శ్రీమతి కె. వరలక్ష్మి అజో-విభో కందాళం విశిష్ట సాహితీ మూర్తి జీవిత కాల సాధన పురస్కారం జనవరి 6, 2020న బాపట్లలో అందుకున్న సందర్భంగా –

అమ్మ గురించి వారి ముగ్గురు పిల్లల ఆంతరంగ వచనాలు

మా అమ్మంటే-

-కె. రవీంద్ర

మా అమ్మ…

మమతకు మారుపేరు

అనురాగానికి అర్థం

ఆప్యాయానికి అలవాలం

త్యాగానికి ప్రతిరూపం

నిస్వార్ధ ప్రేమకు నిలువుటద్దం

మా అభివృద్ధికి బంగారు బాటలు వేసింది

మా ఆశలకు ఆయువు నింపింది

మా ఊహలకు ఊపిరి పోసింది

మా జీవన గమనంలో మైలురాయిగా నిలిచింది

మేం ప్రగతి పథంలో దూసుకు వెళ్తుంటే

అందరికంటే ఎక్కువ సంతోషించే మా – అమ్మ…

అమ్మ ప్రేమను సంపూర్ణంగా పొందిన మేం చాలా

అదృష్టవంతులం….

*** 

నాకు తెలిసిన మా అమ్మ

                                                                                             – డా|| కె.గీత

నాకు తెలిసిన మా అమ్మ ఒక గంభీర ఉపాధ్యాయిని, నిరంతర విద్యార్థిని. తన పిల్లలమైన మాతో బాటూ తన విద్యార్థులందరికీ మార్గదర్శి. పదో తరగతి తో ఆగిపోయిన తన చదువుని మేం ముగ్గురం పుట్టేక పట్టుదలతో కొనసాగించి ఎమ్మే వరకూ చదవడమంటే మాటలు  కాదు. అదీ ఒక పక్క జీవితంతో ఎడతెగని పోరాటం చేస్తూ, మమ్మల్ని బాధ్యతాయుతంగా చూసుకుంటూ, ఉద్యోగ నిర్వహణలో అలసిన పగళ్లు దాటి, మిగిలిన కాస్సేపు రాత్రుళ్లు చదువుకుంటూ. నాకు గుర్తున్నంత వరకు తన చేతిలో ఎప్పుడూ పుస్తకమో, పెన్నో ఉండేది. 

అదే నాకూ అలవడింది. 

మా అమ్మ స్కూలు ప్రిన్సిపాల్ కావడం వల్ల, ఇంట్లోనూ క్రమశిక్షణ పాటించడం వల్లా దగ్గిరికి వెళ్లాలన్నా, మాట్లాడాలన్నా చిన్నప్పుడంతా చాలా భయంగా ఉండేది. అలాంటిది నాకు పదహారేళ్లు వచ్చేసరికి తను నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నెచ్చెలి అయ్యింది. స్నేహితులతో కన్నా అన్నీ తనతోనే ముచ్చటించగలిగే స్వేచ్ఛ ఉండేది నాకు. మేమిద్దరం ఎంత స్నేహితులమయ్యామంటే ఒకసారి మా ఇద్దరికీ “కరప సాహితీ సమితి” వారి కవిత్వ బహుమతులు వచ్చాయి. ఆ సభలో ఒకే ఊరి స్నేహితురాళ్లకు బహుమతులు రావడం గొప్ప విషయమని నిర్వహకులు స్టేజీ మీద చెప్పడం విని నవ్వుకున్నాం. నాకు మా అమ్మ పోలికలు లేకపోవడం, మేమిద్దరం ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకోవడం వల్ల వాళ్లు మేమిద్దరం స్నేహితులమని అనుకున్నారట. తీరా మేమిద్దరం తల్లీ కూతుళ్లమని తెలిసి ఆశ్చర్యపోయేరు.

నాకు తెలిసిన మా అమ్మ ఒక సునిశిత పరిశీలనా శక్తి గల రచయిత్రి. గ్రామీణ జీవితంలో తనకెదురైన ఎన్నో జీవితాల్ని తనదైన శైలిలో ప్రాణప్రతిష్ట చేసిన విశిష్ట స్రష్ట. ముఖ్యంగా  పల్లెటూరి స్త్రీల సమస్యలు, జీవితాల్ని తనలా ఆవిష్కరించిన మరొక రచయిత్రి లేరంటే అతిశయోక్తి కాదు! 

