
జ్ఞాపకాల సందడి-7
-డి.కామేశ్వరి
ఒకసారి ఎప్పుడో ఏదోసభలో ఎవరో నవలకి, కథకి తేడా ఏమిటి? “పేజీలసంఖ్య- అనద్దు, స్వరూప భేదం గురించి చెప్పండి” అని తెలివైన ప్రశ్న వేశారు.
కాస్త ఆలోచించి ఇలా అన్నాను:-
“నవల జీవితం అనుకుంటే, కథ అందులో ఒకరోజు అనచ్చు.
నవల అనేకపాత్రల, అనేక సంఘటనల సమాహారం.
ఒక జీవితంలో ఒకమనిషి పుట్టుకతో జీవితం ఆరంభం అయితే నవల లో ఒక కేరక్టర్ రచయిత సృష్టించుతాడు. జీవితంలో ఒక మనిషి పుట్టుకతో ఎన్నో సంబంధాలు అమ్మ నాన్న, తోబుట్టువులు. మాతా పితామహులు, అత్తలు మామలు, పిన్నులు బాబాయిలు ఎంతో మంది రక్తసంబంధీకులతో ప్రయాణం ఆరంభం అయి ఒక్కక్క స్టేజి లో అంటే చదువుకొనేటప్పుడు స్నేహితులు, పెద్దయ్యాక ఉద్యోగాలపుడు సహోద్యోగులు పెళ్లితో కలిసే బంధుజనం, తరువాత పిల్లలు, పిల్ల పెళ్లితో వియ్యాలవారు, మనవలు.
ఒక జీవితంలో ఎన్నో మంది మన జీవితంలో ప్రవేశించి వారితో బంధాలు, అనుబంధాలు, అందరి మధ్య అనేకానేక సంఘటనలతో పరోక్షంగానో, ప్రత్యక్షంగానో మనము పాల్గొంటూ, సంతోషాలు, దుఃఖాలు, మోదాలు, విబేధాలు, సంఘర్షణలు, అసూయలు, ద్వేషాలు, పట్టింపులు, జయాలు, అపజయాలు, చావులు, పుట్టుకలు, పెళ్లిళ్లు అనేక సంఘటనలు మన జీవితంలో జరిగిపోతూ అన్నిటికి డైరెక్ట్ గా కాకపోయినా ప్రతి మనిషి జీవితంలో ఎందరితో ఎన్నో సంఘటనలతో సంబంధం ఉంటుంది .
అలాగే నవలలో ఒక హీరో పాత్ర కానీ, హీరోయిన్ పాత్ర కానీ సృష్టించాక ఆ చుట్టూ ఎన్నో, అవి బంధువుల స్నేహితుల పాత్రలేవన్నా కావచ్చు. ప్రధానపాత్రతో అనుసంధిస్తూ వారి సమస్యలు కానీ, కష్టసుఖాలు, ఈతిబాధలు కానీ, ప్రధానపాత్రతో ముడిపెడుతూ సంఘటనలు అల్లుకుంటూ కథ నడిపిస్తుంటే మరికొన్ని పాత్రలు వచ్చి కథాగమనానికి (నిజజీవితంలో పిల్లల పెళ్ళివాళ్ళ కొత్తకుటుంబాలతో ముడిపడుతుంది బాంధవ్యం) తోడ్పడుతూ, కొత్తమలుపులు తిప్పుతూ కథాగమనంలో వీలయినంత మంచిచెడులు పాత్రల సృష్టి ద్వారా పాఠకుల విచక్షణతో సారాంశం గ్రహించుకోగలిగేట్టు సంఘటనలు కథాంశం ఎంత గొప్పదయినా కథనం కుతూహలంగా చదివించలేకపోతే రచన వ్యర్థం అన్నది రచయితలూ ముందు గుర్తు పెట్టుకుని కథ ప్రారంభం, ముగింపు మధ్యలో కథాగమనం అన్ని సమపాళ్లలో రంగరించి రాయగలిగితే అది మంచి నవల అవగలదు. నవలన్నది అనేక పాత్రల సంఘటనల సమాహారం .
కథ అన్నది ఒక సంఘటనో, ఒకసమస్యో తీసుకుని కొన్నిపాత్రల చుట్టూ తిరుగుతూ వారి మనో భావాలను చిత్రీకరించుతూ, కథాంశం క్లుప్తత పాటిస్తూ, పదునుగా తక్కువ పదాలతో భావ వ్యక్తీకరణ చేప్పట్టినపుడు మంచికథ తయారవుతుంది.
నవలకి విస్తృతపరిధిలో రాసే నైపుణ్యం, కథకి క్లుప్తత పాటించగలిగిన నైపుణ్యం కావాలి.
నవల అంటే జీవితం, కథ అంటే ఒకరోజు అని నా భావన.
నవల అంటే ఆనాటి ఓ నారాయణరావు, కాలాతీతవ్యక్తులు, చివరకు మిగిలేది, వంశవృక్షం, హిమజ్వాల, వేయిపడగలు, మంచిచెడు లాంటివి. ఇపుడు రాసే నూట ఏభయి పేజీల పెద్దకథలు కావు అన్నది మరిచిపోకండి.”
ఈ విషయం మీకు నచ్చినా, నేను చెప్పిందానితో ఏకీభవించకపోయినా మీ అభిప్రాయాలు చెప్పండి.
*****

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.
