దేవి చౌధురాణి

(మూడవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

రాణి సైన్యం అడవిలో నుండి ఒక చీమల దండులాగా జరజరా బయటపడ్డారు. అందరికి ఒక చేతిలో బల్లెం, ఇంకొక చేతిలో ఢాలు వున్నాయి. వీపుకున్న వరలో దుడ్డు వెదురు కర్ర కట్టుకున్నారు. నీటిలో జరిగే పోరు కనుక ఎవరికీ కాళ్లకు జోళ్లు లేవు. కొందరి దగ్గర తుపాకులు వున్నవి.

నదీ తీరం చేరుతూనే కొంత మంది “రాణిజీ కి జయ్” అంటూ శంఖాలు పూరిస్తూ నావ ఎక్కారు. వీళ్లు ఆ నావకు నావికులు. చుక్కాని పట్టుకోవల్సిన వాళ్లు చుక్కా వద్దకు, తెడ్లు వేసే వాళ్లు తెడ్ల దగ్గరకు, ఎవరి స్థానాల్లో వాళ్లు వెళ్లి నావను సిద్ధపరిచారు. తుపాకులతో కొంత మంది నావ పైకప్పు మీదకు చేరి ప్రతిఘటనకు సిద్ధమయ్యారు.

కంపెనీవాళ్ల నాగతరులు నావను చుట్టుముట్టాయి. మల్ల యుద్ధం, కర్రసాములలో ఇంగ్లీషు వాళ్లు ఈ అగ్నివీరుల బరకందాజ్‌కు సమ ఉజ్జీలు కాదు. అన్ని వైపుల పోరు మొదలయ్యింది. సిపాయిల అరుపులు కేకలతో, తిట్లతో, ఇంగ్లీషు సిపాయిలను నీటిలోకి లాగిన తోపిడీలతో నది అల్లకల్లోలమవుతున్నది.

అక్కడ దేవి ఈ రొద, మోత విని ‘నా సందేశం భవాని ఠాకుర్‌గారికి చేరినట్లు లేదు. లేకపొతే ఆయన విని కూడా విస్మరించి వుంటారు. ఏది ఏమైనా, ఇప్పుడు ఈ పోరు ఆపటం నా ధర్మం’ అనుకున్నది.

చదరంగంలోనైనా యుద్ధరంగంలోనైనా నాలుగు ఎత్తులు ముందుకు ఆలోచించాలి. దేవి ఈ యుక్తి, పధకరచనలో సాటిలేనిది. పధకం ముందు నుంచే రచించిందా అన్నంత వేగంగా ఒక తెల్ల జెండా అందుకుని నావ ఉపరితలానికి వెళ్లి వూపింది.

యుద్ధం ఆగిపోయింది. ఎవరు ఎక్కడ వున్నారో, అక్కడే నిలబడిపోయారు.

దేవి తెల్ల జెండా పట్టుకుని వెళ్లటం చూసి వ్రజేశ్వర్ అనుసరించాడు. వెనుకగా వున్న వ్రజేశ్వర్‌కి దేవి జెండా అందించి “నేను వెళ్లి నిశిదివలతో మాట్లాడాలి. రంగారాజు వస్తే వెంటనే లోపలికి వచ్చి నా ఆజ్ఞాపాలన చెయ్యమని చెప్పండి” అంటూ లోపలికి వెళ్లిపోయింది.

అప్పుడే రంగరాజు వచ్చాడు. వస్తూనే వ్రజేశ్వర్‌ని చూసి “నిన్ను తెల్ల జెండా ఎగరెయ్యమని ఎవరు చెప్పారు?” అంటూ తీక్షణంగా ప్రశ్నించాడు.

వ్రజేశ్వర్ “రాణిగారి ఆజ్ఞ” అన్నాడు.

“రాణిగారి ఆజ్ఞ? అసలు నువ్వు ఎవరివి?” రంగరాజు ప్రశ్నించాడు.

“గుర్తు పట్టలేదా?”

రంగరాజు వ్రజేశ్వర్‌ని పరిశీలనగా చూసి, పరిహాసంగా నవ్వుతూ, “బాబూకొడుకులిద్దరూ దేవి రాణిని పట్టించే పని మీదే వచ్చారనమాట. వీడ్ని కట్టిపడెయ్యండి” అంటూ ఆదేశించాడు.

ఇద్దరు మల్లులు వచ్చి వ్రజేశ్వర్‌ని తాళ్లతో కట్టిపడవేశారు. వ్రజేశ్వర్  ప్రతిఘటించలేదు. “నన్ను కట్టేస్తే కట్టేశారు, కానీ తెల్ల జెండా వూపితే యుద్ధం ఎందుకు ఆగిపోయింది?” అంటూ ఆశ్చర్యపోయాడు.

“నీకు ఆమాత్రం తెలవదా అమాయక చక్రవర్తి? తెల్ల జెండా చూపితే ఇంగ్లీషువాడు పోరు ఆపుతాడని?” ఎగతాళిగా అన్నాడు రంగరాజు.

“సరే, నాకు తెలువదు. ఏం ఫర్వాలేదు. ముందు వెళ్లి రాణిగారినే అడుగు, నేను ఆవిడ ఆజ్ఞ మీదనే తెల్ల జెండా వూపానో లేదో అని. నిన్ను వెంటనే లోపలికి వచ్చి తన ఆజ్ఞాపాలన చెయ్యమని చెప్పింది” అన్నాడు.

రంగరాజు లోపలికి వెళ్లి “మాతా, రాణి …” అంటూ వినయంగా నుంచున్నాడు.

“ఎవరు, రంగరాజా?”

