యుద్ధం.. భూతలానికి పెద్ద శాపం.

– అవధానం అమృతవల్లి

ఒకరిస్వార్ధం ఒకరికి వేదన
ప్రపంచాన్ని శాసించాలన్న చింతన
రక్తపు టేరులతో తడిపేస్తోన్న కుటిల ఆలోచన
అణగత్రొక్కడమే అధిపత్యపు చిరునామానా!?

సంపద తమ నేలలో పారడమే తాము
చేసుకున్న పాపమా!!
సహజ సిద్ధ సిరుల గనులు తమ చుట్టూ
ఉండటమే తమ మనుగడకు శాపమా!!

ఎవరి నేలను ఎవరు ఆక్రమించదలచారో
ఏ సరిహద్దు రేఖలను ఎవరు అతిక్రమించారో
విజ్ఞానపు డేగ కళ్ళు విలువైన స్థావరాల
ఆచూకీల గుట్టు విప్పేస్తుంటే..
పరమాణువుల శక్తి ముందు మనిషి ఉనికి
గల్లంతు ఔతోంది!

యుద్ధం వినాశ హేతువని కొత్తగా పాఠాన్ని
ఎవరు నేర్పాలి?
చరిత్ర దారులన్నీ బీడులై విధ్వంసపు ఆనవాళ్లను ఇంకా మోస్తూనే ఉన్నా..
ఎవరి ఉన్నతిని కాంక్షిస్తూ చేస్తున్న పోరాటం ఇది?!

అసంబద్దపు కొరతలు సృష్టించి ఎవరి గల్లా పెట్టెలు నింపుకుందామని.. ఈ వాంఛ!?
అసహాయుల్ని చేసి ఎవరి మాన ప్రాణాల్ని
కబలిద్దామని ఈ కఠోర చొరబాటు..!?
అయినవారిని కోల్పోయి అనాదలౌతున్న
బాల్యపు మౌన రోదన ఏ ఆకాశపు చెవిని సోకేను!?

నింగి నేలా ఏకం చేసి అగ్నికీలలకు ఆహుతి
చేస్తున్నావ్ మనిషి మనుగడను
విద్వేషపు బీజాల్ని విచ్చల విడిగా చల్లేసి
అరాచకపు మొలకలతో రేపు ఏ సమాజహిత పంటల్ని పండించగలవు?!

సార్వభౌమాధికారమంటే అనాలోచిత ఆక్రమణ కాదే..
ప్రపంచ శాంతిని కోరే నోటికి ఎవరు తాళం వేశారు విప్పకుండా
ఆక్రమణ దారులకు పచ్చ జెండా ఊపుతున్న
ఔన్నత్యం ఎవరిదో!?

యుద్ధం ఒక క్షోభ యని
సంక్షోభానికి హేతువని
వినాశనానికి తెర్చుకున్న వాకిళ్ళని
విచక్షణ కోల్పోయిన మూర్కుని చేతిలో
మండుతున్న అగ్నిశిఖయని..
అనాలోచిత ఆట భస్మాసుర హస్తమౌతుందని గ్రహించ లేరా..!!

తూరుపు సూరుడి వెలుగులను
పశ్చిమ ప్రమిదలో నింపాలన్న ప్రకృతి అసంబద్ధ యోచన…
ప్రకృతి ధర్మాన్ని,నియమాన్ని వీడి విస్తరణకు పూనుకుంటే
ఓర్చుకోలేని భూమి ఒక్కసారి వొళ్ళు విరుచుకుంటే చాలు.. శ్వేత సౌధాలన్నీ
భూస్థాపితాలే.!!

జీవిస్తూ జీవించనివ్వాలన్న ఇంగితం మరచి
సర్వప్రాణికోటికి ప్రాణవాయువును కూడా
మిగుల్చలేని స్థితిని కల్పించి..నువ్వే కిరీటం
మోస్తే ఏం ప్రయోజనం!?
ఊపిరి పిట్టలు లేని ఊళ్ళని ఆక్రమించి
శ్మశానాల్ని ఏలు కుంటావా??

ఎవరి చమట ఇంధనాలకో డాలర్ల రెక్కలు
తొడిగి ప్రపంచ విపణి వీధిలో అమ్మకానికి
పెట్టేందుకు ఎవరిచ్చారు హక్కు!?
పెదవి విప్పాలి శాంతి కాముకులు
ఆక్రమణ దారులను కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి..
కాలుష్య రహిత బూతలానికై యుద్ధ వాంఛలను మొదలంటా కూల్చాలి.
సరిహద్దు రేఖలలో శాంతి పూలు పూయించాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.