
తురాగా జానకీ రాణి గారితో ఇంటర్వ్యూ
-మణి నాథ్ కోపల్లె
‘‘కధలు ఎలా రాయాలో ఎవరూ నేర్పరు. కథ రాయాలనే తపన లోపల్నించి పెళ్ళగించుకుని రావాలి. ఉత్సాహం ఉండాలి. రాయకపోతే తోచని స్ధితి. ఈ స్ధితిలో రాయాలి కథ . –
కథలు ఎలా రాయాలో ప్రముఖ కథా రచయిత్రి తురగా జానకీ రాణి గారి అభిప్రాయం ఇది.
“ఆరున్నర దశాబ్దాలపాటు తెలుగు సాహిత్యంతో కలిసి పయనించిన జానకీ రాణి విలక్షణ రచయిత్రి” అని డా. సి. నారాయణ రెడ్డి కొనియాడారు.
తురగా జానకి రాణి గారి గురించి తెలియని వారుండరు. ఆకాశవాణిలో “రేడియో అక్కయ్య”గా అందరికీ సుపరిచితులు.
రేడియో అక్కయ్యగా ..
తురగా జానకీ రాణి గారు రేడియోలో బాలానందంలో పని చేస్తుండేటప్పుడు తన అనుభవాల గురించి చెప్పిన సంగతులు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం, పాటలు, నాటికలు, రూపకాలు ఇత్యాది కార్యక్రమాలు రూపొందించి వాటిలో చిన్నారులు పాల్గొనటంలో వెనుక ఆమె ఉన్నారు. ఎందరో బాలబాలికలకి మైక్ లో ఎలా మాట్లాడాలి… భయం పోయేలా ధైర్యంగా మాట్లాడాలి సృజనాత్మకత.. ఇలా ఎన్నో విషయాలకి బాలానందం ఒక వేదిక అయింది. ఎందరో ప్రముఖులు తాము చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో వున్న అనుభవం మర్చిపోలేరు. ఆమెని ఒక ఆత్మీయురాలిలాగా పలకరించేవారు…రేడియోలో బాలానందంలో ఉన్నపుడు పాల్గొన్న పిల్లలు ఎంతోమంది ఉన్నత స్ధానంలో ఉన్నా పలకరిస్తూ వుండేవారు. ఇది వారికి ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం.
వీరు ఆకాశవాణిలో ఏమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో వీరు రూపొందించే కార్యక్రమాలు ఒక ఛాలెంజింగ్ గా వుండేవి. వీరి ప్రోగ్రామ్స్ లో వైవిధ్యం వుండేది. రేడియో అక్కయ్యగా బాలానందంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. మహిళలకోసం కూడా కొత్త ప్రయోగాలు చేసేవారు. స్త్రీలు తమ సమస్యలు ఉత్తరాల ద్వారా తెలియ పరిస్తే వాటిని నిపుణులైన డాక్టర్లు, లాయర్లు మొదలైన వారిచే ‘ఇది నా సమస్య’ అనే కార్యక్రమం ద్వారా రేడియోలో పరిష్కారాలు చూపేవారు. ఇక వృద్ధుల కోసం తమ అనుభవాలు తెలిపే స్రవంతి కార్యక్రమం మొదలు పెట్టారు. అలాగే “చదువు” అని పంచాయితీలలోని స్త్రీలకి పాఠాలు అందించేవారు. మహిళలు వారు రాసిన కవితలు, కథలు పాటలు ఈ కార్యక్రమంలో వినిపించేవారు.
“ఒక కార్యక్రమం రేడియోలో రూపొందాలి అంటే ప్లానింగ్, ప్రొడక్షన్, ప్రెజెంటేషన్ ఎంతో ముఖ్యంఅని, ప్లానింగ్ పర్ఫెక్ట్ గా వుండాలి, ప్రొడక్షన్ లో విలువలుండాలి, ప్రెజెంటేషన్ లో ఇవి అన్నీ వుండి అందర్నీ ఆకర్షించేలా వుండాలి” అని అనేవారు.
రేడియో కార్యక్రమానికి మనిషి కంఠ ధ్వని, ఇతర శబ్దాలు, విరామం ఎంతో ముఖ్యం. అలాగే రేడియోలో పాల్గొనే వారు ఎక్సపర్ట్స్ కానవసరం లేదు. ఏక్స్ పీరియన్స్ ముఖ్యం. చెప్పదలచిన విషయాన్ని ఇచ్చిన సమయానికి సమయపాలన పాటించి చెప్పగలగాలి. వృద్ధులు చెప్పే దాంట్లోనూ విలువలుంటాయి.
