మంచి మార్పు

-అనసూయ కన్నెగంటి

                                

             కవిత, వనిత ఇద్దరూ స్నేహితులు.  ఒకే బడిలో చదువుతున్నారు. వాళ్ళ ఇద్దరి ఇళ్ళు పక్క పక్కనే కావడంతో రోజూ బడికి కలిసి వెళ్ళి కలిసి వస్తూ ఉంటారు. 

కవిత కంటే వనిత వయసులో రెండేళ్ళు చిన్నది. అందుకని కవిత ఏడవ తరగతి అయితే వనిత ఐదవ తరగతి.  

రోజూ బడి నుండి రాగానే ఇంటి దగ్గర ఏవైనా పనులు చెప్తే చేసేసి పాలు తాగి ఏవైనా కథలు చదువుకోవటానికి దగ్గర్లో ఉన్న గ్రంధాలయానికి వెళతారు. ఆ రోజు కూడా అలాగే బయలుదేరారు.  వాళ్ళకు  దారిలో ఆరవ తరగతి చదివే  రాజేష్ అనే అబ్బాయి ఒకచోట గోడ ఎక్కి ఎవరిదో జామచెట్టు కొమ్మలు వంచి జామకాయలు కొయ్యడం కవిత, వనిత చూశారు. రాజేష్ కూడా రోజూ గ్రంధాలయానికి వచ్చి చదువుకుంటూ ఉంటాడు. 

 అది చూసి కవిత, వనితతో “చూడు చూడు వనితా.  రాజేష్  అటు ఇటు చూసి ఎవరో చూడడం లేదు అనుకుని కాయలు ఎలా దొంగతనం చేస్తున్నాడో”  అంది.

“అవునక్కా. నేనూ చూశాను”  అంది వనిత. 

“నాకు నచ్చలేదు రాజేష్ అలా కోయటం” 

“ అవును. నాకూ నచ్చలేదు. ఏదైనా చెట్టు నుండి కాయలు కోసేటప్పుడు ఆ చెట్టు మనదైతే ఎంత గర్వం కలుగుతుందో, అడక్కుండా ఎవరి చెట్టు నుండైనా కోస్తుంటే అంతే భయం కలుగుతుంది కదా అక్కా. రాజేష్ భయపడుతున్నాడు” అంది వనిత.

“ అవును” అంది కవిత. అలా   ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ , మధ్య మధ్యలో ఎవరైనా స్నేహితులు కనిపిస్తే మాట్లాడుతూ వెళుతున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి రాజేష్ కలిశాడు. 

రాజేష్ తో పాటు ఎనిమిదవ తరగతి చదువుతున్న గోపి కూడా ఉన్నాడు. ఇద్దరూ జామకాయలు తింటున్నారు. రాజేష్  కవిత, వనిత  ఇద్దరికీ చెరొక జామకాయ ఇవ్వబోతే తీసుకోలేదు వీళ్ళిద్దరు. 

దాంతో ముఖం అదోలా పెట్టుకుని “ఇంతకుముందు నేను ఏం పెట్టిన మీరు తీసుకుని తినేవారు కదా. ఇప్పుడు ఎందుకు తీసుకోవటం లేదు?” అని అడిగాడు రాజేష్. 

 “ఆ జామకాయలు నువ్వు దొంగతనంగా కోసావు. మేము చూసాము. దొంగతనం చేసిన కాయల్ని  మేము ఎలా తీసుకుంటాము?”అంది కవిత. 

“అవునా? దొంగతనంగా కోసావా? నేనింకా మీ ఇంట్లో చెట్టువి అనుకున్నాను” అన్నాడు గోపి.

“ మేము వచ్చే దార్లో చెట్టే. మేము చూశాము”

“ ఇందులో మీ తప్పు కూడా ఉంది” అన్నాడు గోపి. 

“మేమేం చేసాము. మమ్మల్ని అంటున్నావు”

 “ ఏం చేసారా? రాజేష్  మీ తరగతి కాకపోవచ్చు.కానీ రోజూ  గ్రంధాలయంలో అందరూ కలిసే పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు కదా. ఆ చనువుతో అతను కాయలు దొంగతనం చేసేటప్పుడు చెప్పాలి కదా అలా కోయకూడదు అని. అప్పుడు చూసి వదిలేసి ఇప్పుడు చెప్తున్నారా? ఎవరైనా తప్పు చేసేటప్పుడే చెప్పాలి కదా!”అన్నాడు  గోపి సగం తిన్న జామకాయని దూరంగా విసిరేస్తూ.  

