పౌరాణిక గాథలు -40

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

జలంధరుడు కథ

పూర్వం బ్రహ్మాది దేవతలు మన్మథుణ్ణి పిలిచి శివుడికి పార్వతీదేవిని ఇచ్చి కళ్యాణం జరిపించాలి అందుకు నువ్వొక సహాయం చెయ్యాలి అని అడిగారు. మన్మథుడు తను చెయ్యవలసిన పనేమిటో చెప్పమన్నాడు. నువ్వొక పూలబాణం శివుడి మీద వేసావంటే మా పని తేలికవుతుంది అన్నారు. దేవతలంతటి వాళ్ళు అడిగినప్పుడు కాదు అనలేడు కదా… తనకు అప్పగించిన పని పూర్తి చేశాడు. శివుడు ఊరుకుంటాడా? కోపంతో మూడో కన్ను తెరిచాడు అంతే, మన్మథుడు కాలి బూడిదయ్యాడు.

మన్మథుడు కాలి బూడిదయినా కూడా శివుడి కంటి నుంచి వచ్చిన కోపాగ్ని కొంత మిగిలిపోయింది. అది వెళ్ళి సముద్రంలో పడింది. పడీ పడగానే సముద్రంలోంచి పెద్దగా ఏడుస్తున్న ధ్వని వినపడింది. ఆ ఏడుపు ధ్వనికి భయపడి లోకాలన్నీ భయంతో గజగజ వణికి పోయాయి.

దేవతలు భయపడి బ్రహ్మగారి దగ్గరికి పరుగెత్తారు. “ స్వామీ! విన్నారా ఆ శబ్దం…ఎంత భయంకరంగా ఉందో…ఎవరో ఏడుస్తున్నట్టుగా ఉంది. ఆ ఏడుపు సముద్రంలోంచి వినబడుతోంది. అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం ఏమీ కనిపించ లేదు. అర్ధంకాక మీ దగ్గరికి పరుగెత్తుకుని వచ్చాం. అదేమిటో మీరే తెలుసుకోవాలి” అన్నారు.

దేవతలందరితో కలిసి సముద్రుడి దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మ. ఒక పసివాణ్ణి చేతుల్లో పట్టుకుని పైకి వచ్చాడు సముద్రుడు. అప్పుడే సముద్రుడి చేతుల్లో ఉన్న పసివాడు ఏడ్చాడు. భయంకరమైన ఆ ఏడుపుకి దేవతలు ఉలిక్కి పడ్డారు. పసివాడి ఏడుపు ఇంత భయంకరంగా ఉంటుందా? ఎవరీ పసివాడు…ఏమిటిదంతా?” అడిగాడు బ్రహ్మ.

“ మహాత్మా! వీడు ఇప్పుడే పుట్టాడు. మీరు సమయానికే వచ్చారు. మీరే వీడికి నామకరణం చేసి, జాతక ఫలం కుడా చెప్పండి” అన్నాడు సముద్రుడు.

వీడి ఏడుపే ఇంత భయంకరంగా ఉంది. ఇంక జాతకఫలం ఇంకెంత భయంకరంగా ఉంటుందో…అనుకుని జలం నుండి పుట్టాడు కనుక అతడికి జలంధరుడు అని నామకరణం చేశాడు బ్రహ్మ. తరువాత అతడి జాతకం చూసి ఆశ్చర్యపోయాడు. “ఈ బిడ్డ రాక్షసులకి రాజు అవుతాడు. అంతేకాదు, ఒక్క శివుడి వల్ల తప్ప వేరెవరి వల్ల ఇతడికి భయం లేదు” అని చెప్పాడు. తరువాత బ్రహ్మతో పాటు దేవతలు కూడా వెళ్ళిపోయారు.

జలంధరుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతడికి పెళ్ళి చెయ్యాలని అనుకుని రాక్షస రాజు కాలనేమికి కబురుచేశాడు సముద్రుడు. కాలనేమి సముద్రుడి దగ్గరికి వచ్చాడు. అతడి కూతురు ’బృంద’ని జలంధరుడికి ఇచ్చి పెళ్ళి చెయ్యమని అడిగాడు సముద్రుడు. అతడు కోరినట్టే తన కూతురు బృందని జలంధరుడికి ఇచ్చి పెళ్ళిచేశాడు కాలనేమి. ఈ విధంగా జలంధరుడు రాక్షసులకి రాజయ్యాడు.