రేడియో అనేది స్టూడియో నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. ప్రజల మధ్యకి వెళ్ళి వారి అనుభవాలు, వాళ్ళ నాలెడ్డ్ తెలుసుకోవాలి అని చాలా క్రార్యక్రమాలు ప్రజల వద్దకి వెళ్లి చేసేవారు. సాధారణ ప్రజలని కూడా ఇందులో భాగస్వామ్యులని చేయటం ద్వారా వారి అనుభవాలు నలుగురికీ తెలిసేవి. ఇందులో భాగంగా గోదావరిఖని, జడ్ చర్ల, కరీంనగర్, శ్రీశైలం …. ఇలా ఎన్నో ప్రదేశాలు తిరిగి కార్యక్రమాలు రూపొందించేవారు.
ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఎందరో పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పని చేశారు. దేవుల పల్లి కృష్ణ శాస్త్రిగారు, స్ధానం నరసింహారావుగారు, వేలూరి శివానంద్ , గోపీచంద్…. ఇలా ఎందరో వున్నారు. వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారు, సినీ రంగ ప్రముఖలు అక్కినేని నాగేశ్వరరావు, యస్.పి. బాలసుబ్రమణ్యం, జె.వి. సోమయాజులు, మంజు భార్గవి, ఇంకా ఎందరో నటీ నటులతో కలిసి కార్యక్రమాలు రూపొందించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే జానకీ రాణి గారి రేడియో ప్రస్థానం గురించి ఎన్నో విశేషాలు ఈ తరం వారికి తెలియనివి వున్నాయి.
సాహిత్య ప్రస్థానం:
జానకీ రాణి గారు రేడియో అక్కయ్య గానే కాదు. మంచి రచయిత్రి కూడా. తురగా జానకీ రాణి కథలు పేరిట వీరి కథా సాహిత్యాన్ని పుస్తక రూపం లోకి తీసుకు వచ్చారు. తురాగా ఫౌండేషన్ సంస్థ వారు. (తురగా జానకీ రాణి అమ్మాయిలు)
వీరు ఎన్నో కథలు రచించారు. నవలలు మూడు, కథా సంపుటాలు మూడు, బాల సాహిత్యం మీద ఐదు పుస్తకాలు వచ్చాయి. మూడు అనువాద రచనలు కూడా వచ్చాయి. ‘ఆగమ్య గమ్యస్థానం’ అనే కథ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి అభినందనలు అందుకుంది. ఆంగ్లంలోకి ‘తర్జుమా అయింది కూడా. దుర్గాబాయ్ దేశ ముఖ్ గురించి రూపకం ఆకాశవాణికి రాసారు.
1954 లో వీరి సాహితీ కలం కథలు రూపొందిస్తూ 2007 వరకూ కూడా ఆగకుండా సాగింది. వీరు కథా రచయిత్రి గానే ఎక్కువ పేరు సంపాదించారు. కథలు రాయటం లోనే తనకి తృప్తి ఉందని అంటారు. కథా నేపథ్యంలోని కథా వస్తువుగా ఎక్కువగా గ్రామీణ మహిళలు, చదువుకోని స్త్రీలు, వుండేవారు.
“ఈ దేశం ఒక హిమాలయం” అనే నవల జనాదరణ పొందటమే కాకుండా అన్నీ భారతీయ భాషలలోకి అనువాదమైంది. ఆకాశవాణిలో నాటకంగా రూపొందింది. ఇంకో నవల “సంఘర్షణ”సామాజిక సంఘర్షణలకు, కుటుంబ జీవితంలో చోటు చేసుకునే మార్పులకు అద్దం పడుతుంది.
ప్రముఖ వ్యక్తులైన మోపాసా, ఓ. హెన్రీ, జె. బి.ప్రిస్టీ మొదలైన ఎందరో వ్యక్తులను తెలుగు పాఠకులకు ప్రముఖ పత్రికలలో పరిచయం చేశారు. దేవయాని’ అనే కలం పేరుతో ప్రముఖ పత్రికలలో శీర్షికలు నిర్వహించేవారు.