మా ఇంటి గోడనానుకుని ఉండే గ్రామ గ్రంథాలయం నుండి మా అమ్మకోసం పుస్తకాలు తెచ్చివ్వడంతో మొదలైన నా పఠనాసక్తి నన్ను చిన్నతనంలోనే సాహిత్యానికి చేరువ చేసింది. అయితే ఏం చదవాలో మార్గదర్శకత్వం వహించేది మా అమ్మ. గ్రంథాలయం నుండి దూరానికి సొంత ఇంటికి మారేక మా ఇంటినే లైబ్రరీగా మార్చేసింది. అలా చిన్నవయసులోనే తెలుగుసాహిత్యంలో గొప్పరచనల్ని, ఇతర భారతీయ భాషా సాహిత్యాలతో బాటు, ప్రపంచ సాహిత్యానువాదాల్ని చదవగలిగేను నేను. 

తన పుస్తక పఠనాసక్తి నన్ను చాలా అబ్బురపరిచేది. ఆరోజుల్లో వేటపాలెం లైబ్రరీలో మాత్రమే లభ్యమవుతున్న ఏనుగుల వీరాస్వామయ్య గారి “కాశీయాత్రా చరిత్ర” ను చదవడానికి ప్రత్యేకంగా రెండురోజులు ప్రయాణించి మరీ వెళ్లి ఆ పుస్తకాన్ని ఇంటికి తెచ్చుకున్నలాటి సంఘటనలెన్నో.

నాకు రచనలు చెయ్యాలనే ప్రేరణ కలగడానికి కారణం మా అమ్మ రచయిత్రి కావడమే! కానీ తన ప్రధాన రచనా ప్రక్రియ కథైనా కవిత్వమంటే మక్కువ వల్ల నేను కవయిత్రినయ్యాను. రాసిన ప్రతి కవితా అమ్మకు చదివి వినిపించాకనే పత్రికలకు పంపేదాన్ని. 

నేను కవిత్వం కొత్తగా, ఉధృతంగా రాసే రోజుల్లో గౌతమీ గ్రంథాలయానికి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగే సభలకు, సమావేశాలకు మేమిద్దరం ఆహ్వానితులుగా వెళ్లడం నాకు మరపురాని అనుభూతి. ఆ రోజుల్లో లైబ్రేరియన్ శ్రీ సన్నిధానం శర్మ గారి సమక్షంలోగౌతమీ గ్రంథాలయం కవులకు, రచయితలకు  ఆలవాలమై నిత్యం సాహిత్య గోష్టులతో అలరారుతుండేది. అక్కడికి వచ్చే సాహిత్యకారుల్లో అమ్మ కథలు ఇష్టమైన వారు నన్ను “మా అభిమాన రచయిత్రి కె.వరలక్ష్మి గారమ్మాయి” అని పరిచయం చేస్తుంటే నాకెంతో గర్వకారణంగా ఉండేది. ఆ తర్వాత “కె.గీత”గా కవితాలోకంలో పరిచయస్తురాలినైనప్పటికీ నేను నన్ను నేను ఇప్పటికీ  “వరలక్ష్మి గారమ్మాయి” గా గుర్తించడాన్నే ఇష్టపడతాను. ఆ తర్వాత్తర్వాత కవులందరూ మా అమ్మని “కె.గీత అమ్మగారు” అని పరిచయం చెయ్యడమూ పరిపాటి అయ్యింది. ఆ మాట విన్నప్పుడల్లా తన ముఖం సంతోషంతో వెలుగుతూ ఉండడం ఇప్పటికీ నాకు గుర్తే. 

