గడిపాము.  ధైర్యం చేసి  మంచులో కాళ్లు కూరుకుపోతున్నా కూడా నిదానంగా ఆయాస పడుతూ ఒక వంద మీటర్లు పైకెక్క గలిగాము. కొంతమంది టూరిస్ట్ లు వయసులో చిన్నవాళ్లు ఇంకా పైకి పైకి నడిచి వెళ్తున్నారు. అప్పటికే కొంత మంది ఇంకా పైకి చేరుకున్నారు. వాళ్లు పట్టు వదలని పర్వతా రోహకులులాగా కనిపించారు. అంత అందమైన పర్వతాలను చూస్తూ ఉంటే వాటిలో మమేకమై అలా పైకి పై పైకి వెళుతూ అక్కడే ఉండిపోవాలనిపించేంత సౌందర్యం అక్కడ కనిపిస్తున్నది, ఆత్మ సౌందర్యం, ప్రకృతి సౌందర్యం, ఈశ్వర సౌందర్యం – సత్యం శివం సుందరం.

***

అలా మమేకమై చూస్తుండగా అనుకోకుండా తుపాకి పేలిన శబ్దం ఆ నిశబ్ద నీరవ ప్రదేశంలో ఒక్కసారిగా అలజడి రేపింది. ఉన్నటుండి పైనుంచి ఒక యువకుడి దేహం దొర్లుకుంటూ ఆ మంచు పర్వత  సానువుల మీద జారీ పడిపోసాగింది. బలంగా ఉన్న ఇద్దరు గుర్రాల నడిపే యువకులు అటువైపుగా పరిగెత్తారు. చూస్తుండగానే ఒక ఐదు – ఆరు గురు యాత్రికులు కిందకి వేగంగా వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. కానీ అక్కడికి అక్కడే ఒరిగే కింద పడిపోతున్నారు కిందకి జారిపోతున్నారు. తుపాకి పేలుతున్న శబ్దం స్పష్టంగా ఆ పర్వతాల మధ్యన ప్రతిధ్వనిస్తోంది. అనుకోని విధంగా దేవదారు చెట్టుమానుల వెనకనుండి ఇద్దరు ఆగంతకులు కొంతమంది యాత్రికులను వెంబడిస్తూ కనపడ్డారు. అదే ఎత్తులో నిలుచుని ఉన్న యువ యాత్రికులు భయంతో కిందకు రావడానికి పరుగు తీస్తున్నారు. వారికి తోడుగా గుర్రాల వాళ్లు కుడా పరిగెడుతున్నారు. ఆ ప్రయాణీకులు అందరూ కాలినడకన పర్వతం పైకి చేరుకున్న వాళ్లే. తుపాకులు పేలుస్తూ పైకి చేరిన యాత్రికుల వెంట పడ్డారు ఆ ఆటంక వాదులు. భయంతో యాత్రికులు పరిగెడుతున్నారు కానీ ఆ తుపాకి గుండు వేగాన్ని దాటి పోలేక పోతున్నారు. ఉన్మాదంగా వారి చేతిలోనే తుపాకులు పేలుతున్నాయి. వాళ్లల్లో కొందరు స్త్రీలు పరిగెత్తలేక ఆ మంచులో నిలదొక్కుకోలేక కిందకు జారిపోతున్నారు.

“ఆంటీ గుర్రానికి దగ్గరగా వచ్చేయండి,” గట్టిగా అరిచాడు ఫౌజీ . మేము దగ్గర్లోనే ఉండటంతో వేగంగా గుర్రం దగ్గరికి చేరాము. నన్ను రబ్బర్ బొమ్మను ఎత్తినంత సులభంగా ఎత్తి బహదూర్ మీద కూర్చో పెట్టాడు. బహదూర్ వెనక వీపు మీద చరిచాడు. బహదూర్ పరుగులంకించుకున్నాడు. “ఫౌజీ… అంకుల్,” అరిచాను భయంతో ఆయన్నే చూస్తూ. బహదూర్ వేగానికి నన్ను నేను కిందపడిపోకుండా గట్టిగా పట్టుకొని వాడి వీపు మీద వాలిపోయాను. “ఫికర్ నహి, ఆంటీ, మే అంకుల్ కా ఖయా ల్ రఖుంగా,” వాడి సమాధానం నా చెవుల్లో ప్రతిద్వనించింది.