సంఘ సంస్కర్త:
జానకీ రాణి గారు సామాజిక స్పృహ వున్న వ్యక్తి. సమాజం లోని చిన్న చిన్న సమస్యలను తీసుకుని రూపకాలుగా రూపుదిద్దేవారు. యూనిసెఫ్, ఎన్.సి.ఆర్.టి., ప్రభుత్వ శాఖల కోసం … పని చేసేటప్పుడు ‘బాల జాగృతి’ (బా జా)అనే కార్యక్రమం చేపట్టి 670 స్ట్రీట్ షోస్ (వీధి ప్రదర్శనలు) చేశారు. బాలల హక్కులు, సమస్యలు, బాల కార్మిక నిర్మూలన, ఇత్యాది ఎన్నో విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేవారు.సామాజిక స్పృహ వున్న విషయాలు, సృజనాత్మక సందేశాలు పిల్లలు, యువతీ యువకులు శిక్షణ పొంది ప్రదర్శించేవాళ్లు.
“మా చేతి పంపు-మా బిందె నింపు” అనే సోషల్ ఎవేర్ నెస్ కార్యక్రమానికి ఆరోజుల్లో మంచి స్పందన లభించింది. ఆంధ్ర మహిళా సభతో వారి అనుబంధం, లోక్ సత్తా కార్య కర్తగా, శ్రామిక విద్యాపీఠం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరుగా, కస్తూర్బా సేవా సంఘం ట్రస్టీగా, మహిళా మండలుల ఫెడరేషన్ కి సలహాదారుగా, వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ నమ్మిన విలువల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారు. పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలోనే గడిపారు.
ఆదరణ తగ్గని ఆలిండియా రేడియో
కొత్త ట్రెండ్స్ ని ఆపలేం… రేడియో ప్రయోజనం మారింది. అందరికీ టి.వి. చూసే సమయం వుండటం లేదు. ఉద్యోగాల రీత్యా… ఉరుకులు పరుకుల జీవిత విధానంలో రిలాక్స్ గా ఇప్పుడు అందరూ రేడియో వినడానికే ఇష్ట పడుతున్నారు. కారులో ప్రయాణిస్తూ కూడా రేడియోనే వింటున్నారు.
“రేడియో అంటేనే బహుజన హితాయ… బహుజన సుఖాయ… రేడియో ద్వారా హితం పలుకుతాం… అందరికి సుఖాన్ని అందిస్తాం. సంఘంలోని సంస్కృతిని నిలపటానికి ఉంది. సమాజం లో జరిగే మార్పులు ప్రజలకు తెలిపేలా ఉపయోగ పడే సాధనం రేడియో“ అనేవారు తురగా జానకీ రాణిగారు.
రేడియో అక్కయ్యగా కథకురాలిగా, ప్రసిద్ది చెందారు. బాలానందంలో పిల్లల్లో పిల్లగా, వనితా వాణి కార్యక్రమాలలో వనితగా, రచయిత్రిగా రాణిస్తూ, నర్తకిగా, సామాజిక సేవకురాలిగా, వృత్తి, ప్రవృత్తి రెండింటిలోనూ రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి జానకీ రాణి గారు అటు మేధావులకు, సామాన్య జనులకు చేరువయ్యారు.
సాహిత్య రచనల్లో “స్త్రీవాదం, దళితవాదం వంటి ఏ వాదాలతో పని లేకుండా మనుషుల కధలు రాయాలి. కష్టాలు, సుఖాలు, బలహీనతలు వంటి వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలి. కలం మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్. ఆ ‘కలం మనం ఎలా ఉపయోగిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది’ అని ఆలోచించాలి. ముందు సంఘర్షణ, పోరాటం ఉంటుంది. ఇకనామిక్, ఫామిలీ విమెన్, సమాజం …. ఈ విషయాలన్ని ముందు ప్రాతిపదికగా తీసుకోవాలి. తరువాతనే విజయం. విజయం కనిపించే కలికి తురాయి వంటిది.’ అని వీరి అభిప్రాయంచెప్పారు.
వీరి ఉద్దేశంలో ‘అసలు రచయిత అంటే రచయితే! రచయిత్రి, రచయిత అని వేరు వేరు లింగ బేధం ఉండదు. భావం ఒకటే. భాష ఒకటే. భావ ప్రకటన ఒకటే! ఆరోజుల్లో రచయిత్రులు చాలా తక్కువ ఉండేవారు. బయటికి నిర్భయంగా చెప్పేవారు తక్కువ.