“అవును, నేనే. మన నావ మీద తెల్ల జెండా ఎందుకు ఎగర వేశారు?”

“నేనే ఆజ్ఞాపించాను. నువ్వు వెంటనే ఒక తెల్ల జెండా తీసుకుని లెఫ్టినంట్ సాబ్ దగ్గరకు వెళ్లి నేను లొంగిపోతున్నానని చెప్పు.”

“నా శరీరంలో ప్రాణం వుండగా అది జరగదు” ధీటుగా బదులిచ్చాడు రంగరాజు.

“ప్రాణం ఇచ్చి కూడా నువ్వు నన్ను రక్షించలేవు.”

“అయినా సరే, నేను ప్రాణమర్పిస్తాను.”

“మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నావు. ఇంగ్లీషు సిపాయిల దగ్గర తుపాకులు వున్నాయి, వాటిముందు కర్రసాము పనికిరాదు. ఇక ఒక చుక్క రక్తం చిందటానికి వీలు లేదు. నేను ఆ తుపాకి తూటాలకు ఎదురయ్యితే, నన్ను నువ్వు రక్షించలేవు. ఒకవేళ నేను పట్టుబడినా నువ్వు ప్రాణాలిచ్చినా విడిపించలేవు. నా దగ్గర చాలా రూపాయిలు వున్నవి. కంపెనీ వాళ్లకు కావల్సిందది. నేను బందీగా ఎక్కువ కాలం గడపను.”

ఇంగ్లీషు వాడికి డబ్బు ఎర చూపి తప్పించుకోలేనని దేవికి తెలుసు. తన పథకం మొత్తం రంగరాజుకి వివరించే సమయం లేదు.

“మీరు ఏ రూపాయిలయితే ఇచ్చి ఇంగ్లీషు వాళ్లని వశ పరుచుకుందామనుకుంటున్నారో, ఆ రూపాయలన్నీ నావ లోనే వున్నాయి కదా, మరి నావ మొత్తాన్ని వాళ్లు వశ పరుచుకోరనేదేమిటి?”

“నువ్వు వెళ్లి ఇంగ్లీషువాడితో రాయబారం నడుపు. కేవలం నేను మాత్రమే పట్టుబడుతాను, నావని తాకరాదని.”

“వాళ్లు ఒప్పుకోకపోతే? నావను లూటీ చెయ్యటానికే వస్తే?”

“అప్పుడు పోరాడదాము. పెద్ద యుద్ధమే అవుతుంది. బోలెడు మంది చనిపోతారు. వాళ్లు ఇక్కడికి రానవసరం లేదు. దేవి చౌధురాణి బందీ అయ్యి వాళ్ల మనుష్యులు ఎవరూ చనిపోకపోవటం ఇంగ్లీషు వాడికి మెరుగు.”

దేవి మాటలలో తప్పకుండా ఏదో యుద్ధ కౌశలం వున్నట్లుందని రంగరాజుకి అర్థమయ్యింది. వెంటనే దేవి చెప్పిన మాటలను ఒప్పుకోసాగాడు.

“భవానీ ఠాకూర్‌గారు ఎక్కడ వున్నారు?”

“ఆయన అడవిలో బరకందాజ్‌లతో పోరు నడిపిస్తున్నారు.”

“వెంటనే వెళ్లి ఆయనకు పోరు ఆపమని చెప్పు. నన్ను రక్షించటం కోసం నావికులను మాత్రం నా వద్దకు పంపినట్లున్నారు. నన్ను రక్షించటం కోసం యుద్ధం అనవసరం. నా రక్షణకు జగదీశ్వరుడు వున్నాడు. భవానీ ఠాకూర్‌గారు సంశయిస్తే ఆకాశం వంక చూడమను, ఆయనకు అంతా అర్థమవుతుంది.”

రంగరాజు ఆకాశం వంక చూసాడు. కొన్ని నల్ల మబ్బులు తప్ప ఇంకేమీ కనిపించలేదు.

“మాతా, ఒక విజ్ఞాపన. హరివల్లభ రాయ్ కొడుకు వ్రజేశ్వర్‌ నావపై వున్నాడు. వాడు  సదుద్దేశ్యంతో వున్నట్లు కనబడటంలేదు. వాడిని నావ పైన అలాగే కట్టిపడేసి వుంచుతాను.”

ఇది విని దివ, నిశిలు నవ్వారు.

“వెంటనే బంధ విముక్తుడిని చెయ్యి. వెళ్లి నావపైన ఒక మూల దాక్కోమని చెప్పు. దివ పిలిచినప్పుడు క్రిందకు రమ్మను.”

రంగరాజు వ్రజేశ్వర్ కట్లు విప్పించి దాక్కోమని చెప్పి భవాని ఠాకూర్ వద్దకు వెళ్లి దేవి సందేశం అందించాడు. భవాని ఠాకూర్ అకాశంలో కమ్ముతున్న నీలమేఘాలను చూసి వెంటనే పోరు విరమించి బరకందాజ్‌లతో కలసి వెనుకకు తగ్గాడు.

నావపై నిశిదివలు నావికుల వద్దకు చేరి వారి చెవిలో ఏదో చెప్పసాగారు. వాళ్లు తలలు వూపారు. నిశిదివలిద్దరూ మళ్లీ దేవి వద్దకు చేరారు.

“నువ్వు చెప్పింది బాగుంది” అన్నది దివ.

“బాగుందో లేదో అన్నది నీ ఆలోచన. ఇప్పుడేం చెయ్యాలో మాత్రం నేను చెబుతాను. ఆ తరువాత నీ ఇష్టం” అన్నది దేవి.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.