***

బహదూర్ పరిగెడుతున్నాడు తానొచ్చిన దారమ్మట. వాడి వేగానికి నేను కూర్చోలేక వాడి మీదకు ఒరిగిపోయి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని  కూర్చున్నాను. పైనుండి వచ్చేటప్పుడు దారి  చాలా దిగుడుగా జారుడుగా ఉంది. బహదూర్ డెక్కల చప్పుడు తెలుస్తున్నది వాడెంత వేగంగా పరిగెడుతున్నాడో! మొదటి మలుపు చాలా సన్నని దారి. బహదూర్ కి కాస్త కాలుజారితే చాలు వేయి అడుగుల లోయలోకి ఇద్దరం పడిపోతాము మా చిరునామా దొరక్కుండా! కానీ బహదూర్ ఆ సన్నని దారిలోనే ముందుకి పొడుచుకొచ్చినట్లున్న కొండ చరియని రాసుకుంటూ పరుగు తీశాడు. నా కాలు పోయి కొండచరియకి తగిలి గీరుకు పోయింది. నా పైజామా చిరిగి, చర్మం చీరుకు పోయి రక్తం కారింది. చావు భయం ముందు ఈ బాధ ఎంత అనిపించిందా క్షణంలో. నిబ్బరంగా బాధను ఓర్చుకుంటూ బహదూర్ మెడ మరింత బలంగా పట్టుకున్నాను. ఈసారి వాడు మెడ విదిలించలేదు. చిన్నగా సకిలించి గాలి పీల్చుకున్నాడు. నన్ను కూడా గాలి పీల్చుకో అన్న సంకేతం ఇచ్చినట్లయింది. వేగం మాత్రం తగ్గలేదు. అలా రెండవ మలుపు చేరుకున్నాం. అది పూర్తిగా అయిదు వందల అడుగుల దారి మొత్తం బురద రాళ్ల మయం. అంత వేగంగా వచ్చిన బహదూర్ ఒక్క సారిగా ఆగిపోయాడు. నేను రొప్పుతూ అతి కష్టం మీద తలెత్తి చూసాను. ముందంతా బురదమయం. లోయ వైపు దారి కాస్త ఎత్తుగా ఉండటంతో బహదూర్ అటువైపు వెళ్ళాడు. నాకు పై ప్రాణం పైనే పోయింది. కళ్ళు మూసుకుని ఆ అమరనాథ్ ని తలుచుకున్నాను ముక్తి కోసం. అదేమీ పట్టని బహదూర్ అతి నెమ్మదిగా చాలా చక్యంగా హార్స్ వాక్   చేస్తున్నాడు అతి నాజూకుగా.  ఆ నాజూకు నడకతో నేను వాడి వీపు మీద అటు ఇటు ఒరుగుతున్నాను. అలా జరిగినప్పుడల్లా అగాధం లాంటి లోయ కనిపించ సాగింది. ఇంకా గట్టిగా కళ్ళు మూసుకొని బహదూర్ మెడను పట్టుకొని జారిపోకుండా ప్రయాస పడుతున్నాను. అవే మీ పట్టించుకోని బహదూర్ నింపాదిగా ఆ బురద నిండిన దారిని దాటేసి మళ్ళీ పరుగులు లంకించుకున్నాడు. నాకు ఊపిరి వచ్చినట్లయింది.