ఒకరోజు జలంధరుడు నిండు సభలో కూర్చుని ఉండగా రాక్షస గురువు శుక్రాచార్యుడు అక్కడికి వెళ్ళాడు. గురువుగార్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించాడు. “రాజా! విన్నావుగా జరిగినవీ…జరుగుతున్నవీ?” అన్నాడు శుక్రాచార్యుడు.

“ ఏమయింది ఆచార్యా? నాకేమీ తెలియవే!” అన్నాడు రాజు జలంధరుడు ఆశ్చర్యంగా.

“నిజంగా తెలియవా? దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథించారనీ…ఆ సమయంలో సముద్రం నుంచి ఏనుగు, గుర్రం, కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి, మణులు, మాణిక్యాలు, వంటివి అనేకం వచ్చాయని…అమృతం కూడ వచ్చిందని…దాన్ని విష్ణుమూర్తి మాయచేసి మోహిని రూపంలో దేవతలకే పంచాడనీ…రాహు కేతువులు దేవతల మధ్య కూర్చుని అమృతం తాగారనీ…అలా తాగినందుకు రాహుకేతువుల తలల్ని విష్ణుమూర్తి తన చక్రంతో నరికేశాడని నీకు తెలియదా? సముద్రుడికి మాత్రం ఏదీ మిగల్చలేదు “ అని వివరించాడు శుక్రాచార్యుడు.

గురువుగారు చెప్పినవన్నీ విని జలంధరుడు తన దగ్గరున్న దూతల్లో ఘస్మసురుణ్ణి పిలిచి “ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రంలో దొరికినవన్నీ మా రాజు జలంధరుడికే చెందుతాయని, అన్నింటినీ పంపించమన్నాడనీ చెప్పు!” అని పంపించాడు. ఘస్మసురుడు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి జలంధరుడు అడగమన్నట్టుగా అడిగాడు.

ఇంద్రుడికి కోపం వచ్చింది. “ మీ రాజు కంటే బలవంతులయిన రాక్షసుల్ని చాలా మందినే విష్ణుమూర్తి చంపాడు. నా తమ్ముడు విష్ణుమూర్తికి కోపం వస్తే మీరెవరూ మిగలరు? వెళ్ళు…వెళ్ళి ఈ విషయాన్ని మీ రాజుకి చెప్పు!” అన్నాడు.

ఘస్మసురుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతడు దూత కాబట్టి, తను చెప్పవలసిన విషయాల్ని చెప్పి, ఇంద్రుడు చెప్పిన దాన్ని విని, తిరిగి రాజుకి చెప్పడానికి వెళ్ళిపోయాడు. దూత చెప్పిన విషయాన్ని విని రాక్షస రాజుకి  చాలా కోపం వచ్చింది. సైనికులందర్నీ పిలిచి యుద్ధానికి సన్నద్ధం చేశాడు. అందరూ కలిసి దేవతల మీదకి యుద్ధానికి బయలుదేరారు.

విషయం తెలుసుకున్న దేవతలు కూడా యుద్ధానికి అవసరమయినవి సమకూర్చుకున్నారు. దేవతలకి, రాక్షసులకి మధ్య యుద్ధం మొదలయింది. దేవతలు జలంధరుణ్ణి ఓడించలేక పోతున్నారు. విష్ణుమూర్తి సహాయాన్ని అర్ధించారు.

విష్ణుమూర్తి దేవతలు కలిసి కూడ రాక్షసుల్ని ఓడించలేక పోయారు. నారయణుడు జలంధరుడి యుద్ధ ప్రావీణ్యతని చూసి ముచ్చట పడ్డాడు. మెచ్చుకున్నాడు కూడా! జలంధరుణ్ణి ఏ వరం కావాలో అడగమన్నాడు.