ఇక తన కథా సంపుటులు జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) లో దాదాపు అన్ని కథలూ ఇష్టమే  నాకు. ప్రత్యేకించి “మంత్రసాని” , “గాజుపళ్లెం”, “మట్టి-బంగారం”, “సువాసినీ పూజ” మొ.నవి. అయితే “శివంగి” కథంటే ప్రత్యేకమైన ఇష్టం నాకు. ఎంచుకున్న కథా వస్తువు, ఎత్తుగడ, ముగింపు, కథాశైలి అన్నిటా ప్రత్యేకమైన కథ అది. అసలే వ్యసనపరుడైన భర్తతో విసిగిపోయిన శివంగి కథలో చికాకు పెట్టే ఎలకని మధ్యమధ్య చొప్పించడం, ఎలుకల కోసం తెచ్చిన మందు భర్తకి కలిపిచ్చి వదిలించుకోవాలనుకున్నా చివరి నిమిషంలో స్త్రీ సహజమైన మానవీయత, బేలత్వం ఎలా పనిచేస్తాయో చెప్పిన అద్భుతమైన కథ. అంతర్జాతీయ స్థాయిలో గొప్పకథలు వేటికీ తీసిపోని కథ.

ఇక ఇటీవల రాసిన “లంకంత ఇల్లు”, “శత్రువు” కథలు కూడా నాకిష్టమైనవే.  

ప్రతీ సంపుటీ ప్రచురణకు ముందు అచ్చుతప్పులు దిద్దడం,  కొన్ని కథలు స్వయంగా టైపు చెయ్యడం, ఆన్ లైన్ లో కథలు పంపడం వంటి పనులతో దాదాపు అన్ని కథలూ ప్రచురణకు ముందే చదవగలగడం నాకు మాత్రమే లభించిన గొప్ప అవకాశం, అదృష్టం. 

నాకు తెలిసిన మా అమ్మ కుసుమ సమానురాలైన సుకుమారి, కళల కాణాచి. చిన్నతనంలో ఇంట్లో పెద్దకూతురిగా అతిగారాబంగా పెరిగింది. ఎప్పుడూ చదువు పట్ల శ్రద్ధ చూపించే అమ్మాయిగా ఆరోజుల్లో ఆడపిల్లలకు సాధారణమైన ఇంటిపని వంటివి నేర్చుకోలేదు. అందుకో ఏమో సాధారణమైన విషయాల కంటే కళాత్మకమైన విషయాల పట్లే ఆసక్తి పెంచుకుంది. సాహిత్యంతో బాటూ సంగీతం పట్ల ఆసక్తి, ప్రవేశం, ప్రావీణ్యం కలిగిన మా అమ్మ దగ్గరే నేను పాటలు పాడడం, వీణ వాయించడం నేర్చుకున్నాను. 

నాకు తెలిసిన మా అమ్మ ప్రపంచ సౌందర్యాన్ని తలదన్నే అందాలరాశి, మృదు స్వభావి. నాకు బాగా గుర్తు. నా చిన్నతనంలో స్నేహితులింటికి వెళ్లినపుడు నాకు తినడానికి ఏ కొబ్బరుండో, బెల్లపచ్చో పెట్టేవారు. ప్రతిసారీ అందులోసగం విరిచి గౌను జేబులో పెట్టుకుని దాచి మా అమ్మకు తెచ్చి ఇచ్చేదాన్ని. ఎందుకో అమ్మకు పెట్టకుండా తినాలని అనిపించేది కాదు. అంతే కాదు వాళ్లెవరైనా మా అమ్మ అందాన్ని పొగుడుతూ మాట్లాడితే నాకు చాలా గర్వంగా ఉండేది. తను బొట్టు, కాటుక పెట్టుకుంటున్నపుడు పక్కనే నిలబడి ఎంతసేపు చూసినా ఇంకా చూడాలని అనిపించేది. నేను పెద్దయ్యాక చాలా మంది నా మొహమ్మీదే  నాకు మా అమ్మ అందం రాలేదని అనేవారు. అందుకే తను ప్రత్యేకమైనది నాకు. అంతే కాదు తనెప్పుడూ ఎవరి మీదా గొంతు పెంచి మాట్లాడడం కూడా చూడలేదు నేను. అంతటి మృదు స్వభావి. 