మూడో మలుపు దగ్గర కిందకి పోతున్న చాలా గుర్రాలు వాటిపై వ్యక్తులు కనిపించారు. వాళ్లకి పైన జరిగిన సంఘటన ఏమి తెలియదనుకుంటా! నింపాదిగా రహదారి ఒకవైపు నిలుచుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. నా బహుదూర్ వస్తున్న వేగాన్ని పసిగట్టిన గుర్రాలు వెనక్కి జరిగి  మెడలు పక్కకు తిప్పి దారి ఇచ్చాయి. బహదూర్ ఏం సంకేతం ఇచ్చాడో తెలియదు కానీ యాత్రికులను కిందకు తీసుకొస్తున్న గుర్రాలు చకచకా ఐదు నిమిషాల్లో బహదూర్ ని అనుసరించాయి. వాటి వెనకే వాటి మనుషులు, వాటి మీద యాత్రికులు. యాత్రికులు అందరూ గోలగా మాట్లాడటం మొదలు పెట్టారు. “ఏంటబ్బాయి,  ఇలా గుర్రాన్ని తొలడమేనా కొద్దిగ ఉంటే కింద పడిపోయేవాడిని,” అని ఒకాయన అంటే, “నా మొబైల్ ఎగిరిపోయేది,” అని ఇంకొందరు. “నేను ఇంకా సెల్ఫీలు తీసుకోవాలి. ఇలా తొందర పెడితే ఎలా?” అని అంటున్న మాటలు గాల్లోనే కలిసిపోతున్నాయి. నాలుగో మలుపు దగ్గరికి చేరగానే కొందరు భారతీయ సైనికులు గుర్రాలు  మీద వేగంగా పైకి వెళ్తూ మాకు ఎదురొచ్చారు. ఒక సైనికుడు  బహదూర్ మెడకున్న  తాడును పట్టి ఆపి, “కితనా లోగ్ హై ఊపర్,” (“పైన ఇంకా ఎంతమంది ఉన్నారు?”) అని అడిగాడు. నేను వెర్రి మొహం వేశాను.  “కిసికో గన్స్ కే సాత్ దేఖాయే క్యా ఆంటీ ?”( మీరు ఎవరినైనా తుపాకులతో చూసారా ఆంటీ?) అన్నాడు.  దానికి ‘అవును’ అని తల ఆడించాను. ఇంతలో ఒక సైనికుడు నాకు కొంచెం నీళ్లు తాగించి, “బహుదూర్ వీపు మీద చరిచాడు. బహుదూర్ మళ్ళీ పరుగు తీశాడు. అలా పరిగెడుతున్న బహుదూర్ ఐదో మలుపుకు చేరగానే వేగం తగ్గించి నడవడం మొదలు పెట్టాడు. ఇంక  ప్రమాదం లేదని పసిగట్టాడేమో! అక్కడి నుండి అంతా రహదారే. దారెమ్మట  మంచు కుప్పలు కుప్పలుగా పడున్నది. కొద్ది దూరంలో చెట్ల వెనక నుండి ఎవరో గన్స్ తోటి నా వైపు రావడం చూసాను. అంతే స్పృహ తప్పి బహదూర్ పైన వాలిపోయాను. ఆ ఆకారాలు దగ్గరికి రావడం నన్ను గుర్రం నుండి దింపడం ఆపైన నా మొహం మీద నీళ్లు చల్లడం జరిగింది. అప్పుడు కళ్ళు తెరిచాను ‘ప్రాణాలతోనే ఉన్నానా లేక ఆత్మలాగా నా దేహం చుట్టూ నేనే తిరుగుతున్నానా?’ అనే  భ్రమలో పడిపోయాను. ఇంకొంచెం కళ్ళు పెద్దవి చేసి చూసాను. నన్ను ఒక చెట్టుకు ఆనించి కూర్చోబెట్టారు. వడి వడిగా వాళ్ళు నన్నక్కడ వదిలి  వెళ్ళి పోయారు. పక్కనే బహుదూర్ నిలబడి ఉన్నాడు. నేను వాడిని తాకాలనుకొని కదల లేక వాడిని దగ్గరికి రమ్మని సైగ చేశాను. ఏం అర్థమైందో వాడికి, నా దగ్గరకు వచ్చి తన మేడను వంచి నిలుచున్నాడు. నా రెండు చేతులతో  వాడి తల పట్టుకొని “నా మంచి బహుదూర్” అన్నాను కళ్ళ నీళ్ళతో. ఆ సమయంలో వాడిలాగే నేను బురద కొట్టుకుపోయి, భయంతో నా శరీరం నుంచి కూడా  దుర్వాసన వస్తున్నది. నేను అక్కడే మా వారి కోసం ఎదురుచూస్తున్నా, తోడుగా బహుదూర్ నిల్చున్నాడు.

అయిదవ మలుపు దాటిన తరువాత కొద్దిదూరం నుండి నా కోసం చేయి  ఊపుతూ వస్తున్న మా వారు, ఆయన గుర్రం  వెంటే ఫౌజీ, వారి వెనకాతలే కొంతమంది సైనికులు యాత్రికులను సురక్షితంగా కిందకి  తీసుకు వస్తున్నట్లు లీలగా కనిపించారు.

“బహుదూర్ దిల్ కి అచ్చా హై! వాడికన్నీ తెలుసు!ఒక శిక్షణ పొందిన సైనికుడు!” చెప్పి ఫౌజీ మా వారిని కూడా దింపేసి, బహదూర్ ని ఒక చేత్తో, మరో గుర్రాన్ని మరో చేత్తో పట్టుకొని ముందుకు వెళ్ళి పోయాడు. వాడి వెనకాతలే వెళుతున్న బహదూర్ వెనక్కి తలతిప్పి చూశాడు. ఒక సకలింపు చేశాడు,”జాగ్రత్త ” చెప్తున్నట్టు అనిపించింది. వాడి వెనకాతలే చూస్తుండగానే  పైనుంచి కొంత మంది ప్రయాణికులను సురక్షితంగా తీసుకొస్తున్న మన సైనికులు. అంత భయంలోను ఏదో భద్రతాభావం నన్ను ధైర్యంగా నిలబెట్టింది. వెళుతున్న బహుదూర్ కి  అతని వెనకాతలే వెళుతున్న సైనికులకు నేను సెల్యూట్ చేస్తూ “జై హింద్” చెప్పాను. చిరునవ్వుతో అభయం ఇస్తున్నట్లు నాకు చెయ్యి  ఊపాడు ఒక సైనికుడు. బహదూర్ ని చూస్తుంటే నాకనిపించింది” నేను సైతం… నేను సైతం,” అంటూ భారతీయుల రక్షణ కోసం శిక్షణ పొందిన ఒక సైనికుడు లాగా కనిపించాడు.

మరో మారు “జై హింద్” అని చెప్పకుండా ఉండలేకపోయాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.