జలంధరుడు సంతోషంతో “హరీ! నువ్వు లక్ష్మీదేవితో సహా మా ఇంట్లో ఉండిపో! అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మీదేవిని తీసుకుని విష్ణుమూర్తి జలంధరుడి ఇంటికి వెళ్ళిపోయాడు.

ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని తమకు సహాయం చెయ్యమని తీసుకుని వస్తే శత్రువుల వైపుకి వెళ్ళిపోయాడు. శత్రువుని ఓడించడం సంగతి అటుంచి శత్రువు ఇంటికే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అనుకున్నారు.

నారదుణ్ణి సలహా అడిగారు. నారదుడు “ మీరు భయపడకండి, నిశ్చింతగా ఉండండి. నేను తప్పకుండా మీకు సహాయపడతాను” అన్నాడు.

అప్పటికప్పుడే బయలుదేరి నారదుడు జలంధరుడి ఇంటికి వెళ్ళాడు. “జలంధరా! నీ దగ్గర ఇంత సంపద ఉందని నేను ఊహించలేదు. ఇటువంటి సంపద నేను ఏ రాజు దగ్గరా చూడలేదు. ఏనుగులు, గుర్రాలు, భవనాలు, ఆభరణాలు ఒకటేమిటి? అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. కాని కాంతారత్నం మాత్రం నీ దగ్గర లేదు. అందరికంటె అపురూపమయిన అందం కలిగిన పార్వతీదేవి శ్మశానంలో ఉంది.

అంత అందమైన భార్య శివుడికి ఎందుకు? నువ్వెందుకు తెచ్చుకోలేదు? ఇప్పుడయినా మించిపోయింది లేదు. నీ సంపదకి కాంతారత్నం పార్వతి కూడా తోడయితే నీకు ఇంక తిరుగుండదు త్వరపడు!” అని తొందర చేశాడు నారదుడు.

నారదుడి వంటి గొప్ప మహర్షి చెప్పాక జలంధరుడు ఆగుతాడా…వెంటనే పార్వతిని నువ్వేం చేసుకుంటావు నా దగ్గరకు పంపించు! అని శివుడికి కబురు చేశాడు. నారదుడి మంత్రం పనిచేసింది. శివుడు ఉగ్రుడయ్యాడు. జలంధరుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో జలంధరుడు కొంతమంది రాక్షసుల్ని శివగణాలుగా మార్చి పార్వతిదేవి దగ్గరకి పంపించాడు. వాళ్ళెవరో పోల్చుకోగలిగిన పార్వతి వెంటనే విష్ణుమూర్తిని తల్చుకుంది.

విష్ణుమూర్తి పార్వతి దగ్గరకొచ్చాడు. “జగన్నాధా! జలంధరుణ్ణి దేవతలు ఓడించలేరు. అతడి భార్య బృంద పతివ్రత. ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లినప్పుడే అతణ్ణి ఓడించడానికి సాధ్యపడుతుంది. అని చెప్పింది పార్వతి. ఆమె చెప్పినట్టే చేశాడు విష్ణుమూర్తి.

పార్వతిని అవమానించిన జలంధరుణ్ణి యుద్ధంలో ఓడించాడు శివుడు. అతడు యుద్ధంలో మరణించాక పార్వతిని తీసుకుని శివుడు కైలాసానికి, లక్ష్మీదేవిని తీసుకుని విష్ణుమూర్తి వైకుంఠానికి, దేవతలు తమ తమ నివాసాలకి వెళ్ళిపోయారు.

అసలు ఇదంతా ఎలా జరిగింది? రాక్షస గురువు శుక్రాచార్యుడు చెప్పడం వల్లే కదా! సముద్రుడు తన తండ్రి కనుక, సముద్రం నుండి వచ్చిన సంపదలన్నీ తనవే అనుకున్నాడు జలంధరుడు.

గాలి, నీరు, భూమి వంటి ప్రకృతి అందరికీ సంబంధించినవని శుక్రాచార్యుడు జలంధరుడికి చెప్పలేదు. అందుకే తనతో పాటు అనేకమంది రాక్షసులు నాశనమవడానికి కారణమయ్యాడు జలంధరుడు.

శిష్యుణ్ణి సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత గురువుదే!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.