50 -60 దశకాల్లో సమాజంలో రచయిత్రుల గురించిన అభిప్రాయం వీరి మాటల్లోనే “ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు పట్టుబట్టి 1963లో అఖిల భారత తెలుగు రచయిత్రుల మహా సభలు పెట్టారు. ఆనాటి సభలకి విజయలక్ష్మీ పండిట్, లీలావతి మున్షీ మొదలైన వారు హాజరయ్యేవారు. ఆవిడ గుంటూరు, విజయవాడ, ఏలూరు ఇలా ఆంధ్ర దేశమంతా తిరిగి రచయిత్రుల మహా సభలు నిర్వహించేవారు. ఆనాడు వేదికలెక్కి ‘మేము రచయిత్రులం’ అని మాట్లాడే ధైర్యం ఎవరికీ వుండేది కాదు. ఆవిడ ఒక శక్తిలా నిలబడ్డారు. రచయిత్రులకి ఈస్ధితి, ప్రోత్సాహం ఒక్కసారిగా రాలేదు. రచయిత్రుల ప్రోత్సాహంతోనూ రాలేదు. ఒక పరిణామ క్రమంలో వచ్చింది” అంటూ ఆనాటి మహిళా రచయిత్రుల పై వీరి అభిప్రాయం చెప్పారు.
సమాజంలో మనిషి తీరుతెన్నులపై ఇలా అనేవారు. ‘‘ప్రపంచం లో మంచి చెడూ సుఖం దు:ఖం అన్నీ ఉంటాయి. మనం దేనినీ మార్చలేము. ఏమి జరిగినా మనమే సర్దుకు పోవాలి.ఉదాహరణకి కొన్ని సార్లు మనకి దు:ఖం కలుగుతుంది. ఎందరు వచ్చి ఓదార్చినా ఆ దు:ఖం మనలోనే ఉంటుంది. గాయం పోయి పుండు మనకే ఉంటుంది. ‘నేను’ అనేది ముఖ్యం. సమాజంలో ఎవరికి హాని తలపెట్టకుండా, మనకి మనం సరిగా బాగా వుండాలి అనే స్పృహ వుండాలి. సృష్టిలో ఎంతో మంచి వుంది. దేనిని భంగ పరచకుండా శక్తిగా, కాంతిగా ప్రసరింపచేయాలి. మనం ఇతరులకి సమస్య కాకుండా ఉండాలి.’’
‘తల్లి తండ్రులకి పిల్లలపై కంట్రోల్ ఉండటం లేదు. పెరిగారంటే పెరిగారు. ఇదివరకు తల్లి తండ్రి చెప్పింది రైటు అనేవారు. గురుత్వ భావం ఉండేది. నేటి పిల్లలపై బయటి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. బయటి ప్రేరణ ఎక్కువయింది. కష్టం, దుఖం ఎదురైతే ఇంట్లో పరిష్కరించుకోరు. బయటికి వెళ్ళి పోతారు. ఎక్కువ చదువుకోవడం వల్ల, ఆత్మ విశ్వాసం పెరుగుతోంది. ఉద్యోగాలు చేస్తుండటం వల్ల కూడా ఆర్ధిక స్తోమతతో కాన్ఫిడెన్స్ వస్తోంది.” అని నేటి సమాజంలోని పిల్లల మనస్తత్వం గురించి చెప్పేవారు.
కాలం మారుతోంది. పుస్తకాలు చదివే వారి గురించి వారి అభిప్రాయం “యువతకి పుస్తకాలు సమయం ఉండటం లేదు కాని చదివే పాఠకులు చాలామందే వున్నారు. సాహిత్యం వస్తూనే వుంది. పుస్తకాలు అచ్చులో వస్తూనే వున్నాయి. కాకపోతే ముద్రించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.” అని. కొన్ని పుస్తకాలలో అక్షరాలు మాయమై కాగితాలు మిగులుతున్నాయి. అని వీరి భావం.
జానకీ రాణి గారి కథల్లో సహజత్వం వుంటుంది. సమాజాన్ని పరిశీలించి రాస్తారు. భిన్న కథాంశాలు,స్త్రీల వాస్తవ గాధలు రాశారు. వీటిల్లో నీతి, అవినీతి ప్రసక్తి లేదు. అది వాస్తవం మాత్రమే!
