
ఏడుగురు అన్నదమ్ముల మధ్య చంపా
హిందీ మూలం – కాత్యాయని
అనుసృజన – ఆర్ . శాంత సుందరి
ఏడుగురు అన్నదమ్ముల మధ్య
పెరిగి పెద్దదయింది చంపా
వెదురు కొమ్మలా నాజూగ్గా
తండ్రి గుండెలమీద కుంపటిలా
కలల్లో
కదులుతూన్న నల్లటి నీడలా
రోట్లో ధాన్యంతోపాటు
రోకటి పోటులని భరించి
పొట్టుతోపాటు
చెత్తకుప్పలో పారేస్తే
అక్కడ పూలతీవై మొలిచింది.
అడవి రేగుపళ్ళ ముళ్ళపొదల్లో
మాధవీలతలా పెరిగిన చంపా
ఇంట్లో ప్రత్యక్షమైంది మళ్ళీ.
ఏడుగురు అన్నదమ్ములతో కలిసి పుట్టిన చంపా
పైకప్పునుంచి వేలాడుతూ కనబడింది ఒకరోజు
చెరువులో దట్టంగా మొలిచిన బుడగ తామరలని
నీళ్ళలోకి నిండా ముంచేసరికి
నల్లకలువై తలెత్తింది చంపా
ఇంటికి చేరుకుంది మళ్ళీ
దేవుడి పాదాల చెంతకి చేరింది
వాడిపోయాక నలిపి పారేయగా
కాలి బూడిదయింది
ఆ బూడిదని ఊరంతా వెదజల్లారు
రాత్రంతా వదలని జడివాన
మర్నాడు
ప్రతి ఇంటి ముంగిటా
దట్టమైన నాగజెముడు పొదల మధ్య
ఒంటరిగా నిర్భయంగా
చిరునవ్వు నవ్వుతూ కనిపించింది
చంపా
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