నాకు తెలిసిన మా అమ్మ దుఃఖాల్ని జయించిన విజేత, జీవితాన్ని సహనంతో గెలిచిన ఆదర్శ మహిళ. ముగ్గురు పిల్లల్ని ఉన్నతంగా పెంచడం కోసం కష్టాల్ని లెక్క చెయ్యకుండా నిరంతరం పాటుపడిన శ్రమజీవి. బాధ్యతలు తీసుకోని భర్తతో ఎన్ని కష్టాలనైనా పంటిబిగువున ఓర్చుకుంది కానీ ఏనాడూ పిల్లలైన మమ్మల్ని మా దారిన వదిలెయ్యలేదు. అలాగని ఆయననీ వదిలిపెట్టలేదు. తననెన్ని కష్టాలు పెట్టినా, వ్యసనపరుడై చివరికి మంచం పట్టిన ఆయన్ని సంవత్సరాల పాటు అన్నీ తనే అయ్యి సకల సపరిచర్యలూ చేసింది.  

మా అమ్మ నాకు తల్లి, గురువు, స్నేహితురాలు అన్నీ. ఆ కడుపున పుట్టడం నాకు జీవితమిచ్చిన  గొప్ప వరం. 

ఈ సంవత్సరం మా అమ్మకు అజోవిభో కందాళం ఫౌండేషన్ వారు విశిష్ట సాహితీ మూర్తి జీవితకాల సాధనా పురస్కార ప్రదానం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు!

*****

అమ్మ… అమ్మే

-శ్రీలలిత

శ్రీలలితకి… ‘‘మమ్మి’’… ఏవిటి?

మా అమ్మ మొదటిసారి, ఇప్పుడే, తనగురించి నా అభిప్రాయం వ్రాసి ఇవ్వాలని అడిగినప్పుడు, నేను అయోమయంలో పడ్డాను. ఏవిటి ఈవిడ గురించి వ్రాసేది? మామ్మూలుగా మనం అమ్మ అని నిర్వచించుకునే లక్షణాలతో మా అమ్మమ్మగారు శ్రీమతి బంగారమ్మగారు ఉండేవారు. మరి మా మమ్మి గురించి వ్రాయమంటే…

సరే

నేను పుట్టాక నా మొదటి జ్ఞాపకం ధూం ధాంగా ఊరంతా బంధువులందరితో జరిగిన నా మొదటి పుట్టినరోజు.

1973 లో, మా చిన్నూ ఊరిలో అది ప్రత్యేకమైన విషయం. నేను పుట్టి పుట్టగానే, దిబ్బంత పుట్టి, కాన్పుకి  నానా కష్టం పట్టిన, నేనూ…. పుట్టి పుట్టగానే… మా మమ్మీకి, స్కులు పెట్టి, అది నడిపించి, మా ఐదుగురుని బతికించ వలసిన పరిస్థితి… ఆపత్తూ. మా డేడి  బుల్లి ఉద్యోగానికి వాళ్ళ పుట్టింటి బాధ్యతలు ఎక్కువ, అసలుకి ఆయనకి స్వభావంలో బాధ్యతా రాహిత్యం కూడా ఎక్కువ. నా పుట్టుక నాటికి, మమ్మీకి, క్లియర్ పిక్చర్, ఇక ఈ నిండు నావకి తన రెక్కలే గతి అని