రచనలు నేటి పత్రికలవారి అభిరుచికి అవసరాలకు తగినట్లుగా కాలాన్ని బట్టి చేయాలి. కొత్త రచయిత్రులని ప్రోత్సహించాలి” అని అనేవారు.
రేడియోలో ఉద్యోగరీత్యా అవసరమైన అంశాలను అప్పటికప్పుడు రాసి ప్రజెంట్ చేసేవారు. అలా రాసినవి దాదాపు 2,000 పుటల దాకా ఉన్నాయి. నూరు కధలు, మూడు నవలలు, అనేక వ్యాసాలు, నాటికలు ఎన్నో వీరి కలం నుంచి వెలువడ్డాయి. నాటికలు పిల్లలవి, పెద్దలవి 40 దాకా వున్నాయి.
సందర్భానుసారంగా మినీ రూపకాలు బాల జాగృతి (బా జా) పేరుతో రూపొందించి, బయటి సమాజంలోని పిల్లలతో పెద్దలతో రికార్డింగు చేసేవారు. ఇది ఎంతో జనాదరణ పొందిన కార్యక్రమం.
అంతేకాదు మహిళా సంక్షేమ రూపకాలు కూడా రూపొందించేవారు. వాటిలో ‘‘పన్నీటి జల్లులు ` పల్లేరు కాయలు’’ కూడా మంచి పేరు వచ్చింది. మంచి విషయాలు చెప్తే ‘పన్నీరు’ అని, చెడు విషయాలు, కష్టాలు వంటి విషయాలు చెప్తే ‘పల్లేరు కాయలు’ అని అర్ధం వచ్చేటట్లుగా ఉండేది ఆ కార్యక్రమం. రేడియో ద్వారా మహిళలు, బాలలు ఎందరికో ఒక వేదిక కల్పించి, నలుగురిలో మాట్లాడే ధైర్యం ఇచ్చి, సృజనాత్మకత పెరిగేలాప్రోత్సహించిన వ్యక్తి జానకీ రాణి గారు. . వీరిలో ఎందరో ప్రముఖులు కూడా ఉన్నారు.
జానకీ రాణి గారి ఉద్యోగ ప్రస్థానం :
జానకి రాణి గారు 1958లో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డులో వెల్ఫేర్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు, ఇది సమాజంలోని వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పనిచేసే కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థ.. వారు మద్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ నుండి ఓరియంటేషన్ సర్టిఫికేట్ పొందారు.సంస్థలో తన సేవలో, ఆమెఅశ్వరావుపేట, వాంఖిడి మరియుఅడ్డతీగలవంటి గిరిజన ప్రాంతాలలో కుటుంబ మరియు పిల్లల సంక్షేమ ప్రాజెక్టులను ప్రారంభించారు. జానకీరాణిగారి పదవీకాలంలో, ఆమె బోర్డు యొక్క అధికారిక పత్రిక ‘సుభాషిణి’ని కూడా సవరించారు.
చిన్నతనం నుంచీ రచనలు చేసిన వీరి పుస్తకాలు హిందీ, తమిళ్, కన్నడ, ఇంగ్లీషు, ఒరియా, బెంగాలీ భాషలలోకి అనువదించబడ్డాయి.
గుడిపాటి వెంకటాచలం
ఆత్మీయురాలు, స్నేహశీలి అయిన తురగాజానకిరాణి గారు గుడిపాటి వెంకట చలంగారి దగ్గరి బంధువు.
చలం గారు మా తాతయ్య అని చలం గారితో చిన్నతనంలో గడిపిన కబుర్ల జ్ఞాపకాలతో“మా తాతయ్య చలం”అనేలేఖా వ్యాసాన్ని రచించారు. జానకీరాణి గారు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని నిలుపుకునే రచనలు చేశారు.
“శాస్త్రరచన వేరు, సృజనాత్మక రచన వేరు. శాస్త్రపరమైన ప్రధానమయినది ‘ప్రతిభ’. ఇది ‘నవనవోన్మేషశాలిని ` ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకు వచ్చేది. వాస్తవ జీవితానుభవాలు రచయిత సృజనాత్మక ప్రతిభతో మేళవించి కథారూపం పొందుతాయి”. – ఈ వాక్యాలుప్రముఖ రచయిత శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారు జానకి రాణి గారి కథల గురించి చెప్పిన విశ్లేషణ ఇది.
రచయితల కుటుంబమే!