“దొంగతనం చేయడం తప్పు. నిజమే. ఆ తప్పు చేస్తున్నప్పుడే అది తప్పని చెప్పాలి. కానీ మేము చెప్పలేదు. ఎందుకంటే అతను గోడ ఎక్కి కాయలు కోస్తున్నాడు. ఆ సమయంలో మేము చెప్తే  ఆ కంగారులో రాజేష్ గోడ మీద నుండి దూకేస్తాడు. అది రాజేష్ కి ప్రమాదం. పైగా తప్పు చేసేటప్పుడు చెప్తే మేము చూసేసామని  అవమానంగా భావించి రాజేష్ మాపై ద్వేషం పెంచుకోవచ్చు. అందుకని చెప్పలేదు”

“ మరి ఇప్పుడు మాత్రం ద్వేషం పెంచుకోడా? ఇప్పుడెందుకు చెప్పారు  అతను దొంగతనం చేసేటప్పుడు మీరు చూశామని” అన్నాడు గోపి.  

“చెప్పాలి. ఒక మిత్రునిగా రాజేష్ కి అతను చేసిన తప్పుని ఇప్పుడు కూడా చెప్పకపోతే మాది తప్పు. ఇంకొకళ్ళ చెట్టు కాయలు వాళ్ళ అనుమతి లేనిదే ఎవరైనా ఎందుకు కోయాలి? ఆ చెట్టు మనం వెయ్యలేదు. నీళ్ళు పొయ్యటం లేదు.  ఆ చెట్టు కాయల్ని ఎవరైతే నీళ్ళుపోసి పెంచుతున్నారో వాళ్ళకే ఉంటుంది. 

పైగా  జామకాయలు మాకు కూడా ఇచ్చి మమ్మల్ని కూడా తప్పు చేసిన వాళ్ళుగా చేయాలని  రాజేష్ అనుకున్నాడు. అందుకని చెప్పాము”

“మంచిపని చేశారు. నాకూ ఇచ్చాడు. కానీ దొంగతనంగా కోశాడని నాకు తెలియక తీసుకున్నాను.  మీరు చెప్పాకా దానిని పడేశాను. దొంగతనం చేయటం ఎంత తప్పో దానిని ప్రోత్సహించటం కూడా అంతేతప్పు” అని రాజేష్ వైపు చూస్తూ..

“దొంగతనం చేయకూడదు అని స్కూల్లో చదువుకుంటున్నాం కదరా రాజేష్.పైగా బోలెడన్ని పుస్తకాలు చదువుతున్నావు. నువ్వు ఇలా చేస్తే పుస్తకాలు బాధపడతాయి కదా.  నువ్వు ఇప్పుడు రెండు పనులు చేయాలి.  ఒకటి నువ్వు తప్పు చేసినందుకు ఆ జామ చెట్టు  కలవాళ్ళ  ఇంటికి వెళ్లి క్షమాపణ అడుగు. ఇంకెప్పుడూ దొంగతనం చెయ్యను అని వాళ్ళతో చెప్పు. ఆ తర్వాత కవితకు వనితకు క్షమాపణ చెప్పు. అప్పుడే నువ్వు మంచి విద్యార్థిని అవుతావు” అన్నాడు గోపి.

“పుస్తకాలను కూడా క్షమించమని అడగాలి” అంది వనిత.

ఆ మాటకి అందరూ నవ్వి “నిజమే నిజమే “ అన్నారు

రాజేష్ కి కూడా నవ్వొచ్చింది. కవిత, వనిత, గోపి చెప్పింది నిజమే అనిపించింది  రాజేష్ కి. 

“సరే! సారీ చెప్పేసి వస్తా”అని రాజేష్ వెళ్ళబోతుంటే “పుస్తకాలు చదివి నేర్చుకోవాల్సింది ఇదే. ఇప్పుడు అవి కూడా సంతోషిస్తాయి. పద. నీతో పాటు మేమూ వస్తాము” అన్నాడు గోపి.  

అందరూ కలసి చెట్టు కలవాళ్ళ ఇంటికి బయలుదేరారు. 

  గ్రంధాలయంలో పుస్తకాలు పులకించిపోతూ ఎదురు చూస్తున్నాయి వీళ్ళంతా ఎప్పుడు వస్తారా అని.

                                                                            —

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.