నా తర్వాత జ్ఞాపకం… నేను గాడిదలాగా ఎదిగినా కూడా ఆవిడ చనుబాలు తాగడం. నేను బుద్ధిగా ఆవిడ పెట్టింది మొత్తం తినేసి లడ్డూలాగా గున గున తిరుగుతున్నా పనులు చెప్పేది కాదు. నేను తను అప్పగించిన పని బాగా చేసినా, నన్ను ఎలాగో ఒకలాగా పనులనుంచి తప్పించేది. నేనూ, స్వతాహగా చాలా మంచి శాంత స్వభావవంతురాలిని అయినా, స్కూల్లో చెడ్డ పిల్లలవి భరించకుండా రోజూ నాలుకు పీకుతూ ఉండేదాన్ని. నాపైన అబద్ధం కంప్లయింట్లు వచ్చినప్పుడు, స్కూలు మూతపడితే ఎలా అనేభయంతో, ఆ పిల్లల ఎదురుగా నాకు బడిత పూజ చేసి భయం చెప్పినా, ఆ రోజు ముగిసి నిద్రపోయేలోగా, మళ్ళ బుజ్జగింపులు దక్కనిచ్చేది. సమయాన్ని సద్వినియోగం చేయడం మా మమ్మీ తర్వాతే ఎవరైనా, స్కూలా, గృహిణా, తల్లా, రచయిత్రా? ఉన్న 24 గంటల్లో మళ్ళీ సెల్ఫ్ కేర్ కూడా. రెండు పూట్లా స్నానం, దీపారాధన, వాడని మల్లెపువ్వు మా మమ్మీ. ఏం చెప్పాలి మమ్మీ గురించి… మమ్మీ అంటే నేను పెద్ద పెద్ద ఇళ్ళల్లో బతకడం, మమ్మీ అంటే గంటలు గంటలు చేత్తో మిక్సిలాగా తప్పి తాగించే మీగడ పాలు. మమ్మీ అంటే ఇల్లంతా సీసనల్ ఫ్రూట్స్, కరకర ఆకలి వేసే రుచైన వంట, మా మమ్మీ అంటే మెట్టినింటి పేదరికం, కడుపు నింపుకున్న ఆవిడ గతం.  మమ్మీ అంటే పుట్టింటి పాడీపంటా పచ్చదనం. మమ్మీ అంటే నా మేనమామలు, పిన్నిలూ ఆవిడ పట్ల కనపరిచే ప్రేమాభిమానాలూ, భయభక్తులు. మమ్మీ అంటే, నా అన్న, అక్కలు మాట్లాడడానికి భయపడుతూ, నన్ను సిఫార్సుకోసం ఆవిడ ముందుకు తోసేనా చనువు, మేము చేసిన విలాస ప్రయాణాలు, ప్రయాణాల్లో ఇంటినించి వండి తెచ్చిన చిరుతిళ్ళు, మమ్మీ అంటే… నాకు పిచ్చి ఇష్టమని, తీసుకెళ్ళి ఆవిడ ఆశీస్సులు ఇప్పించిన అందాల తార శ్రీదేవి, ‘‘ఇల్లు’’, మమ్మీ అంటే అవసరమైన వారికి ఉచిత విద్య, మమ్మీ అంటే చక్కగా స్థిరపడడానికి దోహదం చేసిన మా స్కూలు విద్యార్ధులు స్టేండర్డ్. మమ్మీ అంటే, తన మెట్టినింటికీ, తోబుట్టువులకీ, ఎవరెవరికో… ఇస్తూ… ఉంటే చెయ్యి. మమ్మీ అంటే… ఏం ఉందక్కడా, చెప్పడానికీ… నా బాల్యమూ. మమ్మీ అంటే జయప్రదా, రచయిత్రిగా సాధించిన వేల అవర్డులూ, రివార్డులూ, నా పిల్లల పుట్టుకా. కన్పు సమయంలో  అందించిన ఆలంబనా, వేయేలా, ఎంతవారలైనా ఎవ్వరికీ వడ్డించనీ విస్తరి కానేరని ఈ మానవ జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, సమయస్ఫూర్తిని ప్రసాదించిన, ఆవిడ ఏర్పాటు చేసిన

‘‘హోంలైబ్రరీ’’, రచనల మీద మా చర్చలు. మమ్మీ అంటే కూడా అమ్మే. ఎందుకంటే అన్నివిధాలుగా ఎంతో ఉన్నతంగా జీవితాలని దిద్దుకున్న మా అన్నయ్య, అక్క ఏనాడూ ఆవిడ మనసు నొప్పించడానికి సాహసించక పోయినా, ఆవిడనుంచే ఆఖండ విశ్వాంతరపు అద్వైత దైవత్వం ఆశిస్తూ… ‘‘ఒక తల్లిగా మాత్రమే జీవితం వెళ్ళబుచ్చిన’’ నేను ఎంత నిస్సిగ్గుగా ఎప్పుడూ ఆవిడని నిలదిస్తూ, ఏవేవో ప్రశ్నిస్తూ కాలం గడిచినా… మళ్ళీ మారిపోయాను. ఎదిగిపోయానని వెంటపడ్డాననుకో, అచ్చం మా అమ్మలాగే మళ్ళీ ఆదరం చూపిస్తుంది. అందుకే మమ్మీ…. ‘‘అమ్మే’’

***

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.