తురగా జానకి రాణి గారి శ్రీవారు తురగా కృష్ణ మోహన్ గారు కూడా మంచి రచయిత. జర్నలిస్ట్. ఆంధ్ర సచిత్ర వార పత్రికలో “ప్రవీణ్” పేరుతో “రాజధాని కబుర్లు” అనే శీర్షికతో వ్యాసాలు వచ్చేవి. ఆ రచనలలో సునిశిత విమర్శ, హాస్యం, వ్యంగ్యం కనపడుతుండేవి. కృష్ణమోహన్ గారి కబుర్లలో కథానికలు పుట్టుకు వస్తే, జానకిరాణి కథల్లో కబుర్లు పుట్టుకు వస్తాయి. ఇద్దరూ మంచి రచయితలే! హాస్యాన్ని కురిపించే వారే! పాఠకులు వీరిద్దరి రచనలు ఇష్టపడేవారే!
ఇక వారి అమ్మాయి తురగా ఉషా రమణి కూడా ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్ గా శ్రోతలను అలరిస్తున్నారు. వసంత శోభ గొప్ప ఆర్కిటెక్ట్. ఇద్దరూ ప్రముఖ వ్యక్తులే!
జానకీ రాణి కథలు సూటిగా, చిన్నవిగా వుంటాయి. కథల్లో డ్రామా లు వుండవు. వాస్తవికత కనిపిస్తుంది. ప్రతి కథ చదుతున్నప్పుడు ఇది ఫలానా చోట జరిగిందనో, లేదా తమకి జరిగిందనో అన్వయించుకుంటారు పాఠకులు. మధ్య తరగతి కథలు కనిపిస్తాయి.
వీరి కథల్లో మనోవిశ్లేషణ ఎక్కువగా కనిపిస్తుంది. కులమతాలకు దూరంగా మనిషి మనసు పోకడలు కనిపిస్తాయి. వీరి కథల్లో భాష, పదాల పొందిక, వాటిని వ్యక్తపరిచే తీరు పాఠకులని కట్టిపడేస్తుంది.“ స్త్రీలు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కుంటారు. వాటిని దాటుకుని ఎప్పుడూ చిరునవ్వుతో వుండే స్త్రీలు అంటే ఎంతో గౌరవం” అంటారు జానకీ రాణి గారు.
“చదువుకొన్న వారికన్నా..” కథలో ఒక ఉమెన్స్ హాస్టల్ లో బట్టలు ఇస్త్రీ చేసి పధ్నాలుగేళ్ల బాలిక ఋక్కు కష్టానికి తగిన ఫలితం ఇవ్వకుండా తిప్పించటం ఇత్యాది ఘటనలతో ఆ చిన్నారి మనసు గురించి చాలా చక్కగా చెప్పారు. రచయిత్రి. ఈ కథ 1956 లో రచించారు.
అలాగే ‘భూతద్దం లోంచి..’ అనే కథలో రాత్రివేళ రిక్షా ఎక్కిన ఓ యువతి మానసికంగా పడే ఆందోళన, ఆ రిక్షా నడిపినతని మీద అనుమానం, చివరికి ఏమీ జరగకుండా భద్రంగా ఇంటికి చేర్చిన అతనికి బహుమతిగా కొంత నగదునివ్వటం తో కథ ముగుస్తుంది. ఇందులో కథా కాలం స్వల్పమే. కానీ అంతరంగ మధనం, మనసులో కలిగే అనుమానాల సంఘర్షణ కథని నడిపిస్తాయి. 30 కథల సంపుటం లో జానకీ రాణి గారికి అన్నీ నాకు నచ్చిన కథలే అని అంటారు. ఏదైనా ఒక వ్యక్తి గానీ, సంఘటన కానీ, ఎదురైనప్పుడు రాసిన కథలే ఎక్కువగా వున్నాయి అని అంటారు.
తురగా జానకీరాణి గారుఅక్టోబరు 15, 2014బుధవారం సాయంత్రం, పంజగుట్టలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
తురగా జానకి రాణిగారి జీవిత విశేషాలు:
జ జననం : 1936, ఆగష్ట్ 31 న కృష్ణాజిల్లా లోని, కోడూరు మండలం, మందపాకల గ్రామం (మచిలీపట్నం వాస్తవ్యులు)
చదువు : ఎం.ఏ. , సోషల్ వర్క్ లో డిప్లోమా.. ; నృత్యంలో చొక్కాలింగం పిళ్ళై శిష్యురాలు. నత్య, సంగీతంలో డిప్లోమాలు…
కుటుంబం : ప్రముఖ జర్నలిస్టు తురగా కృష్ణమోహన్ గారితో 1959లో వివాహం జరిగింది. 1974 లో రైలు ప్రమాదంలో కీర్తి శేషులయ్యారు. పెద్దమ్మాయి తురగా ఉషారమణి , ఆలిండియా రేడియో న్యూస్ రీడర్.
చిన్నమ్మాయి వసంత శోభ. ఆర్కిటక్. ప్రముఖ సంస్ధలో..
విద్యావేత్తలు, సాహితీ వేత్తల కుటుంబం…. అమ్ముమ్మ నుంచీ చదువుకున్నవంశమే! వీరి తల్లి బి.ఏ .. పిన్ని డాక్టరు… ప్రముఖ సాహితీవేత్త శ్రీ గుడిపాటి చలం దగ్గరి బంధువు. (అమ్ముమ్మ గారి తమ్ముడు)
ఉద్యోగం :
1974 వరకు హైదరాబాదు ఆకాశవాణితో నాటక కళాకారిణి, ప్రసంగ కర్త, ప్రయోక్తగా అనుబంధం…1975లో ప్రోగ్రామర్ గా ఆలిండియా రేడియోలో ప్రవేశం.
1994 లో ఐ.బి.ఎస్. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగా పదవీ విరమణ.
రచనలు : జానకీరాణి కధలు, ఎర్రగులాబీలు, జానకీరాణి కధలు, నవ్వని నవ్వు.. మొదలైన ముద్రిత సంపుటాలు.
నవలలు :వేయబోవని తలుపు, సంఘర్షణ, ‘ఈ దేశం ఒక హిమాలయం’
అనువాదాలు: కస్తూర్బా, రెడ్ క్రాస్ కధ, దేశాన్ని పునర్నిర్మించండి, నా యాత్రా అనుభవాలు..
పిల్లల పుస్తకాలు :బి.నందంగారి ఆసుపత్రి, మిఠాయి పొట్లం…..
అవార్డులు :
- 1987, 89 రెండు సార్లు జాతీయ స్ధాయి ఆకాశవాణి అవార్డులు…
- 1990లో “నిశ్శబ్దంలో ప్రేమ నాదాలు” కార్యక్రమానికి నేషనల్ అవార్డు.
- “ఆశ్రయం” వృద్ధుల మీద రూపొందించిన కార్యక్రమానికి నేషనల్ అవార్డు..
- వీరికి ‘నారీ నవ్యదర్శిని’, ‘స్త్రీ హితైషిణి’, ‘బాలబంధు’ వంటి టైటిల్స్ వచ్చాయి.
- బాల సాహిత్య పరిషత్ ద్వారా “బాలసాహిత్య రత్న” అవార్డు
- గహలక్ష్మీ స్వర్ణకంకణం. ; తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం (రెండుసార్లు);
- రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం; పింగళి వెంకయ్య స్మారక సత్కారం.
- అరవిందమ్మ మాతృమూర్తి అవార్డు;
- ఆంధ్ర సారస్వత పరిషత్తులో ‘పరిణితవాణి’ గౌరవం.
- ‘ఈనాడు’ అవార్డు;
- సుశీల నారాయణరెడ్డి సాహితీ పురస్కారం.
- దక్షిణ మధ్య రైల్వే గౌరవ సత్కారం;
- ఇలా ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నారు.
- వీరి రచనలపై పి.హెచ్.డి., యం.ఫిల్. విద్యార్ధులు పరిశోధనలు. చేశారు… ఇప్పటికీ చేస్తున్నారు.
*****

మణి కోపల్లె పుట్టింది గుంటూరులో. చదివింది ఎం ఏ, (ఇంగ్లీష్) , ఎం సి జె (జర్నలిజం). కోపల్లె మురళినాథ్ సతీమణి గా ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణి గా వున్నారు. రచయిత్రిగా అన్ని ప్రక్రియల్లో వున్నా ఎక్కువగా జర్నలిస్ట్ గానే వీరి ఆర్టికల్స్ వచ్చాయి. కలం పేరు మణినాథ్ కోపల్లె . ప్రవృత్తి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. టీచర్ గా, స్క్రిప్టర్ గా, డిటిపి ఆపరటర్ గా చేసిన అనుభవం.
